SOURCE :- BBC NEWS
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
-
4 జనవరి 2025
“జగనే మేలు నా బస్సులను నిలిపేయించాడు. బీజేపీ ప్రభుత్వంలో నా బస్సులను తగలబెట్టించారు. ఇంతకంటే నీచమైనది ఏమైనా ఉందా”
నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలివి.
గతంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తరచూ తీవ్రంగా విమర్శించిన ప్రభాకరరెడ్డి హఠాత్తుగా ‘జగన్ మంచోడు’ అనడం, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించకుండా బీజేపీ ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
రాష్ట్ర రాజకీయాల్లో చిన్నపాటి అలజడిని సృష్టించిన జేసీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.
తగలబడిన బస్సులు
2024 డిసెంబర్ 31న రాత్రి జరిగిన న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలోని జేసీ పార్కులో ప్రభాకరరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
ఆ కార్యక్రమానికి కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పారు.
జేసీ పార్క్ తాడిపత్రికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో, అంత దూరంలో అలాంటి కార్యక్రమాలు నిర్వహించి, దానికి మహిళలను మాత్రమే ఆహ్వానిస్తే, అసాంఘిక చర్యలకు పాల్పడేవారితో సమస్యలు రావచ్చని, మహిళలకు రక్షణ ఉండదని బీజేపీ రాష్ట్ర మహిళా నేతలు నటి మాధవీలత, యామినీ శర్మ సాదినేని వ్యాఖ్యలు చేయడంతో దీనికి రాజకీయరంగు పులుముకుంది.
”జేసీ పార్క్ సున్నితమైన ప్రదేశం. అక్కడ గంజాయి తాగేవారు చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటిచోట మహిళలకోసం నూతన సంవత్సర వేడుకలు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో అక్కడ జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? దయచేసి దీనికి మహిళలు అటెండ్ కాకుండా ఉంటే బాగుంటుంది.” అని బీజేపీ నేత మాధవీలత డిసెంబర్ 31న అన్నారు.
‘‘తాగి మద్యం మత్తులో తిరిగేవారు ఉంటారు. కేవలం మహిళలకు మాత్రమే అని స్వేచ్ఛ, ఎంజాయ్‌మెంట్ పేరుతో ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం వారి కుటుంబాల వారికి ఇబ్బంది కలుగుతుంది. దీనిపై ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.” అని యామినీ శర్మ సాదినేని కూడా అదే రోజు వ్యాఖ్యానించారు.
అయితే ఆ వేడుకలు జరిగిన ఒక రోజు తర్వాత అంటే జనవరి 2న తెల్లవారుజామున జేసీ ప్రభాకరరెడ్డికి సంబంధించిన ఒక బస్సు అనంతపురంలో అగ్నికి ఆహుతి అయ్యింది.
దీంతో, ఇది బీజేపీ నేతల పనేనని జేసీ ప్రభాకరరెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలను విమర్శించడంతో ఆగకుండా వై.ఎస్. జగన్‌ను ప్రశంసించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
జేసీ అసలు ఏమన్నారు?
ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే, జగన్ మీద ప్రశంసలు కురిపించారు జేసీ. తన బస్సుల అనుమతులు రద్దు చేశారని వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డిపై గతంలో పదేపదే విమర్శలు చేసేవారాయన. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా కామెంట్లు చేశారు.
“జగన్ రెడ్డి నయం. మంచోడు. నా బస్సులను కాల్చ లేదు, నిలబెట్టించాడు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో నా బస్సులను తగలబెట్టించారు. అంతకన్నా నీచమైనది ఏమైనా ఉందా? నా బస్సులు తగలబెట్టారు. నేను కంప్లైంట్ కూడా చేయను. వరసగా నిలబెట్టాను. ఇంకెన్ని బస్సులు కాలుస్తారో కాల్చండి.’’ అని అన్నారు.
తాను నిర్వహించిన న్యూఇయర్ వేడుకలపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత మాధవీలతపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘బట్టలు కూడా సరిగా వేసుకోరు. ముస్లింలను బురఖాలు తీయాలని వాదిస్తారు. వాళ్ల ముఖాలు మీరు చూడాలా? వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్లు అది వేసుకుంటారు.’’ అన్నారు.
బీజేపీ నేతలను పరుష పదజాలంతో విమర్శించిన ఆయన, ఆ బస్సులను తమ డ్రైవరుకు ఇచ్చానని, వాటిని తగలబెట్టి వారి జీవితం నాశనం చేశారని అన్నారు.
‘‘పాత బస్సులు ఎక్కడైనా అమ్మితే పది లక్షలు వస్తుంది. కానీ నేను మా దగ్గర పనిచేసిన వాళ్లకు ఐదు లక్షలకే ఇచ్చాను. ప్రూవ్ చేయడం పోలీసులకు చేతకాదని కేసు కూడా పెట్టవద్దనుకున్నా. ఐదేళ్లలో రూ.450 కోట్లు పోగొట్టుకున్నా. ఇదెంత నాకు.’’ అని జేసీ అన్నారు.
తన బస్సును కావాలనే ఎవరో కాల్చేశారని, షార్ట్ సర్క్యూట్ కాదని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేతల స్పందనేంటి?
జేసీ ప్రభాకరరెడ్డి బీజేపీ ప్రభుత్వం అంటూ తమ నేతలను విమర్శించడంపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడారు.
“బీజేపీ ప్రభుత్వం బస్సు తగలబెట్టించింది అంటున్నారు. ఇక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. అందులో ఆయన కూడా భాగస్వామి. ఉన్నట్టుండి జేసీ ప్రభాకర్ రెడ్డికి జగన్ మీద ప్రేమ ఎందుకు పుట్టిందో అర్థం కావడం లేదు.’’ అని అన్నారు.
బీజేపీ కార్యకర్తలు అలాంటి దుశ్చర్యలకు పాల్పడరని ఆయన అన్నారు.
“కేసు పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. కాబట్టే కేసు పెట్టడు. ఏదో ఒక ఆరోపణ చేయాలి. రోజూ వార్తల్లో ఉండాలనే ఆయన జగన్‌ను పొగడడం, కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం చేస్తున్నారు.” అని శ్రీనివాసులు అన్నారు.
జేసీ నిర్వహించిన కార్యక్రమాలపై తమ పార్టీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలను శ్రీనివాసులు సమర్ధించారు. నటులపై జేసీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
”మహిళలపై సంస్కారం లేకుండా మాట్లాడడం సరికాదు. ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు” అన్నారు శ్రీనివాసులు.
జేసీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని బీబీసీతో మాట్లాడారు.
“మహిళల భద్రతకోసం మేము జాగ్రత్తలు చెప్పాం తప్ప తప్పుగా ఏమీ మాట్లాడలేదు. మహిళలపై ప్రేమ అంటున్నారు. మేము కూడా మహిళలమే కదా. ఇలాంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడడం, క్యారక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్టు కాదు. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. అలాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆయన బస్సులను కాల్చింది అని ఎలా మాట్లాడతారు.” అన్నారు.
ఈ ఘటనపై అధికారుల వాదనేంటి?
అనంతపురంలో బస్సు తగలబడిన ఘటన గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ బీబీసీతో మాట్లాడారు.
” ఏం జరిగిందో పూర్తిస్థాయి దర్యాప్తులోనే తేలుతుంది. చాలా సంవత్సరాల నుంచి అక్కడ బస్సులు నిలబెట్టి ఉన్నాయి. అవి గతంలో కేసులు పెట్టడంతో సీజ్ చేసిన బస్సులు. అక్కడ వేస్ట్ డంప్ ఉంది. పక్కనే ఐదడుగుల దూరంలో బస్సులు ఉంటాయి. అక్కడ చెట్లు కంపలు బాగా పెరిగాయి. ఆ వేస్ట్ డంప్ దగ్గర నుంచి ఫైర్ వచ్చినట్టు ఉంది.” అని ఎస్పీ అన్నారు.
బస్సు తగలబడిందని తెలియగానే తాము మంటలు ఆర్పామని, షార్ట్ సర్క్యూట్ వల్ల అలా జరిగిందని చెప్పలేమని అనంతపురం జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులురెడ్డి బీబీసీతో అన్నారు.
“మంటల్లో ఒక బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇంకో బస్సు పాక్షికంగా కాలింది. మంటలు కింది నుంచి పైకి వెళ్లాయి. దీంతో పైన ఉన్న విద్యుత్ వైర్ కాలి తెగి దానిపై పడింది.” అన్నారు.
మొత్తం వివాదంపై స్థానికులు ఏమంటున్నారో బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. “అక్కడ ఏం జరిగింది అనేదానిపై వాస్తవాలు తెలియకుండా ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్టు కాదు. బీజేపీ నేతలు కూడా అక్కడ ఏదైనా జరిగినప్పుడు మాట్లాడి ఉండాల్సింది. ఏమీ జరగక ముందే మాట్లాడారు. తన బస్సు తగలబడడంతో ఆవేదనకు గురై జేసీ అలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు” అని అనంతపురంలో సీనియర్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్న దామోదర ప్రసాద్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS