SOURCE :- BBC NEWS
3 గంటలు క్రితం
గల్ఫ్ ఆఫ్ మెక్సికోపై డోనల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలన్న తన ఆలోచన గురించి ఆయన ప్రస్తావించారు.
“మార్పు గురించి త్వరలోనే ప్రకటన చేస్తాం. ఎందుకంటే అది మాది. మేము అక్కడ చాలా పనులు చేస్తున్నాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మారుస్తాం” అని ఫ్లోరిడాలోని మార్ ఎ లాగోలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ చెప్పారు.
“గల్ఫ్ ఆఫ్ అమెరికా, ఓహ్ ఎంత అందమైన పేరు. అది చక్కగా సరిపోతుంది కూడా..” అని ట్రంప్ అన్నారు.
తన ప్రతిపాదన గురించి మరిన్ని వివరాలు చెప్పకుండా మెక్సికో గురించి మాట్లాడుతూ.. ” మా దేశంలోకి లక్షల మంది ప్రజల్ని పంపించడాన్ని కూడా ఆపాలి” అని చెప్పారు.
మెక్సికో, కెనడా మీద ” తీవ్రమైన సుంకాల భారాన్ని మోపుతామన్న” వ్యాఖ్యల్ని ట్రంప్ పునరుద్ఘాటించారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చడం గురించి తన ప్రణాళిక ఏంటన్నది ట్రంప్ ఏమీ చెప్పలేదు. అయితే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చాలని కోరుతూ తానొక బిల్లును ప్రవేశపెడతానని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి మర్జోరీ టేలర్ గ్రీన్ చెప్పారు.
“అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పరిపాలనకు ఇదొక గొప్ప ఆరంభం” అని టేలర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చేందుకు వీలైనంత త్వరగా నేను తీర్మానాన్ని ప్రవేశపెడతాను. అదే సరైన పేరు కూడా” అని అందులో రాశారు.
అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక ప్రాంతం పేరు మార్చడం అంత సులభమా?
గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎవరి సొంతం?
గల్ఫ్ ఆఫ్ మెక్సికో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా, పశ్చిమ క్యూబా మధ్య ఉన్న ఒక సముద్ర ప్రాంతం.
దీని చుట్టూ మెక్సికోకు చెందిన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి. అవి టమౌలిపస్, వెరక్రుజ్, టబస్కో, కాంపెచే, యుక్తాన్.
అమెరికాలోని ఫ్లోరిడా, అలబామా, మిసిసిపి, లూసియానా, టెక్సస్ రాష్ట్రాలు, క్యూబాలోని పినర్, డెల్ రియో, అర్టెమిసా ప్రావిన్సులకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో తీరం ఉంది.
సముద్రంలో చమురు ఉత్పత్తి చేసే క్షేత్రాల్లో ప్రపంచంలోనే అతి పెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో. అమెరికా ముడి చమురు ఉత్పత్తిలో 14 శాతం, 5 శాతం సహజవాయువు ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది.
మెక్సికోకు సంబంధించి ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఆ దేశానికి అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. మెక్సికో ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ప్రధాన చోదకశక్తి ఇదే.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు సంబంధించి అమెరికా- మెక్సికో, అమెరికా- క్యూబా, మెక్సికో- క్యూబా మధ్య సముద్రంలో సరిహద్దులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థల సమక్షంలో జరిగిన ఒప్పందాలు ఉన్నాయి.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఎందుకంటారు?
ఈ సముద్ర ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని 16వ శతాబ్దంలో యూరోపియన్ మ్యాపుల్లో పేర్కొన్నారు.
1580లో బ్రిటిష్ అన్వేషకుడు ఫ్రాన్సిస్ డ్రేక్, మ్యాపుల చిత్రకారుడు బాప్టిస్ట్ బొయోజియో తన మ్యాపుల్లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా గుర్తించారు. ఈ ప్రాంతాన్ని “సర్ ఫ్రాన్సిస్ వెస్టిండీస్ నౌకా యాత్రకు ఇదొక మార్గం” అని పేర్కొన్నట్లు ఫ్లోరిడాకు చెందిన స్థానిక పత్రిక సెయింట్ అగస్టీన్ రికార్డ్‌లో సుసాన్ పార్కర్ రాశారు.
1591లో డిబ్రై రూపొందించిన మ్యాప్‌లో కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరు ఉపయోగించారని సుసాన్ పార్కర్ తెలిపారు.
1630లో రూపొందించిన మరో మ్యాపులో ఈ ప్రాంతాన్ని “గల్ఫ్ ఆఫ్ న్యూ స్పెయిన్”గా పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రాన్ని అప్పట్లో న్యూ స్పెయిన్‌గా పిలిచేవారు.
అంతకు ముందు ఎవరు ఎలా గుర్తించినా, 400 ఏళ్లుగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరు వాడుకలో ఉంది.
పేరు మార్చడం సాధ్యమేనా?
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చాలంటే ట్రంప్ ముందుగా మెక్సికో, క్యూబా అనుమతి తీసుకోవాలి.
అయితే మెక్సికోలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షెనబౌమ్ ట్రంప్ ప్రతిపాదనపై స్పందిస్తూ “మనం ఈ ప్రాంతాన్ని మెక్సికన్ అమెరికా అని ఎందుకు పిలవకూడదు? ఇది బాగానే ఉంది కదా” అని అన్నారు.
“ఆ ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని పిలుస్తాం” అని మెక్సికో ఆర్థిక శాఖ మంత్రి మార్సెలో ఎడ్బర్డ్ అన్నారు.
“ఆయన రోజూ ఏదో ఒకటి మాట్లాడతారు. వాటన్నింటికీ మేము స్పందించలేం. 30 ఏళ్ల తర్వాత కూడా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పిలుస్తాం. ఈ చర్చలో జోక్యం చేసుకోవాలని మేము అనుకోవడం లేదు. అమెరికాతో మాకున్న బంధాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాం” అని ఎడ్బర్డ్ అన్నారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చాలంటే ట్రంప్ అనేక అంతర్జాతీయ సంస్థల అనుమతి పొందాల్సి ఉంటుంది. అందులో ఇంటర్నేషనల్ హైడ్రో గ్రాఫిక్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఆన్ ది లా ఆఫ్ సీ , యునైటెడ్ నేషన్స్ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ జియోగ్రాఫికల్ నేమ్స్ వంటి సంస్థల అనుమతి అవసరం.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో వివిధ రకాల తీర ప్రాంత సముద్ర జీవులకు ఆవాసం. కొత్త పేరు ప్రకటిస్తే దాన్ని నాటికల్ చార్ట్స్, అధికారిక మ్యాపుల్లో ప్రకటించాలి. అంతే కాకుండా గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం ఉన్న దేశాల్లో చట్టాలను కూడా మార్చాల్సి ఉంటుంది.
ట్రంప్ ఏకపక్షంగా పేరు మార్చగలరా?
గల్ఫ్ పేరు మార్చడాన్ని మెక్సికో, క్యూబా వ్యతిరేకించినప్పటికీ, ఇతర దేశాలు గల్ఫ్ ఆఫ్ అమెరికా అనే పేరు గుర్తించేందుకు ఇష్టపడనప్పటికీ, పేరు మార్చాలనే తన కోరికను ట్రంప్ నెరవేర్చుకోగలరు.
అమెరికాలో ఆ దేశ ప్రభుత్వం ప్రాంతాల పేర్లు మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి.
అందులో యునైటెడ్ స్టేట్స్ బోర్డ్ ఆన్ జియోగ్రాఫికల్ నేమ్స్ ఒకటి.
అమెరికన్ ప్రభుత్వం భౌగోళికంగా పిలిచే పేర్లలో ఏకత్వం కోసం పేర్లు మార్చేందుకు ఈ సంస్థ పని చేస్తుంది.
ఈ సంస్ఖ ఏదైనా ప్రాంతానికి సంబంధించి భౌగోళికంగా కొత్త పేరు పెట్టదు. అయితే ఇది అమెరికన్ ప్రభుత్వం, అమెరికాలోని రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ప్రతిపాదించిన పేరును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
ట్రంప్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడినప్పటికీ, ఒక ప్రాంతం పేరు మార్చిన తొలి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఎలాంటి గుర్తింపు దక్కదు.
2015లో నార్త్ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ మెకిన్లే పేరును మౌంట్ డెనాలిగా మార్చాలని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కోరడంతో ‘యునైటెడ్ స్టేట్స్ బోర్డ్ ఆన్ జియోగ్రాఫికల్ నేమ్స్’ అంగీకరించింది. ఇది అలస్కా ప్రజలు తరతరాలుగా ఉపయోగిస్తున్న అథాబాస్కాన్ పేరు. ఈ మాటకు ‘చాలా గొప్పది’ అని అర్థం.
1896లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన విలియం మెకిన్లీ పేరు మీద ఆ పర్వతానికి పేరు పెట్టారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆరు నెలల్లోనే ఆయనను హత్య చేశారు.
మెకిన్లీ ఎప్పుడూ అలాస్కాకు రాలేదు. స్థానిక అమెరికన్లతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకే ఒబామా పర్వతం పేరు మార్చారు.
అయితే డోనల్డ్ ట్రంప్ డెనాలీ పేరుని తిరిగి మౌంట్ మెకిన్లీగా మార్చాలని అనుకుంటున్నట్లు గతంలో చెప్పారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేందుకు ‘యునైటెడ్ స్టేట్స్ బోర్డ్ ఆన్ జియోగ్రాఫికల్ నేమ్స్’ అంగీకరించినా, తమ పరిధిలోని జల వనరులకు సంబంధించిన పేర్ల విషయంలో అమెరికా, మెక్సికో మధ్య వివాదాలు ఏర్పడటం ఇదే తొలిసారి కాదు.
అమెరికాలోని టెక్సస్ నుంచి మెక్సికన్ రాష్ట్రాలు చిహువాహువా, కోవాహుయిలా, న్యూవొ, లియోన్, టమౌలిపస్ ప్రవహించే నదిని అమెరికన్లు రియో గ్రాండే అని పిలిస్తే మెక్సికన్లు రియో బ్రావో అని పిలుస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)