SOURCE :- BBC NEWS

నేటివిటీ చర్చి

ఫొటో సోర్స్, Getty Images

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని బెత్లెహామ్ పట్టణాన్ని క్రిస్మస్ పండుగకు రాజధానిగా పిలుస్తుంటారు. పండగ సందడితో కళకళలాడాల్సిన ఈ ప్రాంతంలో ఇప్పుడు కొద్దిమంది పర్యటకులు మాత్రమే కనిపిస్తున్నారు.

గాజాలో కొనసాగుతున్న యుద్ధంతో బెత్లెహామ్ బోసిపోయింది. ప్రతి ఏడాది కనిపించే ప్రకాశవంతమైన వీధి అలంకరణలు ఈసారి కనిపించడం లేదు.

ఏసుక్రీస్తు జన్మస్థలంగా భావిస్తున్న ఈ ప్రదేశంలో నిర్మించిన ‘నేటివిటీ చర్చి’ ఎదురుగా ఎప్పటిలా క్రిస్మస్‌ట్రీని ఏర్పాటు చేయలేదు.

గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా వరుసగా రెండో సంవత్సరం కూడా పాలస్తీనాలో క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయి. అక్కడి క్రైస్తవులు కుటుంబ సంబరాలు, చిన్న చిన్న మతపరమైన వేడుకలకు మాత్రమే హాజరవుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బెత్లెహమ్

ఫొటో సోర్స్, Reuters

గాజాలో క్రైస్తవుల పరిస్థితేంటి?

”ఇది ఆనందంగా ఉంటూ సంబరాలు చేసుకోవాల్సిన సమయం. కానీ, గాజాలో కుమిలిపోతున్న మా తోబుట్టువులకు, సహచరులకు సంఘీభావం తెలుపుతూ బెత్లెహామ్ బాధలో మునిగింది” అని స్థానిక లూథరన్ పాస్టర్, రెవరెండ్ డాక్టర్ ముంతెర్ ఐజాక్ వ్యాఖ్యానించారు.

“మరో క్రిస్మస్ రానే వచ్చింది. కానీ, గాజాలో హింస ఇంకా ఆగలేదు” అని రెవరెండ్ ఐజాక్ ఇటీవలి ప్రసంగంలో అన్నారు.

పాలస్తీనియన్ల బాధలను పాలకులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

బెత్లెహామ్‌లోని చాలామంది క్రైస్తవులు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్రైస్తవ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని అంటున్నారు. బెత్లెహామ్‌లోని చాలామందికి గాజాలో కుటుంబం, స్నేహితులు ఉన్నారు.

“నిజంగా అక్కడ జరుగుతున్న దానిలో ఒక శాతం కూడా టీవీలో చూపించడం లేదని మా అమ్మ నాకు చెప్పారు” అని గాజా సిటీకి చెందిన ఆధ్యాత్మికవేత్త డాక్టర్ యూసెఫ్ ఖౌరీ చెప్పారు.

ఆయన తల్లిదండ్రులు, సోదరి గత 14 నెలలుగా గాజాలోని చర్చిలో ఉన్నారు. వారితో పాటు అక్కడి రెండు చర్చిలలో కొన్ని వందలమంది క్రైస్తవులు ఆశ్రయం పొందుతున్నారు.

“వారు గాజాలో అందరిలాగే బాధపడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. బాంబు దాడులు, డ్రోన్‌ల కారణంగా సరిగా నిద్రపోవడం లేదు ” అని ఆయన అంటున్నారు. “మేం స్నేహితులు, బంధువులను కోల్పోయాం” అని యూసెఫ్ వివరించారు.

గైడ్స్

ఆ రోజుతో అంతా మారింది..

దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత గాజాలో ప్రారంభమైన యుద్ధంలో 45,000 మందికి పైగా మరణించారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అక్టోబర్ 7, 2023న జరిగిన దాడిలో ఇజ్రాయెలీలు, కొంతమంది విదేశీయుల సహా దాదాపు 1,200 మంది మరణించారు. హమాస్ దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకెళ్లింది.

యుద్ధంతో పాటే వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. పాలస్తీనియన్ల కదలికలపై ఇజ్రాయెల్ కొత్త ఆంక్షలు విధించింది. ప్రతిరోజూ జెరూసలేం లేదా యూదుల స్థావరాల నుంచి వెళ్లే వర్కర్ల అనుమతులను వేలాదిగా రద్దు చేసింది.

బెత్లెహామ్‌లో ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, ఈ ప్రాంతం పర్యటకంపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇపుడు అక్కడి గైడ్‌లు ‘నేటివిటీ చర్చి’ దగ్గర పనిలేకుండా నిల్చున్నారు.

“పర్యటకులు ఉంటే హోటళ్లు, రవాణా, వసతి అన్నీ పనిచేస్తాయి” అని అబ్దుల్లా అనే గైడ్ చెప్పారు.

“కానీ బెత్లెహామ్‌లో పర్యటకులు లేకుంటే జీవితం లేదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“నేను నష్టపోయాను. వ్యాపారం లేదు, ఏడాదికిపైగా ఇంట్లోనే ఉన్నాం” అని స్టార్ స్ట్రీట్‌లో వ్యాపారం చేసే అద్నాన్ సుబా అన్నారు.

“నా కొడుకు చర్చి దగ్గర గైడ్, అందరం ఇంట్లోనే ఉంటున్నాం. ఇపుడు ఎవరికీ ఉద్యోగాలు లేవు, వ్యాపారం లేదు, పర్యటకులూ లేరు” అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS