SOURCE :- BBC NEWS

2019 నుంచి 2023 వరకూ, ఏటా మూడు నుంచి ఐదు వరకూ ఇలాంటి కేసులు నమోదయ్యేవి.

ఫొటో సోర్స్, Getty Images

”చైనా ప్రజలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు”, ఈ ఏడాది ఆరంభంలో ఆగంతకుడు అపరిచితులపై దాడి చేసి చంపేసిన (సామూహిక హత్య) ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ నెటిజన్ చేసిన పోస్టు ఇది. ”ఇలాంటి దాడులు మరిన్ని జరగొచ్చు” అని కూడా ఆయన హెచ్చరించారు.

”ఈ విషాద ఘటన సమాజంలో నెలకొన్న అంధకారానికి ప్రతీక” అని మరొకరు రాశారు.

2024లో చైనాలో జరిగిన అమానుష దాడుల నేపథ్యంలో వెలువడిన ఇలాంటి అంచనాలు.. ప్రజలను సామూహిక హత్యలకు, సమాజంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరేపించడమేంటనే ప్రశ్నలకు దారితీశాయి.

అత్యధిక జనాభా ఉండే చైనాలో ఇలాంటి దాడులు చాలా అరుదు, కానీ కొత్తేమీ కాదు అని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేవిడ్ షాక్ చెప్పారు. అయితే, ఒకే తరహాలో జరిగే ఇలాంటి వరుస ఘటనలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

కానీ, ఈ సంవత్సరం మాత్రం మరింత బాధాకరం.

2019 నుంచి 2023 వరకూ, ఏటా మూడు నుంచి ఐదు వరకూ ఇలాంటి కేసులు నమోదయ్యేవి. ఈ కేసుల్లో నేరస్తులు ఎక్కువగా పాదచారులు, అపరిచితులపై దాడులకు పాల్పడ్డారు.

2024లో ఈ కేసుల సంఖ్య 19కి పెరిగింది.

2019లో, ఇలాంటి ఘటనల్లో ముగ్గురు మరణించగా, 28 మంది గాయపడ్డారు. 2023లో, 16 మంది చనిపోగా 40 మంది గాయాలపాలయ్యారు. 2024లో ఇలాంటి ఘటనల కారణంగా 63 మంది చనిపోయారు. మరో 166 మంది వరకూ గాయపడ్డారు. అందులోనూ నవంబర్ నెల మరింత రక్తసిక్తమైంది.

నవంబర్ 11న, ఝుహై నగరంలోని ఓ స్టేడియం బయట వ్యాయామం చేస్తున్న వారిని 62 ఏళ్ల వ్యక్తి కారుతో గుద్దుకుంటూ వెళ్లిన ఘటనలో 35 మంది చనిపోయారు. తన విడాకుల కేసులో చూపిన పరిష్కారంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ వారం ఆయన్ను ఉరి తీయనున్నారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే చాంగ్డే నగరంలో మరో వ్యక్తి ఒక స్కూల్ బయట విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 30 మంది వరకూ గాయపడ్డారు. నష్టాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

అదే వారంలో, గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిలైన 21 ఏళ్ల యువకుడు వుక్సీ నగరంలోని క్యాంపస్‌లో కత్తితో విచక్షణారహితంగా జరిపిన దాడిలో 8 మంది చనిపోగా, 17 మంది గాయపడ్డారు.

సెప్టెంబర్‌లో, 37 ఏళ్ల వ్యక్తి ఒకరు షాంఘై షాపింగ్ సెంటర్‌లో చొరబడి, జనంపై కత్తితో దాడి చేశాడు. జూన్‌లో, ఒక పార్కులో 55 ఏళ్ల వ్యక్తి నలుగురు అమెరికన్లపై దాడి చేశారు. జపనీయులపై రెండు వేర్వేరు దాడులు జరిగాయి. స్కూల్ బయట పదేళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన కూడా అందులో ఒకటి.

తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు అపరిచిత వ్యక్తులను టార్గెట్ చేసుకుంటున్నారని ప్రొఫెసర్ షాక్ చెప్పారు.

మహిళలు రాత్రిళ్లు ఒంటరిగా బయటికి వచ్చేందుకు కూడా పెద్దగా సంకోచించని, నిఘా వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో జరుగుతున్న ఇలాంటి హత్యలు సమాజంలో నెలకొన్న అశాంతికి అద్దంపడుతున్నాయి.

అయితే, చైనాలో ఈ సామూహిక దాడులకు ప్రేరేపిస్తున్నదేంటి?

చైనా

ఫొటో సోర్స్, Getty Images

మందగిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ

చైనాలో మానసిక ఒత్తిళ్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ మందగమనం. దేశంలో యువతలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడం, భారీగా పేరుకుపోతున్న అప్పులు, ఎన్నో కుటుంబాలు జీవితకాలం దాచుకున్న సొమ్మును మింగేసిన రియల్ ఎస్టేట్ సంక్షోభం వంటివి ఈ పరిస్థితికి కారణమనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

చైనాలో చాలా నగరాల శివార్లలో హౌసింగ్ ఎస్టేట్‌ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే, అప్పుల్లో కూరుకుపోయిన డెవలపర్లు వాటిని పూర్తిచేసే పరిస్థితిలో లేరు. అలా అసంపూర్తిగా మిగిలిపోయిన అపార్టుమెంట్లలో, కనీసం విద్యుత్, కిటికీలు కూడా లేకుండా, నీళ్లు నిలిచిపోయిన ఇళ్లలోనే ఉంటున్న వారిని 2022లో బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. ఎందుకంటే, వారికి ఉండడానికి మరో చోటు కూడా లేదు.

”ఆశావాదం సన్నగిల్లినట్లు కనిపిస్తోంది” అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ‌ చైనా సెంటర్‌‌లో రీసర్చ్ అసోసియేట్ జార్జ్ మాగ్నస్ అన్నారు. ”ఇక్కడ మనం ట్రాప్‌డ్ అనే పదం వాడొచ్చు. చైనా ఒక విధమైన అణచివేత చక్రంలో చిక్కుకుందని అనుకుంటున్నా. సామాజిక అణచివేత, ఆర్థిక అణచివేత ఒకవైపు.. తడబడుతున్న ఆర్థిక అభివృద్ధి మోడల్ మరోవైపు” అన్నారు.

వ్యక్తిగత అవకాశాలపరంగా చూస్తే చైనీయుల్లో నిరాశావాదం గణనీయంగా పెరగడం వల్ల వారి యాటిట్యూడ్ (ప్రవర్తన)లో భారీ మార్పులను అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అమెరికా – చైనా గతంలో జరిపిన ఒక సంయుక్త విశ్లేషణ సమాజంలో అసమానతలకు కృషి, సామర్థ్యమే ప్రధాన కారణాలని పేర్కొంది. ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వేలో, లోపభూయిష్టమైన ఆర్థిక వ్యవస్థని ప్రజలు ఎక్కువగా నిందిస్తున్నట్లు గుర్తించారు.

ప్రజలు నిజంగా ఎవరిని నిందిస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న అని మాగ్నస్ అంటున్నారు.

” ఆ తర్వాత.. ఈ వ్యవస్థ సరిగ్గా లేదు, మనం మార్చలేం, నా జీవితం కూడా ఇక ఇంతే.. అనే దశకు వస్తారు” అన్నారాయన.

చైనా

ఫొటో సోర్స్, BBC/Xiqing Wang

అవకాశాల కొరత

మీడియా కాస్త బలంగా ఉన్న దేశాల్లో.. మిమ్మల్ని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినా, లేదా స్థానిక అధికారుల మద్దతుతో బిల్డర్లు మీ ఇంటిని కూల్చివేశారని భావించినా, మీ గురించి చెప్పుకోవడానికి మీడియాను ఆశ్రయించవచ్చు. కానీ, చైనాలో ఇది చాలా అరుదు. ఎందుకంటే, ఇక్కడ మీడియాపై కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ ఉంటుంది. అలాగే, ఏ స్థాయిలోనూ ప్రభుత్వాన్ని చెడుగా చూపించే కథనాలకు ఆస్కారమే లేదు.

ఆ తర్వాత కోర్టుల వంతు. ఝుహై‌లో దాడికి ఇదే కారణమని కూడా మీడియా ఎత్తిచూపింది. తన విడాకుల కేసులో కోర్టు న్యాయమైన పరిష్కారం సూచించిందన్న విశ్వాసం అతనికి కలగలేదు.

అలాగే, చైనా ప్రజలు తమ నిరసనను తెలియజేసే వేదికలు కూడా తగ్గిపోయాయని, అన్నిమార్గాలు దాదాపుగా మూసుకుపోయాయని నిపుణులు అంటున్నారు.

సాధారణంగా తమ అసంతృప్తిని చైనా ప్రజలు సోషల్ మీడియా ద్వారా వెలిబుచ్చుతారని టొరంటో యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లినెట్ ఓంగ్ చెప్పారు.

ప్రజల అసహనాన్ని, అసంతృప్తిని నిలువరించేందుకు చైనా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఓంట్ ఎన్నో పరిశోధనలు చేశారు.

”ఆన్‌లైన్‌లో ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, కేవలం వారి కోపాన్ని వెళ్లగక్కుతారు. చిన్నచిన్న నిరసనలు చేస్తారు, చిన్నస్థాయి నిరసనలకు పోలీసుల అనుమతి కూడా వస్తుంది” అని ఆమె చెప్పారు.

”అయితే, తమ అసంతృప్తిని తెలిపే అవకాశం కూడా ఇటీవల కొన్నేళ్లుగా లేకుండాపోయింది” అన్నారామె.

చైనా

ఫొటో సోర్స్, Reuters

అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. వివాదాస్పదం లేదా ఇబ్బందికరమైన పదాలు, అభిప్రాయాల వ్యక్తీకరణపై ఇంటర్నెట్ సెన్సార్‌షిప్(నియంత్రణ) పెరగడం, ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసే చీకె హాలోవీన్ దుస్తులపై ఆంక్షలు, తమ అకౌంట్లను స్తంభింపజేశారని హెనాన్ ప్రావిన్స్‌లో బ్యాంకుల ఎదుట గుంపులుగా నిల్చున్న వారిని సమీకరించిన గ్రూపుగా భావించి స్థానిక అధికారులు దాడి చేయడం వంటివి.

ఆధునిక చైనీస్ సమాజంలో ఒంటరితనానికి, డిప్రెషన్‌‌కి గురైన వారికి కౌన్సెలింగ్ సేవలు కూడా సరిపోయేంత స్థాయిలో అందుబాటులో లేవని నిపుణులు చెబుతున్నారు.

”భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు కౌన్సెలింగ్ సాయపడుతుంది” అని హాంకాంగ్ సిటీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సిల్వియా క్వాక్ చెప్పారు. మానసిక ఆరోగ్య సంబంధిత సేవలను చైనా మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, మరీముఖ్యంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఆ ట్రామా నుంచి బయటపడేసేందుకు సేవలను మెరుగుపరచాలని ఆయన అన్నారు.

”తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు హింసాత్మకంగా ప్రతిస్పందించకుండా, తమ భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం నిర్మాణాత్మక పద్ధతులను అన్వేషించాల్సి ఉంటుంది.” అన్నారు.

వీటన్నింటినీ చూస్తే, చైనీస్ సమాజంలో ప్రెజర్ కుక్కర్ లాంటి పరిస్థితిని సూచిస్తున్నాయి.

”ఈ సామూహిక హత్యలపై ప్రజలు పెద్దయెత్తున స్పందించినట్లు కనిపించకపోయినా, ఇప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే, ఇప్పుడిప్పుడే ఇదంతా ముగిసిపోయేలా కూడా కనిపించడం లేదు” అన్నారు మాగ్నస్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)