SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
జనరల్ సుందర్‌జీ ఏ రాష్ట్రానికి చెందినవారనే విషయంపై అనేక సందేహాలున్నాయి. సుందర్‌జీ పేరు కూడా ముఖర్జీ, బెనర్జీ, చటర్జీ తరహాలోనిదే అనేభావనతో ఆయనను బెంగాలీ అనుకుంటారు. మరికొందరు ఫ్రాంజి, జంషెడ్‌లాంటి పదాలతో పోల్చుకుని ఆయనను పార్సీగా భావిస్తుంటారు. ఇంకొందరేమో ఆయనను సింధీ అనుకుంటారు.
”మీ అమ్మానాన్నలిద్దరూ తమిళ బ్రాహ్మణులు అయితే నీకు సుందర్ జీ అనే పేరు ఎలా వచ్చింది అని మా పెళ్లయిన కొత్తలో ఆయన్ను అడిగాను” అని సుందర్‌జీ భార్య వాణి తన ‘ఏ మ్యాన్ కాల్డ్ సుందర్‌జీ’ అనే ఆర్టికల్‌లో రాశారు.
‘నాకు మూడేళ్ల వయసున్నప్పుడు నా తల్లిదండ్రులెప్పుడూ గాంధీజీ గురించి మాట్లాడుకోవడం వినేవాణ్ని. మీరు మాట్లాడుకునేది ఏ గాంధీజీ గురించి అని నేను ఒక రోజు మా నాన్నను అడిగాను. మహాత్మాగాంధీ అనే గొప్ప వ్యక్తి గురించి అని మా నాన్న సమాధానమిచ్చారు. గాంధీని గౌరవించుకోవడానికి మేం ఆయన పేరుకు ‘జీ’ని జోడిస్తున్నామని చెప్పారు. అప్పటినుంచి నేను కూడా నన్ను సుందర్‌జీ అని పిలవాలని పట్టుబట్టాను. మా నాన్న దీనికి అంగీకరించారు” అని సుందర్‌జీ చెప్పినట్టు వీణ రాశారు.
మద్రాసు(చెన్నై)లోని హోలీ ఏంజిల్స్ కాన్వెంట్‌లో కూడా ఆయన పేరు కృష్ణస్వామి సుందర్‌జీగా రాశారు.
ఆయన సోదరులు, సేవకులు కూడా పేరు చివర ‘జీ’ని చేర్చి పిలవడం ప్రారంభించారు. అలా ఆయనను అందరూ జీవితాంతం ‘సుందర్‌జీ’ అనే పిలిచారు.


ఫొటో సోర్స్, Getty Images
యుద్ధభూమిలోనే నిద్రపోయిన సుందర్‌జీ
పేరు మాత్రమే కాకుండా ఇతర విషయాల్లోనూ సుందర్‌జీ భిన్నమైన వ్యక్తి. ఓ సారి డెహ్రాడూన్‌లోని అధికారుల మెస్‌లో ఒక ఆర్మీ కెప్టెన్ పరుగున సుందర్‌జీ దగ్గరకు వచ్చారు. ”సర్..మీ కోసం పూర్తి శాకాహారం తయారుచేశాం” అని చెప్పారు.
”ఓ…నేను బీఫ్ తినే బ్రాహ్మణుడిని. నాకు రుచి నచ్చితే…కదిలే, ఈదే, పాకే వాటన్నింటినీ తింటాను’’ అని సుందర్‌జీ బదులిచ్చారు.
తండ్రి ఒత్తిడిమేరకు ఆయన డాక్టరయ్యేందుకు బయాలజీ చదవడం ప్రారంభించారు. కానీ చదువు మధ్యలో ఉండగానే ఆయన సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఆయన వయసు 17 ఏళ్లు మాత్రమే.
ఐదు యుద్ధాల్లో ఆయన పోరాడారు. మేజర్‌గా ఉన్నప్పుడు సైన్యం ఆయన్ను ఐక్యరాజ్యసమితి బలగాల తరపున పోరాడేందుకు కాంగో పంపింది. అక్కడ అనేక భీకర పోరాటాలు జరిగాయి.
ఒకసారి సుందర్‌జీ తిండీ, నిద్ర లేకుండా 72గంటల పాటు నిరంతరాయంగా కాల్పుల్లో పాల్గొన్నారు. దీంతో బాగా అలసిపోయారు. అక్కడే…ఆ కాల్పుల మధ్యే పడిపోయి నిద్రపోయారు.
”బిహారీ అసిస్టెంట్ లక్ష్మణ్ ఆయన్ను బంకర్‌లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆయన లక్ష్మణ్‌పై పెద్దగా అరిచారు. 24 గంటల తర్వాత కళ్ళు తెరిచి చూసినప్పుడు…ఆయన యుద్ధభూమిలో ఉన్నారు. ఆయన చుట్టూ 36 మోర్టార్ షెల్స్ పడి ఉన్నాయి. ఆయన వాటిని జాగ్రత్తగా లెక్కపెట్టారు. కాల్పులు అంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయనకు ఏమీ కాలేదు. చిన్న దెబ్బ కూడా తగలలేదు” అని వాణి సుందర్‌జీ రాశారు.
చాలా సంవత్సరాల తరువాత సుందర్‌జీ ఆర్మీ చీఫ్ అయినప్పుడు, లక్ష్మణ్ తమ ఇంట్లో తయారుచేసిన నెయ్యిని ఆయన కోసం తీసుకొచ్చారు.
అప్పుడు సుందర్‌జీ కాంగో రోజులను గుర్తుచేసుకుంటూ ‘ఆ రోజు యుద్ధభూమిలో నన్నెలా నిద్రపోనిచ్చావు’ అని లక్ష్మణ్‌ను సరదాగా అడిగారు.
”మీరు నన్ను ‘ఫక్ ఆఫ్’ అనడంతో బాధగా అనిపించి వెళ్ళిపోయాను” అని లక్ష్మణ్ బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Happer Collins
ఆపరేషన్ బ్లూ స్టార్
తమిళనాడులోని చెంగల్పట్టులో 1928లో జన్మించిన కృష్ణస్వామి సుందర్‌జీ 1945లో భారత సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వాయువ్య సరిహద్దులో సైనిక చర్యలో పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు 1984లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదులను తరిమికొట్టడానికి రాజకీయంగా సున్నితమైన ఆపరేషన్ బ్లూ స్టార్‌కు సుందర్‌జీ నాయకత్వం వహించారు.
ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో జనరల్ సుందర్‌జీ వెస్ట్రన్ కమాండ్‌కు అధిపతిగా ఉన్నారు. 1984 జూన్ మూడున, ఇందిరా గాంధీ ఆయన్ను దిల్లీకి పిలిపించారు. ఆ రాత్రి ఆయన ఇందిరాగాంధీతో ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత…సుందర్ జీ తన భార్యతో, ఇది తనకు అతిపెద్ద పరీక్ష అని చెప్పారు.
ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఆయన నవ్వు మాయమై పోయింది. సుందర్‌జీ భార్య దీనిపై ఆందోళనను వ్యక్తం చేసినప్పుడు, తాను త్వరలోనే కోలుకుంటానని ఆయన చెప్పారు. కానీ ఎప్పటికీ కోలుకోలేకపోయారు.
‘నేను శిక్షణ పొందింది శత్రువుతో పోరాడడానికి. నా సొంత ప్రజలతో కాదు’ అని ఆయన తరచుగా అంటుండేవారు.
ప్రజలు నిజం తెలుసుకునేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ అనుభవాల గురించి రాయాలని కుష్వంత్ సింగ్ ఆయన్ను కోరారు. తీరిక సమయంలో ఆ విషయం గురించి రాస్తానని సుందర్ జీ చెప్పారు కానీ… ఆ సమయం ఎప్పుడూ రాలేదు.
”మేం స్వర్ణదేవాలయంలోకి కోపంతో కాదు..బాధతో ప్రవేశించాం. ఆ సమయంలో మా పెదవులపై ప్రార్థన ఉంది. మా హృదయాల్లో మానవత్వం ఉంది. ఆ సమయంలో మాకు ఓటమి లేదా విజయం అనే ఆలోచన లేదు. ఏదైనా రివార్డు సాధించాలనే కోరికా లేదు. మా వరకు, అది నెరవేర్చాల్సిన బాధ్యత మాత్రమే” అని సుందర్‌జీ చెప్పినట్టు తన పుస్తకం ‘ఆపరేషన్ బ్లూ స్టార్ ది ట్రూ స్టోరీ’ అనే పుస్తకంలో లెఫ్టినెంట్ జనరల్ కేఎస్ బరార్ రాశారు.

ఫొటో సోర్స్, www.bharatrakshak.com
ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్ కథ
జనరల్ సుందర్‌జీ పేరుతో ముడిపడి ఉన్న మరో ఆపరేషన్ ‘ఆపరేషన్ బ్రాస్‌స్టాక్స్’. భారతదేశ యుద్ధ సన్నద్ధతను పరీక్షించడానికి 1986 ఫిబ్రవరి-మార్చిలో రాజస్థాన్ ఎడారిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.
స్వాతంత్య్రం తర్వాత భారత సైన్యం నిర్వహించిన అతిపెద్ద సైనిక విన్యాసం ఇదే. ఈ స్థాయిలో సైనిక విన్యాసాలు ఆసియాలో ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. యుద్ధంలాంటి పరిస్థితుల్లో అన్ని సైనిక పరికరాలు, వాహనాలు, ట్యాంకులను పరీక్షించాలని సుందర్‌జీ భావించారు.
సైన్యంలో ఎక్కువ భాగం ఈ విన్యాసాల్లో పాల్గొంది. సైనిక విన్యాసాలు భారీగా ఉండడంతో భారత్ తమపై దాడి చేయాలనుకుంటోందని పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకుంది.
పాకిస్తాన్ తన సైనికుల సెలవులను రద్దు చేసి, వారిని తిరిగి విధుల్లోకి పిలిచింది. ఈ విన్యాసాల వల్ల రక్షణ శాఖ మంత్రి అరుణ్ సింగ్ శాఖ మార్చాల్సి వచ్చింది.
”అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు నజీబుల్లాకు స్వాగతం పలికేందుకు మేం విమానాశ్రయానికి వెళ్తుండగా… నట్వర్, మనం పాకిస్తాన్‌తో యుద్ధం ప్రారంభించబోతున్నామా?” అని రాజీవ్ అడిగారు” అని నట్వర్ సింగ్ తన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ అనే పుస్తకంలో రాశారు.
సైనిక విన్యాసాలను రక్షణ శాఖ మంత్రి అరుణ్ సింగ్ తన స్థాయిలో ఆమోదించారు. దీనిపై రాజీవ్ గాంధీకి ఎలాంటి సమాచారం లేదు.
‘రక్షణమంత్రిని ఏం చేయాలి’ అని రాజీవ్ గాంధీ నట్వర్ సింగ్, నారాయణ్ దత్ తివారీని అడిగారు.
”ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని నేను రాజీవ్‌కు స్పష్టంగా చెప్పాను. అరుణ్ సింగ్ తనకు స్నేహితుడు అని రాజీవ్ బదులిచ్చారు. ‘సర్… మీరు డూన్ స్కూల్ మాజీ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షులు కాదు. మీరు భారత ప్రధానమంత్రి. ప్రధాన మంత్రులకు ఎలాంటి స్నేహితులు ఉండరు’ అని నేను బదులిచ్చాను” అని నట్వర్ సింగ్ రాశారు.
కొన్ని రోజుల తర్వాత, అరుణ్ సింగ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి ఆర్థికమంత్రిని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘స్కాలర్ జనరల్’ బిరుదు
ఈ ఆపరేషన్ సమయంలో ఒక విషయం ఎప్పుడూ ఆగలేదు. అది జనరల్ జియా నుంచి జనరల్ సుందర్‌జీకి పెద్ద బుట్టలో మామిడి పండ్లు, కమలాలు రావడం.
”జనరల్ సుందర్‌జీకి, శుభాకాంక్షలు. మీకు అవి నచ్చుతున్నాయనుకుంటున్నాను… జియా’అని ఆ పండ్ల బుట్టలపై జనరల్ జియా చేతితో రాసిన నోట్ ఉంది” అని వాణి సుందర్‌జీ రాశారు.
జనరల్ జియా విమాన ప్రమాదంలో మరణించేవరకు సుందర్‌జీకి అవి వస్తూనే ఉన్నాయి.
భారత సైన్యం కోసం బోఫోర్స్ శతఘ్నులు కొనుగోలు చేయాల్సిందిగా సిఫార్సు చేసినందుకు కూడా జనరల్ సుందర్‌జీ గుర్తుండిపోతారు.
ప్రజలు జనరల్ సుందర్‌జీని ‘స్కాలర్ జనరల్’ అని కూడా పిలిచేవారు. ఆయన ‘అణుసిద్దాంతం’ రూపొందించారు. 1998 అణు పరీక్ష తర్వాత భారతదేశం మొదట అణ్వాయుధాలను ఉపయోగించకూడదని నిర్ణయించింది దాని ప్రకారమే.
”భారత సైన్యంలో మరే ఇతర జనరల్‌కు ఇంత లోతైన మేధస్సు, వ్యూహాత్మక దృక్పథం, వ్యవస్థను మార్చే సామర్థ్యం లేదని ఆయన్ను తీవ్రంగా విమర్శించే వాళ్లు సైతం అంగీకరించారు. రెండేళ్ల నాలుగు నెలల పదవీకాలంలో ఆయన భారత సైన్యాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించారు” అని ‘ది ప్రింట్’లో ప్రచురితమైన ‘జనరల్ సుందర్‌జీ గేవ్ చైనా స్ట్రాటజీ ఫోర్ డికేడ్స్ ఎగో అనే వ్యాసంలో జనరల్ హెచ్ఎస్ పనాగ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘విజన్ 2100’
జనరల్ సుందర్‌జీకి ఒక ఆడంబరమైన సైనికుడి ఇమేజ్ ఉండేది. కానీ ఆయన భార్య దృష్టిలో ఈ అభిప్రాయం సరైనది కాదు.
ఆమె దృష్టిలో ఆయన నిరాడంబరమైన, నిజాయితీ గల వ్యక్తి. పిల్లాడి మనస్తత్వం.
”ఆయన స్టైలిష్‌గా జీవించడానికి ఇష్టపడేవారు, కానీ మామూలు దుస్తుల్లోనే తరచుగా కనిపించేవారు. ఆయన పైపుతో పొగ తాగేవారు…దాన్ని ఉపయోగించి అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి గోడపై ఉన్న మ్యాప్‌లను వివరించేవారు. మధ్యమధ్యలో, ఆయన పైపు నుంచి ఒకటి లేదా రెండు పఫ్‌లు తీసుకునేవారు. ఆయనకు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి” అని వాణి సుందర్‌జీ చెప్పారు.
ఆ సమయంలో ఆయన మానసికంగా 21వ శతాబ్దంలోకి వెళ్లిపోయారు. 21వ శతాబ్దంలో భారత సైన్యం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేదానిపై ఆయన ‘విజన్ 2000’ రూపొందించారు.
అణుసంబధిత అంశాలపై ఆయన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే. ఈ అంశంపై ఆయన చాలా రాశారు కూడా. ఆయన వ్యక్తిగత లైబ్రరీలో వేల పుస్తకాలు ఉండేవి.
”లియోనార్డో డావిన్సీ, చెంఘిజ్ ఖాన్ ప్రభావం సుందర్‌జీపై చాలా ఉండేది. ఆయనకు సంగీతమంటే కూడా చాలా ఇష్టం. ఆయనకు అన్ని రకాల సంగీతం ఇష్టం – భారతీయ సంగీతం, పాశ్చాత్య, శాస్త్రీయ సంగీతం, లైట్ మ్యూజిక్, జానపదం..ఇలా అన్నీ. మేం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రవిశంకర్ సంగీత కచేరీలలో ఉండేవాళ్లం. ఆయనతో మాకు నాలుగు దశాబ్దాల స్నేహం ఉంది” అని వాణి సుందర్‌జీ రాశారు.
సుందర్‌జీ కోరిక మేరకు రవిశంకర్ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ కోసం ఓ ట్యూన్ స్వరపరిచారు. ఆయన తరచుగా ప్రఖ్యాత శాస్త్రవేత్త రాజా రామన్న ఇంటికి వెళ్లి ఆయన పియానో వాయించడం వినేవారు.
సుందర్‌జీ పనిచేస్తూ బిస్మిల్లా ఖాన్, యెహుడి మెనుహిన్ లేదా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీతాన్ని వినేవారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖగోళ శాస్త్రం, పక్షులపై ఆసక్తి
సుందర్‌జీకి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రతి విషయం గురించి ఆయనకు పైపైన కాకుండా లోతైన జ్ఞానం ఉండేది.
ఒకసారి ఆయన పదవీ విరమణ తర్వాత చైనా వెళుతున్నప్పుడు, చైనీస్ భాష నేర్చుకోవడానికి రెండు పుస్తకాలు కొన్నారు. అప్పటికి ఆయన వయసు 60ఏళ్లపైనే. అయినా చైనా వెళ్లే సమయానికి ఆయన మాండరిన్ బాగా మాట్లాడడం మొదలుపెట్టారు.
“ఆయన నా నుంచి రెండు విషయాలు నేర్చుకున్నారు. వాటిలో ఒకటి ఖగోళశాస్త్రంలో ఆసక్తి. నాకు ఆరేళ్ల వయసున్నప్పటి నుంచి గ్రహాలు, నక్షత్రాలను చూపించడానికి మా నాన్న నన్ను అబ్జర్వేటరీకి తీసుకెళ్లేవారు. సుందర్‌జీ నా కోసం ఖగోళశాస్త్రానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు తెచ్చిపెట్టారు. కొంతకాలం తర్వాత ఆయనకు కూడా ఈ రంగంలో ఆసక్తి ఏర్పడింది” అని వాణి సుందర్‌జీ రాశారు.
”ఆయన నా నుంచి నేర్చుకున్న రెండో విషయం పక్షుల పట్ల నాకున్న ఆసక్తి. ఈ విషయంలో ఆయన నా నుంచి ప్రేరణ పొందారు. పక్షులపై సలీం అలీ, డిలన్ రిప్లీ రాసిన అనేక పుస్తకాలను ఆయన కొన్నారు. పక్షులను గమనించడానికి ఆయన రెండు బైనాక్యులర్లను కూడా కొన్నారు. ఆయనకు చేపలు పట్టడం, వేటాడటం కూడా ఇష్టం. నా దగ్గర ఆయన ఫిషింగ్ రాడ్, 12 బోర్ గన్ ఇప్పటికీ ఉన్నాయి” అని వాణి సుందర్‌జీ రాశారు.
సుందర్‌జీ ప్రతి పనీ చాలా వేగంగా చేసేవారు. ఆయన చాలా వేగంగా నడిచేవారు. ఆయన నడిచేటప్పుడు, ఆయన వెంట నడవడానికి ప్రయత్నించేవారు ఊపిరి ఆడక ఇబ్బంది పడేవారు. ఆస్పత్రిలో చేరే వరకు ఆయన రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
మోటార్ సైకిల్, యుద్ధ ట్యాంక్ దేన్నైనా నడిపేస్తారు
సుందర్‌జీకి డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన ట్యాంకుల నుంచి ఏపీసీ (ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్), మోటార్ సైకిళ్ల వరకు ప్రతిదీ నడపగలరు.
ఆయన వెస్ట్రన్ కమాండ్ అధిపతిగా ఉన్నప్పుడు, ఒక ఆదివారం మాజీ ఏడీసీ ఆయన్ను కలవడానికి మోటార్ సైకిల్‌పై వచ్చారు.
“ఆ సమయంలో మేం దిల్లీలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లా వరండాలో టీ తాగుతున్నాం. మోటార్ సైకిల్ చూసిన వెంటనే సుందర్‌జీ నాతో రండి అని అన్నారు. మేమిద్దరం మోటార్ సైకిల్ మీద కూర్చున్నాం. ఆ సమయంలో సుందర్‌జీ కుర్తా పైజామా ధరించారు. నేను నైటీలో ఉన్నాను. తరువాతి అరగంట పాటు, ఆయన నన్ను మోటార్ సైకిల్ మీద మొత్తం కంటోన్‌మెంట్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు” అని వాణి సుందర్‌జీ గుర్తుచేసుకున్నారు.
‘‘ఆయన ఒకసారి ఎడారిలో… 44 డిగ్రీల వేడిలో ఏపీసీ నడిపారు. కొద్దిసేపటికే ఆయన సహచరులు చాలా మంది వేడి తట్టుకోలేక అల్లాడిపోయారు… కానీ లెఫ్టినెంట్ జనరల్ అయిన 51 ఏళ్ల సుందర్‌జీ దానిని మూడు గంటల పాటు నడిపారు’’
”కొన్నేళ్ల తరువాత, ఆయన ఆర్మీ చీఫ్ అయినప్పుడు, మేము కలిసి బబీనాకు వెళ్ళాం. అక్కడ వరుసగా అనేక ట్యాంకులు నిలబడి ఉండటం ఆయన చూశారు. ఆయన వెంటనే దగ్గరలో ఉన్న ట్యాంక్ డ్రైవింగ్ సీటుపై కూర్చుని నన్ను తన వద్దకు పిలిచారు. భౌగోళికంగా క్లిష్టంగా ఉండే ఆ ప్రాంతంలో పూర్తి వేగంతో ట్యాంక్‌ను నడిపారు” అని వాణి గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇలా బతకడం ఇష్టం లేదు’
సుందర్‌జీ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ నవాజ్ జంజువా అతిథిగా ఉన్నారు. ఆయన ఇస్లామాబాద్, పెషావర్, ఖైబర్ పాస్‌లను కూడా సందర్శించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అభ్యర్థన మేరకు, ఆయన అప్గాన్ సరిహద్దులో 50 మీటర్లు లోపలికి వెళ్ళారు.
ఆ తర్వాత ఆయన హెలికాప్టర్‌లో తక్షశిల, మొహెంజోదారో, లాహోర్‌ను కూడా సందర్శించారు.
జనరల్ సుందర్‌జీ ‘మోటార్ న్యూరాన్ వ్యాధి’తో బాధపడుతున్నారని 1998 జనవరి 10న వైద్యులు గుర్తించారు.
ఇది మెదడు, వెన్నెముకలోఉండే మోటార్ న్యూరాన్‌లను ప్రభావితం చేసే నాడీ సంబంధిత వ్యాధి. కండరాల బలహీనతకు, చివరికి పక్షవాతానికి కారణమవుతుంది.
ఈ వ్యాధి గురించి జనరల్ సుందర్‌జీకి చెప్పడానికి వైద్యులు కొంచెం సంకోచించారు. కానీ కొన్నిరోజులకే ఇంటర్‌నెట్ ద్వారా ఆయన ఈ వ్యాధికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకున్నారు.
ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో జీవించాలనుకోలేదు. కారుణ్య మరణం గురించి కూడా ఆయన వైద్యులను ప్రశ్నించారు.
మార్చి 28 నాటికి, ఆయన పూర్తిగా లైఫ్ సపోర్ట్ వ్యవస్థపై ఉండాల్సి వచ్చింది.
ఆ స్థితిలో కూడా, ఆయన ‘దయచేసి నన్ను చనిపోనివ్వు’ అని నాలుగు పదాల నోట్ రాశారు.
”జీవితంలోని చివరి నిమిషం వరకు, ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారు. కళ్ళతోనే వైద్యులతో, నాతో మాట్లాడారు. పోఖ్రాన్ అణు పరీక్ష గురించి నేను ఆయనకు చెప్పాను. ఆ స్థితిలో కూడా, ఆయన రోజూ మూడు వార్తాపత్రికలు చదివేవారు. పెద్ద టీవీ తెరపై క్రికెట్ చూసేవారు” అని వాణి సుందర్‌జీ రాశారు.
వ్యాధి గుర్తించిన ఏడాది తర్వాత, ఫిబ్రవరి 8, 1999న సుందర్‌జీ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS