SOURCE :- BBC NEWS

Chattisgarh, maoist encounter bbc news telugu

ఫొటో సోర్స్, DEVENDRA SHUKLA

చత్తీస్‌గఢ్ లోని గరియాబంద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 20మంది మావోయిస్టులు మృతిచెందినట్టు భద్రతా బలగాలు ప్రకటించాయి.

‘ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటికీ చాలామంది మావోయిస్టులు ఉన్నారు. డ్రోన్ల సహాయంతో వారందరిని గుర్తించి చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు మరణించిన మావోయిస్టుల సంఖ్య 20మందికి పైనే ఉంటుంది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

అయితే పోలీసులు ఇప్పటివరకు కేవలం మావోయిస్టులువిగా భావిస్తున్న 14 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒడిశా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్ జైరాం అలియాస్ చలపతి ఉన్నారు.

సీపీఐ మావోయిస్టు పార్టీలో చలపతి ఉన్నత స్థాయి నాయకుడు. సైద్ధాంతిక విషయాలలో నిపుణుడిగానూ, మంచి వ్యూహకర్తగానూ ఆయనకు పార్టీలో పేరుంది. దీంతో చలపతి మరణాన్ని పోలీసులు విజయంగా భావిస్తున్నారు.

bbc news telugu
CHATTISGARH, RAIPUR, MAOIST,

ఫొటో సోర్స్, DEVENDRA SHUKLA

నాలుగు రోజుల కిందట కూడా చత్తీస్‌గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో 12 మంది మావోయిస్టులని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

తరువాత తమ బృందంలో 18మంది కామ్రేడ్లు మరణించారని మావోయిస్టులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు సంస్థ టాప్ లీడర్ దామోదర్ కూడా ఉన్నారని వారు తెలిపారు. దామోదర్‌పైన 50 లక్షల రివార్డు ఉంది.

దేశవ్యాప్తంగా 38 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

రాజీవ్, సోనియా

ఫొటో సోర్స్, Madhya Pradesh Public Relations Department

భద్రతా బలగాలు ఆపరేషన్ ను నిర్వహించిన కుల్హదీఘాట్ ఒక దట్టమైన అటవీ ప్రాంతం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోనియా గాంధీతో కలిసి ఈ ప్రాంతాన్ని 14జులై 1985న సందర్శించి, ఇక్కడి గిరిజనులతో ఒకరాత్రంతా విడిది చేశారు. దీంతో అప్పట్లో కుల్హదీఘాట్ వార్తల్లో నిలిచింది.

ఇప్పుడీ ప్రాంతంలోనే ఆదివారం సీఆర్పీఎఫ్ బృందం,చత్తీస్‌గఢ్ పోలీస్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఒడిశా నుంచి 7 కంపెనీల భద్రతా బలగాలు, చత్తీస్‌గఢ్ నుంచి 3 కంపెనీల భద్రత బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

కుల్హదీఘాట్ ప్రదేశంలోని భాలుదిగి, టర్ ఝర్ అడవుల్లో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ మొదలైంది. ఘటనాస్థలంలో ఊహించిన దానికంటే ఎక్కువ మంది మావోయిస్టులు ఉన్నారు.

సోమవారం మధ్యాహ్నానికల్లా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు.

మావోయిస్టులను గుర్తించేందుకు రీకొనైసాన్స్ డ్రోన్లను ఉపయోగించారు. ఈ డ్రోన్ సమాచారంతో మావోయిస్టులను గుర్తించి భద్రతా బలగాలు వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి.

మంగళవారం ఉదయానికల్లా భద్రతా బలగాలు మరో పన్నెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో మృతుల సంఖ్య 14కు చేరింది.

ఎన్‌కౌంటర్

ఫొటో సోర్స్, Devendra Shukla

ఈ ఆపరేషన్ లో ఒక సైనికుడు గాయపడ్డారు. ఆయనను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు. మావోయిస్టుల నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

మావోయిస్టులను ముట్టడించే ప్రయత్నాలు మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. మావోయిస్టులను ముట్టడించిన ప్రాంతంలో చెట్లు తక్కువ, రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ అమలు సులువైంది.

గరియాబంద్ ప్రాంతానికి మరిన్ని భద్రతా బలగాలను పిలిపించినట్లు పోలీసు అధికారి చెప్పారు. అలాగే గరియాబంద్ లోని భాటిగఢ్ స్టేడియం వద్ద మోహరించిన పోలీసులను అప్రమత్తంగా ఉండమని ఆదేశాలు జారీ అయ్యాయి. పలువురు పోలీసు ఉన్నతాధికారులు గరియాబంద్ కు చేరుకున్నారు.

2024లో 219మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు హతమార్చలేదు. పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఏడాది గత 21రోజుల్లోనే 43మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు.

ఇది మరో మైలురాయి: అమిత్ షా

నక్సల్ రహిత భారతదేశం విషయంలో మన భద్రతా బలగాలు మరో మైలురాయిని చేరుకున్నాయి. ఇది నక్సలైట్లకు మరో పెద్ద దెబ్బ’’ అని కేంద్ర హోం శాఖమంత్రి మంత్రి మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

సీఆర్పీఎఫ్, ఒడిశా పోలీస్ ప్రత్యేక బృందం,ఒడిశా పోలీసులు కలిసి 14మంది నక్సలైట్లను హతమార్చారు .జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని అమిత్ షా చెప్పారు.

‘నక్సల్-రహిత భారత దేశ సంకల్పానికి భద్రతా బలగాల తోడ్పాటు కారణంగా దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉంది’ అని అమిత్ షా అన్నారు.

ఈ ఘటనపై చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి స్పందిస్తూ 2026 మార్చినాటికల్లా నక్సలిజం ఆనవాలు ఉండవన్నారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేత, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ‘‘ప్రజాస్వామ్య వ్యతిరేకులకు గుణపాఠం నేర్పినందుకు మన భద్రతా బలగాలను అభినందిస్తున్నాను’’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)