SOURCE :- BBC NEWS

మృతుడు లక్ష్మీనారాయణ

హత్యకు గురైనది తమ కుటుంబ సభ్యుడే అని తెలిసినా మృతుడికి కర్మకాండలు ఎందుకు జరుపలేదు? అనే కోణంలో దర్యాప్తు చేసి పది నెలలుగా అంతుచిక్కని కేసును పోలీసులు పరిష్కరించారు.

ఈ కేసులో నిందితులను ఏప్రిల్ 2న (బుధవారం) అదుపులోకి తీసుకున్నట్లు జగిత్యాల జిల్లా పోలీసులు వెల్లడించారు.

గుర్తు తెలియని వ్యక్తి హత్యగా నమోదైన ఈ కేసును సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పది నెలల తర్వాత ఛేదించినట్లు తెలిపారు.

డీఎన్ఏ, పాలిగ్రాఫ్(లై డిటెక్టర్) టెస్ట్ రిపోర్ట్‌ల ఆధారంగా మృతుని కొడుకు, భార్యను హంతకులుగా తేల్చినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కేసు ఏంటి?

జగిత్యాల జిల్లా పోలీసులు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

‘‘జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ సమీపంలో 2024 జూన్ 14న ఓ గుర్తు తెలియని వ్యక్తి శరీరాన్ని సగం కాలిపోయిన స్థితిలో గ్రామస్థులు గుర్తించారు.

దీనిపై గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయడంతో బీర్పూర్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

మృతుడు పొరుగు గ్రామం నర్సింహులపల్లికి చెందిన అంకం లక్ష్మీనారాయణ (55) కావొచ్చనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.

శవాన్ని గుర్తించేందుకు లక్ష్మీనారాయణ కుమారుడు సాయి కుమార్ (20), భార్య అరుణలను పోలీసులు పిలిపించి విచారించగా తమ కుటుంబ సభ్యుడు కాదని వారు వెళ్లిపోయారు.

తర్వాత గ్రామస్థుల సహాయంతో పోలీసులే ఆ శవం అంత్యక్రియలను పూర్తిచేశారు.

స్థానికుల్లో చాలామంది కాలిపోయిన ఆ శవం లక్ష్మీనారాయణదే అని చెబుతుండటం, అతని భార్య, కొడుకు మాత్రం కాదని చెప్పడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు.

అయితే, తల్లీకొడుకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో బీర్పూర్ పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ సహాయం తీసుకున్నారు.

అప్పటికే మృతుని శరీరం నుంచి సేకరించిన తుంటి ఎముకతో హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిపిన డీఎన్ఏ పరీక్షలు మృతుని తల్లి డీఎన్ఏతో సరిపోలాయి.

ఇలా సుమారు రెండు నెలల తర్వాత గుర్తు తెలియని శవం లక్ష్మీనారాయణదే అని పోలీసులు నిర్ధరణకు వచ్చారు.

ఇదే విషయం మృతుని భార్య, కుమారుడికి తెలిపారు’’ అని జగిత్యాల జిల్లా పోలీసులు చెప్పారు.

జగిత్యాల పోలీస్ స్టేషన్

అంత్యక్రియలు చేయకపోవడంతో బలపడిన అనుమానం

అప్పటివరకు అనుమానాస్పద మృతిగా ఉన్న కేసును హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

టైలరింగ్ పనిచేసే లక్ష్మీనారాయణకు స్థానికంగా ఎలాంటి గొడవలు, శత్రుత్వాలు లేవని.. కానీ, కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని, తరచూ గొడవలయ్యేవని పోలీసుల విచారణలో తేలింది.

చనిపోయింది లక్ష్మీనారాయణే అని తెలిసినా తర్వాత అతని భార్య, కుమారుడిలో పెద్దగా స్పందన లేకపోవడంతో అనుమానం మరింత పెరిగిందని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన జగిత్యాల (రూరల్) ఇన్‌స్పెక్టర్ వై. కృష్ణారెడ్డి బీబీసీతో చెప్పారు.

లక్ష్మీనారాయణ కోసం వెతకడం కానీ, కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడం కానీ చేయకపోవడంతో ఇవ్వకపోవడంతో తమ అనుమానం మరింత పెరిగిందని పోలీసులు చెప్పారు.

“మృతుని భార్య, కుమారునిలో ఎలాంటి బాధ కనిపించలేదు. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాల్సిన కర్మకాండలు కూడా జరపలేదు. దీంతో హత్యలో భార్య, కుమారుడి హస్తం ఉండొచ్చని అనుమానించాం” అని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.

మృతుడి భార్య అరుణ, కుమారుడు సాయికుమార్‌లను విచారించగా తొలుత వారు నేరం అంగీకరించలేదని పోలీసులు చెప్పారు.

దీంతో పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్ ) టెస్టును నిర్వహించినట్లు తెలిపారు.

”లై డిటెక్టర్ టెస్టుకు అవసరమైన సాధారణ ప్రొసీజర్స్ అన్నీ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అరుణ, సాయికుమార్‌లకు పరీక్షలు నిర్వహించారు.

అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వారిద్దరిని అందుపులో తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం” అని విచారణ అధికారి కృష్ణారెడ్డి బీబీసీతో చెప్పారు.

నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

ఎలా హత్య చేశారు?

మృతుడు లక్ష్మీనారాయణకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పని కోసం సింగపూర్‌ వలస వెళ్లారు. బీర్పూర్‌లో చిన్నకొడుకు సాయికుమార్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు.

ఆయన తల్లి నర్సింహుల పల్లిలో వేరుగా ఉంటున్నారు.

హత్యకు దారితీసిన పరిస్థితులను ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి వివరించారు.

”హత్యకు వారం రోజుల ముందు ఇంట్లో గొడవ పెట్టుకునిపోయిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మళ్లీ గొడవపడ్డారు. అదే రోజు సాయంత్రం మద్యం తాగుదామని చిన్న కొడుకు సాయికుమార్ తండ్రిని రోళ్లవాగు ప్రాజెక్ట్ దగ్గరికి తీసుకెళ్లగా అక్కడ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో తండ్రి గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. ఇంటికి వచ్చి తల్లికి విషయం చెప్పాడు. ఘటనా స్థలానికి వెళ్లి తల్లీ, కొడుకులు శవాన్ని గడ్డితో కప్పి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విచారణలో ఈ విషయాన్ని వారిద్దరూ అంగీకరించారు” అని బీబీసీతో కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి కృష్ణారెడ్డి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)