SOURCE :- BBC NEWS

రోమన్ గ్లాడియేటర్ (వీరుడి) అస్థిపంజరంపై కనిపించిన గాట్లు మనుషులకు, సింహాలకు మధ్య పోరాటం జరిగిందని తెలియజేసే తొలి ప్రాచీన సాక్ష్యాధారాలని నిపుణులు చెబుతున్నారు.
బ్రిటన్‌లోని యార్క్ డ్రిఫీల్డ్ టెర్రస్‌లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను గుర్తించారు.
అక్కడ వెలికితీసిన యువకుడి అస్థిపంజరంపై జరిపిన ఫోరెన్సిక్ పరీక్షలో, ఆయన కటి ఎముకపై(పెల్విస్) కనిపించిన గాట్లు, రంధ్రాలు సింహం పంజా విసరడంతో ఏర్పడినవి కావొచ్చని నిపుణులు చెప్తున్నారు.
సింహాలు, పులులు వంటి పెద్ద జంతువులతో(బిగ్ క్యాట్స్) గ్లాడియేటర్లు పోరాడినట్లు తెలియజేసే తొలి భౌతిక సాక్ష్యం ఇదేనని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ టిమ్ థాంప్సన్ చెప్పారు.
‘‘పుస్తకాలు, కళాత్మక రూపాల ద్వారానే రోమన్ గ్లాడియేటర్లకు, జంతువులకు మధ్య పోరాటాన్ని మనం చాలా ఏళ్లుగా అర్థం చేసుకుంటూ వస్తున్నాం. కానీ, ఇది ఆ కాలంలో జరిగిన విషయాలపై తొలిసారి భౌతిక సాక్ష్యాన్ని అందిస్తుంది’’ అని ఆయన అన్నారు.

ఈ గాయాలను పరిశీలించేందుకు నిపుణులు 3డీ స్కాన్ వంటి సరికొత్త ఫోరెన్సిక్ విధానాలను వాడారు. 3డీ స్కాన్‌లో ఒక జంతువు మనిషి కటి భాగాన్ని పట్టుకుని లాగినట్లు తెలిసింది.
‘‘చనిపోయే సమయంలోనే ఈ గాట్లు పడ్డట్లు మేం కనుగొనగలిగాం’ అని ఐర్లాండ్‌లోని మేనూథ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ థాంప్సన్ చెప్పారు.
చనిపోయిన తర్వాత ఆయన్ను తినాలనుకున్న జంతువు గుర్తులు కూడా కాదని ఆయన వివరించారు.
ఈ గాయాలను స్కాన్ చేసి, లండన్ జూలోని అతిపెద్ద జంతువుల గాట్ల శాంపిళ్ల పరిమాణం, ఆకారంతో పోల్చి చూశారు.
ఈ వ్యక్తి అస్థిపంజరంపై కనిపించినవి సింహం చేసిన గాట్లు అని థాంప్సన్ బీబీసీ న్యూస్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, University of York
అస్థిపంజరంపై కనిపించిన గాట్లు గ్లాడియేటర్ల మరణానికి గల కారణాలపై మరింత సమాచారాన్ని పరిశోధకులకు అందించాయి.
‘‘పెల్విస్‌పై సాధారణంగా సింహాలు దాడి చేయవు. ఏదైన ఆయుధంతో ఈ గ్లాడియేటర్ దానితో పోరాటం చేయడంతోనే ఇలా దాడి చేసి ఉంటుందని మేం నమ్ముతున్నాం. సింహం ఆయనపై విరుచుకుపడి, పట్టుకుని లాగినట్లు ఉంది’’ అని థాంప్సన్ వివరించారు.
ఈ అస్థిపంజరం 26 నుంచి 35 ఏళ్లకు చెందిన వ్యక్తిది. మరో ఇద్దరి శవాలతో సమాధిలో దీన్ని ఖననం చేసి, గుర్రపు ఎముకలతో పూడ్చిపెట్టారు.
అస్థిపంజరాలపై 30 ఏళ్లుగా జరుపుతున్న పరిశోధనల్లో, అంతకుముందెన్నడూ ఇలాంటి గాట్లు చూడలేదని యార్క్ యూనివర్సిటీ ఆస్టియో ఆర్కియాలజీ సీనియర్ లెక్చరర్ మాలిన్ హోల్స్ట్ అన్నారు.
అత్యంత క్రూరమైన జీవిత కథనాన్ని ఈ మనిషి అవశేషాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.
ఈ ఎముకలు పెద్దగా, శక్తివంతమైన కండరాలతో ఉన్నాయి. గట్టి శారీరక శ్రమ, పోరాటాన్ని ఆయన భుజాలు, వెన్నెముక గాయాలు ప్రతిబింబిస్తున్నాయి.
తాజా పరిశీలనలు గ్లాడియేటర్లు ఎలా ఉండేవారో మెరుగైన చిత్రాన్ని రూపొందించేందుకు ఉపయోగపడనున్నాయని యార్క్ ఆస్టియోఆర్కియాలజీ మేనేజింగ్ డైరెక్టర్ హోల్స్ట్ చెప్పారు.
అకడమిక్ జర్నల్ పీఎల్ఓఎస్ వన్‌లో ఈ ఆవిష్కరణ ప్రచురితమైంది.

నిపుణుల అంచనాల ప్రకారం, యార్క్‌లో రోమన్ నాయకులు ఉండటం వల్ల, వారికి విలాసవంతమైన జీవనశైలి అవసరం ఉండేదని, తమ సంపదను ప్రదర్శించేందుకు గ్లాడియేటర్ ఈవెంట్లను నిర్వహించేవారేమోనని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఈ వ్యక్తిని ఈ ప్రాంతానికి ఎవరు తీసుకొచ్చారో మీకు తెలియదు. ఇతరులకు వినోదాన్ని అందించేందుకు ఆయన పోరాడి ఉంటారు. రోమో కోలోసియం నుంచి ఇప్పటి వరకు గ్లాడియేటర్ పోరాటానికి సంబంధించి లభించిన తొలి ఆస్టియోఆర్కియాలజికల్ సాక్ష్యాధారం ఇది’’ అని యార్క్ ఆర్కియాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ జెన్నింగ్స్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)