SOURCE :- BBC NEWS
(గమనిక: ఈ కథనంలో అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)
పశ్చిమగోదావరి జిల్లాలో యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళ ఇంటికి పార్సిల్‌గా వచ్చిన డెడ్ బాడీ ఎవరిదో పోలీసులు గుర్తించారు. అయితే ఆ శవాన్ని ఎవరు పంపించారనే విషయంపై దర్యాప్తు సాగుతోంది.
తులసి మరిది శ్రీధర్ వర్మ అలియాస్ సిద్ధార్ధ వర్మని ఈ కేసులో అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే శవాన్ని బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు.
ఇంతకీ ఈ బర్రె పర్లయ్య ఎవరు? పర్లయ్యని చంపి ఆ మృతదేహాన్ని సాగి తులసి ఇంటికే ఎందుకు పార్సిల్ చేశారు? తులసి మరిదిని పోలీసులు ఎందుకు అనుమానిస్తున్నారు?
పోలీసులు ఏం చెబుతున్నారు?
మృతుడు బర్రె పర్లయ్యను కూలి పనులకు వెళ్లే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆయనది పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలంలోని గాంధీనగర్.
పర్లయ్యకు నా అనేవారు ఎవరూ లేకపోవడంతో ఏ ఊరిలో పని చేస్తే అక్కడే ఏ ఇంటి అరుగుమీదో పడుకునేవాడని పోలీసులు చెప్పారు.
”పర్లయ్యను హత్య చేయడం ద్వారా అనుమానితుడు తిరుమాని శ్రీధర్ వర్మ ఏ లబ్ధి పొందాలనుకున్నాడనే విషయంపై విచారణ చేస్తున్నాం ” అని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ చెప్పారు.
యండగండి గ్రామంలో ముదునూరి రంగరాజుకి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి పేరు తులసి, చిన్నమ్మాయి రేవతి. ఈ రేవతి భర్తే శ్రీధర్ వర్మ.
తులసి ఇంటికి పార్సిల్‌లో శవం వచ్చినప్పటి నుంచి శ్రీధర్ గ్రామంలో కనిపించడం లేదు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
“కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీధర్ వర్మను గుర్తించాం. పర్లయ్యను హత్య చేసి ఆ బాడీని సాగి తులసికి బాక్సులో పంపించారా? లేదా అనుకోకుండా పర్లయ్య చనిపోతే దానిని పంపిచారా అనేది దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. కానీ శ్రీధర్ వర్మకు నేర చరిత్ర ఉన్నట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. ఇప్పటికే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. సాగి తులసిని భయపెట్టి ఆమె ఆస్తిని పొందేందుకు శ్రీధర్ వర్మ వేసిన పథకంగా ఇది కనిపిస్తోంది” అని ఎస్పీ నయీం అస్మీ చెప్పారు.
కాళ్ల గ్రామంలో శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన పోలీసులకు అక్కడ మరో చెక్క పెట్టె కనిపించింది. ఇది దేని కోసం ఉంచారనే విషయంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఆస్తి గొడవలు
ఘటన జరిగిన రోజు శ్రీధర్ వర్మ కారు యండగండి గ్రామంలోనే ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
“శ్రీధర్ వర్మకు సాగి తులసితో ఆస్తి కోసం చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్పారు. ఆమెను బెదిరించి ఆస్తిని లాక్కునేందుకు పార్సిల్ డెడ్ బాడీ పథకం వేసినట్లు తెలుస్తోంది.” అని జిల్లా ఎస్సీ అన్నారు.
శ్రీధర్ వర్మ దొరికితే ఈ కేసులో చిక్కుముడులన్నీ విడిపోతాయని చెబుతున్న పోలీసులు అనుమానితుడి ఫోటోలను విడుదల చేశారు. అలాగే నేరం జరిగిన తర్వాత అతడు ప్రయాణించిన ఎరుపు రంగు కారు చిత్రాలను కూడా విడుదల చేశారు.
ఇంతకుముందు ఏం జరిగిందంటే?
తులసికి ఈనెల 20న ఎలక్ట్రికల్ సామాన్ల పార్సిల్ పేరుతో చెక్కపెట్టెలో డెడ్ బాడీ వచ్చింది. అందులో డబ్బులు చెల్లించాలంటూ ఒక లేఖ కూడా ఉంది.
ఈ సామాన్లను పంపించినవారి అడ్రసు రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితి పేరుతో ఉంది.
తులసికి గ్రామంలో ప్రభుత్వ ఇంటి స్థలం మంజూరైంది. ప్రస్తుతం ఇల్లు నిర్మాణ దశలో ఉంది. అయితే, ఆర్థిక సాయం కోసం రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితిలో ఆమె పేరు నమోదు చేసుకున్నారు.
ఈ సమితి క్షత్రియుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తుంటుందని, వారికి దరఖాస్తు చేసుకున్న తర్వాత తొలిసారి కొన్ని సామాన్లు వచ్చాయని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ఈ డెడ్ బాడీ వచ్చిందని పార్సిల్ అందుకున్న తులసి చెప్పారు.
మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
లేఖలో ఏముంది?
తులసికి వచ్చిన పార్సిల్‌లో డెడ్‌బాడీతో పాటు ఒక లేఖ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు.
“తులసి ఇంటికి ఎలక్ట్రికల్ సామాన్ల పార్సిల్ బాక్సును ఒక ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని తెలిపారు. ఆమె వచ్చి సామాన్ల బాక్సు తెరవగానే అందులో మృతదేహం కనిపించింది” అని పోలీసులు చెప్పారు.
ఆ పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని రాసి ఉందని పోలీసులు తెలిపారు.
మాకు సంబంధం లేదు : క్షత్రియ సేవా సమితి
తులసికి వచ్చిన పార్సిల్‌ను క్షత్రియ సేవా సమితి పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది రాజమహేంద్రవరంలో ఉన్నట్లు వచ్చిన పార్సిల్ పై ఉన్న అడ్రసు బట్టి అర్థం అవుతుందని పోలీసులు తెలిపారు. దీనిపై రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితితో బీబీసీ మాట్లాడింది.
“క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సాగి తులసి అనే మహిళకు వచ్చిన పార్సిల్ రాజమహేంద్రవరంలోని క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లుగా వార్తల్లో వస్తోంది. అది అవాస్తవం. రాజమండ్రిలో క్షత్రియ సేవా సమితి తప్ప ఎటువంటి క్షత్రియ పరిషత్ లేదు. మేము మా ప్రాంతవాసులకు తప్ప ఇతర ప్రాంతాల వారికి ఎటువంటి సాయం చేయం. యండగండి ఘటనలో మాకు ఎటువంటి సంబంధం లేదు” అని రాజమహేంద్రవరంలోని క్షత్రియ సేవా సమితి నిర్వహక ప్రతినిధి ఎంఎన్ రాజు బీబీసీతో చెప్పారు.
మృతదేహం గుర్తింపు
పార్మిల్‌లో వచ్చిన మృతదేహం ఎవరిది అనే అంశంపై ఘటన జరిగిన రోజు స్పష్టత రాలేదు. పైగా మృతదేహంలోని కొన్ని భాగాలు చెక్కేసినట్లు ఉండటం, కాళ్లు కోసేసినట్లు ఉండటం వంటి అంశాలను పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన రోజు నాటికి మృతదేహాం ఎవరిదనే విషయంపై స్పష్టత లేకపోవడంతో పోస్టుమార్టం కోసం పోలీసులు మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు శవాన్ని బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత స్థానికులు చెప్పిన వివరాలు సరిపోలడంతో చనిపోయింది పర్లయ్యేనని నిర్థరించారు. ఘటనకు ముందు పర్లయ్యని కూలి పనుల కోసం తీసుకొచ్చిన శ్రీధర్ వర్మ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)