SOURCE :- BBC NEWS

ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Alamy

ఐస్‌లాండ్ ఉత్తర తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో, భూమి నుంచి దూరంగా, హోరున వీచే గాలులతో ప్రత్యేకంగా కనిపించే యూరప్‌లోని మారుమూల ప్రాంతం ఈ గ్రిమ్సే దీవి. లక్షల సంఖ్యలో పక్షులకు ఇది నిలయం.

గ్రిమ్సే ద్వీపంలో వీచే గాలులు నీటి పొరలను చీల్చుకుంటూ చాలా వేగంగా వస్తున్నాయి. ఆ గాలుల వేగం ఎలా ఉందంటే, అవి ప్రపంచ పటం నుంచి ఈ ప్రాంతాన్ని తుడిచి పెట్టేస్తాయా అన్నట్లుగా ఉంది.

నా భర్త, నేను అందమైన ఈ గ్రిమ్సే ద్వీపానికి వచ్చాం.

తీరపు అంచుల మీద కర్రల సాయంతో నడుస్తున్నాం. ఆ కర్రలు మేం పట్టు తప్పకుండా ఉండటానికి మాత్రమే కాదు, తీరంలో ఏటవాలుగా ఉన్న బండరాళ్ల మీద ఏర్పాటు చేసుకున్న తమ గూళ్లకు దగ్గరగా వచ్చే పర్యటకులపై దాడి చేసే ఆర్కిటిక్ టెర్న్ పక్షుల నుంచి కాపాడుకోవడానికి కూడా పనికొస్తాయి.

ద్వీపంలోని రాళ్ల అంచుల దగ్గర నెమ్మదిగా నడుస్తున్నప్పుడు, సముద్రంలోకి వలస వెళ్లే కొన్ని పఫిన్ పక్షులు అక్కడ ఉండటాన్ని మేము గమనించాం.

ఐస్‌లాండ్ ఉత్తర తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో 6.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది గ్రిమ్సే ద్వీపం. ఐస్‌లాండ్‌కు ఉత్తరాన నివాసానికి అనుకూలంగా ప్రదేశం ఇది. అంతే కాదు, అర్కిటిక్ సర్కిల్‌లో ఏకాంతంగా ఉన్న భూభాగం కూడా ఇదే.

ఇందులో ఎన్నో ఆకర్షణలున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Alamy

1931వరకు, గ్రిమ్సే చేరుకోవాలంటే ఏడాదికి రెండుసార్లు ఈ ద్వీపానికి ఉత్తరాలు ఇవ్వడానికి వచ్చే చిన్న పడవ ఒక్కటే ఆధారం. అయితే ప్రస్తుతం అకురెరి నుంచి విమానంలో అయితే 20 నిముషాల్లోనే వచ్చేయవచ్చు.

సాహసాలు చేయాలనుకునేవారు దాల్విక్ గ్రామంలో ఫెర్రీ ఎక్కితే మూడున్నర గంటల్లో ఈ ఏకాంత ద్వీపానికి చేరుకోవచ్చు.

మాలాంటి వాళ్లు అనేకమంది ఈ ద్వీపంలో సుదూరంగా ఉన్న జనావాసాలను, ఇక్కడున్న వివిధ రకాల పక్షులను, వన్య ప్రాణుల్ని చూసేందుకు వస్తున్నారు.

దీనికి తోడు పురాతన యుద్ధ విమానాలను తలపించే ఆర్కిటిక్ టెర్న్ పక్షులు, విస్తృతంగా ఉన్న పఫిన్ పక్షులు, నల్లటి కాళ్లున్న కిట్టీ వేక్స్, రేజర్‌బిల్స్, గిల్లేమాట్స్, ఇంకా స్వేచ్ఛగా తిరిగే గుర్రాలు, గొర్రెలకు కూడా ఈ ద్వీపం ఆవాసం.

ఇక్కడ నివసించే స్థానికుల జనాభాతో పోల్చి చూసినప్పుడు ఒక్కో మనిషికి 50వేల పక్షులు ఉన్నాయని అంచనా.

“మీరు నమ్మరుగానీ, ఇక్కడ చాలా ఏళ్లుగా ఉంటున్నది మేం 20మందిమే” అని ఆర్కిటిక్ ట్రిప్ అనే సంస్థకు చెందిన టూర్ గైడ్ హల్లా ఇంగోల్ఫ్‌డాట్టిర్ చెప్పారు.

రెక్జావిక్‌లో జన్మించిన ఆమె, ఆగ్నేయ ఐస్‌లాండ్‌లో పెరిగారు. తన సోదరిని చూసేందుకు గ్రిమ్సే వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అక్కడే గడిపారు.

గ్రిమ్సేలో ఒక మత్స్యకారుడితో పరిచయం తర్వాత ఆయన్ను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. 20 ఏళ్ల పాటు పార్ట్ టైమర్‌గా జీవించిన తర్వాత అక్కడే స్థిరపడాలని 2019లో నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె వెనక్కి రాలేదు.

“నేను ప్రేమలో పడటం వల్ల ఇక్కడకు వచ్చానని అందరు అనుకుంటారు. అయితే నేను ఈ దీవితో ప్రేమలో పడ్డాను. ఇక్కడ ఏదో మేజిక్ ఉంది. ఇక్కడ ప్రజలు జీవించే విధానం నాకు బాగా నచ్చింది. శీతాకాలంలో ఉత్తరం నుంచి వచ్చే వెలుగు, చీకటి, నక్షత్రాలు, తుపానులు, వసంత కాలంలో వెలుగులు, పక్షులు.. ఇక్కడ ప్రతి రుతువు ప్రత్యేకమే” అని ఆమె చెప్పారు.

ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Alamy

పర్యటక సంస్థను నడపడంతో పాటు, ఆమె తన ఇంటి పక్కనే ఉన్న 9 గదులున్న గెస్ట్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు.

ఐస్‌లాండ్ తన విద్యుత్ అవసరాల కోసం ఎక్కువగా జల విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల మీద ఆధారపడుతోంది.

గ్రిమ్సే చాలా దూరంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని సెంట్రల్ గ్రిడ్‌తో అనుసంధానిచడం వీలుకాలేదు.

“మీకు బోర్ కొడితే ఏం చేస్తారని పర్యటకులు తరచు అడుగుతుంటారు. నేను చేయాల్సింది చాలా ఉంది. ప్రధాన భూభాగం మీద ఉండేవాళ్లు చేసేవన్నీ మేం కూడా చేస్తాం. పని, వ్యాయామం…ఇంకా చాలా ఉన్నాయి. అయితే నన్ను ఇక్కడే ఉండేలా చేస్తున్నది మాత్రం ఈ ప్రకృతే” అని ఇంగోల్ఫ్‌డాట్టిర్ చెప్పారు.

గ్రిమ్సేలో ఏమేం ఉంటాయి?

గ్రిమ్సేలో ఆసుపత్రి లేదు. డాక్టర్ లేదా పోలీస్ స్టేషన్ లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు స్పందించేలా ద్వీపవాసులకు తీర రక్షక దళం, ఎమర్జెన్సీ సేవల బృందాలు శిక్షణ ఇచ్చాయి.

“మీరు ఇక్కడ జీవిస్తున్నప్పుడు, వివిధ రకాల పరిస్థితులు, అనూహ్య సంఘటనలను ఎదుర్కొనేందుకు వీలుగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి” అని ఇంగోల్ఫ్‌డాట్టిర్ చెప్పారు.

“మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో వాళ్లు మాకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ మూడు వారాలకు ఒకసారి డాక్టర్ విమానంలో ఈ ప్రాంతానికి వచ్చి వెళతారు” అని ఆమె చెప్పారు.

ఈ ద్వీపంలో నైరుతి వైపున కొన్ని ఇళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మరి కొన్ని పర్యటకుల కోసం ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌస్‌లు. ఇళ్లున్న ప్రాంతాన్ని శాండిక్ అని పిలుస్తారు. ఇందులో ఒక స్కూలు కూడా ఉంది.

స్థానికులు ఈ స్కూలు హౌస్‌ను కమ్యూనిటీ సెంటర్‌గా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ కమ్యూనిటీ సెంటర్‌లో హస్తకళల కేంద్రం, కెఫే ఉన్నాయి. ఇందులో స్థానికులు ఇంట్లోనే తయారు చేసిన వస్తువులు, అల్లికలు, చిన్న చిన్న కళాకృతులను ప్రదర్శిస్తున్నారు.

అంతే కాకుండా ఇక్కడ ఒక చిన్న కిరాణ దుకాణం ఉంది. దీన్ని ప్రతీరోజూ గంట పాటు తెరిచి ఉంచుతారు. అలాగే రెస్టారెంట్, బార్, స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, చర్చి, ఎయిర్ స్ట్రిప్ ఉన్నాయి. ఎయిర్ స్ట్రిప్ చుట్టు పక్కల పక్షులు వేల సంఖ్యలో కనిపిస్తాయి.

ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Michelle Gross

ఐస్‌లాండ్‌లోని చాలా చిన్న పట్టణాలు, గ్రామాల మాదిరిగానే గ్రిమ్సేకు కూడా స్థానిక గాథలలో స్థానం ఉంది. పశ్చిమ నార్వేలోని సోగ్న్ జిల్లా నుంచి వచ్చిన గ్రిముర్ అనే పేరు గల నోర్స్ సెటిలర్‌తో ఈ ద్వీపం పేరు ముడిపడి ఉందని ఒక కథ ఉంది.

గ్రిమ్సే గురించి మొట్టమొదటిసారి ప్రస్తావన 1024ల్లోనే ఉంది. ఇది పురాతన ఐస్‌లాండిక్ కథలకు చెందిన హిమ్‌స్క్రింగ్లాలో రికార్డు అయి ఉంది. హిమ్‌స్క్రింగ్లా అనేది స్వీడన్, నార్వే రాజులకు చెందిన కథల సంపుటి.

దీనిలో నార్వే రాజు ఒలాఫర్ స్నేహానికి చిహ్నంగా గ్రిమ్సేను ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే, చేపలు, పక్షులు ఎక్కువగా ఉన్న ఈ ద్వీపాన్ని వదులుకునేందుకు అప్పటి స్థానిక నేతల నిరాకరించారు అని దానిలో ఉంది.

18వ శతాబ్దం చివరిలో, న్యూమోనియా, చేపల పట్టే సమయంలో నెలకొన్న ప్రమాదాల వల్ల గ్రిమ్సే జనాభా దారుణంగా పడిపోయింది. చిన్న పడవలు, ప్రతికూల వాతావరణం, సహజ నౌకాశ్రయం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజల జీవనాన్ని ప్రమాదకరంగా మార్చింది.

అయినప్పటికీ, ప్రధాన భూభాగం నుంచి నిరంతరం అక్కడికి మత్స్యకారులు వెళ్లడం వల్ల, ఐస్‌లాండ్ ఉత్తర తీరంలో ఉన్న హుసావిక్‌లోని సమీప స్థావరంతో వాణిజ్యం కోసం వచ్చిన వారితో అక్కడ కొంత జనాభా మిగిలింది.

2009లో గ్రిమ్సే అకురెరి మున్సిపాలిటీలో భాగమైంది. ”ప్రస్తుతం గ్రిమ్సే భూమి అకురెరి పట్టణానికి చెందిన స్థానికుల చేతిలో ఉంది. ఈ ద్వీప వారసత్వంగా అక్కడున్న సహజ నిధిని, కమ్యూనిటీని కాపాడేందుకు ఈ ఐస్‌లాండ్ రాష్ట్రం కృషి చేస్తోంది” అని పర్యటకం కోసం గ్రిమ్సే ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తోన్న మారియా హెచ్ ట్రైగ్వాడాట్టిర్ చెప్పారు.

ఈ ద్వీపంతో తనకున్న ప్రత్యేక అనుభవాన్ని పంచుకున్నారు మారియా. ”మారుమూలన ప్రాంతంలో ఈ ద్వీపం ఉండటం, ప్రత్యేకమైన కాంతి, అద్భుతమైన పక్షి జీవితం గ్రిమ్సేలో నన్ను బాగా ఆకర్షిస్తాయి” అని మారియా చెప్పారు.

ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Michelle Gross

పఫిన్స్‌కు తోడు ఈ ద్వీపంలో మరో పర్యటక ఆకర్షణ దీని భౌగోళికంగా ఇది ఉన్న ప్రాంతం. 66 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ఐస్‌లాండ్‌కు సంబంధించి ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఒకే ఒక్క భూభాగం ఇది.

2017లో ఇక్కడ 3,447 కేజీల కాంక్రీట్ భూగోళాన్ని నిర్మించారు. దీన్ని ఈ ద్వీపంలో ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఐస్‌లాండ్ ఉత్తర ప్రాంతంలో ఆర్కిటిక్ సర్కిల్ గ్రిమ్సే ఊహాత్మక రేఖ వెళ్లే ప్రాంతంలో ఈ భూగోళాన్ని ఏర్పాటు చేశారు.

“ఐలండ్‌ పర్యటకాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఇదొక మంచి అంశం. అయితే దీన్ని ఇక్కడ నుంచి తరలించడం అసాధ్యం. దీన్ని ప్రధాన భూభాగానికి తరలించడానికి ప్రత్యేక సామగ్రి అవసరం. ఆర్కిటిక్ సర్కిల్‌లో మరో పురాతన కట్టడం ఉంది. అది ఇక్కడ 1970 నుంచి ఉంది. మీరు దాన్ని సందర్శిస్తారని అనుకుంటున్నాను” అని ఇంగోల్ఫ్‌డాట్టిర్ అన్నారు.

గ్రిమ్సే భౌగోళికంగా ఉత్తరం వైపు ఉండటంతో ఈ ద్వీపంలో ఉన్న వారు ఎన్నో పోలార్ నైట్స్‌ను అనుభవించగలరు. డిసెంబర్ ప్రారంభం నుంచి ఫిబ్రవరి మధ్య వరకుండే చలికాలంలో నెలల తరబడి చీకటి ఉంటుంది.

”నాకు చీకటి విషయంలో పెద్దగా భయం, బాధ అనిపించదు. కానీ, కొందరు ఇబ్బంది పడతారు. వెలుగు మళ్లీ వస్తుందని మాకు తెలుసు” అని ఇంగోల్ఫ్‌డాట్టిర్ చెప్పారు.

ఐస్‌లాండ్, టూరిజం, టూరిస్టులు, ఆర్కిటిక్, Grímsey

ఫొటో సోర్స్, Alamy

ఇక్కడున్న ద్వీప ప్రజలు ఈ చీకటి బారి నుంచి భయపడేందుకు సొంతంగా లైట్లను తయారు చేసుకుంటారు.

”మేం క్రిస్మస్‌కు ముందుగానే లైట్లను డెకరేట్ చేసుకుంటాం. ఈ చీకటిని లైట్లతో తరిమికొట్టాలనుకుంటాం. ఇక్కడొక చిన్న క్రిస్మస్ టౌన్ కనిపిస్తుంది. ఫిబ్రవరి వరకు ఈ లైట్లను మేం వెలిగిస్తూనే ఉంటాం” అని ఇంగోల్ఫ్‌డాట్టిర్ తెలిపారు.

గ్రిమ్సే భవిష్యత్ విషయానికొస్తే, వచ్చే వేసవిలో కొన్ని కొత్త అభివృద్ధి మొదలు కానున్నాయని ఇంగోల్ఫ్‌డాట్టిర్ చెప్పారు. వాటిల్లో, రచయితలు, ఇతర క్రియెటివ్ ఆర్టిస్టులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు.

అయితే, ఈ ద్వీపంలో మాస్ టూరిజాన్ని తాము అనుమతించాలనుకోవడం లేదని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)