SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విదేశీ వస్తువుల దిగుమతులపై కొత్త సుంకాలను ప్రకటించారు, కానీ ఆ జాబితాలో పేరు లేని ఏకైక అమెరికా వాణిజ్య భాగస్వామి రష్యా.
రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం లేకపోవడమే దీనికి కారణమని అమెరికా అధ్యక్షుడి కార్యాలయం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ చెప్పినట్లు అమెరికన్ వార్తాసంస్థ ఏఎక్స్ఐఓఎస్ తెలిపింది.
లెవిట్ మాటల ప్రకారం…క్యూబా, బెలారస్, ఉత్తర కొరియా పేర్లు కూడా సుంకాల జాబితాలో లేవు. అయితే, అమెరికాతో తక్కువగా వ్యాపారం చేసే సిరియా వంటి దేశాలను ఈ జాబితాలో చేర్చారు.


ఫొటో సోర్స్, Reuters
వాణిజ్యం లేదు.. సుంకం లేదు
సిరియా గత సంవత్సరం అమెరికాకు 11 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 94 కోట్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసిందని ఐక్యరాజ్యసమితి డేటా ఆధారంగా ‘ట్రేడింగ్ ఎకనామిక్స్’ రిపోర్టు చేసింది.
2022లో యుక్రెయిన్‌పై మాస్కో దాడి తర్వాత రష్యాపై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. అయితే, తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్ రష్యా పట్ల స్నేహపూర్వకంగా ఉంటున్నారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ట్రంప్ తన ప్రాధాన్యతగా తీసుకున్నారు. యుద్ధాన్ని ఆపడానికి చర్చలు కొనసాగుతున్నందున, ఇతర ప్రభుత్వ అధికారులతో సమావేశాల కోసం రష్యన్ ఉన్నత స్థాయి అధికారి ఈవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే, మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 50 శాతం సుంకం విధిస్తామని గత నెలలో డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
రష్యా మీడియా సంస్థలు కూడా ఇప్పటికే ఉన్న ఆంక్షల కారణంగా తమ దేశాన్ని విస్తృత సుంకాల జాబితాలో చేర్చలేదని తెలిపాయి.
“రష్యాపై సుంకాలేవీ విధించలేదు కానీ, ఇదేమీ ప్రత్యేకం కాదు. ఎందుకంటే మా దేశంపై ఇప్పటికే పాశ్చాత్య దేశాల ఆంక్షలు అమలులో ఉన్నాయి” అని రష్యా ప్రభుత్వ చానల్ రోసియా24 టీవీ తెలిపింది.
సుంకాల జాబితాలో రష్యా లేకపోవడంతో “పశ్చిమంలోని అనేక దేశాలు నిరాశ చెందాయి” అని చానల్ రోసియా 1 తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
రూ. 30 వేల కోట్ల బిజినెస్
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ప్రకటనను రష్యన్ మీడియా సంస్థలు ప్రత్యేకంగా ఉదహరించాయి. రష్యా, బెలారస్‌పై ఆంక్షలున్నాయని, ఆ దేశాలతో అమెరికా వ్యాపారం చేయడం లేదని ఫాక్స్ న్యూస్‌తో స్కాట్ చేసిన ప్రకటనే అది.
అయితే, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం ప్రకారం, 2024లో రష్యా నుంచి అమెరికా మూడున్నర బిలియన్ డాలర్ల విలువైన (భారత కరెన్సీలో దాదాపు రూ. 30 వేల కోట్లు) వస్తువులను దిగుమతి చేసుకుంది. ట్రేడింగ్ ఎకనామిక్స్, రష్యన్ మీడియా ప్రకారం, ఇందులో ప్రధానంగా ఎరువులు, అణు ఇంధనం, కొన్ని లోహాలు ఉన్నాయి.
కొన్ని రష్యన్ వార్తాసంస్థలు సుంకాలను ఎగతాళి చేశాయి. యూరప్‌లోని అమెరికా మిత్రదేశాలను ట్రంప్ బానిసలుగా చూశారని క్రెమ్లిన్ అనుకూల మీడియా ఎన్టీవీ పేర్కొంది.
జనావాసాలు లేని హర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు కూడా సుంకాల జాబితాలో ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జ్వెజ్డా టీవీతో సహా కొన్ని మీడియా సంస్థలు ప్రస్తావించాయి.
“కొన్ని పెంగ్విన్‌లు 10 శాతం సుంకం చెల్లించాల్సి రావొచ్చు” అని జ్వెజ్డా తెలిపింది. కాగా, యుక్రెయిన్ కూడా ఎగుమతులపై 10 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ ఏం చెప్పింది?
అమెరికా కొత్త సుంకాలు ఎక్కువగా చిన్న ఉత్పత్తిదారులపై ప్రభావం చూపుతాయని యుక్రెయిన్ ఉప ప్రధానమంత్రి యులియా స్విరిడెంకో అభిప్రాయపడ్డారు. “వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి యుక్రెయిన్ కృషి చేస్తోంది” అని ఆమె అన్నారు.
యులియా ప్రకారం, 2024 సంవత్సరంలో అమెరికాకు 874 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 7.4 వేల కోట్లు) విలువైన వస్తువులను యుక్రెయిన్ ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 3.4 బిలియన్ డాలర్ల (రూ. 29 వేల కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది.
“న్యాయమైన సుంకాలు ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తాయి” అని యులియా అన్నారు.
వాణిజ్యం కొద్దిగానే ఉన్నప్పటికీ, రష్యాపై యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా గణనీయమైన మద్దతును అందించింది. దీనికోసం అమెరికా 300-350 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అట్లాంటిక్ రిసాల్వ్ కోసం 182.8 బిలియన్ డాలర్లు కేటాయించినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మొత్తంతో యూరప్‌లో సైనిక శిక్షణ, అమెరికా రక్షణ సామగ్రిని తిరిగి నిల్వ చేయడం వంటివి ఉన్నాయి.
ఇపుడు, యుక్రెయిన్ ఖనిజాల కోసం అమెరికా ప్రయత్నిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)