SOURCE :- BBC NEWS

తిరుపతి తొక్కిసలాట

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ గురువారం తిరుపతికి వచ్చారు.

తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనలో గాయపడి, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తిరుపతిలోని బైరాగిపట్టెడ పద్మావతి పార్కును పరిశీలించారు.

స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పవన్ ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు జగన్‌ను‌ లోపలికి అనుమతించలేదు.

జగన్‌ను అడ్డుకోవడంతో అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు కూడా నినాదాలు చేయడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒక దశలో, పవన్ వెళ్లే సమయంలో జగన్ ముందుకు రావడంతో ఆస్పత్రి ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది.

పోలీసులు ఇరువర్గాలను అదుపుచేశారు. అక్కడి నుంచి జనసేన కార్యకర్తలను పంపించేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆ తర్వాత జగన్ పరామర్శించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
చంద్రబాబు, తిరుపతి, తిరుమల

ఫొటో సోర్స్, i&pr

ఈ ఘటన బాధాకరం: చంద్రబాబు

తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగి పట్టెడలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రానికి పక్కన ఉన్న మునిసిపల్ పార్క్, స్కూల్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఒకేసారి అంతమందిని ఎలా వదులుతారని కలెక్టర్, ఎస్పీపై సీరియస్ అయ్యారు.

”తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతాం” అని చంద్రబాబు అన్నారు.

విధుల్లో అలసత్వం వహించిన డీఎస్పీ రమణకుమార్, ఎస్వీ గోశాల ఇన్‌చార్జి డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

జేఈవో ఎం.గౌతమి, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో శ్రీధర్‌లను బదిలీ చేసింది.

మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

ఈ ఘటనలో గాయపడిన 33 మందికి రూ.2 లక్షల చొప్పున పరిహారం, వారందరికీ వైకుంఠ ఏకాదశి రోజున (శుక్రవారం) శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వారందరినీ వారి ఇళ్లకు చేర్చే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని చంద్రబాబు ప్రకటించారు.

ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు.

పవన్ కల్యాణ్, తిరుమల, తిరుపతి

ఫొటో సోర్స్, i&pr

కఠిన చర్యలు తీసుకుంటాం: పవన్

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. బాధ్యతలు నిర్వర్తించడంలో టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని, అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తోందన్నారు.

బైరాగి పట్టెడ పద్మావతి పార్కులో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భక్తులను ఒకేసారి ఎందుకు వదిలారని అధికారులను ప్రశ్నించారు.

”టీటీడీలో ప్రక్షాళన జరగాల్సి ఉంది. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఇళ్లకు వెళ్లి టీటీడీ పాలకమండలి సభ్యులు క్షమాపణ చెప్పాలి. తిరుపతిలో తప్పు జరిగింది ప్రజలు క్షమించాలి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. టీటీడీ సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాలి. రద్దీని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది” అని పవన్ కల్యాణ్ అన్నారు.

వైఎస్ జగన్, తిరుమల, తిరుపతి

ఫొటో సోర్స్, YSRCP/fb

చంద్రబాబు సహా అందరూ బాధ్యులే: జగన్

స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం సాయంత్రం పరామర్శించి బయటికొచ్చిన తర్వాత వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మీడియాతో మాట్లాడారు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షల మంది వస్తారనా తెలిసినా టిక్కెట్ కౌంటర్ల దగ్గర టీటీడీ ఎందుకు సరిగ్గా భద్రతా ఏర్పాట్లు చేయలేదని జగన్ ప్రశ్నించారు.

”చంద్రబాబు సొంత జిల్లా ఇది. వైకుంఠ ఏకాదశి రోజు లక్షల మంది వస్తారని తెలుసు. అయినా ఆయన 6,7,8 తేదీల్లో పర్యటన పెట్టుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇక్కడ గాలికొదిలేయడం వల్లే ఈ ఘటన జరిగింది. ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. గాయాలతో 50, 60 మంది ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు. చనిపోయిన ప్రతి ఒక్కరి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. గాయాలపాలైన వారికి ఉచిత వైద్యం అందించడంతో పాటు 5 లక్షల పరిహారం ఇచ్చి పంపాలి” అని డిమాండ్ చేశారు.

”ఇందులో చంద్రబాబు, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అదనపు ఈవో, కలెక్టర్, ఎస్పీ అందరిపై బాధ్యత ఉంది. 194 బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు, బీఎన్ఎస్ 105 కింద కేసు నమోదు చేయాలి.” అని అన్నారు.

టీటీడీ లడ్డూ ప్రసాదం విషయంలో అబద్ధాన్ని సృష్టించి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్టపాలుజేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు, తిరుమల చరిత్రలో మరో బ్లాక్ మార్క్‌గా నిలిచిపోయే ఘటనకు కారణమయ్యారని, గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 29 మంది చనిపోయారని జగన్ విమర్శించారు.

‘‘నా కాన్వాయ్ రాకుండా అడ్డుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషంట్లను కూడా ఇక్కడి నుంచి తరలించాలని చూశారు’’ అని జగన్ ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)