SOURCE :- BBC NEWS

ట్రంప్ పరస్పర సుంకాలు, చైనా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటించే సందర్భంలో చైనాపై కటువుగా మాట్లాడారు.

“నాకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంటే చాలా గౌరవం ఉంది. చైనా పట్ల కూడా గౌరవం ఉంది. అయితే వాళ్లు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు” అని ట్రంప్ తన ప్రసంగంలో అన్నారు.

అమెరికన్ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన ఆటంకాలు సృష్టిస్తున్న దేశాలు, ప్రాంతాల జాబితాను చూపుతూ ట్రంప్ ” మీరు ఇక్కడ చూస్తే.. చైనా, అమెరికన్ వస్తువుల మీద 67 శాతం పన్నులతో తొలి వరుసలో ఉంది. అందులో కరెన్సీ అక్రమాలు, వాణిజ్య అక్రమాలు కూడా ఉన్నాయి” అని చెప్పారు.

“మేం కూడా వాళ్ల కు కొంచెం రాయితీ ఇస్తూ 34 శాతం పరస్పర సుంకాన్ని విధిస్తున్నాం. సూటిగా చెప్పాలంటే, మీరు సుంకాలు విధిస్తే, మేం కూడా అదే చేస్తాం. అయితే మనం విధించే సుంకాలు కాస్త తక్కువ. దీని వల్ల ఎవరైనా ఎందుకు బాధ పడతారు?” అని ట్రంప్ ప్రశ్నించారు.

సుంకాల విధింపుపై చైనా వాణిజ్య శాఖ తక్షణం స్పందించింది. ఇది “ఏకపక్ష బెదిరింపు చర్య” అని ప్రకటించింది. తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని” తెలిపింది.

డోనల్డ్ ట్రంప్ ‘‘రెండు దేశాల వాణిజ్యాన్ని చాలా తేలికగా దెబ్బకు దెబ్బ లాంటి ఆటగా మార్చారని” చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా ఆరోపించింది.

బీజింగ్ ఆందోళనకు సరైన కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా ఇప్పటికే చైనా ఉత్పత్తుల మీద భారీగా సుంకాలు విధిస్తోంది. ట్రంప్ తాజా ప్రకటనతో ఈ సుంకాలు ఇప్పుడు 20శాతం పెరుగుతాయి

మరొకటి, ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు చైనా మీద విధించిన సుంకాల వల్ల ఆ దేశం తన సరఫరా వ్యవస్థను విస్తరించింది. అయితే ఇప్పుడు అగ్నేయాసియా దేశాలైన కాంబోడియా, వియత్నాం, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాల మీద భారీగా సుంకాలు విధించడం ద్వారా అలాంటి అవకాశాలను లేకుండా చేసింది.

ట్రంప్ భారీగా సుంకాలు విధించిన 10 దేశాల్లో ఐదు ఆసియా దేశాలే ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ట్రంప్ పరస్పర సుంకాలు, చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనాపై పన్నుల భారం

ట్రంప్ జనవరిలో వైట్‌హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి చైనా దిగుమతుల మీద సుంకాలు విధిస్తూనే ఉన్నారు. వాటినిప్పుడు 20శాతానికి పెంచారు.

వారం వ్యవధిలోనే, కార్లు, స్టీల్, అల్యూమినియంపై ఈ సుంకాలు 54 శాతానికి చేరతాయి. నిజానికి వీటిపై సుంకాలు తక్కువగా ఉండాలి.

సుంకాల పెంపుతో పాటు ట్రంప్ బీజింగ్‌పై వాణిజ్యపరమైన విమర్శలు చేస్తున్నారు.

చైనా నుంచి వచ్చే తక్కువ విలువైన పార్సిల్స్‌కు ముగింపు పలుకుతూ బుధవారం డోనల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ఈ ఆర్డర్ రాక ముందు వరకు చైనాలో ఈ కామర్స్ దిగ్గజాలైన షీన్, టెము లాంటి సంస్థలు 800 డాలర్ల లోపు ధర ఉన్న తమ వస్తువులను ఎలాంటి పన్నులు, తనిఖీలు లేకుండా కార్గో నౌకల ద్వారా అమెరికాకు పంపేవి.

ఇలా గత ఆర్థిక సంవత్సరంలో 1.4 బిలియన్ల వస్తువులు అమెరికాకు వచ్చాయని కస్టమ్స్ డేటా చెబుతోంది.

తాజాగా ట్రంప్ ఈ అవకాశాన్ని తొలగించడంతో చైనాకు చెందిన ఈ కామర్స్ సంస్థలు తమపై పడే భారాన్ని వినియోగదారులకు బదలాయించాల్సి వస్తుంది. దీని వల్ల వాటి ధర పెరిగి అమెరికాలో వాటికి గిరాకీ తగ్గవచ్చు.

వీటన్నింటినీ కలిపి చూస్తే చైనాకు ఇది ఆందోళన కలిగించే అంశమే అని హిన్రిక్ ఫౌండేషన్ కన్సల్టెన్సీకి చెందిన దేబ్రో ఎల్మ్స్ చెప్పారు.

“ట్రంప్ విధిస్తున్న కొత్త సుంకాలు కేవలం చైనాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విధించినవని అనుకోవడం లేదు. కానీ అమెరికా వరుసగా సుంకాలను పెంచుతున్నప్పుడు, ముఖ్యంగా చైనా వస్తువుల మీద సుంకాలను పెంపు విషయంలో అంకెలను చూసినప్పుడు కళ్లు చాలా త్వరగా చెమర్చుతాయి” అని ఎల్మ్స్ అన్నారు

“చైనా, చైనీయులు దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్లు దీన్ని చూస్తూ కూర్చోలేరు” అని ఆమె చెప్పారు.

ట్రంప్ సుంకాలు, చైనా

ఫొటో సోర్స్, Getty Images

సరఫరా వ్యవస్థకు ఎదురు దెబ్బ

వియత్నాం, లావోస్, కాంబోడియా నుంచి అమెరికాకు వచ్చే వస్తువుల మీద డోనల్డ్ ట్రంప్ 46నుంచి 49 శాతం సుంకాలను విధించారు.

దీన్ని “బీజింగ్ విస్తృత సరఫరా గొలుసు మీద పూర్తి స్థాయి ఎదురు దాడిగా” భావించవచ్చని పెట్టుబడుల సంస్థ ఎస్పీఐ అస్సెట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి స్టీఫెన్ ఇన్నెస్ చెప్పారు.

“అమెరికా వాణిజ్య విధానాన్ని దూకుడుగా పునర్నిర్మించే ప్రయత్నంలో వియత్నాం, దాని చుట్టు పక్కల ప్రాంతాలు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది దెబ్బకు దెబ్బ కాదు. సుంకాల యుద్ధం ద్వారా కట్టడి చేసే వ్యూహం” అని ఆయన అన్నారు.

ఆగ్నేయాసియా ప్రాంతంలో లావోస్, కాంబోడియా పేద దేశాలు. ఇవి రెండు చైనా పెట్టుబడులు, సరఫరా వ్యవస్థ మీదఎక్కువగా ఆధారపడ్డాయి. ట్రంప్ తాజాగా ప్రతిపాదించిన అధిక సుంకాలు ఈ రెండు దేశాలను భారీగా దెబ్బ కొట్టనున్నాయి.

వియత్నాంకు చైనా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ట్రంప్ తొలి అధ్యక్ష పాలనా కాలంలో అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతల వల్ల లాభపడిన దేశాల్లో వియత్నాం ఒకటి.

2018లో ట్రంప్ చైనా మీద సుంకాల్ని పెంచారు. దీంతో కొంతమంది వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడ తయారు చేయాలా అనే ఆలోచనలో పడ్డారు. వారిలో కొంతమంది వియత్నాంలో తమ తయారీ కేంద్రాలను తెరిచారు.

దీంతో వియత్నాం నుంచి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. చైనా సంస్థలు వియత్నాం నుంచి అమెరికాకు ఎగుమతుల్ని పెంచడంలో కీలకంగా మారాయి.

“గతంలో చైనా మీద విధించిన సుంకాల భారాన్ని అధిగమించడానికి వియత్నాం కొత్త మార్గంగా మారడం వల్ల ట్రంప్ ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమవుతోంది” అని అమెరికా వాణిజ్య మాజీ సంధానకర్త స్టీఫెన్ ఓస్లో బీబీసీతో చెప్పారు.

వియత్నాం అమెరికాకు అతి పెద్ద ఎగుమతి దారుగా ఉంటే, చైనా వియత్నాంకు అతి పెద్ద సరఫరాదారుగా ఉంది. అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువుల్లో మూడు వంతులకు పైగా వియత్నాం నుంచి వస్తున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గతేడాది వియత్నాంకు కొత్తగా వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ప్రతి మూడింట్లో ఒకటి చైనా సంస్థల నుంచే వచ్చింది.

ఆగ్నేయాసియా దేశాల మీద అమెరికా విధించిన సుంకాల వల్ల ఆ దేశాల్లో చైనా నిషేధిత జాబితాలో చేరుతుందని ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ పుషన్ దత్‌ చెప్పారు.

“ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుపడు చైనా వస్తువులకు డిమాండ్ ఉంది. సుంకాల ప్రమాదాన్ని తప్పించుకునేందుకు చైనా సంస్థలు తమ తయారీ యూనిట్లను అగ్నేయాసియా దేశాల వైపు మళ్లించాయి. ఇప్పుడా తలుపు కూడా మూసుకుపోయింది” అని ఆయన అన్నారు.

అయితే ట్రంప్ తాజా సుంకాల వడ్డింపు ఆయా దేశాల్లోని అమెరికన్ సంస్థలపైనా ప్రభావం చూపుతోంది.

ఉదాహరణకు, అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, ఇంటెల్‌తో పాటు స్పోర్ట్ వేర్ దిగ్గజం నైకీ లాంటి సంస్థలకు వియత్నాంలో తయారీ కర్మాగారాలు ఉన్నాయి.

ట్రంప్ సుంకాల్ని పెంచితే భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాలని వియత్నాంలో ఉన్న అమెరికన్ సంస్థలు భావిస్తున్నట్లు వియత్నాంలోని అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.

అమెరికా పరస్పర సుంకాలు, చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఏం చేస్తుంది?

ట్రంప్ ప్రభుత్వం విధించిన తాజా పన్నుల విషయంలో చైనా ఎలా స్పందిస్తుందనే ప్రశ్న ఉంది.

ట్రంప్ తాజా సుంకాలు, ఇతర నిర్ణయాలతో చైనా కూడా తమ దేశంలోని అమెరికన్ సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించే పరిస్థితిని కల్పించవచ్చని ఓస్లాన్ అంచనా వేస్తున్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో బీజింగ్ “కఠినమైన ఎంపికలకు” సిద్ధం కావల్సి ఉంటుందని ప్రొఫెసర్ దత్ అభిప్రాయపడ్డారు.

“ఆగ్నేయాసియా దేశాలు తమ ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే, ఆయా దేశాల్లో పారిశ్రామికీకరణ తగ్గుతుంది. ఈ పరిణామాన్ని రాజకీయ నాయకులు ఎంత మాత్రం ఇష్టపడరు. దీనర్ధం ఏంటంటే చైనా, స్వదేశంలో డిమాండ్‌ను పెంచుకోవాలి” అని దత్ వివరించారు.

అమెరికా సుంకాల వల్ల చైనా, ఆసియాలోని ఇతర దేశాలతోనూ భాగస్వామ్యాలను నిర్మించుకోకతప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఆయా దేశాలకు లాభిస్తుంది.

“ఇలాంటి కఠిన పరిస్థితుల మధ్య అందరం కలిసి ఉందాం. కలిసి పని చేద్దాం” అని చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ థింక్ ట్యాంక్‌తో పని చేస్తునన వాంగ్ హుయియవో పిలుపిచ్చారు.

“చివరకు అమెరికా తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఏకాకిగా మిగులుతుంది”అన్నారు వాంగ్ .

ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు ఆసియన్ దేశాలు ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. గత ఐదేళ్లలో తొలిసారిగా సౌత్ కొరియా, జపాన్ ఇటీవల ఆర్థిక అంశాలపై చర్చించాయి.

పదేళ్ల క్రితం తాము ప్రతిపాదించిన వాణిజ్య ఒప్పందాలపై చర్చల్ని వేగవంతం చేయాలని ఈ దేశాలు నిర్ణయించాయి.

ఏదేమైనప్పటికీ, వాషింగ్టన్‌తో చర్చలు ప్రారంభించే వరకు, బీజింగ్ కొంత బాధను భరించాల్సి రావచ్చు.

“అంతిమంగా, అమెరికా చైనా చర్చల్లో అనేక అంశాల మీద భారీగా బేరసారాల వైపు వెళ్లవచ్చు” అని ఓస్లాన్ చెప్పారు.

‘‘అయితే అదంత త్వరగా జరక్కపోవచ్చు. పరిస్థితులు మెరుగుపడటానికి ముందే మరింతగా దిగజారవచ్చని అనుకుంటున్నాను” అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS