SOURCE :- BBC NEWS
తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో విదేశీ కరెన్సీని దొంగతనంగా తరలించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
పరకామణిలో పెద్ద జీయర్ మఠం తరఫున నగదు లెక్కింపులో పాల్గొన్న సి.వి.రవికుమార్‌పై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
కొన్నేళ్లుగా ఆయన దాదాపు రూ. 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని ఆరోపించిన భాను ప్రకాష్ రెడ్డి.. 2023లో రవికుమార్ ఈ దొంగతనంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని, తర్వాత లోక్ అదాలత్‌లో రాజీకి వచ్చారని కూడా చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తాజాగా 2023లో రవికుమార్ దొరికారని, తర్వాత రాజీకి వచ్చారని తెలిపే డాక్యుమెంట్లు కూడా బయట పెట్టడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.
తిరుమల పరకామణిలో విదేశీ నగదు కుంభకోణం జరిగిందని టీటీడీ పాలకమండలి సభ్యుడు డిసెంబర్ 24న సోమవారం బోర్డు మీటింగ్‌లో చెప్పి ఈఓ, చైర్మన్‌లకు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరిన ఆయన తర్వాత దానికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ జారీ చేసిన లేఖలను, వాటితోపాటూ 2023లో రవి కుమార్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను అందించారు.
అసలు ఏం జరిగింది ?
టీటీడీ విజిలెన్స్ జారీ చేసిన డాక్యుమెంట్లలో ఉన్న వివరాల ప్రకారం 2023లో పెద్దజియ్యంగార్ మఠంలో క్లర్కుగా పనిచేస్తున్న 54 ఏళ్ల సీవీ రవికుమార్ మఠం తరఫున పరకామణిలో అధికారిక ప్రతినిధిగా ఉండేవారు.
తిరుపతిలో నివసించే ఆయన 2023 ఏప్రిల్ 29న తిరుమలలో పరకామణి లెక్కింపు తర్వాత ఇంటికి వెళ్లడానికి ముందు తన లోదుస్తుల్లో దాచుకున్న అమెరికన్ డాలర్లలో ఉన్న 9 కరెన్సీ నోట్లతో టీటీడీ సెక్యూరిటీకి దొరికారు.
ఆ సమయంలో వంద డాలర్ల విలువ చేసే ఆ 9 అమెరికన్ కరెన్సీ నోట్ల విలువ భారత కరెన్సీలో రూ.72 వేలు అని టీటీడీ తమ డాక్యుమెంటులో చెప్పింది.
రవికుమార్‌ను ఆరోజు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్(ఏవీఎస్ఓ) సతీశ్ కుమార్, ఆయన టీమ్ రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు.
అనంతరం ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు ఐపీసీ 379, 381 సెక్షన్ల కింద తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
టీటీడీ విజిలెన్స్ తాము జారీ చేసిన పత్రాలతోపాటు, 2023 ఏప్రిల్‌లో పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి అప్పటి ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ విజిలెన్స్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీని కూడా భాను ప్రకాశ్ రెడ్డి విడుదల చేశారు.
ఫిర్యాదు కాపీలో… 2023 ఏప్రిల్ 29న పరకామణిలో డబ్బులు లెక్కిస్తున్న సమయంలో రవికుమార్ వింతగా ప్రవర్తించడాన్ని విజిలెన్స్ అధికారులు గమనించినట్లు పేర్కొన్నారు.
తర్వాత ఆయన బయటికి వస్తున్నప్పుడు వెంటనే ఆయన్ను తనిఖీ చేయగా పిరుదుల మధ్య విదేశీ కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు సతీశ్ కుమార్ చేసిన ఫిర్యాదులో ఉంది.
ఆ కట్టలో 100 డాలర్ల నోట్లు 9 ఉన్నాయని ఫిర్యాదులో రాశారు.
అనంతరం రవికుమార్ తన తప్పు అంగీకరించారని.. 30 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తాను అంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయలేదని, దీనిని తన మొదటి తప్పుగా భావించి క్షమించమని వేడుకున్నారని సతీష్ కుమార్ తన ఫిర్యాదులో చెప్పారు.
రవికుమార్ బయటకు తెస్తుండగా దొరికాయని చెప్తున్న 9 అమెరికన్ 100 డాలర్ల నోట్లపై ఉన్న నంబర్లను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరారు.
రాజీ ఎలా కుదిరింది?
ఈ కేసులో 2023 మే 30న రవికుమార్ మీద చార్జిషీటు వేశారు.
కానీ, ఈలోపే, అంటే అదే ఏడాది మే 19న తిరుపతి, చెన్నైలో తమకు చెందిన కోట్ల విలువ చేసే 7 స్థిరాస్తులను రవికుమార్, ఆయన భార్య టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ఒక లేఖ ఇచ్చారు.
తాము ఇష్టపూర్వకంగా ఇస్తున్న 7 ఆస్తుల వివరాలను అందులో ప్రస్తావించారు.
తర్వాత లోక్ అదాలత్‌లో ఫిర్యాదుదారు, నిందితుడు రాజీకి రావడంతో ఈ కేసును ముగించారని విజిలెన్స్ విభాగం తాజాగా జారీ చేసిన పత్రాల్లో తెలిపింది.
రవికుమార్, ఆయనపై ఫిర్యాదు చేసిన ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ ఇద్దరూ తాము రాజీ పడుతున్నట్లు కోర్టుకు తెలిపారు.
పెద్ద జీయర్ మఠం పరువు ప్రతిష్టలకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఈ కేసులో రాజీకి వచ్చినట్లు తెలిపారు.
రవి కుమార్ విదేశీ కరెన్సీ తరలిస్తుండగా పట్టుకున్న ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ ప్రస్తుతం శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఆయన్ను విజిలెన్స్ ప్రశ్నించగా ఆ సమయంలో పోలీసుల నుంచి వచ్చిన తీవ్ర వత్తిళ్ల వల్ల తాను రాజీకి రావాల్సి వచ్చిందని ఆయన చెప్పినట్లు విజిలెన్స్ తన డాక్యుమెంట్లలో పేర్కొంది.
సతీశ్ కుమార్ కష్టపడి పనిచేసే మంచి అధికారి అని కూడా అవే పత్రాల్లో విజిలెన్స్ తెలిపింది.
అయితే రవికుమార్, ఆయన భార్య టీటీడీకి 13 భవనాలను విరాళంగా ఇచ్చారని.. వాటిని టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ నిమిత్తం ఉపయోగించాలని అనుకుంటున్నట్లు టీటీడీ 2024 మే 10న ఒక నోటీస్ జారీ చేసింది.
ఇందులో రవికుమార్, ఆయన భార్యకు చెందిన తిరుపతిలోని పసుపర్తి పనోరమా అపార్టుమెంట్‌లోని 8 ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు, 5 డబుల్ బెడ్రూం ఫ్లాట్లను టీటీడీకి సమర్పించారని, వాటిని క్వార్టర్స్‌గా కోరుకునే టీటీడీ ఉద్యోగులు తమ అభ్యర్థనలు సమర్పించాలని కోరింది.
స్థిరాస్తులు చేతులు మారాయా?
పరకామణి కుంభకోణంపై సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, పెద్ద ఎత్తున నగదు చేతులు మారడం వల్లే ఈ కేసును నీరుగార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.
తిరుపతి-కరకంబాడి మార్గంలో రవికుమార్ కొనుగోలు చేసిన పనోరమ అపార్టుమెంట్ ఫ్లాట్లను డిసెంబర్ 25 బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ అంశంపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
”2023లో పరకామణి నుంచి విదేశీ డాలర్లు దొంగిలించి బయటకు వస్తున్న రవికుమార్‌ను టీటీడీ విజెన్స్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆ సమయంలో రూ.72 వేల విలువ చేసే డాలర్లు పట్టుబడ్డాయి. అయితే తర్వాత ఆయన కోట్లు విలువ చేసే 14 ఫ్లాట్లు టీటీడీకి గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. చెన్నైలో స్థిరాస్థులు చేతులు మారాయి. చిన్నస్థాయి ఉద్యోగి అయిన రవికుమార్ ఇంత ఆస్తి ఎలా సంపాదించారు”అని అన్నారు.
”కానుకలను దొంగిలించిన కేసులో 409 సెక్షన్ పెట్టకుండా నామమాత్రపు సెక్షన్లు పెట్టారు. ఉన్నత స్థాయి విచారణ జరిగితే గతంలో అవినీతికి పాల్పడిన పాలకులు బయటికి వస్తారు. ఎవరి ఒత్తిళ్లతో ఈ కేసును నీరుగార్చారు. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతులు మారాయి. దీనిపై పూర్తి స్థాయిలో ధర్యాప్తు చేసి పరోక్షంగా సహకరించిన దోషులను పట్టుకోవాలి”అని భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
పరకామణి అంటే ఏంటి.?
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణికి శతాబ్దాల చరిత్ర ఉంది.
వందల ఏళ్లుగా శ్రీవారికి వస్తున్న నగదు, కానుకలను లెక్కించే కార్యక్రమాన్ని పరకామణి అని పిలుస్తున్నారు.
17వ శతాబ్దం కంటే ముందే పరకామణి..
భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు, నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు, వెండి కానుకలు కూడా వస్తుంటాయి.
17 శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లు శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతోంది.
శ్వేత వస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు హుండీగా పిలుస్తారు. హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు.
ఈ గంగాళాలను విజిలెన్స్, ఆలయ అధికారులు, బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు.
1965 వరకు బంగారు వాకిలి దగ్గరే లెక్కింపు..
కట్టుదిట్టమైన నిఘా నడుమ హుండీ లెక్కింపు సాగుతుంది.
చిల్లర నాణేలు, స్వదేశీ, విదేశీ నోట్లు, పురాతన నాణేలు, ఆభరణాలు, ముడుపులు, వస్తువులు, విలువైన పత్రాలు, కోర్కెల చిట్టాలు, శుభలేఖలు, విజిటింగ్ కార్డులు, కలకండ, బియ్యం, పసుపు… ఇలా రకరకాల కానుకలు హుండీకి చేరుతున్నాయి.
1965 వరకు హుండీ లెక్కింపు బంగారు వాకిలి వద్దే జరిగేది.
ఆ తర్వాత కానుకలు రావడం పెరగడంతో హుండీ లెక్కింపునకు ఆలయ ప్రాగణంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
12 నుంచి 14 గంగాళాల కానుకలు..
భక్తులు సమర్పించే కానుకలతో రోజూ 12 నుంచి 14 గంగాళాలు నిండుతాయి.
ఈ గంగాళాలను బంగారు వాకిలి వద్దకు తరలించి ఏకాంత సమయానికి స్ట్రాంగ్ రూమ్‌కు చేరుస్తారు.
పరకామణిలో సీసీ కెమెరాల నిఘా నేత్రాల నడుమ కట్టుదిట్టంగా హుండీ కానుకలను లెక్కిస్తారు.
నిబంధనల నడుమ విధుల నిర్వహణ
పరకామణి విధుల్లో ఉండే సిబ్బంది పలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
2012 ఆగస్టు 20న పరకామణి సేవను టీటీడీ ప్రారంభించింది.
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయినవారు పరకామణిలో స్వచ్ఛంద సేవలను అందించేందుకు టీటీడీ అవకాశం కల్పించింది.
పరకామణి సేవలో పాల్గోవాలనుకునే భక్తులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భక్తుల సంఖ్యతో పాటు కానుకలు కూడా వెల్లువలా వచ్చి పడుతుండడంతో పరకామణిలో లెక్కింపునకు ఇబ్బందిగా మారింది.
దీంతో 2022లో కొత్త భవనాన్ని నిర్మించి పరకామణిని అందులోకి తరలించారు.
పరకామణిలో దొంగతనం చేసాడని చెబుతున్న రవికుమార్ ను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది.
ఈ కేసు ముగిసినప్పటి నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరని స్థానికులు చెప్తున్నారు.
ఈ వ్యవహారంపై టీటీడీ ఈఓ శ్యామలరావుతో మాట్లాడేందుకు బీబీసీ అనేకసార్లు ప్రయత్నించింది.
ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్ చేస్తాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)