SOURCE :- BBC NEWS

రక్తహీనత, గుండె జబ్బులు, నవజాత శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

రక్తహీనత ఉన్న గర్భిణులకు జన్మించే పిల్లలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువని కొత్త అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనంలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు 16,500 మంది తల్లుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ కేటాయించిన నిధులతో ఈ అధ్యయనం జరిగింది.

గర్భం దాల్చిన మొదటి వంద రోజుల్లోనే తల్లికి రక్తహీనత ఉంటే శిశువు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం సాధారణం కంటే 47శాతం ఎక్కువగా ఉందని తేలింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ప్రతి ముగ్గురిలో ఒక గర్భిణికి రక్తహీనత

ఐరన్ లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని అంచనా.

యూకేలో దాదాపు నాలుగో వంతు గర్భిణులది ఇదే పరిస్థితి.

ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉంటే రక్తహీనత అంటారని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) తెలిపింది.

ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ తీవ్రమైన రక్తహీనత వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. శిశువు తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకముందే జన్మించడం వంటివాటికి ఇది దారితీస్తుందని అధ్యయనంలో తేలింది.

గర్భందాల్చిన మొదటి రోజుల్లో రక్తహీనత ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చాలా తక్కువ సమాచారమే అందుబాటులో ఉంది.

రక్తహీనత, గుండె జబ్బులు, నవజాత శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

ఐరన్ సప్లిమెంట్లతో చెక్?

“పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల ప్రమాదం అనేక కారణాల వల్ల పెరుగుతుందని మనకు ఇప్పటికే తెలుసు. ఈ అధ్యయనంలో తేలిన విషయాలతో రక్తహీనత ప్రభావాన్ని మరింత మెరుగ్గా అర్ధంచుకోవచ్చు. అందుకు అనుగుణంగా చికిత్స అందించవచ్చు” అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ డంకన్ స్పారో అన్నారు.

గర్భధాల్చిన తొలినాళ్లలో రక్తహీనత ఉండడం చాలా ప్రమాదకరమన్న విషయం తెలియడం చికిత్సపరంగా అతిపెద్ద మార్పుకు దారితీయొచ్చని స్పారో అన్నారు.

”చాలా మందిలో రక్తహీనతకు ప్రధాన కారణం ఐరన్ లోపం. పిల్లలను కనాలని అనుకుంటున్నప్పుడు, గర్భం దాల్చినప్పుడు మహిళలకు ఐరన్ సప్లమెంట్లు ఇవ్వడం వల్ల పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల బారిన పడకుండా నవజాత శిశువులను రక్షించడానికి అవకాశం ఏర్పడుతుంది” అని ఆయన చెప్పారు.

రక్తహీనత, గుండె జబ్బులు, నవజాత శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

శిశువుల్లో పెరుగుతున్న గుండె జబ్బుల కేసులు

నవజాత శిశువులకు గుండెజబ్బులు పుట్టుకతో వచ్చే లోపాలుగా ఉన్నాయి. యూకేలో రోజుకు సగటున 13మంది శిశువుల్లో గుండె సంబంధిత సమస్యలు గుర్తిస్తున్నారు. శిశువుల మరణాలకు ఇది ప్రధాన కారణం.

గర్భధారణ సమయంలో ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతకు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉన్నట్టు గతంలో ఎలుకలపై చేసిన పరిశోధనల్లో కనుగొన్నారు. ఇప్పుడు మనుషుల్లో దీనిన్ని నిర్ధరించే ప్రయత్నంలో ఉన్నారు.

భవిష్యత్తులో పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల కేసులను తగ్గించడానికి ఐరెన్ సప్లిమెంట్లను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)