SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్) బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మే 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టులో గవాయ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే ఆరవ మరాఠీ వ్యక్తి జస్టిస్ భూషణ్ గవాయ్. ఆయన కంటే ముందు, జస్టిస్ పి.బి. గజేంద్రగడ్కర్, జస్టిస్ వై.వి. చంద్రచూడ్, జస్టిస్ శరద్ బాబ్డే, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ సీజేఐలుగా పనిచేశారు.
అంతేకాదు, నాగ్‌పూర్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోయే మూడో వ్యక్తి జస్టిస్ గవాయ్. ఆయన కంటే ముందు, జస్టిస్ శరద్ బాబ్డే, జస్టిస్ ఎం. హిదయతుల్లా ఈ పదవి చేపట్టారు.
ఈ నేపథ్యంలో జస్టిస్ భూషణ్ గవాయ్ ప్రయాణం, ఆయన నేపథ్యం, కీలక తీర్పులను ఒకసారి తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, ANI
జస్టిస్ భూషణ్ గవాయ్ నేపథ్యం
మహారాష్ట్రలోని అమరావతి నగరంలో భూషణ్ రామకృష్ణ గవాయ్ 1960 నవంబర్ 24న జన్మించారు. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడైన రామకృష్ణ సూర్యభాన్(ఆర్ఎస్) గవాయ్ కుమారుడు.
ఆర్ఎస్ గవాయ్ అమరావతి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. కేరళ, బిహార్ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన దీక్షభూమి స్మారక కమిటీ అధ్యక్షుడు కూడా.
అమరావతిలో భూషణ్ గవాయ్ ప్రాథమిక విద్యను అభ్యసించారు. ముంబయిలో న్యాయవిద్యను చదివారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్ సభ్యుడయ్యారు. 1987 వరకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ అడ్వకేట్ జనరల్‌తో కలిసి పనిచేశారు.
గవాయ్ 1987లో బాంబే హైకోర్టులో స్వతంత్ర న్యాయవాద వృత్తిని ప్రారంభించి 1990 వరకు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. తరువాత నాగ్‌పూర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో ఆయన న్యాయవాద వృత్తిని కొనసాగించారు.
నాగ్‌పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లకు, అలాగే అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేశారు .
1992 ఆగస్టు నుంచి 1993 జులై వరకు, బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో గవాయ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవులను నిర్వహించారు.
హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌కు 2000 జనవరి 17న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత, 2005 నవంబర్ 12న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు గవాయ్. అక్కడ ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చారు.
హైకోర్టు న్యాయమూర్తిగా 14 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు గవాయ్.
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్న జస్టిస్ గవాయ్ ఆరు నెలల పాటు ఆ పదవిలో ఉంటారు. 2025 నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు.

ఫొటో సోర్స్, ANI
జస్టిస్ గవాయ్ కీలక తీర్పులు
సుప్రీంకోర్టులో జస్టిస్ భూషణ్ గవాయ్ కీలక తీర్పులు ఇచ్చారు. 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో గవాయ్ సభ్యులు.
నోట్ల రద్దు కేసు గురించి జస్టిస్ గవాయ్ తీర్పు చెబుతూ.. “భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 26(2) కింద ఇచ్చిన అధికారాలను ఉపయోగించి అన్ని రకాల నోట్లను నిషేధించవచ్చు. ఈ విభాగంలో ఉపయోగించిన ‘ఏదైనా’ అనే పదాన్ని పరిమితంగా కాకుండా విస్తృత కోణంలో అర్థం చేసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వేషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉప-వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా అనుమతించొచ్చని 2024లో సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. జస్టిస్ భూషణ్ గవాయ్ ఈ ధర్మాసనంలో భాగం.
ఈ కేసులో భాగంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధనను ప్రవేశపెట్టాలని తీర్పు చెప్పిన వారిలో జస్టిస్ గవాయ్ ఒకరు.
ఈ కేసు తీర్పులో భాగంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ “రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా ప్రతి ఒక్కరినీ సమానంగా చూసేలా ఈ దశ సహాయపడుతుంది. అయితే, ఇతర వెనుకబడిన తరగతుల(ఓబీసీలు) మాదిరిగానే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) కోసం కూడా క్రీమీలేయర్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రమాణాలు భిన్నంగా ఉండవచ్చు” అని అన్నారు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, ఆ నిర్ణయాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సుప్రీంకోర్టు డిసెంబర్ 2023లో తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ భూషణ్ గవాయ్ కూడా ఒకరు.
‘ఎలక్టోరల్ బాండ్ స్కీం’ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ గవాయ్ సభ్యులు. దాతల వివరాలు చెప్పకపోవడమనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని ఈ ధర్మాసనం అభిప్రాయపడింది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో నిందితుల ఇళ్ల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనానికి జస్టిస్ గవాయ్ నాయకత్వం వహించారు.
కూల్చివేతలను ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది, తగిన ప్రక్రియను పాటించకుండా ఆస్తులను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. నిందితుల ఇళ్లపై ఇటువంటి చర్యలు తీసుకునే ముందు అనుసరించాల్సిన విధానపరమైన చర్యలను కోర్టు నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలను దేశవ్యాప్తంగా వర్తింపజేయడం జరిగింది. ఈ నియమాలను అమలు చేయడానికి తగిన సర్క్యులర్లను జారీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ కేసు
రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, గరిష్ఠ శిక్ష విధించడానికి దిగువ కోర్టు నిర్దిష్ట కారణాలను అందించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు శిక్షను నిలిపివేసింది.
జస్టిస్ భూషణ్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. అయితే, విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న దీర్ఘకాల అనుబంధాన్ని పేర్కొంటూ స్వచ్ఛందంగా కేసు నుంచి తప్పుకునేందుకు ముందుకొచ్చారు. చివరికి, కేసును గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనమే విచారించింది.
తీస్తా సెతల్వాద్, మనీష్ సిసోడియాలకు బెయిల్
జస్టిస్ భూషణ్ గవాయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం 2023లో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేసింది. 2002లో గుజరాత్ అల్లర్లకు కుట్ర పన్నారనే ఆరోపణలు తీస్తాపై ఉన్నాయి.
‘లిక్కర్ స్కాం’ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 2024లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు భూషణ్ గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ముందు సిసోడియా బెయిల్ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, 17 నెలలు కస్టడీలో గడిపిన సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు.
ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార కేసు
భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేసి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు భావించింది. ఈ విషయాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ కేసును న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, భూషణ్ గవాయ్, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రశాంత్ భూషణ్ పోస్టు కోర్టు ధిక్కారమని బెంచ్ తేల్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)