SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Family handout
ఇంటి దగ్గర సొంతంగా చేసుకునే డీఎన్ఏ టెస్టింగ్ కిట్‌లో మొదటి ఫలితాలు చూసిన తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సుసాన్ అయోమయానికి గురయ్యారు.
ఇప్పుడు సుసాన్ 70ల్లో ఉన్నారు. తన తాత గురించి ఆమెకు పెద్దగా తెలియదు. ఏదన్నా అసాధారణమైన విషయం తెలుస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆమె ప్రైవేట్‌గా డీఎన్ఏ టెస్టు చేయించుకున్నారు.
‘నాకు ఐరిష్ వారసత్వం చాలా ఉందని తేలింది. నాకు తెలిసినంతవరకు ఇది కరెక్టు కాదు’ అని సుసాన్ చెప్పారు.
ఐరిష్ వారసత్వం గురించి తెలిసిన తర్వాత కూడా నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాని గురించి మర్చిపోయా. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఆపేశా. అంతకుమించీ ఇంకేమీ చేయలేదు.
అయితే, తన కుటుంబం గురించి తనకు తెలిసిన చరిత్రంతా తప్పని సుసాన్ గుర్తించడానికి మరో ఆరేళ్ల సమయం పట్టింది.
ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌లో ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి ? కొందరు తమ పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారనుందా?

ప్రసూతి వార్డులో ఏం జరిగింది?
సుసాన్ ఆమె అసలు పేరు కాదు.
1950ల్లో జరిగిన విషయం ఆమెకు తర్వాత తెలిసింది. రద్దీగా ఉండే ఎన్‌హెచ్ఎస్ మెటర్నటీ వార్డులో తాను, మరో శిశువు మార్పడినట్టు తెలుసుకున్నారు.
బీబీసీ వెలికితీసిన కేసుల్లో ఇది రెండోది. చౌకగా మారిన జన్యుపరీక్షలు, పూర్వీకుల గురించి తెలిపే వెబ్‌సైట్లతో ఇలాంటి కేసులు మరిన్ని వెల్లువలా వచ్చే అవకాశముందని లాయర్లు అభిప్రాయపడ్డారు.
భుజం వరకు పొడవున్న జుట్టుతో చురుగ్గా, సరదాగా ఉండే సుసాన్, దక్షిణ ఇంగ్లండ్‌లోని తన ఇంటి ముందు గదిలో కూర్చుని తన కథ చెప్పారు.
ఆమె పక్కనే కూర్చున్న ఆమె భర్త, ఎప్పుడేం జరిగిందేనేదానిపై కొన్ని విషయాలను ఆమెకు గుర్తుచేశారు.
దాదాపు పదేళ్ల కిందట ఆమెకు డీఎన్ఏ టెస్టు చేసిన జీనాలజీ కంపెనీ, ఆ వివరాలను ఫ్యామిలి ట్రీలో ఎంటర్ చేసింది. ఆమె దగ్గరివారు లేదా దూరపు బంధువులైన ఇతర యూజర్లు ఆమెను సంప్రదించే వీలు కల్పించింది.
ఆరేళ్ల తర్వాత ఆమెకు అనుకోకుండా ఓ మెసేజ్ వచ్చింది.
తన వివరాలు ఆమె సమాచారంతో సరిపోలయాని, దాని ప్రకారం తాను కచ్చితంగా ఆమెకు జన్యుపరంగా సోదరుణ్ణని ఆ కొత్త వ్యక్తి చెప్పారు.
”అది ఆందోళన కలిగించింది. ఎంతో భావోద్వేగం కూడా కలిగింది” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెంచుకున్న కుటుంబం దగ్గరకు సుసాన్ ఎలా చేరారు?
తనను రహస్యంగా పెంచుకుని ఉంటారని సుసాన్ మొదట భావించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ కొన్నేళ్ల కిందటే మరణించారు. దీంతో ఆమె ధైర్యం చేసి తన అన్నను ఈ విషయం గురించి అడిగారు.
అయితే ఈ మొత్తం వ్యవహారం మొత్తం పెద్ద స్కామ్ అయ్యుంటుందని ఆమె అన్న బదులిచ్చారు.
తన సోదరి, తన జీవితంలో ఎప్పుడూ ఓ భాగమని ఆయన భావిస్తారు. చెల్లికి సంబంధించి తల్లి గర్భంతో ఉన్నప్పటి విషయాలు ఆయనకు బాగా గుర్తున్నాయి.
అయినప్పటికీ సుసాన్‌కు అనుమానాలు తీరలేదు. తన అన్నకన్నా ఆమె కొంచెం ఎక్కువ పొడవుంటారు. అలాగే ఆమెకు బంగారు రంగు జుట్టు ఉంటుంది. కుటుంబంలో ఎవరికీ అలా లేదు.
సుసాన్ పెద్ద కూతురు తన తల్లి పుట్టినరోజున స్థానికంగా నమోదయిన జననాల సమాచారం సేకరించారు.
జాబితాలో ఉన్న పేర్లలో రెండో పేరు, అదే ఎన్‌హెచ్ఎస్ ఆస్పత్రిలో పుట్టిన శిశువుది. ఆ శిశువు ఇంటిపేరు, జీనాలజీ వెబ్‌సైట్ ద్వారా సుసాన్‌ను కాంటాక్ట్ అయిన వ్యక్తి ఇంటి పేరు ఒకటే.
ఇది యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఏడు దశాబ్దాల కిందట ఆ ప్రసూతి వార్డులో జరిగిన పొరపాటు లేదా గందరగోళం మాత్రమే దీనికి కారణం కావొచ్చు.
ఇటీవలి వరకు ఇలాంటి కేసులు బ్రిటన్‌లో పెద్దగా బయటకు రాలేదుగానీ, ఇతర దేశాలలో మాత్రం కొన్ని ఉదాహరణలున్నాయి.

ఫొటో సోర్స్, Family handout
అనుబంధాల్లో ఎలాంటి మార్పూ రాలేదన్న సుసాన్
ఎన్‌హెచ్ఎస్‌లో ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రామాణిక పద్ధతి…పుట్టిన వెంటనే శిశువుల చీలమండల చుట్టూ రెండు రిస్ట్‌బ్యాండ్‌లు తగిలించడం, ఆస్పత్రిలో ఉన్నంత కాలం తల్లి, బిడ్డను కలిపి ఉంచడం.
1950లలో శిశువుల సంరక్షణ చాలా భిన్నంగా ఉండేది. శిశువులను పెద్ద నర్సరీ గదులలో ఉంచేవారు. వారిని మంత్రసానులు చూసుకునేవారు.
”అప్పటికి వ్యవస్థ ఇంత అధునాతనంగా లేదు” అని సుసాన్ తరఫున వాదిస్తున్న లండన్ న్యాయ సంస్థ రస్సెల్ కూక్‌కు చెందిన జాసన్ టాంగ్ చెప్పారు.
”శిశువు పుట్టిన వెంటనే సిబ్బంది, కార్డు లేదా ట్యాగ్ అటాచ్ చేసుండకపోవచ్చు. లేదా ట్యాగ్ కింద పడిపోతే తిరిగి పెట్టే సమయంలో మరో శిశువుకో, ఇంకో ఉయ్యాలలోనో ఉంచి ఉండొచ్చు.” అని ఆయన తెలిపారు.
1940ల చివరి నుంచి యుద్ధానంతర జననాల పెరుగుదల బ్రిటన్‌లో కూడా కనిపించింది. దీంతో కొత్తగా ఏర్పడిన ఎన్‌హెచ్ఎస్‌లో ప్రసూతి వార్డుపై ఒత్తిడి బాగా పెరిగింది.
ఎన్‌హెచ్ఎస్ గురించి దశాబ్దాల పాటు సుసాన్‌కు ఏమీ తెలియదు.
ఆమె సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. పెళ్లిచేసుకున్నారు. ఆమె ఎన్‌హెచ్ఎస్‌లోనే ఉద్యోగం చేశారు.
తన తల్లిదండ్రులను చాలా ప్రేమానురాగాలు చూపించేవారిగా ఆమె గుర్తుంచుకున్నారు. తాము చేయగలిగినవన్నీ చేశారని, తనను చాలా ప్రోత్సహించారని ఆమె అన్నారు.
”ఒక విధంగా, వారు ఇక్కడ లేకపోవడం, దీన్ని చూడకపోవడం నాకు సంతోషం కలిగించింది” అని సుసాన్ చెప్పారు. ఒకవేళ పైనుంచి వారు నన్ను చూస్తుంటే..ఏం జరుగుతోందో వారు తెలుసుకోకూడదని నేను కోరుకుంటున్నా” అని అన్నారు.
ఇలాంటి హోమ్ డీఎన్ఏ టెస్టులు గతంలో అందుబాటులో ఉండుంటే ఆ నిజాన్ని తల్లిదండ్రులకు తాను చెప్పగలిగేదాన్నికాదని, అది చాలా భయంకరమైనదని ఆమె అన్నారు.
”వారికి సంబంధించి నా దృష్టిలో మార్పేమీరాదు..వాళ్లు ఇప్పటికీ నాకు అమ్మానాన్నలే” అని సుసాన్ అన్నారు.
అదే సమయంలో ఇప్పుడు ఎదురైన విషయాల వల్ల తన అన్నతో తన బంధం మరింత బలపడిందని ఆమె భావిస్తున్నారు.
”ఇది మమ్మల్ని మరింత దగ్గర చేసింది. ఇప్పుడు మేము తరచుగా కలుస్తున్నాం. ‘నా ప్రియమైన చెల్లి’ అని రాసిన కార్డులు నాకు వస్తున్నాయి. ”మా అన్నయ్య, ఆయన భార్య ఇద్దరూ చాలా అద్భుతమైన మనుషులు. వాళ్ల గొప్పతనం గురించి చెప్పాలంటే నా దగ్గర మాటలు లేవు.” అని సుసాన్ అన్నారు.
అదే సమయంలో ఒక బంధువు ప్రేమతో రాసిన లేఖ ఆమెకు గుర్తుంది. ”ఆందోళన వద్దు. నువ్వు ఇప్పటికీ కుటుంబంలో భాగమే” అని ఆ బంధువు ఆ లేఖలో రాశారని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కలిసి పెరగలేదు…భావోద్వేగ బంధం లేదు’
అయితే తన కొత్త రక్త సంబంధాల విషయంలో పరిస్థితి కష్టంగా ఉందని సుసాన్ అన్నారు.
తనను సంప్రదించిన వ్యక్తిని, అంటే జన్యుపరంగా తనకు సోదరుడయిన వ్యక్తిని ఆమె కలిశారు. తామిద్దరం ఒకేలా ఉన్నామని గుర్తు చేసుకుని ఆమె నవ్వారు.
”ఆయనకు విగ్గు పెట్టి, కాస్త మేకప్ వేస్తే, అచ్చంగా నేనెలా ఉంటానో అలానే ఉంటారు” అని ఆమె సరదాగా చెప్పారు.
ఆమె అసలు తల్లి ఫోటోలను, ఆమె కొడుకులను కూడా సుసాన్ చూశారు.
అయితే కుటుంబంలోని కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోవడం అంత సులభం కాదు.
”వారు నాకు పుట్టుకతో బంధువులని తెలుసు, కానీ నేను వారితో కలిసి పెరగలేదు. అందుకే అక్కడ అంత భావోద్వేగ బంధం లేదు. వాళ్లు తమ సోదరిగా భావించి దగ్గరయ్యారు. చాలా చక్కగా ప్రవర్తించారు. నేను వారిని అర్ధం చేసుకున్నాను.”అని ఆమె అన్నారు.
సుసాన్ అసలు తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల కిందట మరణించారు. తాను అచ్చం అసలు తల్లి పోలికలతోనే ఉన్నానని సుసాన్ చెప్పారు.
“ఆమె ఎలా ఉండేవారు, ఏం చేసేవారు వంటి విషయాలన్నీ తెలుసుకోవాలని నేను ఇప్పటికీ అనుకుంటున్నా. కానీ నేను ఎప్పటికీ తెలుసుకోలేను. నేను ఇందులో ఎమోషన్‌ను పక్కన పెట్టి లాజికల్‌గా ఆలోచిస్తే నేను పెరిగిన విధానమే నాకు బాగా నచ్చింది” అని సుసాన్ అన్నారు.
చారిత్రక పొరపాటు
ఇలాంటి కేసుల్లో పరిహారం పొందిన మొదటి వ్యక్తులలో సుసాన్ ఒకరు. అయితే ఈ కేసుల్లో ఎంత మొత్తం ఇస్తారనేది తెలియదు. ఈ చారిత్రక తప్పిదానికి పాల్పడినట్టు ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్ అంగీకరించి క్షమాపణలు చెప్పేముందు ఆమె రెండో డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సివచ్చింది.
పిల్లలు తారుమారయిన దశాబ్దాల కాలం నాటి మరో కేసును గత ఏడాది బీబీసీ రిపోర్టు చేసింది. ఒకరు డీఎన్ఏ టెస్టింగ్ కిట్‌ను క్రిస్మస్ కానుకగా ఇవ్వడంతో ఈ కేసు బయటకు వచ్చింది.
ఇదంతా డబ్బుల గురించి ఒప్పందం కాదని, ఎన్నో ఏళ్ల కిందట జరిగిన తప్పును గుర్తించడం గురించని సుసాన్ అభిప్రాయపడ్డారు.
“ఎప్పుడూ ఎవరో ఒకరిని నిందించాలని జనం అనుకుంటుంటారు. కానీ ఇది నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అందుకే నేను ఒక ముగింపు కోరుకున్నా.”అని సుసాన్ తెలిపారు.