SOURCE :- BBC NEWS

చెన్నై, జంతువులు రవాణా

ఫొటో సోర్స్, Chennai Custom

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో డిసెంబర్ 5న కస్టమ్స్ అధికారులు 5,193 ఎర్ర చెవుల తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. రమేష్, తమీమ్ అన్సారీ అనే ఇద్దరు ప్రయాణికులు ఈ తాబేళ్లను మలేషియా నుంచి చెన్నైకి తీసుకొచ్చారు.

వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సలహా మేరకు తాబేళ్లను అధికారులు మలేషియాకు తిరిగి పంపించారు. నలుగురు నిందితులను కస్టమ్స్‌ యాక్ట్‌తోపాటు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అరెస్టు చేశారు.

చెన్నై విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. సెప్టెంబర్ 27న అదే జాతికి చెందిన 4,968 తాబేళ్లను, ఏప్రిల్‌లో 5,000 తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు.

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ప్రకారం వాయుమార్గంలో వన్యప్రాణులను అత్యధికంగా రవాణా చేసే మొదటి పది దేశాలలో భారత్ ఒకటి.

2022లో ప్రచురితమైన ‘హై ఫ్లైయింగ్ – ఇన్‌సైట్ ఇన్‌టు వైల్డ్‌లైఫ్ ట్రాఫికింగ్ త్రూ ఇండియాస్ ఎయిర్‌పోర్ట్స్ రీసెర్చ్’ రిపోర్టు ప్రకారం 2011-20 మధ్యకాలంలో దేశంలోని 18 విమానాశ్రయాలలో 70,000 వన్యప్రాణులు, జంతువుల శరీర భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో 36.1 శాతం కేసులు చెన్నై విమానాశ్రయంలోనే నమోదయ్యాయి. దీని తర్వాత ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14.8 శాతం కేసులు, దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 11.3 శాతం కేసులు నమోదయ్యాయి.

చెన్నై ద్వారా పెద్ద మొత్తంలో వన్యప్రాణులు అక్రమంగా రవాణా అవుతున్నట్లు ఈ డేటా నిర్ధరిస్తోంది.

చెన్నై జోనల్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అందించిన సమాచారం ప్రకారం..వన్యప్రాణుల అక్రమ రవాణా కేసులు 2023లో పద్దెనిమిది ఉండగా, 2024 నవంబర్ వరకు 14 కేసులు నమోదయ్యాయి. విదేశాలకు చెందిన వేలాది జంతువులను స్వాధీనం చేసుకున్నారు. చాలా వాటిని తిరిగి ఆయా దేశాలకు పంపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
చెన్నై విమానాశ్రయం , జంతువుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Chennai Custom

చెన్నైలోనే ఎందుకు?

చెన్నై జోనల్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్. శ్రీనివాస నాయక్ బీబీసీతో మాట్లాడుతూ..” థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి భారత్‌కు జంతువులను స్మగ్లింగ్ చేయాలంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లో చెన్నై దగ్గరి ప్రదేశం. అందుకే జంతువులను ఇక్కడికి తీసుకువస్తున్నారు” అని తెలిపారు.

దక్షిణాసియా దేశాలను వాయు, సముద్ర మార్గాల ద్వారా కలిపే ప్రధాన కేంద్రం చెన్నై కావడంతో ఈ అక్రమ రవాణా జరుగుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు చెప్పారు.

“20 సంవత్సరాల కిందట చెన్నైలోని పల్లవరం, మూర్ మార్కెట్‌లలో ఎవరైనా విదేశీ పక్షులు, జంతువులను సులభంగా అమ్మేవారు, కొనేవారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేసిన చాలామంది ధనవంతులుగా మారారు. వారికి విదేశీ జంతువులను కొనుగోలు చేసే, అమ్మే వందల కేంద్రాలు ఉన్నాయి. వీటికి అనేక సంవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఇక్కడ స్మగ్లింగ్ పెరిగింది” అని ఆ అధికారి తెలిపారు.

చెన్నైలో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టే, ఇక్కడ వన్యప్రాణుల గుర్తింపు పరీక్షలు ఎక్కువగా జరుగుతాయని ఆయన వివరించారు.

చెన్నై విమానాశ్రయం, జంతువుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Chennai Custom

జంతువుల గురించి చట్టంలో ఏముంది?

”బ్యాగేజీలో వన్యప్రాణులు ఉన్నట్లు నిర్ధరణ అయితే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందజేస్తాం. ఈ జంతువులు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయో లేవో గుర్తిస్తారు. ఒకవేళ ఉంటే.. వాటిని అవి వచ్చిన దేశానికి విమానంలో పంపుతాం” అని శ్రీనివాస నాయక్ అన్నారు.

అయితే జంతువులను స్వస్థలాలకు తరలించడమనేది ఆ సమయంలో వాటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని వైల్డ్ లైఫ్ వార్డెన్ పవన్ శర్మ చెప్పారు. పవన్ శర్మను అడవుల గౌరవ పరిరక్షకుడిగా (వైల్డ్‌లైఫ్ వార్డెన్) మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అటవీ సంబంధిత కేసులను ఆయన పర్యవేక్షిస్తుంటారు.

2022లో వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972కి సవరణలు చేసే వరకు ఈ విధంగా పట్టుకున్న జంతువులను ఏ దేశం నుంచి విమానంలో వచ్చాయో అక్కడికే తిరిగి పంపేవారని పవన్ చెప్పారు.

ప్రస్తుతం, వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 2022 ప్రకారం షెడ్యూల్ 4లోని సబ్‌సెక్షన్ 1లో జాబితా అయిన జంతువులను అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పంపాలి.

చెన్నై, జంతువుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Chennai Customs

“పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉంటాయి. కొన్ని జంతువులను అడవి నుంచి తీసుకువచ్చి ఉండవచ్చు. కొన్ని జంతువులను తోటల్లో పెంచి, ఆపై అక్రమంగా రవాణా చేసి ఉండవచ్చు. జంతువుల లక్షణాలను బట్టి వాటిని వెనక్కి పంపవచ్చు. కానీ, అన్నీ అడవిలోకి వెళతాయని ఖచ్చితంగా చెప్పలేం” అని పవన్ చెప్పారు.

వన్యప్రాణుల సంరక్షణ సవరణ చట్టం-2022 షెడ్యూల్ 4 కింద సీఐటీఈఎస్ (కన్వెన్షన్‌ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్‌డేంజర్డ్ స్పీసీస్) ఒప్పందంలో కొన్ని జంతు జాతుల వివరాలను జాబితా చేశారు. ఈ జాతులను రక్షిత జాతులుగా గుర్తించారు. అనుమతి లేకుండా అటువంటి జంతువులను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం చట్టరీత్యా నేరం.

అలాంటి జంతువులను పెంచుకుంటున్న వ్యక్తులకు లైసెన్స్‌ ఉండాలి. వన్యప్రాణులను పెంపుడు జంతువులుగా అమ్మే లేదా వ్యవసాయ క్షేత్రాలలో పెంచేవారు అధికారికంగా అనుమతి పొందాలి.

విదేశాల నుంచి తెచ్చిన జంతువులను నేరుగా కస్టమర్లకు అమ్మబోరని రాజా (పేరు మార్చాం) అంటున్నారు. రాజా కొన్నేళ్ల కిందట ఇలా దిగుమతి చేసుకున్న జంతువులను అమ్మేవారు.

విదేశాల నుంచి తెచ్చిన జంతువులను పొలాలు, తోటల్లో పెంచుతారని, వాటికి పుట్టే పిల్లలను అమ్మేస్తారని ఆయన చెప్పారు.

చెన్నై విమానాశ్రయం, జంతువుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Chennai Custom

భారీ ధరలు

చెన్నైలో ఈ జంతువులు ఎక్కువగా రవాణా అవుతుండటాన్నిబట్టి తమిళనాడులో వీటికి డిమాండ్ ఎక్కువ ఉందని అనుకోవద్దని రాజా అంటున్నారు.

దేశవ్యాప్తంగా కోతులకు ఎంతో డిమాండ్ ఉంటుందని ఆయన చెప్పారు. కోతుల్లో చాలా రకాలు ఉన్నాయని.. వాటిలో బంగారు రంగులో ఉండే కోతులను ఇక్కడ విరివిగా అమ్ముతుంటారని, వీటికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల ధర పలుకుతుందని ఆయన తెలిపారు. కాటన్ టాప్ మార్మోసెట్ కోతులను రూ.3.5 లక్షల వరకు అమ్ముతారని తెలిపారు.

“దక్షిణ అమెరికాకు చెందిన స్కార్లెట్ మకావ్ అనే చిలుకకు చాలా డిమాండ్ ఉంది. ఒక పక్షిని రూ. 4 లక్షల వరకు అమ్ముతున్నారు” అని ఆయన అన్నారు.

”బాల్ పైథాన్ (పైథాన్ రెజియస్)గా పిలిచే కొండచిలువలకు కూడా డిమాండ్ ఉంది. దీని ధర రూ.20 నుంచి రూ.30 వేలు. ఇవే కాకుండా ‘కార్న్ స్నేక్’ పాములకు (పాంథెరోఫిస్ గుట్టటస్) కూడా డిమాండ్ ఎక్కువ” అని ఆయన చెప్పారు.

సహారా ఎడారిలో దొరికే తాబేళ్ల విలువ రూ. 9 వేల నుంచి 12 వేల మధ్య ఉంటుందని రాజా తెలిపారు.

అంతేకాదు ”ఎర్ర పాదాల తాబేళ్లు, చెర్రీ హెడ్ తాబేళ్లకు కూడా ఇక్కడ గిరాకీ ఎక్కువ. చిన్నవాటికి ధర రూ.20 వేల నుంచి రూ.30 వేలు. నాలుగేళ్ల వయసున్న తాబేళ్లకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకు ధర ఉంటుంది. అల్దాబ్రా తాబేళ్లను రూ. 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు విక్రయిస్తున్నారు” అని ఆయన చెప్పారు.

”కొన్నిసార్లు ఈ జంతువులను వస్తుమార్పిడి పద్ధతుల్లో అక్రమ రవాణా చేస్తుంటారు. ఇక్కడ కొన్నివేల రూపాయలకు విక్రయించే స్టార్ ఫిష్, మొసలి పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో మంచి ధర ఉంది. అలాంటి జంతువులను ఇక్కడి నుంచి ఎగుమతి చేసి, అక్కడి నుంచి వేరే జంతువులను దిగుమతి చేసుకుంటున్నారు” అని తెలిపారు.

చెన్నై , జంతువుల అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Chennai Custom

స్థానిక పర్యావరణంపై ప్రభావం

గతంలో ఏనుగు దంతాలు, పులి గోర్లు, జింక కొమ్ములు వంటి వివిధ వన్యప్రాణుల శరీర భాగాలను పెద్దఎత్తున స్మగ్లింగ్ చేసేవారని, వాటిని సామాజిక హోదాకు చిహ్నాలుగా భావించేవారని పవన్ వివరించారు.

ఇటువంటి వన్యప్రాణుల ఉత్పత్తుల అక్రమ రవాణా చాలావరకు నియంత్రించినప్పటికీ, దక్షిణాసియాలలో వైద్య అవసరాలు లేదా పెంపకం కోసం జంతువుల అక్రమ రవాణా ఇప్పటికీ భారీగానే ఉందనీ, ఇది పర్యావరణంపైనే కాకుండా మనుషులపై కూడా ప్రభావం చూపుతుందని పవన్ అంటున్నారు.

“జంతువుల ద్వారా వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయనే దానికి కోవిడ్-19 ఒక ప్రధాన ఉదాహరణ. మన పర్యావరణంలో స్థానికేతర జాతులను ప్రవేశపెట్టడం వలన ప్రమాదాలు పెరుగుతాయి” అని పవన్ అన్నారు.

“ఈ చట్టాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ (చెన్నై విమానాశ్రయంలో) నిఘా ముమ్మరం అయ్యాయి. ఇంతకుముందు, లెపర్డ్ పిల్లలతో సహా అనేక జంతువులను అక్రమంగా రవాణా చేసేవారు. ఇప్పుడు అలాంటివి జరగడం లేదు” అని నాయక్ చెప్పారు.

అలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు నాయక్ తెలిపారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)