SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు ఎట్టకేలకు తమ దిగుమతులపై విధించుకున్న సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు అంగీకరించాయి.
రెండు దేశాలు 90 రోజుల పాటు పరస్పర సుంకాలు (రెసిప్రొకల్ టారిఫ్స్)ను 115 శాతానికి తగ్గించనున్నట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్పెంట్ ప్రకటించారు.
ఈ రెండు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన వాణిజ్య చర్చల అనంతరం ఈ ప్రకటన విడుదలైంది.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ జనవరిలో చైనా దిగుమతుల మీద సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇది.
ట్రంప్ నిర్ణయాలకు ప్రతిగా బీజింగ్ కూడా సుంకాలను పెంచింది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలను పెంచడంతో సుంకాల సంక్షోభం ఏర్పడింది.
చైనా దిగుమతులపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచింది. చైనాకు దిగుమతయ్యే అమెరికా వస్తువుల మీద సుంకాలు 125 శాతానికి చేరుకున్నాయి.
ఇలా రెండు దేశాలు భారీగా సుంకాలను పెంచుతూ వెళ్లడంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం చోటు చేసుకుంటుందేమోనని ప్రపంచ మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
చివరకు, ఈ రెండు దేశాలు సుంకాల తగ్గింపుపై చర్చలు జరిపాయి.
చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు 90 రోజులు 30 శాతం పాటు తగ్గించనుండగా.. అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్‌లు కూడా అప్పటివరకు 10 శాతం తగ్గనున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఒప్పందానికి ముందు పరిణామాలు..
అనేక దఫాలుగా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా సుంకాలు విధించుకున్న దేశాలు, తమ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను బద్దలు కొట్టేందుకు సిద్ధమనే సంకేతాలు పంపాయి.
“ఒకరి వ్యవహారాల్లో ఒకరు తలదూర్చకుండా ముందుకు సాగవచ్చని రెండు దేశాలు భావించాయి. అందుకే చర్చలు జరుగుతున్నాయి” అని అమెరికా మాజీ వాణిజ్య రాయబారి స్టీఫెన్ ఒస్లాన్ అభిప్రాయపడ్డారు.
దీనిపై, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పందిస్తూ “అమెరికా అభ్యర్థన మేరకే చర్చలు జరుగుతున్నాయి” అని అన్నారు.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇది వాషింగ్టన్కు అనుకూలం అని పేర్కొంది. అమెరికన్ వ్యాపారులు, వినియోగదారుల పిలుపులకు సమాధానం ఇస్తున్నట్లు పేర్కొంది.
అయితే, ట్రంప్ ప్రభుత్వం మాత్రం.. వారి ఆర్థిక వ్యవస్థ కూలిపోతోంది కాబట్టి, వారు వ్యాపారం చేయాలనుకుంటున్నారని చైనా అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
“మేము మొదలుపెట్టామని వాళ్లు చెప్పారా? మంచిది, వాళ్లు ఒక్కసారి వెనక్కి వెళ్లి ఫైళ్లను అధ్యయనం చేయాలనుకుంటా” అని అంతకుముందు ట్రంప్ చెప్పారు.
“మనం ఏమైనా చేయవచ్చు. మొదట ఎవరు కాల్ చేశారు, ఎవరు చేయలేదు, ఇది ముఖ్యం కాదు. ఆ గదిలో ఏం జరుగుతుందన్నదే ముఖ్యం” అని ట్రంప్ గతవారం అన్నారు.
ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయం కూడా బీజింగ్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆ సమయంలో షీ జిన్‌పింగ్ మాస్కోలో ఉన్నారు.
జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 80 ఏళ్లైన సందర్భంగా మాస్కోలో జరిగిన విక్టరీ పరేడ్‌లో జిన్‌పింగ్ అతిథిగా పాల్గొన్నారు.
షీ జిన్‌పింగ్‌కు గ్లోబల్ సౌత్ నాయకులతో సన్నిహిత సంబంధాలు.. చైనాకు వాణిజ్యం కోసం ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పడమే కాకుండా, తాను ప్రత్యామ్నాయ ప్రపంచ నాయకుడినని అమెరికాకు గుర్తు చేస్తుంది.

ఫొటో సోర్స్, BBC/Xiqing Wang
పెరిగిన ఒత్తిడి
పెంచిన సుంకాలు అమెరికాను బలోపేతం చేస్తాయని ట్రంప్ చెబుతున్నారు. బీజింగ్ మాత్రం చివరి వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది. కానీ వాస్తవం ఏంటంటే, పెరిగిన సుంకాలు రెండు దేశాలనూ దెబ్బతీస్తున్నాయి.
చైనాల్లో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి దెబ్బతిందని చైనా ప్రభుత్వ లెక్కలు చెప్పాయి. 2023 డిసెంబర్ తర్వాత, తాజాగా ఏప్రిల్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు కనిష్ట స్థాయికి దిగజారాయి. సేవల రంగంలోనూ కార్యకలాపాలు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నట్లు కైక్సిన్ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల చైనా ఎగుమతిదారులు ఇబ్బంది పడుతున్నారని, గోదాముల్లో స్టాక్ పేరుకుపోతోందని, అయినప్పటికీ వారు ధిక్కార ధోరణిలో వ్యవహరిస్తూ అమెరికాయేతర మార్కెట్ల కోసం వెతుకుతున్నట్లు బీబీసీ గుర్తించింది.
“ఏ ఒప్పందం లేకపోవడం కంటే, ఏదో ఒక ఒప్పందం ఉండటం మంచిదనే వాస్తవాన్ని చైనా గుర్తించిందని అనుకుంటున్నా” అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ప్రొఫెసర్ బెర్ట్ హాఫ్మన్ ఈ ఒప్పందానికి ముందు చెప్పారు.
“అందుకే వారు చర్చలు కొనసాగిద్దాం అనే ఆచరణాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు” అని హాఫ్మన్ అన్నారు.
మరోవైపు, సుంకాల పెంపు వల్ల ఏర్పడిన అనిశ్చితి వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తొలిసారి మూడేళ్ల దిగువ స్థాయికి పడిపోయింది. చాలాకాలంగా చైనా వస్తువులపై ఆధారపడిన పరిశ్రమలు ఆందోళనలో ఉన్నాయి.
“సరఫరా వ్యవస్థల గొలుసు పూర్తిగా విచ్ఛిన్నం కావడాన్ని చూస్తున్నాం” అని లాస్ ఏంజెలిస్‌కు చెందిన బొమ్మల కంపెనీ యజమాని బీబీసీతో చెప్పారు.
అమెరికన్ వినియోగదారులు సుంకాల పెంపు వల్ల ఏర్పడిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్ స్వయంగా అంగీకరించారు.
“అమెరికన్ పిల్లల దగ్గర 30 బొమ్మలకు బదులుగా రెండు బొమ్మలే ఉండవచ్చు. ఆ రెండు బొమ్మల ధర సాధారణంగా ఉండే ధర కంటే రెండు డాలర్లు ఎక్కువ కావొచ్చు” అని ఆయన ఈ నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో చెప్పారు.
మాంద్యం రావొచ్చనే ఆందోళనలు, పెరుగుతున్న ధరల కారణంగా ట్రంప్ రేటింగ్ పడిపోయింది. ఆయన సుంకాల మీద మరీ ఎక్కువగా దృష్టి పెడుతున్నారని 60 శాతం మంది ప్రజలు భావించారు.
“రెండు దేశాలు మార్కెట్లలో పెరుగుతున్న ఆందోళనలను తగ్గించేందుకు, వ్యాపారాలకు, స్థానిక ప్రజలకు కొంత భరోసా ఇవ్వాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి” అని ఓల్సాన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)