SOURCE :- BBC NEWS
ఆయన రాజకీయ జీవితంలో ఈ వారం చాలా చెత్తగా గడిచింది. అయినా సరే..ఆయన పండగ మూడ్ లోనే ఉన్నారు.
ట్రూడోకు అత్యంత విశ్వాస పాత్రురాలైన ఆర్ధిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్, పార్లమెంట్‌లో ఆర్థిక ప్రకటన చెయ్యడానికి కొన్ని గంటల ముందే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సొంత పార్టీలోనే కొంతమంది నేతలు ప్రధాని పదవిని వదిలేయాలని ఆయన్ను కోరుతున్నా, ట్రూడో ఏమాత్రం తొట్రుపడకుండా గంభీరంగా ప్రవర్తిస్తున్నారు.
నీలి రంగు సూటు, టై ధరించి, తన అనుయాయులతో కలిసి పార్టీ సమావేశంలో ప్రసంగించారు.
పార్టీలో తనకు ‘తలనొప్పి’గా మారిన పరిణామాలను చిన్నపాటి కుటుంబ తగాదాగా ఆయన అభివర్ణించారు.
ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా, నింపాదిగా కనిపించిన ఆయన, తన రాజకీయ ప్రత్యర్థి, కెనడా ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ నేత పియర్ పోలియెవ్ర్ పై విమర్శలు చేశారు.
ఆయన ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని, రాజకీయంగా గందరగోళం ఉన్నప్పటికీ, ట్రూడో వాటిని ఎదురొడ్డి నెట్టుకొస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రూడో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కొత్త ఏడాదిలో తీర్మానాన్ని తీసుకొస్తామని న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ ప్రకటించినప్పటికీ, ట్రూడో వైఖరిలో ఏమాత్రం తడబాటు కనిపించలేదు. ప్రస్తుతం జగ్మీత్ సింగ్ పార్టీ మద్దతుతోనే ట్రూడో ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ బట్టి చూస్తే త్వరలో ఎన్నికలు తప్పేలా లేవు.
ఇంత జరుగుతున్నా, తాను రాజీనామా చేస్తాననే సూచనలు మాత్రం ట్రూడో నుంచి ఏమాత్రం రావడం లేదు. ఏం చేయాలనే దాని గురించి శీతాకాలపు సెలవుల్లో ఆలోచిస్తానని ఆయన తన పార్టీ సభ్యులకు చెప్పారు.
ఒత్తిడిలో ఉన్నప్పుడు ట్రూడో మొండిగానూ, ధిక్కార వైఖరితోనూ ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 9 ఏళ్ల పాలనా కాలంలో ఆయనను వివాదాలు చుట్టుముట్టినప్పుడు, ఇలాంటి వైఖరే ఆయనకు సాయపడింది.
ఆయనను ప్రత్యర్ధులు తరచుగా తక్కువగా అంచనా వేస్తుంటారు. ట్రూడోకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదని విమర్శిస్తుంటారు. కానీ, 2015లో తన 44 ఏటనే మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ట్రూడో.
అయితే, ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోంది. ఈ దశలో ఆయనకు కొత్త వ్యూహం అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యర్థుల అంచనాలను దాటి..
ట్రూడో తొలిసారి ప్రధామంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, మూడు పదాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. అవి జస్ట్-నాట్-రెడీ
అప్పటి ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్‌ను అధికారంలో నుంచి దించేందుకు ట్రూడో ప్రయత్నాలు చేస్తున్న కాలంలో, ట్రూడోకు వ్యతిరేకంగా తయారైన ఎన్నికల ప్రచార యాడ్‌కు ఈ మూడు పదాలు ట్యాగ్ లైన్ గా మారాయి. ఈ యాడ్‌ను దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించారు ట్రూడో రాజకీయ ప్రత్యర్థులు.
ఆయన ఇంకా రాజకీయాలకు కావలసినంత పరిణితి సాధించలేదని, అనుభవం లేదని, ఆయన రాజకీయ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని విమర్శించడానికి ఈ పదబంధాన్ని ఆయన ప్రత్యర్ధులు వాడారు.
వాంకోవర్‌లో డ్రామా టీచర్ కావడానికి ముందు జస్టిన్ ట్రూడో ఎలాంటి లక్ష్యం, స్పష్టమైన మార్గనిర్దేశనం లేకుండా తిరిగే వ్యక్తని కెనడా చరిత్రకారుడు రేమండ్ బ్లేక్ చెప్పారు. మాజీ ప్రధానమంత్రి పియరే ఇలియట్ సంపన్న వారసుడిగా ఆయన తనకంటూ ఒక కవచాన్ని ఏర్పరుచుకున్నారు.
అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ట్రూడో పోరాటబాటకు మారారు. ఆయన వ్యక్తితంలో కొంతభాగం ఆయన తండ్రి నుంచి వచ్చిందని కొందరు చెబుతారు.
“ఆయన తండ్రికి పోరాట పటిమ ఉన్న నాయకుడనే గుర్తింపు ఉంది. పరిస్థితులకు లొంగని రాజకీయ నేత ఆయన” అని వాషింగ్టన్‌లో ఉంటున్న కెనడా రాజకీయ కాలమిస్ట్ లారెన్స్ మార్టిన్ అన్నారు.
ఆయన కొడుకుగా ట్రూడో కూడా లిబరల్ పార్టీకి చారిత్రక విజయం అందించడం ద్వారా తన మీద విమర్శలన్నింటినీ అధిగమించారు. తాను పోటీ చేసిన తొలి ఎన్నికల్లో పార్టీని పార్లమెంట్‌లో మూడో స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువచ్చారు.
‘‘నేను ఎలాంటి అవరోధాలనైనా అధిగమించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని ట్రూడోకు ఇచ్చింది’’ అని మార్టిన్ అన్నారు.
ట్రూడో ప్రధాని కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆయన రాజకీయ జీవితం ఒడిదొడుకులతో సాగింది. అనేక స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఆయన తొలిసారి ప్రధాని అయిన తర్వాత న్యాయశాఖమంత్రి జోడీ విల్సన్ రేబౌల్డ్ పదవి నుంచి వైదొలగారు. ఈ పదవి చేపట్టిన తొలి మూలవాసీ మహిళ ఆమె. ఒక అవినీతి కేసులో విచారణకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కొందరు తన శాఖలో జోక్యం చేసుకుని తమకు సహకరించాలని కోరుతూ బెదిరించారని ఆమె ఆరోపించారు.
2019లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రచారం చేస్తున్నప్పుడు ట్రూడో మొహాన్ని గోధుమ రంగులోకి మార్చి విడుదల చేసిన ఫొటోలు సంచలనం సృష్టించాయి.
ఏడాది తర్వాత 2020లో ఒక యూత్ చారిటీకి సంబంధించి ఒక భారీ ప్రభుత్వ కాంట్రాక్టును ట్రూడో కుటుంబ సభ్యులు దక్కించుకోవడంతో, ఆయన పాటించే నైతిక విలువల గురించి ప్రశ్నలు వినిపించాయి.
అయితే, ఎన్ని సమస్యలు వచ్చినా, ట్రూడో పదవి నుంచి దిగిపోలేదు. ఆయన రెండుసార్లు ఎన్నిక్లలో గెలిచారు. జీ7 దేశాల్లోని తన సహచరుల్లో అత్యధిక కాలం అధికారంలో ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
‘ట్రూడో అనేకసార్లు తప్పించుకున్నారు’ అని ప్రొఫెసర్ బ్లేక్ అన్నారు. కుంభకోణాలకు సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ, రాజకీయంగా సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలతో పార్టీలో గట్టి మద్దతు సంపాదించుకున్నారు ట్రూడో.
ఆర్థిక మంత్రి రాజీనాామా మలుపు కానుందా?
ట్రూడోకు సమస్యలు ఎదురైనప్పుడల్లా, ఆయన పనైపోయిందనే సంకేతాలు కనిపించేవి. ఇప్పుడు తగ్గిపోతున్న తన ప్రజాదరణను కాపాడుకునేందుకు ట్రూడో గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
2024 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఓ సర్వేలో మూడింట రెండొంతుల మంది కెనడియన్లు ఆయనను తిరస్కరించినట్లు తేలింది. కేవలం 26 శాతం మాత్రమే ప్రధానమంత్రిగా ట్రూడో ఉండాలని అభిప్రాయపడ్డారు. కన్సర్వేటివ్ నాయకుడు పియర్ పోలియెవ్ర్ కంటే ఆయన 19 పాయింట్లు వెనకబడి ఉన్నారు.
ట్రూడోకి సొంత పార్టీలోనూ మద్దతు తగ్గుతోంది. ఇప్పటి వరకు ట్రూడో పదవి నుంచి తప్పుకోవాలని 18 మంది లిబరల్ పార్టీ ఎంపీలు కోరారు.
“మనం ఇలాగే ఉంటామని అనుకుంటే ఆయన భ్రమపడుతున్నట్లే” అని బ్రన్సివిక్ ఎంపీ వేన్ లాంగ్ గతవారం చెప్పారు.
“ఎంపీలకు, మంత్రులకు, దేశం మొత్తానికి అన్యాయం జరుగుతోంది. మనం కొత్త దిశలో ప్రయాణించాలి. మనం రీబూట్ కావాలి” అని ఆయన అన్నారు.
ట్రూడోను పదవి నుంచి దింపేందుకు లాంగ్ కూడా ప్రయత్నించారు. లిబరల్ పార్టీకి చెందిన 153 మంది ఎంపీలలలో ఆయనకు 50 మంది ఎంపీల మద్దతు లభించింది. వారంతా ట్రూడో తక్షణం పదవి నుంచి దిగిపోవాలని కోరుతున్నారు. అయితే ట్రూడో అధికారంలో ఉండాలని కోరుకునే వారు కూడా అదే సంఖ్యలో ఉండగా, మిగిలిన వారంతా గోడమీద పిల్లుల్లా ఉన్నారని లాంగ్ చెప్పారు.
“ఆయనంటే ఇష్టపడుతున్న కొంతమంది విధేయులు ఉన్నారు.” అని వాషింగ్టన్‌లో ఉంటున్న కాలమిస్ట్ మార్టిన్ అన్నారు.
” లిబరల్ పార్టీ సమావేశంలో రహస్య ఓటింగ్ పెట్టి, ఆయన కొనసాగాలా, దిగిపోవాలా అని కోరితే దిగిపోవాలనే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది” అని మార్టిన్ అన్నారు.
‘‘తన రాజకీయ ప్రత్యర్థి పియరే పోలియెవ్ర్‌ను అధికారంలోకి రాకుండా చేసేందుకైనా ట్రూడో ఈ పదవికిని కాపాడుకోవాలని అనుకుంటున్నారు.
“ఆయన ఎక్కడా వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. తాను అసహ్యించుకునే పియరే పోలియెవ్ర్ మీద పోటీపడాలని అనుకోవడం లేదు. అలాగని ఆయనను వదిలేయాలని కూడా భావించడం లేదు.” అని మార్టిన్ చెప్పారు.
ట్రూడో మొండితనం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను పోలి ఉంది. జో బైడెన్ కూడా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వచ్చే వరకు అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వదులుకోలేదు.
అయితే ట్రూడో వారసత్వం బైడెన్ మాదిరిగా ఉంటుందా లేదా అనేది ఆయన నిష్క్రమించే తీరును బట్టి ఉంటుందని ప్రొఫెసర్ బ్లేక్ చెప్పారు.
‘‘ఓడిపోయే యుద్ధాన్ని కొనసాగించడం ఆయనకు మచ్చలా మిగిలిపోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడిన ఘనమైన చరిత్ర ట్రూడోకు ఉంది’’ అని బ్లేక్ అన్నారు.
“ఆయన అనేక సార్లు గట్టెక్కారు. ఆయన కొన్ని అసాధారణమైనవి సాధించారు. అయితే ఈసారి అలా జరుగుతుందా అంటే, నేను చెప్పలేను.” అని బ్లేక్ అన్నారు.
ట్రూడో ప్రస్తుతం ఉన్న పరిస్థితి లాంటిదాన్నే గతంలో ఆయన తండ్రి ఎదుర్కొన్నారు. ఆయన వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచారు. నాలుగో ఎన్నిక గెలిచేందుకు ఏడాది ముందే అధికారాన్ని వదులుకుని, తర్వాత ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు.
అప్పట్లో తాను అధికారంలో కొనసాగితే ఓడిపోతానని ట్రూడో తండ్రి భావించారు. అందుకే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఒట్టావా మంచు తుపానులో తిరుగుతుంటే, తనకు ప్రధాని పదవిని వదులుకోవాలనిపించిందని అప్పట్లో సీనియర్ ట్రూడో చెప్పారు.
అప్పటి నుంచి “వాక్ ఇన్ ద స్నో” అనే మాట రాజీనామాకు పర్యాయపదంగా మారింది. ఈసారి క్రిస్మస్‌కు ట్రూడో అడుగులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)