SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ కోసం ప్రత్యేక బిల్లును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ముసాయిదా బిల్లును విడుదల చేసి, దానిపై అభ్యంతరాలు తీసుకుంటోంది.
వీటి ఆధారంగా తుది బిల్లును తయారు చేసి అమల్లోకి తీసుకువస్తామని చెబుతోంది ప్రభుత్వం.
అయితే, తాము ఆశించిన మేరకు బిల్లు తీసుకురాలేదంటున్నారు తెలగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు.

సామాజిక భద్రత కోసం నీతి ఆయోగ్ సిఫార్సు
దేశ శ్రామిక రంగంలో గిగ్ వర్కర్స్ వాటా 1.5 శాతంగా ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.
గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్‌కు సామాజిక భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది నీతి ఆయోగ్.
తెలంగాణలో 4.20 లక్షల మంది గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ ఉన్నారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ బీబీసీతో చెప్పారు.

గిగ్ వర్కర్స్ ముసాయిదా బిల్లు విడుదల
స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా లాంటి యాప్ బేస్డ్ ట్యాక్సీ డ్రైవర్స్ లేదా మోటార్ సైకిల్ రైడర్స్, డెలివరీ ఏజంట్స్‌తో పాటు గిగ్ అండ్ మార్కెట్ ప్లాట్‌ఫాంలలో పనిచేసే ఫ్రీలాన్స్ లేదా పార్ట్ టైం వర్కర్లందరూ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ కిందకు వస్తారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) యాక్ట్, 2025 పేరుతో ముసాయిదా బిల్లు ఉంది.

బిల్లులో చేసిన ప్రతిపాదనలు ఇవీ..
ప్రత్యేకంగా తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది చట్టం వర్తించే తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంటుంది.
బోర్డులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఎక్స్-అఫీషియో ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి కార్యదర్శిగా ఉంటారు.
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు, రాష్ట్ర కార్మిక శాఖ, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా శాఖ పిన్సిపల్ సెక్రటరీ, కార్మిక శాఖ కమిషనర్ ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు.
గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ తరఫున నలుగురు సభ్యులు (ఒక మహిళ), అగ్రిగేటర్స్ నుంచి నలుగురు సభ్యులు (ఒక మహిళ), పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
వీరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. డాటా కలెక్షన్, ఐటీ సిస్టమ్స్ పరంగా సాంకేతిక నిపుణుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది.
గిగ్ వర్కర్లుగా పనిచేసే వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకుంటే ప్రతి కార్మికుడికీ ఓ యూనిక్ ఐడీ ఇస్తారు.
అగ్రిగేటర్స్ లేదా ఫ్లాట్‌ఫాంలు ఈ చట్టం అమల్లోకి వచ్చిన 45 రోజులలోగా వెల్ఫేర్ బోర్డులో తమ సంస్థలు లేదా కంపెనీలను రిజిస్టర్ చేసుకోవాలి.
ఆయా సంస్థలు వర్కర్స్ విషయంలో మతం, జాతి, కులం, లింగం పుట్టిన స్థలం, వైకల్యం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపించకూడదు.
ఎవరైనా వర్కర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటే ఏడు రోజుల ముందుగా రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.
కానీ, వినియోగదారుడు (కస్టమర్)కి హాని జరిగిందని గుర్తిసే వెంటనే తొలగించే అధికారం ఆయా సంస్థలకు ఉంటుంది.
వర్కర్స్‌కు ఇచ్చే వేతనాల్లో కోత పెడితే, వాటిని వారికి చేసే పేమెంట్స్ ఇన్‌వాయిస్‌లో చూపించాలి.
గిగ్ వర్కర్స్ చేసే ఫిర్యాదులు లేదా సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రతి ఫ్లాట్‌ఫాం నియమించుకోవాలి. సదరు వ్యక్తి వివరాలు వర్కర్‌కు తెలిసేలా ఫ్లాట్‌ఫాం అప్లికేషన్‌లో ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
‘వెల్ఫేర్ ఫండ్’ ఏర్పాటుకు ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం ప్రత్యేక నిధి (తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ ఫండ్) ఏర్పాటు చేయనుంది.
ఈ నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వడంతోపాటు సంస్థలు, గిగ్ వర్కర్స్ ఇచ్చే మొత్తాన్ని ఫండ్‌లో జమచేస్తారు.
తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్‌ఫాం వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ ఫీజును అగ్రిగేటర్స్ లేదా ప్లాట్‌ఫామ్స్ నుంచి వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది.
గిగ్ అండ్ ప్లాట్‍ఫాం వర్కర్లకు చెల్లింపుల్లో ఒకశాతం తక్కువ కాకుండా, రెండు శాతానికి మించకుండా ఫీజు ఉంటుంది.
”సంస్థల తరఫున జరిగే లావాదేవీలన్నీ వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ (డబ్ల్యూఎఫ్ఎఫ్వీఎస్) తో మ్యాప్ చేసి ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు పర్యవేక్షిస్తుంది” అని బిల్లులో ప్రతిపాదించింది తెలంగాణ ప్రభుత్వం.
”సంస్థలు వెల్ఫేర్ ఫండ్ ఫీజు చెల్లించని పక్షంలో ఏడాది జైలు లేదా రెండు లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించే వీలుంటుంది. ఆయా సంస్థలు సమాచారం, స్టేట్‌మెంట్, రిపోర్టులు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రూ.50 వేల వరకు జరిమానా విధించే వీలుంటుంది” అని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నప్పటికీ, అది ఎంత అనేది చట్టంలో ప్రస్తావించలేదని చెబుతున్నారు గిగ్ వర్కర్లు.
”కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత హక్కులు చట్టంలో పెట్టాలి. వీటిని నిబంధనలకే పరిమితం చేయకూడదు” అని బీబీసీతో చెప్పారు సలావుద్దీన్.
అయితే, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల పాలసీని తీసుకువస్తున్నామని, మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని ఆయన చెప్పారు.

‘అందరికీ సమ ప్రాధాన్యం ఉండాలి’
గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమిస్తుందని బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది.
మరోవైపు, ”ప్రభుత్వం ప్రతిపాదించిన బోర్డులో వర్కర్స్, ప్లాట్ ఫాంలు, ప్రభుత్వం నుంచి సమాన ప్రాతినిధ్యం ఉండాలి. బోర్డ్ కేవలం సలహాలివ్వడానికే పరిమితం కాకుండా జరిమానాలు విధించడం, కంపెనీలపై పర్యవేక్షణ, విచారణ నిర్వహించే అధికారం ఉండాలి” అని సలావుద్దీన్ సూచించారు.
ప్లాట్‌ఫాంలు స్వతంత్ర ఆడిట్స్ జరిపి ఎప్పటికప్పుడు సమర్పించేలా చూడాలని చెప్పారు.
దీనిపై పీవోడబ్య్లూ నాయకురాలు సంధ్య బీబీసీతో మాట్లాడారు.
”ఉద్యోగ భద్రత పరంగా హామీ ఇవ్వాలి. ఆర్డర్లపై వచ్చే ట్యాక్సులను కార్మికులకు ఇచ్చే మొత్తం నుంచే తీసుకుంటున్నారు. దీనిలో మార్పు రావాలి. వీరందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి” అని ఆమె చెప్పారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్లతో స్థానికంగా ఉండి పనిచేసుకునే వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఫొటో సోర్స్, https://x.com/RahulGandhi
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబరులో గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్లతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబరులో సీఎం రేవంత్ రెడ్డి.. గిగ్ వర్కర్లతో సమావేశయ్యారు.
”రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోనూ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తాం” అని చెప్పారు.
ఇందులో భాగంగా తెలంగాణలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చేందుకు ముసాయిదా బిల్లును తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
ఇప్పటికే దేశంలో రాజస్థాన్, కర్ణాటకలో గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకువచ్చాయి.
”కనీస వేతనం, పనిగంటలు.. చట్టాలతో ఈ రెండింటి పరంగా మాకు ప్రయోజనం కలిగేలా ఉండాలి. రోజులో ఎన్ని గంటలు పనిచేసినా, ఆర్డర్లకు తగ్గట్టుగా కమీషన్ లేదా జీతం రావడం లేదనే చెప్పాలి” అని ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ వాసి శివ బీబీసీతో చెప్పారు.
బీమా సదుపాయం కల్పించడంతో పాటు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వంటివి కల్పించాలని కోరారు.
ప్రస్తుతం ముసాయిదా బిల్లు విడుదల చేసిన నేపథ్యంలో అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం ఏప్రిల్ 29 నుంచి మూడు వారాల గడువు ఇచ్చింది.
”ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలను tg.gig.labour@gmail.com కు మెయిల్ చేయవచ్చు లేదా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనని కార్మికశాఖ భవన్‌లో రాతపూర్వకంగా ఇవ్వచ్చు” అని కార్మిక శాఖ ప్రకటించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)