SOURCE :- BBC NEWS

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఒక గంట క్రితం

చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరే అవకాశం ఉంది.

ఈ టోర్నీలో కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు.

సచిన్ తెందూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగులు సాధించాడు. సంగక్కరకు ఈ మార్కును చేరుకోవడానికి 378 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 13,906 పరుగులు ఉన్నాయి. తన కెరీర్‌లో 295 మ్యాచ్‌లాడిన కోహ్లీ 283 ఇన్నింగ్స్‌లలో ఈ పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

అతితక్కువ ఇన్నింగ్స్‌లలో..

ఫిబ్రవరిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే వన్డేలలో 14,000 పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ సచిన్ తెందూల్కర్. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 463 మ్యాచ్‌లాడి 18,426 పరుగులు చేశాడు.

సంగక్కర 404 మ్యాచ్‌ల్లో 14,232 పరుగులు చేసి ఈ జాబితాలో రెండో స్థానంలో, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు.

కోహ్లీ మరో 329 పరుగులు సాధిస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వన్డేల్లో అత్యంత వేగంగా అంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 8000, 9000, 10000,11000,12000,13000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీనే.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు ఎన్నంటే..

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్‌ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబయ్ వేదికగా జరుగనుంది.

ఐసీసీ డిసెంబర్ 24న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఆతిథ్య దేశం పాకిస్తాన్‌తో పాటు తటస్థ వేదికైన దుబయ్‌లో జరుగుతుంది.

టోర్నీలో ఎనిమిది జట్లను 2 గ్రూపులుగా విభజించారు.

డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్, భారత్, న్యూజీలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ ‘ఎ’లో ఉండగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు గ్రూప్ ‘బి’లో చోటు దక్కించుకున్నాయి.

ఫిబ్రవరి 19న కరాచీలో జరుగనున్న టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. మరుసటి రోజు భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దుబయ్‌లో ఆడుతుంది.

గ్రూపు దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ గ్రూప్ దశలో 3 మ్యాచ్‌లు ఆడుతుంది.

భారత్, పాక్ జట్లు

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ ఉద్రిక్తతలు

ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది.

దీంతో తటస్థ వేదికగా దుబయ్‌ని ఎంచుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది.

కాబట్టి, షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఆడాల్సిన మూడు గ్రూప్ మ్యాచ్‌లు, మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగనున్నాయి.

ఫైనల్ మ్యాచ్ మార్చి 9వ తేదీన లాహోర్‌లో జరుగుతుంది.

ఒకవేళ భారత జట్టు ఫైనల్‌కు చేరితే ఈ వేదికను దుబయ్‌కు మార్చనున్నారు. 1996 తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. 2028లో జరగనున్న మహిళల టి20 ప్రపంచ కప్‌కు కూడా పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అప్పుడు కూడా తటస్థ వేదిక ఏర్పాటు జరుగుతుంది.

బీసీసీఐ, పీసీబీ, ఐసీసీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, 2027 వరకు భారత్ ఆతిథ్యం వహించే ఏ టోర్నమెంట్‌లోనైనా పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడుతుంది.

ప్రధాన టోర్నీలను మినహాయిస్తే 2013 నుంచి పాకిస్తాన్, భారత్‌లు పరస్పరం ఆడలేదు. అంతే కాకుండా 2008 నుంచి పాకిస్తాన్‌లో భారత్ ఆడలేదు.

జట్లు

బీబీసీ

షెడ్యూల్

ఫిబ్రవరి 19 పాకిస్తాన్ X న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్ X భారత్, దుబయ్

ఫిబ్రవరి 21 ఆఫ్గానిస్తాన్ X దక్షిణాఫ్రికా, కరాచీ

ఫిబ్రవరి 22 ఆస్ట్రేలియా X ఇంగ్లండ్. లాహోర్

ఫిబ్రవరి 23 పాకిస్తాన్ X భారత్, దుబయ్

ఫిబ్రవరి 24 బంగ్లాదేశ్ X న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 25 ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా, రావల్పిండి

ఫిబ్రవరి 26 అఫ్గానిస్తాన్ X ఇంగ్లండ్, లాహోర్

ఫిబ్రవరి 27 పాకిస్తాన్ X బంగ్లాదేశ్, రావల్పిండి

ఫిబ్రవరి 28 అఫ్గానిస్తాన్ X ఆస్ట్రేలియా, లాహోర్

మార్చి 1 దక్షిణాఫ్రికా X ఇంగ్లండ్, కరాచీ

మార్చి 2 న్యూజిలాండ్ X భారత్, దుబయ్

మార్చి 4 సెమీఫైనల్-1, దుబయ్

మార్చి 5 సెమీఫైనల్-2, లాహోర్

మార్చి 9 ఫైనల్ మ్యాచ్, దుబయ్/లాహోర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)