SOURCE :- BBC NEWS

వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ఆదేశాలతో పలువురు అమ్మాయిలు బలవంతంగా తమ షర్ట్‌లను విప్పాల్సి వచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కానీ, తాను అలాంటి ఆర్డర్ ఇవ్వలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

ధన్‌బాద్ జిల్లా కలెక్టర్‌కు విద్యార్థినులు రాసిన ఫిర్యాదులో, స్కూల్‌లో ప్రీ-బోర్డు ఎగ్జామినేషన్ చివరి రోజు ఇలా జరిగిందని పేర్కొన్నారు.

షర్ట్‌లపై విద్యార్థినులు ఒకరి కోసం ఒకరు సందేశం రాసుకున్న సమయంలో, ఇలా చేయడం వల్ల స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందని, స్కూల్‌లోనే ఆ షర్ట్‌లను విడిచేసి వెళ్లాలని విద్యార్థినులందరినీ స్కూల్ ప్రిన్సిపల్ ఆదేశించినట్లు తెలిపారు.

దీని తర్వాత, కొందరు అమ్మాయిలు తమకు తాము ఆ షర్ట్‌లను తీసివేయగా, కొందరి షర్ట్‌లను వారి సీనియర్లతో విప్పించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

అసలేం జరిగింది?

ఈ ఘటనపై విద్యార్థినులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. కుటుంబ సభ్యులు దీనిపై మాట్లాడారు.

మహేశ్ కుమార్ (పేరు మార్చాం) ఒక వ్యాపారవేత్త. ఆయను కూతురు ఆ స్కూల్‌లోనే చదువుకుంటున్నారు.

‘‘ జనవరి 9న మధ్యాహ్నం నా కూతురు నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నేను కోల్‌కతాలో ఉన్నాను. ‘10వ తరగతి ప్రీ-బోర్డు ఎగ్జామ్ అయిపోయాయి. కానీ, నా స్నేహితులతో ‘పెయిన్ డే’ ( స్కూలును విడిచి వెళుతున్నందుకు బాధతో చేసుకునే రోజు) జరుపుకుంటుంటే మా ప్రిన్సిపల్ అకస్మాత్తుగా స్కూల్ గ్రౌండ్‌లోకి వచ్చి, మాపై అరిచారు అని మా కూతురు చెప్పింది.” అని ఆయన తెలిపారు.

‘‘ మెసేజ్‌లను రాసుకున్న షర్ట్‌లను డిపాజిట్ చేయాలని ప్రిన్సిపల్ ఆదేశించారు. ‘పెయిన్ డే’ కోసం కొందరు అమ్మాయిలు వేరే షర్ట్‌లను తెచ్చుకున్నారని తెలిపింది.” అని మహేశ్ కుమార్ వెల్లడించారు.

”కొందరు వారి స్కూల్ యూనిఫామ్‌లపైనే సందేశాలను రాయించుకున్నారు. దీంతో, స్కూల్‌లో విద్యార్థినులు షర్ట్‌లను బలవంతంగా తీసేయాల్సి వచ్చింది. వారు బ్లేజర్లపైనే ఇంటికి వెళ్లారని నా కూతురు చెప్పింది.” అని తండ్రి మహేశ్ కుమార్ చెప్పారు.

రాగిణి సింగ్

ఫొటో సోర్స్, @RaginiSingh7007

10వ తరగతిలో రెండు సెక్షన్‌లలో కలిపి స్కూల్‌లో మొత్తం 120 మంది విద్యార్థినులు ఉన్నారు. ప్రీ-బోర్డ్ పరీక్షలు అయిపోయిన తర్వాత, 20 మంది విద్యార్ధినులు ఇంటికి వెళ్లిపోయారు. కొందరు విద్యార్థినులు ‘పెయిన్ డే’ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు కొందరు విద్యార్ధినులు బ్లేజర్లు ధరించి స్కూలు బస్సులో కాకుండా సొంతంగా ఇంటికి వెళ్లారు.

”నా కూతురు బాగా ఏడ్చింది. కానీ, అమ్మాయిలందరి కోసం మేం పోరాడతాం అని ఆమెకు చెప్పాం. బోర్డు ఎగ్జామ్‌లపై దృష్టి పెట్టమని చెప్పాం.” అని మహేష్ కుమార్ చెప్పారు.

ఈ సంఘటన విద్యార్థినులపై రాబోయే పరీక్షల్లో ప్రభావం చూపుతుందని మరో తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ప్రిన్సిపల్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.

1955 నుంచి ఈ స్కూల్‌ను నడుపుతున్నారు. ఈ గర్ల్స్ స్కూల్‌లో సుమారు 1,300 మంది వరకు చదువుకుంటున్నారు.

ధన్‌బాద్

ఫొటో సోర్స్, @dc_dhanbad

విచారణకు ఆదేశించిన డీసీ మాధవి మిశ్రా

బలవంతంగా తమ షర్ట్‌లు విప్పదీయించారని చెబుతూ, 80 మంది విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు అందినట్లు ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) మాధవి మిశ్రా చెప్పారు.

”శనివారం కొందరు విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు మా ఆఫీసుకు వచ్చారు. గురువారం (జనవరి 9న) పెయిన్ డే చేసుకున్నారని వారు చెప్పారు. ఒకరి షర్ట్‌లపై మరొకరు సందేశాలను రాసుకున్నారు. పిల్లలందరూ పదవ తరగతికి చెందినవారు” అని మాధవి మిశ్రా తెలిపారు.

ఎస్‌డీఎం నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీని తాము ఏర్పాటుచేసినట్లు డీసీ చెప్పారు. విచారణ జరిపేందుకు కమిటీ స్కూల్‌కు వెళ్లిందని, సీసీటీవీ రూమ్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు.

కమిటీ ప్రస్తుతం విచారణ జరుపుతోందని, అది పూర్తయ్యాక రిపోర్టును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని మాధవి మిశ్రా తెలిపారు.

అయితే, ప్రిన్సిపల్ ఈ ఆరోపణలన్నింటిన్నీ కొట్టివేస్తున్నట్టు మాధవి మిశ్రా తెలిపారు. తానెలాంటి ఆర్డర్ ఇవ్వలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

”నేనలా చేయలేదు. షర్ట్‌లను విప్పేసి, వెళ్లాలని వారికసలు చెప్పలేదు. సరైన యూనిఫామ్‌లో వెళ్లాలని మాత్రమే వారికి చెప్పాను” అని ప్రిన్సిపల్ తెలిపారు.

మీపై వస్తున్న ఆరోపణలన్ని అబద్ధమా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా…అబద్ధమే అన్నారు.

నిరసన

ఫొటో సోర్స్, ANAND DUTT

నిరసనలు వ్యక్తం చేసిన బీజేపీ, సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాబులాల్ మరాండి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

”విచారణ పేరుతో ఈ ఘటనను కప్పిపుచ్చడానికి బదులు నిందితులపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కఠిన చర్యలు తీసుకోవాలి” అని చెప్పారు.

ఫిర్యాదుతో తల్లిదండ్రులు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు, వారితో పాటు ఝారియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ కూడా ఉన్నారు.

”స్త్రీలను అవమానించినట్లు అర్థమవుతోంది. అమ్మాయిలు తప్పు చేశారని ప్రిన్సిపల్ భావిస్తే, తల్లిదండ్రులకు ఆ విషయం తెలియజేయాలి. వారిని దుస్తులు విప్పేసి వెళ్లాలని ఆదేశించకూడదు.” అని చెప్పారు.

‘‘అదే స్కూల్‌లో బోర్డు ఎగ్జామ్స్ జరుగుతాయి. అమ్మాయిలు భయపడుతున్నారు. స్కూల్‌పై నమ్మకం కోల్పోయారు. వారికి సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలో ఎగ్జామ్స్ నిర్వహించకపోతే, మేం ఈ ఆందోళనను విరమించం” అని చెప్పారు.

”స్కూల్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుతో నేను షాక్‌కు గురయ్యాను. పెయిన్ డే అనేది స్కూల్‌లో చివరి రోజు జరుపుకుంటారు. విద్యార్థినులకు ఉండే జ్ఞాపకాల్లో ఇదొకటి. ఎన్నో తరాల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఈ మానసిక, శారీరక క్షోభ పిల్లలకు జీవితకాలం ఒక పీడకల అవుతుంది.” అని చెప్పారు.

ఈ విషయంపై ఫిర్యాదు డిస్ట్రిక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు కూడా వెళ్లింది.

”ధన్‌బాద్‌ పేరెంట్స్ అసోసియేషన్‌కి చెందిన సామాజిక కార్యకర్తలు అంకిత్ రాజ్‌గర్హియా, మనోజ్ మిశ్రా, మధురేంద్ర సింగ్‌లు దీనిపై మాకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్టు కోసం మేం ఎదురు చూస్తున్నాం.” అని కమిటీ చైర్మన్ ఉత్తమ్ ముఖర్జీ చెప్పారు.

జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్, పిల్లల సంరక్షణ కమిటీ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్తారని తెలిపారు.

ప్రస్తుతం పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమని, దీనికోసం తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఝార్ఖండ్ హైకోర్టు దీన్ని సుమోటోగా చేపట్టి, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలని, పోక్సో చట్టం కింద కూడా దీనిపై కేసు రిజిస్టర్ చేయాలని సామాజిక కార్యకర్త అంకిత్ రాజ్‌గర్హియా అన్నారు.

”తొలుత ఇది లైంగిక వేధింపుల కేసు. పోక్సో చట్టంలోని సెక్షన్ 9 కింద ఎవరైనా పిల్లల్ని లైంగికంగా వేధిస్తే, పిల్లల్ని బలవంతంగా దుస్తులు విప్పదీయిస్తే లేదా పబ్లిక్‌గా నగ్న ప్రదర్శన చేసేలా చేస్తే, వారిపై కేసు నమోదు చేస్తారు. ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారా? లేదా? అని దీనివెనకున్న ఉద్దేశ్యాన్ని కోర్టు చూస్తుంది.” అని న్యాయవాది అపూర్వ వివేక్ తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసులో జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యల గురించి కుటుంబాలు వేచి చూస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)