SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మసూద్ అజర్, 1994 జనవరి 29న మొదటిసారి బంగ్లాదేశ్ విమానంలో ఢాకా నుంచి దిల్లీ వచ్చారు. ఆయన దగ్గర పోర్చుగల్ పాస్‌పోర్ట్ ఉంది.
ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉన్న డ్యూటీ ఆఫీసర్ ఆయన్ను చూసి “మీరు పోర్చుగల్ దేశస్థుడిలా అనిపించడం లేదే” అన్నారు. మసూద్ వెంటనే “నేను గుజరాతీ మూలాలున్న వాడిని” అని చెప్పారు. దాంతో, ఆయన మళ్లీ ఆయనవైపు చూడకుండా దానిపై ముద్ర వేసేశారు.
వచ్చిన కొన్ని రోజుల్లోనే మసూద్ అజర్ శ్రీనగర్ వీధుల్లో కనిపించడం మొదలైంది. అక్కడ యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించడం, కశ్మీర్‌లో వేర్పాటువాదుల మధ్య గొడవలు వస్తే మధ్యవర్తిత్వం వహించడం వంటి పనులు చేసేవారు.
ఆయనకు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉండేది. కశ్మీరీ యువకులను మిలిటెంట్ కార్యకలాపాలవైపు ఆకర్షించడం, వారిని ప్రేరేపించడం.


ఫొటో సోర్స్, Getty Images
అనంతనాగ్‌లో ఒకసారి సజ్జాద్ అఫ్గానీతో కలిసి ఆటోలో వెళ్తున్నప్పుడు ఆయన్ను ఆర్మీ జవాన్లు ఆపారు. దాంతో ఇద్దరూ ఆటోలోంచి దూకి పరిగెత్తడం మొదలెట్టారు. కానీ, జవాన్లు వాళ్లను పట్టుకున్నారు.
భారత ప్రభుత్వానికి తనను ఎక్కువ రోజులు జైల్లో ఉంచే శక్తి లేదని మసూద్ అజర్ తరచూ చెప్పేవారు.
మసూద్‌ను అరెస్టు చేసిన పది నెలల్లోనే మిలిటెంట్లు దిల్లీలో కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. వారిని వదలాలంటే మసూద్ అజర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ప్రయత్నం విఫలమైంది. ఉత్తర ప్రదేశ్, దిల్లీ పోలీసులు సహారన్‌పూర్ నుంచి బందీలను విడిపించడంలో సఫలం అయ్యారు.

లావుగా ఉండడంతో సొరంగంలో ఇరుక్కుపోయారు
ఏడాది తర్వాత హర్కత్-ఉల్-అన్సార్ మళ్లీ కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేసి మసూద్ అజర్‌ను విడిపించాలని ప్రయత్నం చేసింది. కానీ, అది కూడా విఫలమైంది.
1999లో జమ్మూలోని కోట్ భలావల్ జైలు నుంచి ఆయన్ను తప్పించడానికి ఒక సొరంగం కూడా తవ్వారు. కానీ లావుగా ఉండడంతో మసూద్ అజర్ దాన్లో ఇరుక్కుపోయారు. మళ్లీ దొరికిపోయారు.
కొన్ని నెలల తర్వాత 1999 డిసెంబర్‌లో మిలిటెంట్లు ఒక భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లారు.
విమానంలో ఉన్న వారిని విడిపించడానికి భారత ప్రభుత్వం ముగ్గురు మిలిటెంట్లను వదిలేందుకు అంగీకరించింది. వారిలో మసూద్ అజర్ కూడా ఒకరు.
ఆ సమయంలో ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఒప్పించడానికి ప్రభుత్వం భారత నిఘా ఏజెన్సీ రా చీఫ్ అమరజీత్ సింగ్ దులత్‌ను ప్రత్యేకంగా శ్రీనగర్ పంపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ముస్తాక్ అహ్మద్ జర్గర్, మసూద్ అజర్‌ను విడిపించడానికి అబ్దుల్లా అసలు ఒప్పుకోలేదు. ఆయన్ను ఒప్పించడానికి దులత్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
రా చీఫ్ దిల్లీ నుంచి ఒక చిన్న గల్ఫ్‌స్ట్రీమ్ విమానంలో వచ్చారు. జర్గర్‌ను శ్రీనగర్ జైలు నుంచి, మసూద్ అజర్‌ను జమ్మూలోని కోట్ భలావల్ జైలు నుంచి శ్రీనగర్ తీసుకొచ్చారు. దులత్ ఇద్దరినీ ఆ గల్ఫ్‌స్ట్రీమ్ విమానంలో కూర్చోబెట్టారు.
“నా విమానంలో ఎక్కించడానికి ముందు ఇద్దరి కళ్లకు గంతలు కట్టారు. ఇద్దరినీ విమానం వెనుక భాగంలో కూచోబెట్టారు. విమానం మధ్యలో తెర ఉంది. తెరకు ఒకవైపు నేను, ఇంకోవైపు జర్గర్, మసూద్ అజర్ ఉన్నారు” అని దులత్ చెప్పారు.
టేకాఫ్ అయ్యే కొన్ని క్షణాల ముందు మేం వీలైనంత త్వరగా దిల్లీ చేరుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ కాందహార్ వెళ్లడానికి మాకోసం విమానాశ్రయంలో వేచిచూస్తున్నారు.
“దిల్లీలో దిగగానే ఇద్దరినీ జశ్వంత్ సింగ్ ఉన్న విమానంలోకి తీసుకెళ్లాం. అందులో అప్పటికే మూడో మిలిటెంట్ ఒమర్ షేక్ ఉన్నారు” అని ఆయన చెప్పారు.

జశ్వంత్ సింగ్ కాందహార్ వెళ్లడానికి కారణం
ముగ్గురినీ భారత్ నుంచి కాందహార్ ఎవరెవరు తీసుకెళ్లాలనే ప్రశ్న తలెత్తింది. కాందహార్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ కట్జూ, ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన అజిత్ డోభాల్, రా సీడీ సహాయ్ అందరూ ఒకే మాట చెప్పారు.
అవసరమైతే అప్పటికప్పుడు అక్కడ ఎలాంటి పెద్ద నిర్ణయమైనా తీసుకోగలిగిన వారినే అక్కడకు పంపించాలన్నారు. ఎందుకంటే ప్రతి నిర్ణయానికి దిల్లీ వైపు చూసే పరిస్థితి అప్పుడు లేదు.
జశ్వంత్ సింగ్ విమానం కాందహార్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక చాలాసేపటి వరకూ తాలిబాన్ల వైపు నుంచి ఆయన్ను కలవడానికి ఎవరూ రాలేదు.
ఆయన అలా విమానంలోనే కూచుని వాళ్ల కోసం వేచిచూశారు.
జశ్వంత్ సింగ్ తన ఆత్మకథ ‘ఎ కాల్ టూ ఆనర్ – ఇన్ సర్వీస్ ఆఫ్ ఎమర్జింగ్ ఇండియా’లో.. “చాలా సేపటి తర్వాత వాకీ-టాకీ శబ్దం వినిపించింది. కంగారుపడ్డ వివేక్ కట్జూ నా దగ్గరకు వచ్చి సర్ బందీల విడుదలకు ముందే మనం ఈ మిలిటెంట్లను వదలాలా, వద్దా మీరే నిర్ణయించండి అన్నారు. నా దగ్గర దానికి ఒప్పుకోవడం తప్ప వేరే దారి లేకుండా పోయింది” అని చెప్పారు.
“విమానంలోంచి ముగ్గురు మిలిటెంట్లు కిందికి దిగగానే.. వారికి చాలా ఉత్సాహంగా స్వాగతం పలకడం చూశాను. వారు దిగగానే మేం దిగకుండా విమానం మెట్లను తీసేశారు. కింద ఉన్న వారు సంతోషంలో గట్టిగట్టిగా అరుస్తున్నారు” అని ఆయన చెప్పారు.
“మేం తీసుకొచ్చింది అసలైనవారినేనా, కాదా అనేది తెలుసుకోడానికి, ఐఎస్ఐ ముగ్గురు మిలిటెంట్ల బంధువులను పాకిస్తాన్ నుంచి కాందహార్ తీసుకొచ్చింది. అసలైనవారే అని వాళ్లకు నమ్మకం కలిగాక వాళ్లు మా విమానానికి మళ్లీ మెట్లు పెట్టారు. అప్పటికే చీకటిపడింది. చలి కూడా పెరుగుతోంది” అని దులత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బహుమతిగా బైనాక్యులర్స్
అయిదు గంటల సమయంలో అజిత్ డోభాల్ హైజాక్ అయిన విమానంలోని ప్రయాణికులను కలవడం మొదలెట్టారు. ఆయన విమానం నుంచి దిగినపుడు కిడ్నాపర్లు ఆయనకు ఒక చిన్న ‘బైనాక్యులర్‌ను బహుమతిగా ఇచ్చారు.
“విమానం బయట ఏమేం జరుగుతోందో ఇదే బైనాక్యులర్‌లో చూసేవాళ్లమని వాళ్లు నాతో అన్నారు. తర్వాత నేను కాందహార్ నుంచి దిల్లీకి బయల్దేరినపుడు నేను ఆ బైనాకులర్‌ను విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్‌కు చూపించాను. ఆయన నాతో ఇది కాందహార్‌లో మన చేదు అనుభవాలను గుర్తు చేస్తుంటుందని అన్నారు. నేను ఆ బైనాక్యులర్‌ను ఒక జ్ఞాపకంగా ఆయనకే ఇచ్చేశాను” అని డోభాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానంలో దుర్గంధం, చికెన్ ఎముకలు
హైజాక్ అయిన విమానంలోని ప్రయాణికులతో విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్, భారత అధికారుల బృందం అదే రోజు తిరిగి భారత్ వచ్చేసింది.
కానీ, ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌లో పనిచేసే ఏఆర్ ఘనశ్యామ్‌ను భారత విమానంలో ఇంధనం నింపి, దానిని తిరిగి దిల్లీ తీసుకువచ్చే ఏర్పాట్ల కోసం కాందహార్‌లోనే ఉంచేశారు. ఎయిర్ ఇండియా కు చెందిన 14 మంది సిబ్బంది కూడా అక్కడే ఉండిపోయారు.
తర్వాత ఘనశ్యామ్ తన రిపోర్టులో “అందరూ వెళ్లిపోయిన తర్వాత నేను ఆ విమానంలోకి వెళ్లాను. అక్కడ ముక్కులు పగిలిపోయేలా దుర్గంధం వ్యాపించి ఉంది. కాక్‌పిట్ ప్యానల్ వరకూ చికెన్ ఎముకలు, ఆరెంజ్ తొక్కలు పడి ఉన్నాయి. టాయిలెట్ చాలా ఘోరంగా ఉంది. అది అసలు ఉపయోగించేలా లేదు” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎర్ర సూట్‌కేస్ రహస్యం
కమాండర్ కెప్టెన్ సూరీ రాత్రి సుమారు 9 గంటలప్పుడు ఘన్‌శ్యామ్ దగ్గరకు వచ్చారు. “తాలిబన్లు ఐసీ 184 ఎగరడానికి ఒప్పుకోవడం లేదు. వాళ్లు దాన్లో ఇంధనం నింపడం గురించి కూడా పట్టించుకోవడం లేదు” అని చెప్పారు.
విమానం హోల్డ్ నుంచి కిడ్నాపర్లకు చెందిన ఒక ఎర్రరంగు సూట్‌కేస్ తీసి తమకు ఇస్తేనే దాన్ని ఎగరనిస్తామని వాళ్లు షరతు పెట్టారు.
కెప్టెన్ సూరీ 11 గంటల వరకు విమానం లోపలే ఉన్నారు. ఘన్‌శ్యామ్ తన రిపోర్టులో “నాకు ఒక ఎర్రరంగు పజేరో విమానం హోల్డుకు సరిగ్గా ముందు నిలబడి ఉండడం కనిపించింది. దాని లైట్లు ఆన్‌లో ఉన్నాయి.”
”కెప్టెన్ రావ్ ఇంజన్ స్టార్ట్ చేసే ఉంచారు. కొంతమంది పనివాళ్లు ఇంకా విమానం లోపల పనిచేస్తూనే ఉన్నారు. వాళ్లు విమానం హోల్డులో ఉన్న ఒక ఎర్ర రంగు సూట్‌కేస్ బయటకు తీసి పజేరోలో ఉన్న వారికి చూపించారని కెప్టెన్ రావ్ నాకు తర్వాత చెప్పారు. సూట్ కేసును గుర్తించడానికి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది హైజాకర్లు కారులోపల ఉన్నట్టు నాకు అనిపించింది”
”తర్వాత కెప్టెన్ సూరీకి ఒకడు మొత్తానికి మాకు ఆ ఎర్రరంగు సూట్ కేస్ దొరికిందని చెప్పాడు. దాన్లో 5 గ్రెనేడ్లు ఉన్నాయని అన్నాడు. తర్వాత కెప్టెన్ రావ్ తిరిగి వచ్చారు. మేమంతా ఆ రాత్రి విమానాశ్రయం లాంజ్‌లోనే ఆగిపోయాం” అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్యాకెట్ లోపల బాదాం, నెయిల్ కట్టర్
తర్వాత రోజు విమానంలో ఇంధనం నింపారు. అఫ్గాన్ సమయం ప్రకారం ఉదయం 9.43 నిమిషాలకు భారత విమానం దిల్లీకి బయలుదేరింది.
ఆ తర్వాత తాలిబాన్లకు చెందిన ఒక వ్యక్తి కూడా కాందహార్ విమానాశ్రయానికి రాలేదు. విమానాశ్రయంలోనే ఉన్న ఘన్‌శ్యామ్‌కు కంట్రోల్ టవర్ దగ్గర అధికారి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఆయన దాన్ని తెరిచి చూడగానే, అందులో కొంత బాదం, ఎండు ద్రాక్ష, ఒక చిన్న దువ్వెన, ఒక నెయిల్ కట్టర్ కనిపించాయి.
తాలిబన్ల సివిల్ ఏవియేషన్ మంత్రి వాటిని ఆయనకు బహుమతిగా పంపించారు. ఎందుకంటే ఘన్‌శ్యామ్ కాందహార్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు, ఆయనకు ఒక్కసారి కూడా నగరంలోకి వెళ్లే అవకాశం రాలేదని వారికి తెలుసు.
ఘనశ్యామ్ మధ్యాహ్నం 12 గంటలకు ఐక్యరాజ్యసమితి విమానం ఎక్కారు. మూడు గంటల తర్వాత ఇస్లామాబాద్ చేరుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)