SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Facebook/Indus Martin
నేరం చేసిన వాళ్లకి శిక్ష పడాలి. అయితే, నేరస్తులందరూ శిక్షను అనుభవిస్తున్నారా? కొందరు కులం, డబ్బు ఆధారంగా శిక్షలు తప్పించుకుంటున్నారు. దళితులు, పేదవాళ్లు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా 23 సినిమా వచ్చింది.
1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసు కథాంశం. ఈ సంఘటనలో 23 మంది చనిపోయారు. సినిమా టైటిల్ కూడా ఇదే.
కథ ఏమంటే.. సాగర్ (తేజ) ఒక పల్లెటూరిలో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలని కోరిక. కానీ, లోన్ దొరకదు. పొగాకు కూలీగా పని చేస్తున్న సుశీల (తన్మయి)ని ప్రేమిస్తుంటాడు. అతనికి దాస్ అనే మిత్రుడుంటాడు. పోలీస్ రికార్డుల్లో దాస్ నేరస్తుడు.
పెళ్లి కాకుండానే సుశీల గర్భవతి అవుతుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేస్తే డబ్బులొస్తాయని ప్లాన్ చేస్తాడు. పెట్రోల్ పోసి, ప్రయాణికుల్ని బెదిరించి డబ్బులు దోచుకోవాలని అనుకుంటారు.
అయితే, ప్రయాణికులు తిరగబడతారు. దాస్‌ను కొడుతూ ఉంటే, తప్పించుకునే క్రమంలో సాగర్ అగ్గిపుల్ల గీసి బెదిరిస్తాడు. అనుకోకుండా బస్సు అంటుకుని 23 మంది చనిపోతారు. వీళ్లని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు వీళ్లకి ఉరిశిక్ష విధిస్తుంది.


ఫొటో సోర్స్, youtube screengrab
ఆ తర్వాత ఏమవుతుంది?
హంతకులకి శిక్ష పడటమే న్యాయమైతే, అందరు హంతకులూ ఉరికంబం ఎక్కుతున్నారా? ఇదీ దర్శకుడి ప్రశ్న. ప్రారంభమే ఈ ప్రశ్నతో మొదలవుతుంది.
1991లో చుండూరు మారణకాండలో 8 మంది చనిపోయారు. 1997లో జూబ్లీహిల్స్ కారు బాంబు ఘటనలో 26 మంది మరణించారు. ఈ రెండు ఘటనల్లో హత్యలు చేయడమే లక్ష్యం. చుండూరులో దళితులే లక్ష్యం. కారుబాంబు గురి తప్పింది, గురి తప్పకపోయినా అనేక మంది పోయేవాళ్లు.
ఈ రెండు కేసుల్లో చంపడమే లక్ష్యంగా ఉన్న నిందితులకి ఉరిశిక్ష కాదు కదా, యావజ్జీవం కూడా పడలేదు. చుండూరు కేసులో జైలుకెళ్లినవారు విడుదలయ్యారు. కారు బాంబు కేసులో ప్రధాన నిందితుడు ఆ తర్వాత ఏదో కారణంతో బయటికొచ్చాడు.
చిలకలూరిపేట కేసులో దోపిడీ చేయడం మాత్రమే లక్ష్యం. ఈ క్రమంలో 23 మంది చనిపోయారు. ఈ కేసులో దోషులు ఉరి వరకు వెళ్లి, ఇంకా జైలులోనే ఉన్నారు. మరి న్యాయం అందరికీ సమానమేనా?
సినిమాలో దర్శకుడు చెప్పదలుచుకున్న మెయిన్‌పాయింట్ ఇదే.
అయితే, ఇది సెకెండాఫ్‌లో దారితప్పి ఖైదీల పరివర్తన దిశగా వెళుతుంది. కథనం నెమ్మదించి, క్లైమాక్స్‌లో క్షమాభిక్ష లభిస్తుంది.

ఫొటో సోర్స్, Facebook/Indus Martin
23 సినిమా రియాలిటీకి దగ్గరగా ఉందా?
23 సినిమా, రెగ్యులర్ సినిమా ఫార్మాట్ కాదు. దర్శకుడు రాజ్ ఆర్ కమర్షియల్ దృష్టితో కాకుండా, సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశారు. నిజానికి మన దేశంలో ఎక్కువగా జైళ్లలో మగ్గుతున్నది దళితులు, పేదవాళ్లే.
ఇలాంటి కథలతో సమస్య ఏంటంటే, కొంచం తేడా వచ్చినా సినిమా కాస్తా డాక్యుమెంటరీ కథనంగా మారిపోతుంది. సినిమాకి ముఖ్యంగా నాటకీయత అవసరం. ఆ రకమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల కథనం ముఖ్యంగా సెకెండాఫ్‌లో స్లోగా ఉంటుంది.
హీరో ఎలివేషన్లు, పంచ్ డైలాగ్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్ కథలు, రొడ్డ కొట్టుడు విలనిజంతో అలిసిపోయిన ప్రేక్షకులకి ఇది ఊరట, హార్ట్ టచింగ్. రొటీన్ సినిమా ప్రేక్షకులకి 23 ఎక్కడం కొంచెం కష్టమే కావొచ్చు. ఆలోచనాత్మక సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మిస్ చేసుకోకూడని సినిమా 23.
సినిమా చూస్తున్నప్పుడు తెలియకుండానే కళ్లు తడుస్తూ ఉంటాయి.
ఇండస్ మార్టిన్ డైలాగ్‌లు శతాబ్దాల దు:ఖాన్ని తడుతూ ఉంటాయి. కులం ప్రస్తావన వచ్చినప్పుడు అణగారిపోయిన వారి కష్టాలు కదులుతూ ఉంటాయి.
హీరో, హీరోయిన్ల అమాయకపు ప్రేమ సన్నివేశాలు, చివర్లో కూతుర్ని రహస్యంగా హీరో చూసినప్పుడు (అది అతని ఆఖరి కోరిక) కలిగే ఎమోషన్‌ను తెరమీద అద్భుతంగా దర్శకుడు ఆవిష్కరించాడు.
కోర్టు రూమ్ డ్రామా బలంగా ఉండి, చెప్పాల్సిన పాయింట్ మీదే (దళితులకి జరుగుతున్న అన్యాయం) ఫోకస్ చేసి ఉంటే సినిమా మరో జైభీమ్ అయి ఉండేది. ఖైదీల పరివర్తన అనే సబ్ ప్లాట్ అతకలేదు. కామెడీ వేషాలు వేసే తాగుబోతు రమేష్ సరికొత్తగా కనిపించి, తనలో అద్భుత నటుడు ఉన్నాడని రుజువు చేసుకున్నాడు.
వినోదాత్మక సినిమాలు ఎపుడూ వస్తాయి. ఆలోచనాత్మక సినిమాలు ఎప్పుడో కానీ రావు.
ప్లస్ పాయింట్స్
1. హీరో, హీరోయిన్ల నటన
2. డైరెక్టర్ రాజ్ ఆర్ ఎంచుకున్న పాయింట్
3. డైలాగ్‌లు, ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్
1. సెకండాఫ్‌లో స్లో నెరేషన్
2. రొటీన్ జైలు సన్నివేశాలు
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)