SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Shutterstock
దేశంలోనే పొడవైన నది గంగ వేలాది డాల్ఫిన్లకు నిలయం. కానీ, ప్రస్తుతం వాటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.
నదిలో ఉండే ఈ డాల్ఫిన్లు సముద్ర డాల్ఫిన్లకు భిన్నమైనవి. ఇవి సముద్రంలోని డాల్ఫిన్లలా ఆర్చ్ ఆకారంలో దూకవు. అంతేకాదు.. నీటి ఉపరితలంపై ఎక్కువ సమయం ఉండడం కానీ, నిటారుగా ఈదడం కానీ చేయవు. ఎక్కువగా నీటి అడుగునే గడుపుతాయి.
పొడవాటి మూతి వీటి ప్రత్యేకత. వీటికి దృష్టి చాలా తక్కువ, దాదాపు ఏమీ కనిపించదు.
భారతదేశ జాతీయ జల జంతువుగా పేరున్న ఈ డాల్ఫిన్లు ఎక్కువగా ఉత్తరాన గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో కనిపిస్తుంటాయి.
దేశంలోని నదుల్లో 6,327 డాల్ఫిన్లు ఉన్నట్లు తాజాగా విడుదలైన అధ్యయనం తేల్చింది.
అందులో ఒక్క గంగా నదిలోనే 6,324 ఉండగా సింధు నదిలో మూడు ఉన్నాయి.
సింధు నది డాల్ఫిన్లు ఎక్కువగా పాకిస్తాన్‌లో కనిపిస్తాయి.
ఈ రకం డాల్ఫిన్లను ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించింది.
వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు 10 రాష్ట్రాల్లోని 58 నదుల్లో 2021 నుంచి 2023 మధ్య సర్వే చేసి తొలి సమగ్ర నివేదిక విడుదల చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
తరచూ ”లివింగ్ ఫాజిల్స్ (సజీవ శిలాజాలు)”గా పిలిచే ఈ డాల్ఫిన్లు లక్షల ఏళ్ల క్రితం సముద్ర డాల్ఫిన్ల నుంచి పరిణామం చెందాయని శాస్త్రవేత్తలు చెబుతారు.
దక్షిణాసియాలోని లోతట్టు ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తినప్పుడు డాల్ఫిన్లు బయటకు వచ్చి నీరు వెనక్కు వెళ్లినా తిరిగి సముద్రంలోకి వెళ్లకుండా భూమి మీది మంచి నీటి ఆవాసాల్లో ఉండిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తారు. అవి కాలానుగుణంగా నదీ జలాలలో మనుగడ సాగించడానికి అలవాటుపడ్డాయి. అలా ఇవి సముద్రంలో నివసించే డాల్ఫిన్లకు భిన్నమైన లక్షణాలను అభివృద్ధి చేసుకున్నాయన్నది శాస్త్రవేత్తల మాట.
నదీ జలాల డాల్ఫిన్ల సంఖ్యను గుర్తించేందుకు సరికొత్త సర్వే అత్యంత కీలకమని నిపుణులు చెప్పారు. 1980 నుంచి కనీసం 500 వరకు డాల్ఫిన్లు చనిపోయాయి. ముఖ్యంగా చేపలు పట్టే వలలలో పడి ప్రమాదవశాత్తు మరణించాయి. నదులలోని డాల్ఫిన్లకు ఉన్న ముప్పును ఈ సర్వే బయటపెట్టింది.
2000 సంవత్సరం వరకు నదీ డాల్ఫిన్ల గురించి పెద్దగా అవగాహన లేదని, తక్కువ సమాచారమే అందుబాటులో ఉందని పర్యావరణవేత్త రవీంద్ర కుమార్ సిన్హా చెప్పారు.
వీటిని సంరక్షణను పెంచేందుకు 2009లో గంగా నది డాల్ఫిన్‌ను భారతదేశపు జాతీయ జల జంతువుగా ప్రకటించింది ప్రభుత్వం.
2020 యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వీటి సంఖ్యను పెంచేందుకు ఒక ప్రత్యేక పరిశోధన సంస్థను 2024లో ఏర్పాటు చేసింది కేంద్రం.
అయితే, ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని, మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డాల్ఫిన్లను వాటి మాంసం, బ్లబర్ ( సముద్రపు జీవుల కొవ్వు ) కోసం వేటాడుతున్నారు.
వాటి నుంచి నూనెను తీసి చేపలకు ఎరగా ఉపయోగిస్తారు. కొన్నిసార్లు, నదుల్లో ప్రయాణించే బోట్లకు తగిలి లేదా ఫిషింగ్ లైన్లలో చిక్కి చనిపోతున్నాయి.
రక్షిత జీవుల జాబితాలో ఉన్న ఇవి చనిపోతే న్యాయ వివాదంలో చిక్కుకుంటామనే భయంతో చాలా మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించిన డాల్ఫిన్లను రిపోర్టు చేయడం లేదని శాంక్చురీ ఆసియా మ్యాగజీన్‌తో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్‌కు చెందిన నచికేత్ కేల్కర్ చెప్పారు.
భారతీయ వన్యప్రాణుల చట్టాల ప్రకారం, ప్రమాదవశాత్తు కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ డాల్ఫిన్ మరణానికి కారణమైతే దాన్ని వేటగా పరిగణిస్తూ కఠినమైన జరిమానాలను విధిస్తారు.
చాలామంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించిన డాల్ఫిన్లను చడీచప్పుడు లేకుండా పారవేస్తూ, జరిమానాలను తప్పించుకుంటున్నారు.
గత దశాబ్ద కాలంగా రివర్ క్రూయిజ్ టూరిజం బాగా పెరిగింది. ఇది కూడా డాల్ఫిన్ల ఆవాసాలకు ప్రమాదకరంగా మారుతోంది. గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో డజన్ల కొద్ది క్రూయిజ్ ట్రిప్పులు చేపడుతున్నారు.
”క్రూయిజ్‌ల నుంచి వచ్చే అలజడులు, డాల్ఫిన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి శబ్దాలను తట్టుకోలేవు. చాలా సున్నితమైనవి” అని పర్యావరణవేత్త రవీంద్ర కుమార్ సిన్హా అన్నారు.
నౌకల రద్దీ పెరగడం కూడా గంగా నదీ జలాల డాల్ఫిన్లను అంతరించిపోయే ప్రమాదం ముంగిటకు తీసుకురావొచ్చని సిన్హా అంటున్నారు.
నదీ జలాల డాల్ఫిన్లు కొంత వాటి స్వభావం కారణంగా కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. వాటికి చూపు దాదాపు ఉండదు. ఎకోలొకేషన్‌పై అవి ఆధారపడతాయి. ఈ లక్షణం వాటి ఆవాసాలకు సరిపోయినప్పటికీ, ఆధునికంగా వస్తోన్న ముప్పులను వాటికి ప్రమాదకరంగా మార్చుతుంది.
సరిగ్గా చూడలేకపోవడం, ఈత కొట్టే వేగం నిదానంగా ఉండటంతో.. నదీ జలాల డాల్ఫిన్లు పడవలను ఢీకొనడంతో పాటు ఇతర అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. వీటి సంతానోత్పత్తి చక్రం నిదానంగా సాగుతుంది.
ఆరు నుంచి పదేళ్ల వయసులో ఇవి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. ఆడ డాల్ఫిన్లు రెండు నుంచి మూడేళ్లకు ఒక బిడ్డకు జన్మనిస్తాయి.
అయితే, భారత్‌లో నదీ జలాల డాల్ఫిన్ల భవిష్యత్‌పై సిన్హా ఆశాజనకంగా ఉన్నారు. ” ఈ డాల్ఫిన్లను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. చాలా చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది” అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS