SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ భారత్. అయినా భారతదేశం తన వారసత్వాన్ని కొనసాగిస్తూ రక్షణాత్మకంగా వ్యవహరించడం, అంతర్గత వాణిజ్య విధానాలపై దృష్టిపెట్టడమనేవి ప్రపంచంతో పోటీపడే తత్వాన్ని అడ్డుకున్నాయి.
భారత్ సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ ఎగుమతుల్లో వాటా రెండు శాతం కన్నా తక్కువ ఉంది.
భారత్‌కు ఉన్న విశాలమైన దేశీయమార్కెట్ వృద్ధికి ఇంధనంగా నిలుస్తోంది. ఇది అనేక ఇతర దేశాలను అధిగమించడానికి కారణమైందని ఆర్థిక వేత్తల వాదన. అయితే మిగిలిన ప్రపంచమంతా మందగమనంతో సాగుతోంది.
అల్లకల్లోలంగా కనిపిస్తూ , రక్షణవాదం పెరుగుతున్న యుగంలో, భారత స్వావలంబన విధానం స్వల్పకాలిక రక్షణ కవచంగా పనిచేయవచ్చు.
వాణిజ్య విధానాల్లో అమెరికా మార్పులకు ప్రతిస్పందనగా వ్యూహాలు రచించడానికి అనేక దేశాలు ఇబ్బందిపడుతుండగా…సుంకాల అమలుకు డోనల్డ్ ట్రంప్ 90రోజుల పాటు విరామమిస్తున్నట్టు ప్రకటించారు. అనేక వారాలపాటు సాగిన బెదిరింపుల తర్వాత ఈ విరామ ప్రకటన వెలువడింది.
అయితే వాణిజ్యంపై ప్రధానంగా ఆధారపడే దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి భిన్నం కావడంతో ఈ మార్పుల వల్ల వచ్చిన సమస్యలను సులభంగా తట్టుకుంది.

సొంత మార్కెట్టే భారత్ బలం
“అంతర్జాతీయ వస్తువుల వాణిజ్య పరిధిలో భారత్ పాత్ర తక్కువగా ఉండడం మనకు కలిసొచ్చే అంశం. సుంకాల ఒత్తిడితో ఎగుమతులపై ఆధారపడిన దేశాలు మందగిస్తే, మనం 6 శాతం వృద్ధితో ముందుకు సాగితే… మనది బలమైన ఆర్థికవ్యవస్థలా కనిపించడం మొదలవుతుంది. ముఖ్యంగా భారీ ఎత్తున ఉండే దేశీయ మార్కెట్ మనకు అండగా ఉంది” అని ముంబయిలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసర్చ్‌లో ఆర్థిక శాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ రాజేశ్వరి సేన్ గుప్త చెప్పారు.
”అంతర్జాతీయ వాణిజ్యంలో చురుకుగా లేకపోవడం మనకు లాభించింది. కానీ మనం అతి నమ్మకంతో ఉండకూడదు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ చురుకుగా ఉండక తప్పదు. క్రమానుగతంగా, వ్యూహాత్మకంగా వాణిజ్యాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి” అని ఆమె చెప్పారు.
వాణిజ్యపరమైన అడ్డంకులు, సుంకాలతో భారత్‌కు ఉన్న సుదీర్ఘ, సంక్లిష్ట సంబంధాల దృష్ట్యా గమనిస్తే… అది అంత తేలిక కాదన్న విషయం అర్ధమవుతుంది.

ఫొటో సోర్స్, AFP
స్వయం సమృద్ధిపైనే దృష్టి
వాణిజ్యం విషయంలో భారత్ అనుసరించిన సంక్లిష్టమైన, వైరుధ్యమైన విధానాల పరిణామాన్ని ”ఇండియాస్ ట్రేడ్ పాలసీ: ది నైంటీ నైంటీస్ అండ్ బియాండ్’ పుస్తకంలో కొలంబియా యూనివర్సిటీ ఆర్థికవేత్త, ప్రసిద్ధ వాణిజ్యరంగ నిపుణులు అరవింద్ పనగరియా వివరించారు.
అంతర్యుద్ధం సంవత్సరాలలో వస్త్రాలు, ఇనుము, ఉక్కు వంటి పరిశ్రమలు గట్టి రక్షణ కోసం ఒత్తిడి చేశాయి, అది వాళ్లకు లభించింది కూడా.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వస్తువుల కొరత ఎక్కువ కావడంతో, దిగుమతులపై మరింత కఠిన నియంత్రణలు వచ్చాయి. వీటిని సంక్లిష్టమైన లైసెన్సింగ్ విధానం ద్వారా అమలు చేశారు.
1960లలో తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి ఆసియా దేశాలు ఎగుమతులపై దృష్టి పెట్టి, సంవత్సరానికి 8-10% వృద్ధి రేట్లను సాధించాయి.
కానీ భారత్ మాత్రం దిగుమతులను తగ్గించి, స్వయం సమృద్ధిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. దీని వల్ల, జీడీపీలో దిగుమతుల వాటా 1957-58లో 10శాతం నుంచి 1969-70 నాటికి కేవలం 4 శాతానికి పడిపోయింది.
1960ల మధ్య నాటికి, వినియోగ వస్తువుల దిగుమతులను భారత్ పూర్తిగా నిషేధించింది. దీనివల్ల దేశీయ ఉత్పత్తిదారులపై నాణ్యతను మెరుగుపరచాలనే ఒత్తిడి తగ్గిపోవడమే కాదు… ప్రపంచ స్థాయి ఉత్పత్తి… సాంకేతికతతో వారికి సంబంధం లేకుండా పోయింది.
దీని వల్ల భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడే స్థాయిని కోల్పోయాయి. ఎగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడింది. దిగుమతులపై మరింత కఠిన నియంత్రణలు వచ్చాయి. ఇది వృద్ధిని అడ్డుకునే ఒక విషవలయాన్ని సృష్టించింది. 1951 నుంచి 1981 వరకు, తలసరి ఆదాయం సంవత్సరానికి కేవలం అతితక్కువగా1.5శాతం మాత్రమే పెరిగింది.

ఫొటో సోర్స్, Reuters
సంస్కరణలతో మలుపు
1991లో పరిస్థితులు మారాయి. విదేశీ మారక ద్రవ్యం సంక్షోభం ఎదురైనప్పుడు, భారత్ చాలా దిగుమతి నియంత్రణలను తొలగించింది. రూపాయి విలువను తగ్గించింది. ఈ చర్య ఎగుమతిదారులకు, దిగుమతులతో పోటీపడే దేశీయ ఉత్పత్తిదారులకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.
వినియోగ వస్తువులపై దిగుమతి లైసెన్సింగ్ ముగిసింది 2001లోనే. అది కూడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) దానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తర్వాతే.
ఈ మార్పు అద్భుత ఫలితాలనిచ్చింది. 2002-03 నుంచి 2011-12 మధ్య, భారత వస్తువులు, సేవల ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయి. అంటే 75 బిలియన్ డాలర్ల నుంచి 400 బిలియన్ డాలర్లకు పైగా చేరాయి.
వాణిజ్య స్వేచ్ఛ, ఇతర సంస్కరణలతో.. 21వ శతాబ్దం మొదటి 17 సంవత్సరాల్లో భారత తలసరి ఆదాయం, 20వ శతాబ్దం మొత్తంలో కంటే ఎక్కువగా పెరిగిందని ప్రొఫెసర్ పనగరియా చెప్పారు.
కానీ వాణిజ్య స్వేచ్ఛకు అడ్డంకులు తొలగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
‘కొత్తరకం వలస వాదంగా భావిస్తున్నాయి’
భారత్‌లోవాణిజ్య సరళీకరణకు రెండుసార్లు ఆటంకం ఏర్పడింది 1996-97లో ఒకసారి, మళ్లీ 2018 నుంచి మరోసారి- బాగా పోటీతత్వం ఉన్న దేశాల నుంచి దిగుమతులను అడ్డుకోవడానికి యాంటీ-డంపింగ్ చర్యలను విస్తృతంగా ఉపయోగించారని ప్రొఫెసర్ పనగరియా చెప్పారు.
“వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్ వంటి చాలా దేశాలు, అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపారాలను కొత్త రకం వలసవాదంగా భావిస్తాయి. దురదృష్టవశాత్తూ, కొందరు విధాన రూపకర్తల్లో ఈ ఆలోచన ఇంకా ఉంది . ఇది నిజంగా సిగ్గుచేటు” అని కెనడాలోని కార్లెటన్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ వివేక్ దేహేజియా అన్నారు.
దాదాపు పదేళ్ల రక్షణవాద విధానాలు ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని బలహీనపరిచాయి. ఈ కార్యక్రమం మూలధనం, సాంకేతికతపై ఆధారపడిన రంగాలపై దృష్టి పెట్టింది, కానీ కార్మికులపై ఆధారపడే వస్త్రాల పరిశ్రమ వంటివాటిని పక్కనపెట్టింది. దీని వల్ల తయారీ రంగంలోనూ, ఎగుమతులలోనూ పెద్దగా ఫలితాలు రాలేదని చాలా మంది ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రక్షణవాద వాణిజ్యంతో లాభపడ్డ కొన్ని కంపెనీలు
“విదేశీయులు వాళ్ల వస్తువులను మనకు అమ్మలేకపోతే, మన దగ్గర కొనుక్కునే వస్తువులకు చెల్లించాల్సిన డబ్బు వాళ్ల దగ్గర ఉండదు. మనం వాళ్ల వస్తువులను తగ్గిస్తే, వాళ్లు కూడా మన వస్తువులను తగ్గించాల్సి వస్తుంది” అని ప్రొఫెసర్ పనగరియా రాశారు.
‘సుంకాల వల్ల భారతదేశంలోని చాలా పరిశ్రమల్లో రక్షణవాదం ఏర్పడింది. ఇది స్థిరంగా ఉన్న కంపెనీలను సామర్థ్యం మేరకు పెట్టుబడులు పెట్టకుండా నిరుత్సాహపరిచింది. వాళ్లు క్రమంగా మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించేలా చేసింది,’ అని న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ విరల్ ఆచార్య చెప్పారు.
”అమెరికా తన వాణిజ్యంపై దృష్టిపెట్టడం, చైనా ఒత్తిడిలో ఉండడం వంటివాటి వల్ల యూరోపియన్ యూనియన్ దేశాలు నమ్మకమైన వాణిజ్య భాగస్వాముల కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి – అందులో భారతదేశం ఒకటి కావచ్చు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే, భారత్ సుంకాలను తగ్గించాలి, ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచాలి, అంతర్జాతీయ వాణిజ్యానికి తాము సిద్ధంగా ఉన్నామని సంకేతం ఇవ్వాలి” అని ఆర్థికవేత్తలు అంటున్నారు.
వస్త్రాలు, బొమ్మల వంటి రంగాలకు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇది సువర్ణావకాశం. కానీ పదేళ్ల పాటు నిలకడ లేని పరిస్థితుల తర్వాత కలుగుతున్న పెద్ద ప్రశ్న ఏంటంటే: ఈ పరిశ్రమలు పెద్ద ఎత్తున పని చేయగలవా? ప్రభుత్వం వాటికి మద్దతు ఇస్తుందా..? అని.
ట్రంప్ తన సుంకాల ప్రణాళికలను ఇప్పుడు ప్రకటించిన విరామం తర్వాత అమలు చేస్తే, ఈ ఏడాది అమెరికాకు భారత ఎగుమతులు 7.76 బిలియన్ డాలర్లు, అంటే 6.4% తగ్గవచ్చని దిల్లీలోని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. (2024లో భారత్ నుంచి అమెరికాకు 89 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతయయ్యాయి.)

ఫొటో సోర్స్, Getty Images
అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి
”ట్రంప్ సుంకాల వల్ల అమెరికాకు భారత్ వాణిజ్య ఎగుమతులపై స్వల్ప ప్రభావం పడవచ్చు” అని జీటీఆర్ఐకి చెందిన అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
అమెరికాతో సమతుల్య ఒప్పందం కుదిరిన తర్వాత, భారత్ తన వాణిజ్యాన్ని విస్తరించాలని ఆయన నొక్కి చెప్పారు. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడాతో వేగంగా అమల్లోకి వచ్చే ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటివి ఉన్నాయని ఆయన అన్నారు.
దేశంలో నిజమైన మార్పు సంస్కరణలపై ఆధారపడి ఉంది. సుంకాలను సరళీకరించడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను మరింత సులభతరం చేయడం, వాణిజ్య విధానాలను మెరుగుపరచడం, నాణ్యత నియంత్రణను పారదర్శకంగా అమలు చేయడం వంటివి చేయాలి. ఇవి లేకుంటే, అంతర్జాతీయంగా అందివచ్చిన అవకాశాలను భారత్ కోల్పోయే ప్రమాదం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS