SOURCE :- BBC NEWS
33 నిమిషాలు క్రితం
పనామా కాలువ ఫీజులను తగ్గించాలని లేదా దాని నియంత్రణను తమకు అప్పగించాలని అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డోనల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అమెరికా కార్గో షిప్‌లకు సెంట్రల్ అమెరికా దేశమైన పనామా ‘మితిమీరిన చార్జీలు’ వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు.
అరిజోనాలోని తన మద్దతుదారులతో ట్రంప్ మాట్లాడుతూ “పనామా వసూలు చేస్తున్న రుసుములు అన్యాయం. ఇది అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకున్నది, మేం దీన్ని ఆపేస్తాం” అని అన్నారు.
వచ్చే నెలలో ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టనున్నారు.
ఆదివారం ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ అనే కన్జర్వేటివ్ గ్రూప్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా పనామా కాలువ చార్జీల విషయాన్ని ప్రస్తావించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో స్పందించారు.
“పనామా కాలువలోని ప్రతి చదరపు మీటరు మాదే, దాని చుట్టుపక్కల ప్రాంతం కూడా మాదే. పనామా సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం విషయంలో ఎటువంటి రాజీ ఉండదు” అని జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు.
ఒక దేశంలోని కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకుంటానని అమెరికా నాయకుడు చెప్పడం చాలా అరుదు. అయితే, ట్రంప్ దానిని ఎలా చేస్తామనేది చెప్పలేదు.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్, తన హయాంలో విదేశాంగ విధానంపై ముందస్తు సూచనలు పంపుతున్నారు.
పనామా కాలువ ఎందుకంత కీలకం?
పనామా కాలువ గతంలో అమెరికాకు ‘కీలకమైన జాతీయ ఆస్తి’ అని డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
పనామా షిప్పింగ్ రేట్లను తగ్గించకపోతే, కాలువపై నియంత్రణను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు. అది కూడా మొత్తంగా, వెంటనే, ఎలాంటి ప్రశ్నలడగకుండా ఇచ్చేయాలని ట్రంప్ అన్నారు.
82 కిలోమీటర్ల పొడవైన పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది.
దీనిని 1900ల ప్రారంభంలో నిర్మించారు. 1977 వరకు కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. దీని తర్వాత పనామా, అమెరికాల సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. కానీ 1999లో కాలువపై పనామా దేశం పూర్తి నియంత్రణను పొందింది.
పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకెళ్లే కంటైనర్ షిప్‌లు అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలూ ఉంటాయి. మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాల విషయంలో వస్తున్న విమర్శలపై కూడా ట్రంప్ స్పందించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు, డ్రగ్స్ వస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు.
పనామా కాలువను 1914లో ప్రారంభించారు. అంటే కాలువ మొదలై 110 ఏళ్లు పూర్తయ్యాయి. పనామా కెనాల్‌ను సమర్థమైన ఇంజనీరింగ్ ఫలితంగా పిలుస్తుంటారు, ప్రపంచ వాణిజ్యంలో విప్లవాత్మక మార్పుగానూ పరిగణిస్తుంటారు.
పనామా నగరం ఆకాశ హర్మ్యాలకు ప్రసిద్ధి. దీనిని కొన్నిసార్లు ‘దుబయి ఆఫ్ లాటిన్ అమెరికా’ అని పిలుస్తారు. పనామా ప్రగతికి ఈ కాలువ ఇంజిన్‌లా మారింది.
కాలువను పనామా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దాని నిర్వహణ తీరుపై ప్రశంసలు అందుకుంది. పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జిస్తోంది.
అయితే, మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం ఐదు శాతం మాత్రమే పనామా కాలువ ద్వారా జరుగుతుంది.
కొత్త సూపర్ ట్యాంకులు ఈ కాలువ గుండా ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. కాలువను విస్తరించేందుకు పనామా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం మొదలైన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగిందని చెబుతున్నారు. ఈ కాలువ చైనాను అమెరికా తూర్పు తీరానికి కలుపుతుంది.
పనామా కాలువకు సవాళ్లు
పనామా కాలువకు సూయజ్ కాలువ సవాలు విసురుతోంది. ఎందుకంటే, సూయజ్ కాలువ కూడా విస్తరిస్తోంది. అంతేకాదు, నికరాగ్వా దేశం అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య కాలువను నిర్మిస్తోంది.
పనామా కాలువ ప్రాజెక్టును మొదట 15వ శతాబ్దంలో ప్రతిపాదించారు. 1881లో ఫ్రాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై పని చేయడం ప్రారంభించింది. అయితే ఆర్థిక నష్టాలు, వ్యాధులు, ప్రమాదాలలో పలువురు మరణించడం కారణంగా ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది.
అనంతరం 1904లో అమెరికా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపింది, పని ప్రారంభించింది. పనామా కాలువలో నౌకల ప్రయాణం 1914లో ప్రారంభమైంది.
పనామా కాలువకు అమెరికా నౌకలు ఎక్కువగా వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ ప్రకారం.. దాదాపు 75 శాతం సరకు రవాణా నౌకలు పనామా కాలువలోంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తాయి. ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు రూ. 23 లక్షల కోట్లు వాణిజ్యం జరుగుతుంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో పనామా కాలువలో నీరు తగ్గడం వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.
2017లో తైవాన్‌తో పనామా దౌత్య సంబంధాలను తెంచుకుంది. చైనాతో సంబంధాలను ఏర్పరచుకుంది. తైవాన్‌తో దౌత్య సంబంధాలున్న దేశాలతో చైనా దౌత్య సంబంధాలను కొనసాగించదు. ఎందుకంటే తైవాన్‌ను చైనా తనలో భాగంగా పరిగణిస్తోంది. చైనా భారీ పెట్టుబడుల కారణంగా పనామాకు ముఖ్యమైన మిత్రదేశంగా మారింది.
పనామా కాలువకు చెందిన రెండు ఓడరేవులను హాంకాంగ్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. పనామా కాలువ ఉన్నది చైనా కోసం కాదని డోనల్డ్ ట్రంప్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ కాలువ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ కాలువపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా నియంత్రణ లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)