SOURCE :- BBC NEWS

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy/fb

రెండేళ్ల కిందట కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం’ అనే బ్యానర్‌తో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.

”ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే, అక్కడ ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది” అంటూ రేవంత్ రెడ్డి చెప్పడంతో ఒక్కసారిగా నినాదాలు మార్మోగాయి.

రేవంత్ రెడ్డి సహా మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ కవరేజీకి ఎల్బీ స్టేడియానికి నేను వెళ్లాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల రాకతో స్టేడియం నిండిపోయింది.

ఒకవైపు ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ప్రగతి భవన్ (ప్రస్తుతం ప్రజా భవన్) వద్ద రహదారిపై నిర్మించిన ఇనుప కంచెలను తొలగించారు.

సీఎం నివాసం బయట ప్రపంచానికి కనిపించడం చాలా ఏళ్ల తర్వాత అదే తొలిసారి.

”ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం, అహర్నిశలూ అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.

అయితే, ”ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోంది” అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీతో అన్నారు. మరోవైపు యూనివర్సిటీలలో రిక్రూట్‌మెంట్, మోడల్ స్కూళ్ల ఏర్పాటు.. ఇలా ప్రతి విషయంపై దృష్టిపెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని విద్యారంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ‘చేతి’కి బలం ఇచ్చిందేమిటి, ‘చేయి’ కాల్చుకున్న అంశాలేమిటి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
మహిళలకు ఉచిత బస్సు పథకం

ఫొటో సోర్స్, UGC

మహిళలకు ఉచిత బస్సు

‘గడీల కోటలు’ బద్దలు కొట్టి అధికారం చేపట్టామని చెప్పుకొన్న కాంగ్రెస్ పాలన మొదలయ్యాక ‘హిట్లు’ ఏమిటి? ‘ప్లాప్‌లు’ ఏమిటి? ఓసారి చూద్దాం.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రారంభించిన పథకమిది.

మహిళలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది రేవంత్ సర్కారు. రోజుకు సగటున 34.32 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది ఆగస్టు నాటికి మహిళలకు 200 కోట్ల జీరో టికెట్లు ఇష్యూ చేశామని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

‘ఆర్టీసీ జారీ చేసిన జీరో టికెట్ల ఆధారంగా 2025 డిసెంబరు 1 నాటికి రూ.8402 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయి’ అని ప్రభుత్వం ప్రకటించింది.

పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో వెనక సీట్ల వరకూ కూడా మహిళా ప్రయాణికులతో నిండిపోయి కనిపిస్తున్నాయి.

అయితే, ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సులు సరిపడాలేవని, ఆటోవాలాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వచ్చాయి.

మహిళా రైతు

ఫొటో సోర్స్, Getty Images

రైతులకు రుణమాఫీ

అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని 2022 మే 6న వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

2024 ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేపట్టింది. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

”ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో రాజీ పడకుండా తెలంగాణ రైతును రుణ విముక్తి చేశాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు.

రుణమాఫీ విడతల వారీగా చేయడం కారణంగా రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందలేదని బీఆర్ఎస్ ఆరోపించింది.

”రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి, అంతకంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు ఆ మేరకు కూడా చేయలేదు” అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

అయితే, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు.

”రూ.2లక్షల వరకు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశాం. అంతకంటే ఎక్కువగా ఉన్న రైతుల విషయంలో, ఎక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే మా హామీ మేరకు రూ.2లక్షలు ప్రభుత్వం తరఫున రుణమాఫీ చేశాం” అని చెప్పారు.

బతుకమ్మకుంట

హైడ్రా

ఈ రెండేళ్లలో అత్యంత వివాదాస్పదమైన అంశంగానీ, అత్యంత చర్చనీయాంశమైన అంశం గానీ ఏదైనా ఉందంటే.. అది హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ).

చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలను కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రాను తీసుకువచ్చామని ప్రభుత్వం చెప్పింది.

అమీన్‌పూర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో స్థానికుల ఇళ్లను కూల్చివేసింది హైడ్రా. దీంతో మొదట్లో హైడ్రా విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత కొంత మార్పు వచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీబీసీ వద్ద ప్రస్తావించారు.

”మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకున్నాం. అందుకే ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మమ్మల్ని ఆదరిస్తున్నారు” అని రంగనాథ్ బీబీసీతో చెప్పారు.

బతుకమ్మకుంట సహా ఆరు చెరువులను పునరుద్ధరించే పనులను హైడ్రా చేపట్టింది. చెరువుల పరిధిలో ఉన్న పెద్ద పెద్ద వాణిజ్య భవనాలు కూల్చివేసింది.

బతుకమ్మకుంటను పునరుద్ధరించి కొత్త రూపు తీసుకువచ్చింది.

ప్యాట్నీ, అమీర్‌పేట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వరద నీరు, నాలాల సమస్యకు పరిష్కారం చూపించింది.

హైడ్రా అంటే కూల్చివేతలే అనే అపవాదును పోగొట్టుకుంటూ, చెరువులు, నాలాలు, పార్కు స్థలాలు పరిరక్షిస్తోందంటూ ప్రజలు మద్దతుగా ర్యాలీలు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

బోడుప్పల్ ప్రాంతంలో నేను ఉండే కాలనీలో నీటి పారుదల శాఖ, మున్సిపల్ అధికారులు చెరువుకు వేరొకవైపు ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేశారు.

20-25 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లు కూడా ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్)లోకి వస్తాయంటూ అధికారులు పొరపాటున మార్కింగ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాలనీకి వచ్చి, ఎఫ్‌టీఎల్ సమస్యకు పరిష్కారం చూపించారు. 2014లో ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో ఇళ్లు లేవని, అలాంటప్పుడు కొత్తగా ఇళ్లకు మార్కింగ్ ఎలా వేస్తారంటూ వాటిని తొలగించారు.

”హైడ్రా అంటే భయం కాదు, అభయం” అని చెప్పడంతో, సమస్య పరిష్కారమైనందుకు మద్దతుగా ర్యాలీ చేసి అక్కడి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

ఔటర్ రింగు రోడ్డు వరకు హైడ్రా పరిధి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలోని మిగిలిన నగరాలు, పట్టణాలకు హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురావాలనే డిమాండ్ తెలంగాణలో వినిపిస్తోంది.

”హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు రూ.50 వేల కోట్ల విలువైన 923.14 ఎక‌రాల ప్రభుత్వ భూమిని కాపాడాం” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.

సన్నబియ్యం

ఫొటో సోర్స్, Getty Images

సన్న బియ్యం

రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం అందిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

”బహిరంగ మార్కెట్లో కిలో రూ.50 పలుకుతున్న సన్న బియ్యాన్ని రేషన్ కార్డులోని ఒక్కొక్క సభ్యుడికి ఆరు కిలోల చొప్పున ఇస్తున్నాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు భట్టి.

దేశంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయిందని బీబీసీతో చెప్పారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

”రుణమాఫీ మా ఘనత. ఇతర అన్ని పథకాలు ఏదో ఒక రాష్ట్రంలో అమలులో ఉన్నాయి. కానీ, సన్నబియ్యం పేదలకు ఇవ్వడం మా ప్రత్యేకత” అని వివరించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలు

ఫొటో సోర్స్, facebook/naveenyadav

రాజకీయ విజయాలు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యం కనబరుస్తూ వచ్చింది.

బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కొంటూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మీడియాను పిలిచి మాట్లాడారు. ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నాను.

”ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తున్నారు?” అని అడిగాం.

”10-12 చోట్ల గెలుస్తున్నాం” అంటూ బలంగా చెప్పారు రేవంత్ రెడ్డి.

అప్పటివరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. ఎనిమిది చోట్ల కాంగ్రెస్ గెలిస్తే, మరో ఎనిమిది చోట్ల బీజేపీ గెలిచింది. ఒక స్థానం ఎంఐఎం దక్కించుకుంది.

అదే సమయంలో జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌దే విజయం. ఈ మధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పాలనకు రెఫరెండంగా ప్రచారం చేస్తూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తలపడ్డాయి.

వరుసగా కాంగ్రెస్ పార్టీ మరో ఉప ఎన్నికలోనూ గెలిచి అసెంబ్లీలో తన బలాన్ని 66కు పెంచుకుంది.

బీఆర్ఎస్ హయాంలో హుజురాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు వంటి ఉపఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితి నుంచి, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ మారింది.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నది వాస్తవమని సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్ అన్నారు.

”బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ప్రజలు చూశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది కానీ, అది వ్యతిరేకతగా మారలేదు” అని అభిప్రాయపడ్డారు.

రేవంత్ రెడ్డి

కొన్ని వెనకడుగులూ…

కాంగ్రెస్ పాలనలో ముందడుగులే కాదు, కొన్ని వెనకడుగులూ వేయాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హెచ్‌సీయూ భూములు

ఫొటో సోర్స్, X/sravandasoju

హెచ్‌సీయూ భూముల వివాదం

ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిలిన ఎదురుదెబ్బ ఇది. హెచ్‌సీయూ వద్ద సుమారు 400 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా వేలం వేసి, అక్కడ ఐటీ పార్కు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2025 మార్చిలో భూముల వేలం నిలిపివేయాలంటూ, ఆ భూములు హెచ్‌సీయూకే చెందుతాయంటూ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

వేలం విషయంలో ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గక తప్పలేదు.

ఒక్కసారిగా పదుల సంఖ్యలో పొక్లెయిన్లతో చెట్లు తొలగించడంతో ఈ అంశం జాతీయ స్థాయిలోనూ వివాదాస్పదమైంది.

చెట్ల నరికివేత సమయంలో నెమళ్ల అరుపులు, పారిపోతున్నట్లుగా వీడియోలు బయటకు రావడం పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. అవి ఏఐ జనరేటెడ్ వీడియోలుగా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ వీడియోలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

మార్చి 31న ఆందోళనను కవర్ చేయడంలో భాగంగా హెచ్‌సీయూలో పనులు చేపట్టిన ప్రదేశానికి నేను వెళ్లాను. అక్కడ చెట్లను భారీగా నరికివేశారు. వాటిలో కొన్ని పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. పెద్దసంఖ్యలో పొక్లెయిన్లు కూడా కనిపించాయి.

అనంతరం భూముల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. చెట్ల నరికివేత నిలిపివేయాలని, తిరిగి అక్కడ పచ్చదనం పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.

వివాదం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. కానీ, భూముల వివాదం ఇంకా సమసిపోలేదు.

ఆరు గ్యారెంటీలు

ఫొటో సోర్స్, TelanganaCongress

అమలుకాని ఆరు గ్యారెంటీలు

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్ర్తమిది.

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామని నాయకులు ప్రకటించారు.

ఆరు గ్యారెంటీలలో ఇచ్చిన కొన్ని హామీలు నేటికీ నెరవేరలేదు.

మొదటి గ్యారెంటీ (మహాలక్ష్మి) కింద మహిళలకు ప్రతి నెల రూ.2500 సాయం.. ఇది అమలు కాలేదు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్ సిలిండర్ హామీలను మాత్రమే అమలు చేస్తోంది ప్రభుత్వం.

రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12000 చెల్లింపు.. ఇది రెండో గ్యారెంటీ. కింద సాయం రూ.15వేలకు బదులుగా రూ.12000కు మాత్రమే ప్రభుత్వం పెంచి 2025 జనవరి నుంచి అమలు చేస్తోంది.

కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – ఇది మూడో గ్యారెంటీ. దీన్ని అమలులోకి తీసుకొచ్చారు.

ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5లక్షల సాయంతోపాటు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.. ఇది నాలుగో గ్యారెంటీ. ఇందులో ఇందిరమ్మ పథకం పేరుతో ఇళ్లు కట్టించే కార్యక్రమం ప్రారంభించగా, ఇంటి స్థలం, ఉద్యమకారులకు ఇచ్చే ఇంటి స్థలం హామీ నెరవేరలేదు.

”ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతలో 4.50లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వచ్చే మార్చి నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేస్తాం. ఆ తర్వాత జూన్ నాటికి రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం” అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్.. ఇది ఐదో గ్యారెంటీ. – ఈ హామీ అమలు కాలేదు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి 2025 అక్టోబరులో మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఒక్కొక్క పాఠశాల కాంప్లెక్సుకు రూ.200కోట్ల చొప్పున 78 నియోజకవర్గాలలో వీటి నిర్మాణానికి రూ.15600 కోట్లు ఖర్చు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

చేయూత కింద నెలవారీ పింఛను రూ.4వేలకు పెంపు.. ఇది ఆరో గ్యారెంటీ. – ఈ హామీ నేటికీ అమల్లోకి తీసుకురాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.

”కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అవికాకుండా రుణమాఫీ, సన్నబియ్యం వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేశాం. ఆరు గ్యారెంటీల్లో మిగిలినవి కూడా రానున్న మూడేళ్లలో అమలు చేస్తాం” అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

లగచర్లకు వెళ్లే మార్గాల్లో పోలీసులు పహారా (ఫైల్ ఫోటో)

లగచర్ల భూసేకరణ వివాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రేగిన వివాదమిది.

ఫార్మా పరిశ్రమల కోసం సుమారు 1,314 ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు ఇవ్వకూడదని రైతులు తిరగబడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిపై దాడులు జరిగాయి.

భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని అక్కడ పర్యటించిన సందర్భంగా బీబీసీకి అర్ధమైంది.

”మా ప్రాణం పోయినా భూములు ఇవ్వం. భూములు ఇచ్చి మేం ఎక్కడికి వెళ్లాలి?” అని అక్కడి రైతులు మాతో చెప్పారు.

ముందస్తుగా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా ప్రభుత్వం భూసేకరణకు వెళ్లడం ప్రతికూల ప్రభావం చూపిందన్నది స్పష్టమవుతోంది.

తర్వాత భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది.

ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి, అందులో సారాంశాన్ని ప్రభుత్వానికి నివేదించింది.

ఫొటో సోర్స్, TelanganaCMO

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజల్లో ఆలోచన తీసుకువచ్చిన అంశాల్లో కాళేశ్వరం కీలకం.

అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బరాజ్ వద్ద ఏడో బ్లాక్ కుంగింది. ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.

దాదాపు ఏడాదికిపైగా విచారణ చేసి 2025 జులై 31న 665 పేజీల నివేదికను అందించింది కమిషన్.

దీన్ని సెప్టెంబరులో శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించింది ప్రభుత్వం.

అప్పటివరకు పెద్దఎత్తున విమర్శలు చేస్తూ, కాళేశ్వరం వ్యవహారాన్ని పదేపదే ప్రచారాస్త్రంగా వాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ‘బంతి’ని కేంద్రం కోర్టులో వేసింది. సీబీఐ విచారణ జరిపించాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.

మరోవైపు, ఫార్ములా ఈ-కార్ రేస్, ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులు సహా వివిధ అంశాలను తెరపైకి తీసుకువచ్చి విచారణ జరిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విచారణలు ఇంకా పూర్తి కాలేదు.

”కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరుతో బీఆర్ఎస్ పాలనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది తప్ప ఏ ఒక్క విషయాన్నీ నిరూపించలేకపోతోంది” అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీబీసీతో అన్నారు.

”కాళేశ్వరం విషయంలో కేంద్ర సంస్థల జోక్యం కూడా ఉన్నందున సీబీఐకు పంపించాం. మిగిలిన విచారణలన్నీ పూర్తవుతాయి” అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

బీసీ కులాలు

ఫొటో సోర్స్, Getty Images

బీసీ రిజర్వేషన్లు

కులగణన చేపట్టి ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ నియమించి బీసీ జనాభా 57.6 శాతంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

దాని ప్రకారమే, రిజర్వేషన్లు 42శాతం కల్పిస్తున్నామని ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఆగస్టు 31న చట్టం చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం తెలపలేదు.

తర్వాత, ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్లు నిలిచిపోయాయి.

బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేసి, పార్లమెంట్లో ఆమోదం తీసుకుని చేయాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ చెప్పారు.

”రాజ్యాంగ సవరణ చేయకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఉపయోగం ఉండదు” అని చెప్పారాయన.

బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు తెలంగాణ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

”నిర్మాణాత్మక మార్పులేవీ కనిపించడం లేదు”

కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో నిర్మాణాత్మక మార్పులేవీ పెద్దగా కనిపించడం లేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

”వచ్చే మూడేళ్ల కాలంలో ఎన్నో విషయాలపై దృష్టి పెట్టాలి. రైజింగ్ తెలంగాణ పేరుతో ఆర్థిక వ్యవస్థ, ఉన్న వనరులను ఏ విధంగా చక్కదిద్దుకోవాలనే విషయంపై ఇప్పుడిప్పుడే కొంత దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. కానీ అది సరిపోదు, ఆర్థిక వ్యవస్థ గాడిన పెడుతూనే, పాలనలో లోపాలు సరిచేయాల్సి ఉంది” అని బీబీసీతో అన్నారు కృష్ణారెడ్డి .

ఫ్యూచర్ సిటీ అంటున్నారే గానీ, అక్కడ సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు.

”హైడ్రా తీసుకురావడం మంచిపనిగా చెప్పవచ్చు. అందులో పక్షపాత వైఖరి అనుసరించారనే విమర్శలు ఉన్నప్పటికీ, చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అభినందించవచ్చు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ, అవి బుడిబుడి అడుగులుగానే కనిపిస్తున్నాయి. యూనివర్సిటీలలో రిక్రూట్‌మెంట్, మోడల్ స్కూళ్ల ఏర్పాటు.. ఇలా ప్రతి విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది” అని చిట్టెడి కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS