SOURCE :- BBC NEWS

పహల్గాం దాడి, కశ్మీర్ పర్యటకం

కశ్మీర్‌ లోయలో ప్రసిద్ధ పర్యటక ప్రాంతమైన పహల్గాంలో జరిగిన తీవ్రవాదుల దాడిలో 26 మంది పర్యటకులు చనిపోవడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు పెరిగాయి.

దీంతో కశ్మీర్‌ నుంచి తిరుగు పయనమైన పర్యటకుల సంఖ్య పెరిగిపోయింది. పర్యటకులను శ్రీనగర్ విమానాశ్రయానికి చేర్చే టాక్సీలు బారులు తీరుతున్నాయి. హైవేలపై కూడా తిరుగు ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాల సంఖ్య పెరుగుతోంది.

‘‘మాకు భయంగా ఉంది. టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు” అని గౌతమ్ అనే టూరిస్ట్ బీబీసీతో చెప్పారు. కశ్మీర్‌లో పర్యటించేందుకు ఆయన బోలెడు ప్రణాళికలతో వచ్చారు. కానీ ఇప్పుడాయన ఇంటికి తిరిగి వెళ్లిపోయే హడావుడిలో ఉన్నారు.

కశ్మీర్‌ దశాబ్దాలుగా హింస‌కు కేంద్రంగా ఉన్నప్పటికీ, పర్యటకుల మీద దాడులు జరగడం చాలా అరుదు.

“ఇటీవలి సంవత్సరాలలో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల్లో ఇది చాలా పెద్దది” అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.

1947లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఈ రెండు దేశాలు ముస్లింలు మెజార్టీగా ఉన్న కశ్మీర్ కోసం రెండు యుద్ధాలు చేశాయి. 1980, 90లలో భారతదేశ పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో చెలరేగిన అసంతృప్తి తిరుగుబాటుకు దారి తీసింది. దీనికి పాకిస్తాన్ నిధులు అందిస్తోందని భారతదేశం ఆరోపిస్తోంది. ఈ సంఘర్షణలో వేల మంది చనిపోయారు.

అయితే ఇటీవలి సంవత్సరాలలో హింస తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.

“2004- 2014 మధ్య 7217 టెర్రరిస్ట్ సంఘటనలు జరిగాయని, అయితే 2014 నుంచి 2024 మధ్య వాటి సంఖ్య 2242కి తగ్గింది” అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
శ్రీనగర్ పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

సంప్రదాయంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద చోదకశక్తిగా ఉన్న పర్యటకం, ఇటీవల బాగా పుంజుకుంది.

2023లో కశ్మీర్‌ను 2 కోట్ల మంది పర్యటకులు సందర్శించారని భారత పర్యటక శాఖ తెలిపింది. కోవిడ్‌కు ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 20శాతం ఎక్కువ.

అయితే పహల్గాం దాడి తర్వాత ఈ పరిస్థితికి ముప్పులా కనిపిస్తోంది.

“అంతా అయిపోయింది. నాకు కన్నీళ్లు వస్తున్నాయి” అని పహల్గాంలో శాలువాలు అమ్ముకునే షకీల్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

“మా జీవితం అంతా పర్యటకుల మీద ఆధారపడి ఉంది. నేను బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఈ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నా వస్తువులను కొనుక్కోవడానికి ఎవరూ లేరు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“పాశవికమైన, క్రూరమైన దాడి. ఇది కశ్మీర్‌కు, ఈ ప్రాంత పర్యటక పరిశ్రమకు చెడ్డవార్త ” అని స్థానిక హోటల్ వ్యాపారి జావెద్ అహ్మద్ చెప్పారు.

అహ్మద్ హోటల్‌లో రూములు జూన్ వరకు బుక్ అయ్యాయి. అయితే ఇప్పుడీ సంఘటన కారణంగా పర్యటకులు రావడం ఆగిపోయినా, బుకింగ్స్ రద్దు చేసుకున్నా, తన వ్యాపారం దెబ్బ తింటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.

పహల్గాం దాడి, శ్రీనగర్ పర్యటకం

కశ్మీర్‌లో పర్యటక రంగానికి ఇది కీలకమైన సీజన్. వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించే స్వర్గధామంలా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తుంటారు. పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి కుటంబసమేతంగా ఇక్కడకు వస్తుంటారు.

అయితే ఈ సెలవుల సీజన్ భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కశ్మీర్ లోయ ఇప్పుడు భద్రతా చట్రంలో చిక్కుకుపోయింది.

ప్రస్తుతం శ్రీనగర్‌లోని పర్యటకులలో భయం ఏర్పడిందని, త్వరలో వెళ్లాలనుకుంటున్న వారిలో ఆగ్రహం, భయం ఉన్నాయని ముంబయి కేంద్రంగా గ్రూప్ టూర్స్‌ను నిర్వహించే అభిషేక్ హాలిడేస్ సంస్థ అధిపతి అభిషేక్ సంసారే బీబీసీతో చెప్పారు.

“బుకింగ్‌లను రద్దు చేయాలని అనేకమంది ఫోన్లు చేస్తున్నారు” అని ఆయన చెప్పారు.

ఈ దాడిని ప్రపంచ దేశాల నాయకులు ఖండించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షిస్తామని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ కశ్మీరీలు నిరసన ప్రదర్శనలు చేశారు.

శ్రీనగర్ పర్యటకం, పహల్గాం దాడి

దాడి చేసింది తామేనని ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా ప్రకటించలేదు.

పహల్గాం దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలను పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తిరస్కరించారు.

ఈ దాడులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినవని అభివర్ణించారు. పాకిస్తాన్‌ మీద నెపం నెట్టడం తేలిగ్గా మారిందన్నారు.

పహల్గాం లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటక రంగానికి ఊపు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2023లో జీ ట్వంటీ టూరిజం వర్క్‌షాప్ గ్రూప్ సమావేశానికి శ్రీనగర్ ఆతిథ్యమిచ్చింది. ఈ సమావేశానికి అనేక మంది విదేశీ అతిథులు హాజరయ్యారు.

ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత తొలిసారి 2024లో శ్రీనగర్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్థానికంగా వ్యవసాయ, పర్యటక రంగాల అభివృద్ధికి 6,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు.

“అభివృద్ధిలో జమ్మూ కశ్మీర్ కొత్త ఎత్తుల్ని తాకుతోంది. ఎందుకంటే అది ఇప్పుడు స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది” అని ప్రధాని మోదీ అన్నారు.

కశ్మీర్ పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టికల్ 370 తొలగించిన తొలినాళ్లలో, పరిస్థితులు ఇంకా చక్కబడకముందే పర్యటకుల సంఖ్య పెరుగుతోందని కొందరు ఆందోళన చెందారు.

“పర్యటకం అంటే సాధారణ స్థితి కాదు. ఇది ఆర్థిక కార్యకలాపాలకు సూచిక. సాధారణ స్థితి అంటే భయం లేకపోవడం. టెర్రరిజం లేకపోవడం, ఉగ్రవాదుల దాడులు తగ్గడం, ప్రజాస్వామిక పాలన వల్ల కశ్మీర్ ప్రస్తుతం సాధారణంగా ఉంది” అని ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2022లో అన్నారు.

2024లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.

పహల్గాం దాడి ఘటనపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. “టెర్రరిస్టుల దాడి తర్వాత పర్యటకులు కశ్మీర్ లోయ నుంచి వెళ్లిపోవడం చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది” అని ఆయన అందులో పేర్కొన్నారు.

శ్రీనగర్ పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

జమ్మూ కశ్మీర్‌లో ఎక్కువ మంది పర్యటకులు సందర్శించే హిల్ స్టేషన్ పహల్గాం.

పచ్చని పచ్చిక బయళ్లతో ప్రకృతి సౌందర్యంతో పర్యటకులకు మరపురాని అనుభూతిని పంచుతుంది. సినిమా నిర్మాతలకు చాలా ఇష్టమైన ప్రాంతం కూడా.

హింసాత్మక దాడులు చాలా తక్కువ. అలాంటిది మంగళవారం జరిగిన దాడి అనేక మందిని నిర్ఘాంత పోయేలా చేసింది.

“క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏంటో ఇప్పుడు దేశం మొత్తానికి తెలిశాయి” అని శ్రీనగర్‌లో కశ్మీర్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకత్వంలో నిరసన ప్రదర్శన చేసిన తర్వాత మెహబూబ్ హుస్సేన్ మీర్ చెప్పారు.

“ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడానికి ముందు, తొలగించిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఎప్పుడూ అశాంతి రాజ్యమేలుతుంది. దీని వల్ల స్థానికులే బాధ పడుతున్నారు. దీనికి ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి. లేకపోతే మా జీవితాలు ఊగిసలాడుతూనే ఉంటాయి” అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)