SOURCE :- BBC NEWS
2 జనవరి 2025
క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. గత నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను ప్రకటిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అందులో భాగంగా, 18 ఏళ్లకే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేశ్‌కు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు లభించింది.
గుకేశ్‌తో పాటు, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, అలా సాధించిన ఏకైక భారీతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ మను భాకర్‌ను కూడా ఖేల్‌రత్న అవార్డుకు ఎంపిక చేసింది.
వారిద్దరితో పాటు పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్, పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ప్రవీణ్ కుమార్‌కు కూడా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న దక్కింది.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది
ఇద్దరు తెలుగమ్మాయిలకు అర్జున అవార్డులు
ఖేల్‌రత్నతో పాటు 32 మంది క్రీడాకారులకు కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించింది. వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు.
ఇద్దరు తెలుగు అమ్మాయిలు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అథ్లెట్ జ్యోతి యర్రాజీ, పారా అథ్లెట్ జీవంజి దీప్తిని అర్జున పురస్కారం వరించింది.
హాకీ క్రీడాకారుడు జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, మహిళా హాకీ టీమ్ కెప్టెన్ సలీమా టెటెకు అర్జున అవార్డులు ప్రకటించారు.
జనవరి 17న పురస్కారాల ప్రదానం
చెస్ గ్రాండ్ మాస్టర్ వంటిక అగర్వాల్‌కు అర్జున అవార్డు లభించింది.
పారా అథ్లెట్లు ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ సర్జేరావ్ ఖిలారి, ధరంబిర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సీమా, సిమ్రన్, నవదీప్‌లు అర్జున పురస్కారానికి ఎంపికయ్యారు.
ద్రోణాచార్య అవార్డుకు ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ హెడ్ కోచ్ అర్మాండో అగ్నెలో ఎంపికయ్యారు.
ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన స్వప్నిల్ సురేశ్ కుశాలె, సరబ్‌జోత్ సింగ్, పారా ఒలింపిక్ షూటర్ మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లకు కేంద్రం అర్జున అవార్డులు ప్రకటించింది.
జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు.
18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలిచిన గుకేశ్
తెలుగు అబ్బాయి అయిన 18 ఏళ్ల గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. గుకేశ్ సాధించిన విజయం ఈ ఏడాది భారతీయ క్రీడల్లో కీలకమైనవాటిలో ఒకటి. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి విజయం సాధించాడు. గుకేశ్‌కు 11కోట్ల34లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది.
గుకేశ్ తండ్రి పేరు రజనీకాంత్, ఈఎన్‌టీ సర్జన్‌గా పనిచేసేవారు. కుమారుడికి చెస్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన రజనీకాంత్ 2017లో వైద్య వృత్తిని విడిచిపెట్టారు. గుకేశ్ తల్లి డాక్టర్ పద్మకుమారి మద్రాసు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్.
మొదటగా ఇంట్లో వారితో చెస్ ఆడటం ప్రారంభించాడు గుకేశ్ . అక్కడే బేసిక్స్ నేర్చుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. గుకేశ్ ప్రతిభను గుర్తించిన కోచ్ అతనికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అతనికి తల్లిదండ్రులు, పాఠశాల నుంచి మద్దతు లభించింది. స్థానిక టోర్నమెంట్లలో పాల్గొనడం ప్రారంభించాడు. బహుమతులు గెలుచుకున్నాడు.
“గుకేశ్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువ, చాలా కష్టపడి పని చేస్తాడు” అని భారత చెస్ జట్టుకు అనేక సంవత్సరాలుగా కోచ్‌గా ఉన్న ఆర్‌బీ రమేష్ అన్నారు.
చిన్నప్పటినుంచే చెస్‌లో గొప్ప విజయాలు సాధించాడు గుకేశ్. 2015లో గోవాలో జరిగిన నేషనల్ స్కూల్స్ చాంపియన్‌షిప్‌ను గెలుపొందిన గుకేశ్, ఆ తర్వాత రెండేళ్లపాటు టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. 2019 జనవరిలో అతను గ్రాండ్‌మాస్టర్ గౌరవం పొందాడు. భారత్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు గుకేశ్ . గుకేశ్ 2016లో కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్‌లో 2018 అండర్-12 ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. 2021లో గుకేశ్ యూరోపియన్ చెస్ క్లబ్ కప్‌లో స్వర్ణం సాధించాడు, అక్కడ అతను మాగ్నస్ కార్ల్‌సెన్‌తో పోటీ పడ్డాడు.
ఫ్రాన్స్‌లో కేన్స్ ఓపెన్ 2020, నార్వేజియన్ మాస్టర్స్ 2021, స్పెయిన్‌లో మెనోర్కా ఓపెన్ 2022, ఎలైట్ నార్వే గేమ్స్ 2023తో సహా 10 ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు గుకేశ్.
పారాలింపిక్స్‌లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికయిన జీవంజి దీప్తి
పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది జీవంజి దీప్తి. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో రేసును ముగించి, మూడో స్థానంలో నిలిచింది. ఇంటలెక్చువల్ ఇంపెయిర్‌మెంట్ విభాగంలో భారత్ నుంచి పతకం గెలిచిన తొలి అమ్మాయిగా దీప్తి నిలిచింది.
2024 మే నెలలో జపాన్‌లోని కోబేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల టీ-20 విభాగంలో దీప్తి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ రేస్‌ను ఆమె 55.07 సెకన్లలో పూర్తి చేశారు. దీంతో పారిస్ పారాలింపిక్స్ పోటీలకు ఆమె నేరుగా క్వాలిఫై అయింది. దీప్తి కిందటేడాది చైనాలో హంగ్జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లోనూ బంగారుపతకం సాధించింది.
వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన జీవంజి దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. ఆపరేషన్ తర్వాత కూడా ఆమె ముఖంపై ఆ ఛాయలు కనిపించేవి. సాధారణ ఆడపిల్లలతో పోలిస్తే ఆమె తల కొంచెం చిన్నగా ఉంటుంది. దీంతో ఆమెను తోటివారు, గ్రామస్తులు ఆటపట్టించేవారు.
”మాది మేనరిక వివాహం. దీప్తి గ్రహణం మొర్రితో పుట్టింది. అందరూ కోతిపిల్లా, కోతిపిల్లా అని గేలి చేస్తుంటే పాప ఏడ్చేది.. అదిచూసి మాకు ఎంతో బాధ కలిగేది” అని తల్లి ధనలక్ష్మి చెప్పారు.
దీప్తి చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలూ ఎదుర్కొంది.
తెలంగాణలోని ఖమ్మంలో పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొన్న దీప్తి.. ట్రాక్‌పై షూ లేకుండానే పరిగెత్తి బంగారు పతకం సాధించింది. ఈ ఘటన ‘సాయ్’ కోచ్ నాగపురి రమేష్‌ను ఆకర్షించింది.
దీప్తిని ‘సాయ్’ లో చేర్చాలని పీఈటీ వెంకటేశ్వర్లుకు కోచ్ రమేష్ సూచించారు. కానీ, దీప్తి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
”ఆడపిల్ల. చన్నీటి స్నానం పడదు. మూర్ఛ వ్యాధి ఉంది. కోచింగ్‌కు పంపలేమని చెప్పాం. పరుగుపందెం అంటే ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని తెలియదు. చిన్నపిల్ల కదా అనుకున్నాం. అందుకే మేం షూ కూడా కొనివ్వలేదు. నిజానికి వేలు ఖర్చుచేసి షూ కొనే స్థోమత కూడా మాకు లేదు” అన్నారు దీప్తి తల్లి ధనలక్ష్మి.
“వెక్కిరించిన వారంతా ఈ రోజు ముక్కున వేలేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా బిడ్డకు నమస్కారం పెడుతున్నారు. తల్లిదండ్రులుగా అంతకన్నా సంతోషం ఏముంటుంది!?” అన్నారు ధనలక్ష్మి.
ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడ్డ జ్యోతి యర్రాజీకి అర్జున అవార్డు
జ్యోతి యర్రాజీ బ్యాంకాక్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేసులో గోల్డ్ మెడల్ సాధించింది. 50 ఏళ్ల ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి యర్రాజీ నిలిచింది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడ్డ మొదటి భారత అథ్లెట్ ఆమె.
జ్యోతి తండ్రి సూర్యనారాయణ విశాఖపట్నం ద్వారకానగర్‌లోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుంటారు.
“ఆడపిల్ల అని మొదట్లో ఆటల్లో ప్రొత్సహించేందుకు ఇష్టపడలేదు. కానీ జ్యోతి ఆసక్తిని గమనించి పంపించాం. ఆడపిల్లను ఆటలు ఆడేందుకు పంపిస్తావా అంటూ చుట్టుపక్కల వాళ్లు అనేవారు. ఆ మాటలను మేం పట్టించుకోలేదు. నేను హోటల్‌లో వంట పని చేస్తూ జ్యోతిని పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి.” అని జ్యోతి తల్లి కుమారి బీబీసీతో చెప్పారు.
భువనేశ్వర్‌లోని ఒడిశా రిలయన్స్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హిల్లర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ హిల్లర్ ఆమెకు కోచింగ్ ఇచ్చాడు. ఇది తనకు ఎంతగానో ఉపయోగపడిందని, తన వేగం మెరుగుపడిందని ఓ సందర్భంలో బీబీసీతో చెప్పింది.
జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఇప్పటికీ 100మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) ఆమె పేరు మీదనే ఉంది.
2023 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించింది. తర్వాతి ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్యాన్ని సాధించింది. ఆమె ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS