SOURCE :- BBC NEWS

వీణ

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని ప్రాంతాలు అక్కడి ‘ఉత్పత్తుల’ కారణంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందుతాయి. అక్కడి వారు వాటిని గర్వకారణంగా భావిస్తుంటారు.

నలుగురిలో ప్రత్యేకంగా నిలిపే ఆయా ఉత్పత్తులు తమ ప్రాంత వారసత్వమని వారు గొప్పగా చెప్పుకుంటారు కూడా. స్థూలంగా చెప్పాలంటే ఈ ఉత్పత్తులు అవి తయారయ్యే ప్రాంతం పేరుతో పిలుస్తారు. ఉదాహరణకు.. బొబ్బిలి వీణ, హైదరాబాద్ హలీమ్, వరంగల్ తివాచీలు, తిరుపతి లడ్డు వంటివి.

నిర్ధిష్ట ప్రాంతంలో ఉత్పత్తి, తయారు, ప్రాసెస్ అయ్యే ప్రత్యేక లక్షణాలుండే వస్తువులను(ఉత్పత్తులు) జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ (జీఐ) గుర్తిస్తుంది. దీని ద్వారా ఇతరులు వాటిని కాపీ చేయకుండా మేథోపరమైన హక్కులుండేలా చట్టపరంగా రక్షణ లభిస్తుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జీఐ ట్యాగ్‌తో ప్రత్యేక గుర్తింపు

ఫొటో సోర్స్, GI%20Journal%20WChapata%20Chili.

భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం.. జీఐ గుర్తింపు వల్ల ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ది, ఉత్పత్తుల నాణ్యత పరిరక్షణకు తోడ్పడుతుంది.

తెలంగాణలోని నిర్మల్‌లో పుట్టి పెరిగిన పోలకొండ నారాయణ వర్మకు అక్కడ తయారయ్యే కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్ అంటే చాలా అభిమానం. వీటికి జీఐ గుర్తింపు కూడా ఉంది.

“మా ఊరు నిర్మల్ అని చెబితే కొయ్యబొమ్మల గురించి అడుగుతుంటారు. అది నాకు గర్వంగా ఉంటుంది. నకాశీ (కొయ్యబొమ్మల తయారీ) కుటుంబం నుంచే వచ్చిన నేను ఆ పనిని నేర్చుకోలేకపోయాను. ఈ విషయం నాకు బాధ కలిగిస్తుంటుంది” అని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నారాయణ వర్మ బీబీసీతో అన్నారు.

నిర్మల్ కొయ్యబొమ్మలకు జీఐ ట్యాగ్

జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ

పరిశ్రమలు, వాణిజ్య శాఖ వెబ్ సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. జీఐ ట్యాగ్ సంబంధిత ఉత్పత్తులు శతాబ్దాలుగా ఒక తరం నుంచి మరొక తరానికి చేరతాయి.

ఆయా వస్తువులు, వాటి ఉత్పత్తి స్థలం మధ్య ఒక బంధం ఉంటుంది, ఇది జీఐ రిజిస్ట్రీలో నమోదుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడింది.

‘జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ ( రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ప్రకారం భారత దేశంలో జీఐ గుర్తింపు, నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

భారత్‌లో 2004 నుంచి ఈ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ కార్యాలయం చెన్నైలో ఉంది. జీఐ ట్యాగ్ వ్యవసాయ, సహజ లేదా ఉత్పత్తి చేసిన ప్రత్యేక లక్షణాలున్న వస్తువులను గుర్తించడానికి వినియోగిస్తారు. 34 రకాల ఉత్పత్తులకు జీఐ గుర్తింపు ఇస్తున్నారు. వీటిలో ప్రధానంగా వ్యవసాయం, ఆహార, హస్తకళలు, పారిశ్రామిక, నిర్మాణ రంగ ఉత్పత్తులు ఉన్నాయి.

తెలంగాణలో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు

ఫొటో సోర్స్, venkatesh

జీఐ నమోదు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

చట్ట ప్రకారం ఏర్పాటైన అధికారిక సంస్థలు, ఉత్పత్తిదారుల సంఘాలు జీఐ గుర్తింపు కోసం నిర్ధేశిత ఫారంతో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. అప్లికేషన్ రుసుం కింద 5 వేల రూపాయలు చెల్లించాలి.

దరఖాస్తులను నిపుణుల బృందం పరిశీలించి, అందులో పేర్కొన్న ఉత్పత్తుల వివరాలు, కచ్చితత్వాన్ని నిర్ధరిస్తుంది. వారు లేవనెత్తే అభ్యంతరాలపై నెల రోజుల్లోపు దరఖాస్తుదారు స్పందించాల్సి ఉంటుంది. లేదంటే తిరస్కరిస్తారు.

నిపుణుల బృందం ఇచ్చే రిపోర్ట్ ప్రకారం జీఐ జర్నల్‌లో సంబంధిత ఉత్పత్తి వివరాలను ప్రచురిస్తారు (అడ్వర్టైజ్). దీనిపైన అభ్యంతరాల స్వీకరణకు మూడు నెలల గడువు ఉంటుంది. అభ్యంతరాలు రాకపోతే జీఐ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాతి క్రమంలో దరఖాస్తుదారుకు పది సంవత్సరాల కాలపరిమితితో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక గుర్తింపు పొడిగింపు కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రాకపోతే జీఐ రిజిస్ట్రీ నుంచి సంబంధిత ఉత్పత్తిని తొలగిస్తారు.

చేర్యాల పెయింటింగ్స్‌కు జీఐ ట్యాగ్

ఏపీ, తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు

ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబందించిన ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 19 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది.

వాటిలో.. గుంటూరు సన్న మిరప, తిరుపతి లడ్డు, బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, శ్రీకాళహస్తి కళంకారి, కొండపల్లి బొమ్మలు, బుడితి ఇత్తడి కళ, మచిలీపట్నం కళంకారి , ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలు, ఉప్పాట జంధాని చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు-ఫ్యాబ్రిక్స్, బొబ్బిలి వీణ, ధర్మవరం పట్టుచీరలు-పావడ, దుర్గి రాతి శిల్పాలు, ఏటికొప్పాక బొమ్మలు, ఉదయగిరి కర్ర వంటపాత్రలు( స్పూన్స్) , ఆళ్ళగడ్డ రాతి శిల్పాలు, నరసాపూర్ క్రోషే లేస్ ఉన్నాయి.

నిర్మల్ కొయ్యబొమ్మలు

తెలంగాణ లో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు దక్కింది.

తాండూరు కందులు, హైదరాబాద్ హలీమ్, పోచంపల్లి ఇక్కత్ , కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ ఫర్నీఛర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, నారాయణపేట చేనేత చీరలు, ఆదిలాబాద్ డోక్రా ఇత్తడి కళ, వరంగల్ తివాచీలు, పోచంపల్లి ఇక్కత్ (లోగో), తెలియా రుమాలు, హైదరాబాద్ లక్క గాజులు తెలంగాణ రాష్ట్రం నుండి జీఐ రిజిస్ట్రీలో నమోదైన జాబితాలో ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)