SOURCE :- BBC NEWS

చైనా

ఫొటో సోర్స్, Getty Images

చైనా చేపడుతున్న భారీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ భారత్, బంగ్లాదేశ్‌లోని లక్షలాది మందిని ప్రభావితం చేయనుంది.

చైనా ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా ప్రకారం. యార్లంగ్ సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై టిబెట్‌లో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా ఆమోదం తెలిపింది. టిబెట్‌లో ఈ నదిని యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా నదిపై డ్యామ్ నిర్మించనున్నారు. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా ‘త్రీ గోర్జెస్’ డ్యామ్ ఉంది. దీనిని సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో యాంగ్జీ నదిపై నిర్మించారు. దీని వార్షిక సామర్థ్యం 88 బిలియన్ కిలోవాట్- అవర్స్.

యార్లంగ్ సాంగ్పో నదిపై నిర్మించే ప్రాజెక్ట్ పర్యావరణంపై ప్రభావం చూపబోదని చైనా అంటోంది. అయితే ప్రాజెక్టు ప్రతికూల పరిణామాల గురించి మానవ హక్కుల సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షీ జిన్‌పింగ్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు నిర్మిస్తోంది?

చైనా 14వ పంచవర్ష ప్రణాళిక ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రాజెక్టు చర్చకు వచ్చింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2021లో టిబెట్‌లో తన పర్యటన సందర్భంగా మెగా డ్యామ్‌ నిర్మాణాన్ని ప్రస్తావించారు.

టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఆనకట్ట ఏటా 300 బిలియన్ కిలోవాట్-అవర్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది త్రీ గోర్జెస్ ఆనకట్ట సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ. దీనిని టిబెట్ పీఠభూమి తూర్పు అంచున నిర్మిస్తున్నారు.

చైనా కార్బన్ లక్ష్యాలు, ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని జిన్హువా తెలిపింది.

ఇది ఇంజనీరింగ్ సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని, టిబెట్‌లో ఉపాధిని సృష్టిస్తుందని ఆ కథనం పేర్కొంది. అయితే, ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. నిర్మాణం జరిగే కచ్చితమైన స్థలాన్ని కూడా పేర్కొనలేదు.

యార్లంగ్ సాంగ్పో నది దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 2 వేల మీటర్ల ఎత్తు నుంచి పారుతుంది. ఈ వాలు జలవిద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుంది, అయితే ఇది ఇంజనీరింగ్ సవాళ్లు ఎదుర్కోనుంది.

ఇప్పటివరకైతే నిర్మాణ వ్యయం గురించి అధికారిక సమాచారం లేదు. కానీ హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం పెట్టుబడి 1 ట్రిలియన్ యువాన్ అంటే రూ. 11.69 లక్షల కోట్లు దాటవచ్చు.

ఈ ప్రాజెక్ట్ కారణంగా ఎంతమంది నిరాశ్రయులవుతారు? పర్యావరణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలపై చైనా స్పష్టతనివ్వలేదు.

చైనాలోని హేచిలో ఒక ఆనకట్ట

ఫొటో సోర్స్, Getty Images

భారత్-బంగ్లాలపై ప్రభావం ఏంటి?

బ్రహ్మపుత్ర (యార్లంగ్ సాంగ్పో) నది టిబెట్‌లోని కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదం నుంచి ఉద్భవించి సుమారు 3 వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.

భారత్‌లో యార్లంగ్ సాంగ్పో నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తుంటారు. ఇది అస్సాం గుండా బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. అక్కడ దీనిని జమున అని పిలుస్తారు, అనంతరం గంగా నదిలో కలుస్తుంది.

బంగ్లాదేశ్‌లో 90 శాతానికి పైగా నీరు సరిహద్దు అవతలి నుంచే వస్తుంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నది మాత్రమే 70 శాతం నీటిని తెస్తుంది. దీన్నిబట్టి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌కు జీవనాడిగా చెప్పొచ్చు.

ఈ ప్రాజెక్టు కోసం టిబెట్‌లోని యార్లంగ్ సాంగ్పో నదీ ప్రవాహాన్ని మళ్లిస్తూ.. నామ్చా బార్వా పర్వత శ్రేణి చుట్టూ కనీసం 20 కి.మీ. పొడవునా నాలుగు సొరంగాలు తవ్వాల్సిన అవసరం ఉందని మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి. అందుకే, ఈ ఆనకట్ట భారత్, బంగ్లాదేశ్‌లకు ఆందోళనపరిచే ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు.

బెంగుళూరులోని తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌లో జియోస్పేషియల్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ వై. నిత్యానందం దీని గురించి వివరించారు.

”మెకాంగ్ నదిపై ఇంతకుముందు చైనా ఆనకట్టలు నిర్మించింది. దీంతో ఆనకట్ట దిగువన ఉన్న ప్రాంతాలను అధ్యయనం చేశాం. చైనా ఆనకట్టలో నీటిని సేకరించి సకాలంలో విడుదల చేయలేదని గ్రహించాం. దీంతో ఆనకట్టల వద్దే సగానికి పైగా బురద ఆగిపోయింది. ఈ బురద దిగువకు ఎలా ప్రవహించాలనే దానిపై ఏర్పాట్లు లేవు. కాబట్టి, భారత్-బంగ్లాదేశ్‌లో ఇలాగే జరుగుతుందనే భయం ఉంది” అని అన్నారు.

నీటి ప్రవాహం

ఫొటో సోర్స్, Getty Images

భూకంపాలు, వరదలు

భారత్, బంగ్లాదేశ్ దేశాల ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికే తీవ్రమైన వరద ముప్పులను ఎదుర్కొంటున్నాయి. ఇపుడు తలెత్తే వాతావరణ మార్పుల కారణంగా కొండచరియలు, భూకంపాలు, వరదలు మొదలైన మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తరచుగా భూకంపాలకు కూడా గురవుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టల నిర్మాణం పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి వినాశకరమైన ఘటనలకు దారి తీస్తుంది.

అయితే చైనా, భారత్, బంగ్లాదేశ్‌లు సహకరించుకుంటే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందవచ్చని చైనాలోని సింఘువా యూనివర్సిటీలోని హైడ్రాలిక్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు 2023లో నిర్వహించిన అధ్యయనంలో పేర్కొన్నారు.

ఆ అధ్యయనం ప్రకారం.. వరదల కోసం ఆనకట్టలను ఉపయోగించడం వల్ల భారతదేశంలో వరద ప్రభావిత ప్రాంతాలను 32.6 శాతం, బంగ్లాదేశ్‌లో 14.8 శాతం తగ్గించవచ్చు.

భారత్ ఏం చెప్పింది?

ఈ విషయంపై భారత్ అధికారికంగా స్పందించలేదు.

“టిబెట్‌లోని ఈ నదులపై ప్రాజెక్టుల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను చైనా నియంత్రించొచ్చు” అని ఆస్ట్రేలియాకు చెందిన థింక్ ట్యాంక్ లోవీ ఇనిస్టిట్యూట్ ప్రచురించిన 2020 రిపోర్టు పేర్కొంది.

2020లో చైనా ఈ ఆనకట్ట నిర్మాణం గురించి ప్రకటించినప్పుడు.. భారత ప్రభుత్వంలోని నీటి, విద్యుత్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా వార్తాసంస్థ రాయిటర్స్‌తో మాట్లాడారు. చైనీస్ ప్రాజెక్టుల దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో పెద్ద డ్యామ్‌ను నిర్మించడం అవసరమని మెహ్రా అభిప్రాయపడ్డారు.

ఆయన ప్రకారం.. చైనా తర్వాత భారత్ కూడా బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మిస్తే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి? బంగ్లాదేశ్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. భారీ ఆనకట్ట నిర్మాణం నివాస ప్రాంతాలను మాత్రమే కాకుండా అక్కడి అడవులు, అడవి జంతువులను కూడా ప్రభావితం చేస్తుంది. ఆనకట్ట నిర్మాణం బురద ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ జీవవైవిధ్యంపై ప్రభావం చూపుతుంది.

నీటిని కూడా ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని ప్రొఫెసర్ నిత్యానందం అభిప్రాయపడ్డారు.

” ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని స్వచ్ఛమైన ఇంధన వనరుగా ఉపయోగిస్తామని చైనా చెబుతోంది. అయితే చైనా నీటిని కూడా ఆయుధంగా ఉపయోగించుకోగలదు. ముఖ్యంగా భారత్, చైనా సరిహద్దులో వివాదాలు జరిగిన సందర్భంలో ఇలాంటివి ప్రభావం చూపవచ్చు” అని అన్నారు.

ఆనకట్టలను నిర్మించడం, పరిమిత నిల్వ సామర్థ్యం ద్వారా నీటి ప్రవాహాన్ని తగ్గించడం వలన దిగువ ప్రాంతాలలో నీరు, పూడిక కొరత ఏర్పడవచ్చు. నీటి అవసరాలను తీర్చడానికి, ప్రజలు మునుపటి కంటే భూగర్భజల వనరులపైనే ఎక్కువగా ఆధారపడతారు. నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా, భూమి మునిగిపోతుంది. భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారడం ప్రారంభిస్తాయి.

ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో ఫరక్కా బ్యారేజీ నిర్మాణం తర్వాత గంగా నదిలో గరిష్ట ప్రవాహం గణనీయంగా తగ్గింది. ప్రవాహం తగ్గుదల భారత్, బంగ్లాదేశ్‌లో సమస్యలకు దారితీసింది. వీటిలో చేప జాతుల నష్టం, పద్మ (గంగా నదిని బంగ్లాదేశ్‌లో పద్మ నది అని పిలుస్తారు) ఉపనదులు ఎండిపోవడం, భూగర్భజలాల లవణీయత వంటివి ఉన్నాయి. అయితే తాము కట్టిన డ్యామ్ నీటిని ఆపబోదని చైనా గతంలోనే చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS