SOURCE :- BBC NEWS

తమ్ముడి కోసం అక్క పోరాటం

ఫొటో సోర్స్, Getty Images

అక్క వయసు 91 ఏళ్లు. తమ్ముడి వయసు 88 ఏళ్లు. తమ్ముడి జీవితంలో సగానికి పైగా కాలం చేయని తప్పుకు కఠోరమైన, క్రూరమైన జైలుశిక్ష అనుభవించడంలో గడిచిపోయింది. ఆ తమ్ముడి కోసం న్యాయపోరాటం చేయడంలో అక్క జీవితంలో ఎక్కువభాగం గడిచిపోయింది. జపాన్ న్యాయవ్యవస్థపై తీవ్రవిమర్శలకు కారణమైన ఓ కేసు ఇది.

ఇవావో హకామటాను సెప్టెంబరులో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన మరణశిక్ష కేసులో ఇప్పటిదాకా శిక్ష అనుభవించిన ఆ వ్యక్తి కోర్టు తీర్పును అర్ధం చేసుకున్నట్టు కనిపించలేదు. నిర్దోషిగా కోర్టు చెప్పినవిషయం విని ఆనందించే స్థితిలో ఆయన లేరు.

‘‘నిర్దోషిగా బయటపడిన విషయం చెప్పాను. కానీ అతను మౌనంగా ఉన్నాడు” అని ఆ వ్యక్తి సోదరి, 91 ఏళ్ల హిడెకో హకామటా బీబీసీతో చెప్పారు.

” తను ఈ తీర్పు విషయాన్ని అర్ధం చేసుకున్నారో లేదో నేను చెప్పలేను” అని ఆమె అన్నారు.

నాలుగు హత్యల కేసులో తన సోదరుణ్ని దోషిగా ప్రకటిస్తూ 1968లో తీర్పు వచ్చినప్పటి నుంచి, కేసు పునర్విచారణ కోసం హిడెకో పోరాడుతున్నారు.

జపాన్‌లో సుదీర్ఘమైన న్యాయసంబంధిత కేసులో ఎట్టకేలకు ఆయన నిర్దోషిగా తేలారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ తీర్పు వచ్చింది. తీర్పు సమయానికి హకామటా వయసు 88 ఏళ్లు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇవావో, హిడెకో

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ న్యాయవ్యవస్థపై విమర్శలేంటి?

హకామటా కేసు ప్రత్యేకమైనది. జపాన్ న్యాయవ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న వ్యవస్థీకృత క్రూరత్వంపై ఈ కేసు అందరి దృష్టిపడేలా చేసింది. ఇక్కడ మరణశిక్ష పడ్డ ఖైదీలకు కొన్ని గంటల ముందు మాత్రమే తమను ఉరి తీస్తారని తెలుస్తుంది. ప్రతిరోజూ అదే చివరి రోజేమో అనుకుంటూ సంవత్సరాలు పాటు గడపాల్సివస్తుంది.

ఇలాంటి శిక్షా విధానం క్రూరమైనది, అమానవీయమైనదని మానవహక్కుల నిపుణులు ఎంతోకాలంగా ఖండిస్తున్నారు. దీనివల్ల ఖైదీలు తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

హకామటా కేసుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన జీవితకాలంలో సగం కన్నా ఎక్కువ భాగం, తాను చేయని నేరానికి, ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తూ ఏకాంత నిర్బంధంలో గడిపారు.

పునర్విచారణకు అనుమతి వచ్చిన తర్వాత 2014లో జైలు నుంచి విడుదలయిన ఆయన…తన సోదరి హిడెకో సంరక్షణలో ఉన్నారు.

మేం ఆయన అపార్ట్‌మెంట్‌కు వెళ్లేటప్పటికి రోజువారీ కార్యక్రమంలో భాగంగా వలంటీర్ గ్రూప్‌తో బయటకు వెళ్లారు. అపరిచితులు రావడంతో ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారని హిడెకో చెప్పారు. చాలా ఏళ్లుగా ఆయన తన ప్రపంచంలో ఒంటరిగా ఉన్నారని వివరించారు.

”బహుశా ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు” అని ఆమె అన్నారు. ”40 ఏళ్లకు పైగా ఒక చిన్న జైలు గదిలో మనల్ని బంధించి ఉంచితే ఇలాగే అవుతుంది” అని ఆమె అన్నారు.

‘‘తనను ఒక జంతువులా మార్చేశారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవావో హకామటా

ఫొటో సోర్స్, Getty Images

హకామటా కేసులో ఏం జరిగింది?

ఇవావో హకామటా మాజీ ప్రొఫెషనల్ బాక్సర్. తన యజమాని, ఆయన భార్య, యుక్తవయసులో ఉన్న వారి ఇద్దరు పిల్లల మృతదేహాలు బయటపడిన సమయానికి హకామటా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఆ నలుగురూ హత్యకు గురయ్యారు.

ఓ కుటుంబాన్ని హత్యచేసి, షిజువోకాలోని వారి ఇంటికి నిప్పుబెట్టి, 556 డాలర్లను హకామటా దొంగిలించారని అధికారులు ఆరోపించారు.

తన సోదరుణ్ని 1966లో అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చే సమయానికి తమకసలు ఏమీ తెలియదని హిడెకో చెప్పారు.

హకామటా ఇంట్లో, ఆయన ఇద్దరు అక్కల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు.

మొదట ఆయన తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించారు. రోజుకు 12 గంటలపాటు సాగిన విచారణ, దెబ్బలను తట్టుకోలేక నేరం చేసినట్టు బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చిందని తర్వాత ఆయన తెలిపారు.

అరెస్టయిన రెండేళ్ల తర్వాత, నాలుగు హత్యలు, ఇంటికి నిప్పుపెట్టిన కేసులో హకామటాను దోషిగా నిర్ధరించి మరణశిక్ష విధించారు. మరణశిక్ష గదికి తరలించిన తర్వాత సోదరుని ప్రవర్తనలో మార్పు వస్తున్నట్టు హిడెకో గుర్తించారు.

సోదరుణ్ని చూడడానికి జైలుకు వెళ్లిన సమయంలో ఓ సారి ఆమెకు ఈ విషయం బాగా అర్ధమయింది.

”నిన్న ఒక ఉరిశిక్ష అమలుచేశారు. నా తర్వాతి సెల్‌లో ఉన్న వ్యక్తిని ఉరితీశారు అని హకామటా చెప్పారు” అని హిడెకో గుర్తుచేసుకున్నారు. ”జాగ్రత్తగా ఉండాలని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆయన మానసిక ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మౌనిలా మారిపోయారు” అని ఆమె తెలిపారు.

హిడెకో హకామటా

ఫొటో సోర్స్, Getty Images

‘ఉరితీత గురించి ఏ క్షణంలోనైనా చెప్పొచ్చు’

జపాన్ మరణశిక్ష వల్ల జీవితాన్ని కోల్పోయింది హకామటా ఒక్కరే కాదు. ఇదే చివరి ఉదయమా అనుకుంటూ అక్కడి ఖైదీలు ప్రతిరోజూ నిద్రలేస్తారు.

‘‘ ఉదయం 8.00 నుంచి 8.30వరకు చాలా కీలకమైన సమయం. తమ ఉరితీత గురించి సాధారణంగా ఖైదీలకు ఆ సమయంలో సమాచారమందుతుంది” అని మెండా సాకే అనే వ్యక్తి తెలిపారు. ఆయన నిర్దోషిగా తేలడానికి ముందు మరణశిక్ష పడ్డ ఖైదీగా 34 ఏళ్లపాటు జైలు జీవితం గడిపారు. జైలు జీవితంపై రాసిన పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు మెండా సాకే.

”చాలా భయంకరమైన ఆలోచనలు వస్తాయి. ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే వారు మీ సెల్ ముందు ఆగిపోతారా లేదా అనేది మీకు తెలియదు. ఆ ఆందోళన ఎంత భయంకరంగా ఉంటుందో వివరించడం అసాధ్యం” అని ఆయన పుస్తకంలో రాశారు.

”తక్షణమే మరణం సంభవిస్తుందన్న విషయం ఎప్పుడు తెలుస్తుందో తెలియని రోజువారీ పరిస్థితి చాలా క్రూరమైనది, అమానవీయమైనది, అవమానకరమైనది” అని మరణశిక్ష పరిస్థితులపై 2009 ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రధాన రచయిత జేమ్స్ వెల్ష్ ఆవేదన వ్యక్తంచేశారు. ఖైదీలకు తీవ్రమైన మానసిక అనారోగ్యం తలెత్తే ప్రమాదముందని ఆ నివేదిక హెచ్చరించింది.

తమ్ముడి కోసం 56 ఏళ్లు పోరాడిన అక్క

ఫొటో సోర్స్, Getty Images

2014లో జైలు నుంచి విడుదల

ఏళ్లు గడిచేకొద్దీ తన సోదరుడి మానసిక ఆరోగ్యం అంతకంతకూ దెబ్బతినడాన్ని హిడెకో మాత్రమే గమనించగలిగారు.

”నేనెవరో తెలుసా అని ఓసారి ఆయన నన్నడిగారు. తెలుసు , నువ్వు ఇవావో హకామటా అన్నాను. కానీ ఆయన ఇంకోలా స్పందించారు. ఇంకో కొత్త వ్యక్తిని చూడడానికి నువ్విక్కడ ఉండాలి అని చెప్పి ఆయన తిరిగి తన సెల్‌లోకి వెళ్లిపోయారు” అని హిడెకో గుర్తుచేసుకున్నారు.

హకామటా ప్రతినిధిగా, లాయర్‌గా హిడెకో పని చేశారు. అయినా 2014 వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.

హకామటాకు వ్యతిరేకంగా ఉన్న కీలక ఆధారం ఆయన పనిచేసిన దగ్గర మిసో (ఆహారపదార్థం) ట్యాంక్‌లో రక్తపు మరకలున్న దుస్తులు దొరకడం.

హత్యలు జరిగిన 14 నెలల తర్వాత ఆ దుస్తులను గుర్తించారు. అవి హకామటాకు చెందిన దుస్తులని ప్రాసిక్యూషన్ వాదించింది. కానీ ఆ దుస్తుల్లో బయటపడ్డ డీఎన్‌ఏ నమూనాలు, హకామటా డీఎన్ఏతో సరిపోలలేదని, ఆయన న్యాయ బృందం ఏళ్లపాటు వాదించింది. కుట్రపూరితంగా ఆ ఆధారాలు సృష్టించారని ఆరోపించింది.

హకామటాను జైలు నుంచి విడుదల చేసేలా, విచారణను తిరిగి ప్రారంభించేలా 2014 నాటికి ఆ బృందం జడ్జిని ఒప్పించగలిగింది.

తర్వాత విచారణ ప్రారంభం కావడానికి చాలా కాలం పట్టింది. గత అక్టోబరులో పునర్విచారణ మొదలయింది. తన సోదరుని జీవితాన్ని రక్షించాలని అప్పుడు కోర్టులో హిడెకో విజ్ఞప్తిచేశారు.

హకామటా భవిష్యత్తు ఆ రక్తపు మరకలు ఎంత కాలం నాటివి అనేదానిపై ఆధారపడి ఉంది.

దుస్తులు స్వాధీనం చేసుకున్నప్పడు మరకలు ఎర్రగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. కానీ మిసో(ఆహార పదార్థం)లో ఏళ్లపాటు ఉంటే రక్తం నల్లగా మారుతుందని హకామటా తరఫు లాయర్ల బృందం వాదించింది.

ఈ వాదనతో జడ్జి కోషి కుని ఏకీభవించారు. ”ఘటన జరిగిన తర్వాత దర్యాప్తు బృందమే రక్తపు మరకలు పూసిన దుస్తులను మిసో టాంక్‌లో పెట్టింది” అని ప్రకటించారు.

ఇవావో హకామటా

ఫొటో సోర్స్, Getty Images

క్షమాపణలు కోరిన జడ్జి, పోలీసు అధికారి

దర్యాప్తు రికార్డుతో సహా ఇతర సాక్ష్యాలు నకిలీవని జడ్జి కుని తెలిపారు. హకామటాను నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పు విన్న వెంటనే హిడెకో ఏడ్చారు.

”ముద్దాయి దోషి కాదని న్యాయమూర్తి చెప్పగానే నాకు సంతోషం కలిగింది. నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. గంటపాటు నేను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాను” అని ఆమె తెలిపారు.

హకామటాకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు నకిలీవని కోర్టు ఇచ్చిన తీర్పు అనేక ప్రశ్నలను లేవెనెత్తింది.

జపాన్‌‌ నేర నిర్ధరణ రేటు 99శాతం. అయితే అక్కడి న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలున్నాయి.

జపాన్ హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అధ్యక్షుడు కానే డోయ్ అభిప్రాయం ప్రకారం అక్కడున్నది బంధీకృత న్యాయవ్యవస్థ. అంటే అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషిగా నిరూపించుకునే వరకు నేరస్తుడిగానే పరిగణిస్తారు. విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ పొందే చాన్స్‌లు తక్కువగా ఉంటాయి. పోలీసుల విచారణ సమయంలో లాయర్లను నియమించుకునే వెసులుబాటు ఇవ్వరు.

ఇలాంటి విధానాల వల్ల చాలా జీవితాలు, కుటుంబాలు నాశనమయ్యాయని, తప్పుడు తీర్పులు వెలువడ్డాయని 2023లో డోయ్ వ్యాఖ్యానించారు.

మనోవాలోని హవాయి యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ అయిన డేవిడ్ టి జాన్సన్ జపాన్‌లో క్రిమినల్ జస్టిస్‌పై పరిశోధన చేస్తున్నారు. గత 30 ఏళ్లగా ఆయన హకామటా కేసును ఫాలో అవుతున్నారు.

కీలకమైన సాక్ష్యాలను 2010వరకు వెల్లడించకపోవడం ఈ కేసు సుదీర్ఘంగా సాగడానికి ఓ కారణమని ఆయనన్నారు.

ఈ వైఫల్యం ”ఘోరమైనది, క్షమించరానిది” అని జాన్సన్ బీబీసీతో చెప్పారు. ”విచారణ పిటిషన్లను జడ్జిలు పదే పదే అనుమతించడంతో కేసు పక్కదారిపడుతూనే ఉంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

తన సోదరునితో బలవంతంగా నేరాన్ని అంగీకరింపచేయడం ఈ అన్యాయానికి కారణమని హిడెకో అన్నారు.

అయితే ఒక్కరి తప్పువల్ల ఇదంతా జరగదని, పోలీసులు, లాయర్లు, కోర్టులు, పార్లమెంట్ ఇలా అన్ని స్థాయిల్లో వైఫల్యాల వల్ల ఇలా జరిగిందని జాన్సన్ విశ్లేషించారు.

ఈ వరుసలో న్యాయమూర్తులు చివరివారన్నారు.

హకామటా నిర్దోషిగా తేలడమన్నది ఇక్కడి న్యాయవ్యవస్థ ప్రకారం అత్యంత అరుదైన విషయం.

హకామటాను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత పునర్విచారణ జరిపిన న్యాయమూర్తి హిడెకోకు క్షమాపణలు చెప్పారు. న్యాయం కోసం ఇంత కాలం ఎదురుచూడాల్సిరావడంపై విచారం వ్యక్తం చేశారు.

షిజువోకా పోలీసు చీఫ్ తీర్పు వచ్చిన కాసేపటి తర్వాత హిడెకో ఇంటికి వచ్చి, అక్కాతమ్ముళ్లిద్దరికీ శాల్యూట్ చేసి, క్షమాపణలు కోరారు.

”గత 58 ఏళ్లగా మేం మీకు మాటల్లో చెప్పలేనంత ఆందోళన, భారం కలిగించాం. మమ్మల్ని క్షమించండి” అని ఆయన అన్నారు.

పోలీసు అధికారికి హిడెకో ఊహించని సమాధానమిచ్చారు.

‘ఇదంతా మా తలరాత అనుకుంటాం. ఎవరినీ తప్పుబట్టలేం’ అని హిడెకో అన్నారు.

హకామటాకు జైల్లో మానసిక అనారోగ్యం

ఫొటో సోర్స్, Reuters

న్యాయపోరాటంలోనే గడిచిపోయిన జీవితం

దాదాపు 60 ఏళ్ల ఆందోళన, ఆవేదన తర్వాత హిడెకో తన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకున్నారు. గదులు ప్రకాశవంతంగా ఉండేలా అలంకరించారు. బంధువులు, మద్దతుదారులతో తాను, తన సోదరుడు హకామటా ఉన్న ఫోటోలను గదుల్లో పెట్టారు.

తన తమ్ముడు..పసిబిడ్డగా ఉన్న సమయం నాటి జ్ఞాపకాలను తలచుకుని హిడెకో ఆనందపడ్డారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఫ్యామిలో ఫోటోలను చూపిస్తూ అప్పటి విషయాలు గుర్తుచేసుకున్నారు.

ఆరుగురు పిల్లల్లో అందరికన్నా చిన్నవాడైన హకామటా ఎప్పుడూ ఆమె వెంటే ఉండేవారు.

”మా చిన్నప్పుడు మేమెప్పుడూ కలిసే ఉండేవాళ్లం. నా తమ్ముణ్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలని నాకు తెలుసు. అదే కొనసాగుతోంది” అని ఆమె చెప్పారు.

”హకామటా బాక్సింగ్ చాంపియన్ కావాలనుకున్నారు. అంతలో ఈ ఘటన జరిగింది” అని ఆమె వెల్లడించారు.

91 ఏళ్ల హిడెకో జీవితంలో ఎక్కువ భాగం తమ్ముడి కోసం న్యాయపోరాటం చేయడంలో గడిచిపోయింది. ఇది తమ విధి అని ఆమె అంటున్నారు.

”గతం గురించి నేనాలోచించదల్చుకోలేదు. నేనెంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. హకామటో ప్రశాంతంగా జీవించాలని మాత్రం కోరుకుంటున్నా” అని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)