SOURCE :- BBC NEWS

J-10C చైనా విమానం

ఫొటో సోర్స్, Getty Images

భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ తారస్థాయిలో ఉన్నప్పుడు , చైనా స్టాక్ మార్కెట్‌లో చైనా రక్షణ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది.

పాకిస్తాన్‌కు ఆయుధాలు, యుద్ధ విమానాలను సరఫరా చేసే కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపించింది . ఈ కంపెనీలలో అవిక్ చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఒకటి. ఈ కంపెనీ జే-10సీ ఫైటర్ జెట్‌ను తయారు చేస్తుంది.

‘ఇండియాకు చెందిన రాఫెల్ యుద్ధవిమానాన్ని కూల్చివేసేందుకు జే-10సీ ఫైటర్ జెట్‌ను ఉపయోగించామని’ పాకిస్తాన్ చెప్పడమే ఈ షేర్ల పెరుగుదలకు కారణం.

మే 7న పాకిస్తాన్ పార్లమెంటులో విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ జే-10సీ ఫైటర్ జెట్‌ను ఉపయోగించినట్టుగా చెప్పారు.

పాకిస్తాన్ వాదనపై భారత్ ఇంకా స్పందించలేదు. రాఫెల్ నష్టాన్ని అంగీకరించలేదు.

చైనా దీనిని తిరస్కరిస్తున్నప్పటికీ.. ఘర్షణ సమయంలో, యుద్ధ సమయంలో పాశ్చాత్య ఆయుధాలపై తన ఆయుధాలు ఎలా పనిచేశాయో నిశితంగా గమనిస్తూ ఉండవచ్చు.

“దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత ఆధునిక చైనా ఆయుధాలు ఇంకా యుద్ధ పరీక్ష ఎదుర్కోలేదు. పాకిస్తాన్ తన ఆయుధాలలో ఎక్కువ భాగాన్ని చైనా నుంచి కొనుగోలు చేస్తోంది. కాబట్టి వాటిని యుద్ధంలో పరీక్షించడం చైనా ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం” అని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్‌లో రక్షణ విశ్లేషకుడు ఎరిక్ ఝు అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఆయుధాల కోసం చైనాపై ఆధారపడ్డ పాకిస్తాన్

గత నాలుగు దశాబ్దాలలో చైనా ఎలాంటి పెద్ద యుద్ధం చేయలేదు. కానీ అదే సమయంలో, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంలో, చైనా తన సైన్యాన్ని బలోపేతం చేయడంలో, అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేయడంలో ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. చైనా ఈ ఆయుధాలను పాకిస్తాన్‌కు కూడా సరఫరా చేసింది.

పాకిస్తాన్ తన ఆయుధ దిగుమతులను 2015 -19తో పోలిస్తే 2020-24 మధ్య 61 శాతం పెంచింది.

పాకిస్తాన్.. చైనా నుంచి తీసుకునే ఆయుధాలలో ఆధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో తయారయ్యే కొన్ని ఆయుధాలలో చైనా పాత్ర కూడా ఉంది. వీటిని చైనా కంపెనీలు తయారు చేసి ఉండవచ్చు లేదా వాటిలో చైనీస్ టెక్నాలజీని ఉపయోగించి ఉండవచ్చు.

భారతదేశం గురించి మాట్లాడుకుంటే, ప్రపంచంలో ఆయుధాలను దిగుమతిలో చేసుకునే దేశాలలో భారత్ రెండో అతిపెద్ద దేశం. అయితే, 2015-19, 2020-24 మధ్య దాని దిగుమతులు 9.3 శాతం తగ్గాయి.

గత ఐదు సంవత్సరాలలో భారత ఆయుధ దిగుమతుల్లో అత్యధిక వాటా (36 శాతం) రష్యా నుంచి వచ్చింది. ఇది 2015-19 (55 శాతం), 2010-14 (72 శాతం) కంటే చాలా తక్కువ. మరోపక్క ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతుల్లో భారతదేశం ఇప్పటివరకు అత్యధిక వాటాను (28 శాతం) పొందింది.

“1990ల ప్రారంభం నుంచి ఎప్పటిలానే, 2020-24లో ఆసియా, ఓషినియా (ద్వీపదేశాలు) ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతి ప్రాంతంగా నిలిచాయి” అని ఎస్ఐపీఆర్ఐ ఆయుధ బదిలీ కార్యక్రమంలో సీనియర్ పరిశోధకులు సైమన్ వెజెమాన్ అన్నారు.

“చాలా కొనుగోళ్లు చైనా నుంచి వచ్చే ముప్పును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నవే” అని తెలిపారు.

షీ జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌లో చైనా ఆయుధాలు

చైనా, పాకిస్తాన్ మధ్య రక్షణ సహకారం 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత రెండు ప్రారంభమైంది. ఆ సమయంలో అమెరికా ఆయుధ ఆంక్షలు పాకిస్తాన్‌‌ను చైనా వైపు మళ్లేలా చేశాయి.

చైనా.. పాకిస్తాన్‌కు యుద్ధ విమానాలు, ట్యాంకులు, ఫిరంగులను సరఫరా చేసి, దీర్ఘకాలిక సంబంధానికి పునాది వేసింది.

ప్రచ్ఛన్నయుద్ధం తరువాత ఈ భాగస్వామ్యం బలపడి, పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే విషయంలో అమెరికా స్థానాన్ని చైనా భర్తీ చేసింది.

రెండు దేశాలూ 1963 నాటి చైనా-పాకిస్తాన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది సరిహద్దు వివాదాలను పరిష్కరించి 1966లో సైనిక సహాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో చైనా ఆయుధాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ఫైటర్ జెట్‌లు:

జే -10Cని చైనా కంపెనీ చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ తయారు చేయగా, జేఎఫ్-17 థండర్‌ను చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

క్షిపణులు:

భారత సైన్యం సోమవారం తన విలేకరుల సమావేశంలో పీఎల్ -15 క్షిపణి అవశేషాలను చూపించింది . అది విజయవంతం కాకముందే కూల్చివేశామని సైన్యం పేర్కొంది. పీఎల్ -15 అనేది పాకిస్తాన్ ఉపయోగించే చైనా క్షిపణి. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన పీఎల్-15 అనేది దీర్ఘ-శ్రేణి రాడార్-గైడెడ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి.

డ్రోన్లు:

వీటిలో చైనా నుంచి సీహెచ్ -4, వింగ్ లూంగ్ 2 డ్రోన్లు, తుర్కియే నుంచి బేరక్తర్ టీబీ2, అకిన్సి డ్రోన్లు ఉన్నాయి.

గగనతల రక్షణ వ్యవస్థ:

పాకిస్తాన్ వద్ద చైనా తయారు చేసిన హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16, ఎఫ్ఎన్-16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో, హెచ్‌క్యూ-9ని 2021లో పాకిస్తాన్ ఆయుధాల జాబితాలో చేర్చింది . దీనిని రష్యా ఎస్-300 కు సమానమైనదిగా పరిగణిస్తారు .

ఇవి కాకుండా, పాకిస్తాన్ 2015 లో ఎనిమిది హంగర్ తరహా జలాంతర్గాముల కోసం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది . అలాగే ఇరుదేశాలు కలిసి అల్-ఖలీద్ ట్యాంక్‌ను సంయుక్తంగా నిర్మించాయి.

“చైనా-పాకిస్తాన్ బంధం దశాబ్దాల నాటిది. కాలక్రమేణా బలపడుతోంది. చైనా చాలాసార్లు పాకిస్తాన్‌ను తన కవల సోదరుడిగా అభివర్ణించింది. ఇటీవలి ఘర్షణలో చైనా పీఎల్-15 క్షిపణిని ఉపయోగించింది, పాకిస్తాన్ దీనికి అనేక పాశ్చాత్య దేశాల దగ్గర సమాధానం లేదు. రక్షణ రంగమే కాకుండా , చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్, గ్వాదర్ పోర్టుకు పాకిస్తాన్ కూడా చాలా ముఖ్యమైనది” అని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ అన్నారు.

చైనా యుద్ధ నౌకలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్-పాకిస్తాన్ ఘర్షణలో చైనా

1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, భారత్, పాకిస్తాన్ కశ్మీర్ సమస్యపై మూడు యుద్ధాలు చేశాయి.

ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ భారతదేశానికి మద్దతు ఇవ్వగా, అమెరికా, చైనా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచాయి.

సాంప్రదాయకంగా అలీన విధానమే అనుసరిస్తున్నప్పటికీ భారత్ అమెరికాకు సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆసియాలో చైనా ఆధిపత్యం కారణంగా భారతదేశం తన వైపు ఉండటం మంచిదేనని అమెరికా కూడా భావిస్తోంది. భారతదేశం అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి ఇతర మిత్రదేశాల నుంచి ఆయుధ కొనుగోళ్లను పెంచింది. రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించింది.

ఈ సంఘర్షణను అమెరికా-చైనా శక్తి సమతుల్యత దృక్పథం నుంచి కూడా చూడాలని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్.. ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ అంటున్నారు.

ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ ఏమన్నారంటే , “భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఘర్షణను అమెరికా-చైనా శక్తి కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు. కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు చూస్తుంటే.. అమెరికా.. భారతదేశాన్ని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామిగా మాత్రమే కాకుండా, ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా కూడా చూస్తుంది. అందువల్ల, భారతదేశం తన శక్తి, వనరులు, సమయాన్ని పాకిస్తాన్ కోసం వృధా చేయకూడదని అమెరికా కోరుకుంటుంది.”

” చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపించింది. పాకిస్తాన్ చైనా ఆయుధాలను ఉపయోగించడమే కాకుండా, చైనా బహిరంగ ప్రకటనల ద్వారా కూడా దానికి మద్దతు ఇచ్చింది.” అని ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ చెప్పారు.

పాకిస్తాన్ ఆయుధాలలో ఎక్కువ భాగం చైనా నుంచి కొనుగోలు చేసినవి. భారతదేశం దాని ఆయుధాలలో సగానికి పైగా అమెరికా, దాని మిత్రదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అందువల్ల, రాహుల్ బేడీ దీనిని పరోక్షంగా చైనా, పాశ్చాత్య దేశాల మధ్య ఘర్షణగా చూస్తున్నారు.

“పాకిస్తాన్ యుద్ధం చేస్తున్నప్పటికీ, పాశ్చాత్య దేశాల ఆయుధాలతో చైనా ఆయుధాలను పరీక్షించాల్సిన సమయం ఇది. యుద్ధ సమయంలో పీఎల్-15 క్షిపణిని చూడటం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది కాకుండా, చైనా యుద్ధ విమానాలు కూడా ఫ్రెంచ్ నిర్మిత రాఫెల్‌తో పోటీ పడాల్సి వచ్చింది.” అని రాహుల్ బేడీ వివరించారు.

పాకిస్తాన్‌పై భారత్ సైనిక దాడులు జరపడంపై చైనా విచారం వ్యక్తం చేసింది. శాంతి, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

ఇటీవలి ఘర్షణకు ముందు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పాకిస్తాన్‌కు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. చైనా.. పాకిస్తాన్‌కు ” దృఢమైన స్నేహితుడు” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)