SOURCE :- BBC NEWS
రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధం లేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలలో ఒకటిగా ఈ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్‌లోనూ చెప్పింది.
అయితే, దఫదఫాలుగా సాయాన్ని పెంచుమతాని చెబుతోంది ప్రభుత్వం.
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?
జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద రూ. 12 వేలు ఇస్తామని తాజాగా ప్రకటించింది ప్రభుత్వం.
గత ప్రభుత్వ హయాంలో ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించేవారు. అప్పుడు ‘రైతుబంధు’ పేరిట ఈ సాయం అందేది.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరు మార్చడంతోపాటు మరో రూ. 2 వేలు పెంచి ఇవ్వాలని నిర్ణయించింది.
హామీకీ, ఆచరణకు పొంతన లేకపోవడంపై అభ్యంతరం చెబుతోంది తెలంగాణ రైతు సంఘం.
”అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లు ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు దాన్ని రూ.12 వేలకే పరిమితం చేయడం ద్వారా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది” అన్నారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శనరావు.
ఈ విషయంపై తెలంగాణ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
”ఒకేసారి రూ. 15వేలు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆర్థిక వనరులు, పరిమితుల కారణంగా ముందుగా రూ. 12 వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించాం. మున్ముందు పెంచి రూ. 15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తాం” అని చెప్పారు కోదండ రెడ్డి.
ఇప్పటికే రైతులకు రెండు లక్షల రూపాయల లోపు ఉన్న అప్పులు మాఫీ చేశామని ఆయన చెప్పారు.
సాగుకు యోగ్యం కాకపోతే సాయం లేనట్టే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది.
కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.
సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం, తెలంగాణలో దాదాపు 74 లక్షల మంది పట్టాదారులున్నారు. సుమారు కోటి 58 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది.
”గత ఆరేళ్లలో 12 సార్లు ‘రైతుబంధు’ సాయం రైతులకు అందింది. దీనికి కింద రూ.80,453 కోట్లు అందించారు. వీటిలో రూ.25,672 కోట్లు వ్యవసాయం చేయని భూములకు రైతుబంధు కింద ఇచ్చారు” అని ఉపసంఘం నివేదిక స్పష్టం చేసింది.
తెలంగాణలో గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి, దాని ఆధారంగా 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందించనున్నారు.
వ్యవసాయం చేయని భూములకు పెట్టుబడి సాయం అందించకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదని అన్నారు రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు కన్నెగంటి రవి.
”రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలు ఉంటే పక్కన పెడతామని ప్రభుత్వం చెబుతోంది. ఆచరణలో ఎంతవరకు పక్కాగా భూముల డాటా సేకరిస్తారనేది అనుమానమే. రాజకీయ లాబీయింగ్ కారణంగా వ్యవసాయం చేయని భూములకు రైతుభరోసా అందిస్తే నిధులు పక్కదారి పట్టినట్లుగా అవుతుంది” అని బీబీసీతో అన్నారు రవి.
ఇదే విషయంపై కోదండ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, ”గతంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణంలో భూముల కోల్పోయిన వారి పేర్లు రికార్డుల్లో తొలగించకపోవడంతో రైతుబంధు సాయం పొందిన పరిస్థితి కనిపించింది. గ్రామాల్లో లే అవుట్లు వేస్తే, అలాంటి భూములకు సాయం అందించారు. మా ప్రభుత్వం మాత్రం సాగుకు యోగ్యమైన భూములకే పరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. గ్రామ సభలు పెట్టి అభ్యంతరాలు తీసుకున్నాకే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం” అని చెప్పారు.
రైతు భరోసా విషయంలో ఇన్ని ఎకరాలకే ఇస్తారు.. ఇన్ని ఎకరాలకు ఇవ్వరు.. అని సీలింగ్ అంటూ ఏమీ లేదని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాగు యోగ్యమైన భూములన్నింటికీ సాయం ఇస్తున్నామని చెప్పారాయన.
ప్రభుత్వ మార్గదర్శకాలివే..
- రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలకు పెంపు
- భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అందజేత. వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగింపు.
- ఆర్ఓఎఫ్ఆర్(రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులు.
- ఆర్బీఐ నిర్వహించే డీబీటీ(నేరుగా లబ్ధిదారుకు నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ.
- రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకుల తరఫున అమలు, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఎంపిక.
- ఫిర్యాదుల పరిష్కారం, పథకం అమలుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు
గతంలో రైతుబంధు ఎలా ఉండేదంటే..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు సాయం భూమి ఉన్న అందరికీ అన్నట్లుగా అందించింది.
ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర భేదాలు పెట్టలేదు. దీనివల్ల సాగు చేయని భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫాంహౌస్ యజమానులు, కళాశాలల యాజమాన్యాలకు రైతుబంధు సాయం అందిందనే ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ శివారులో భూముల ధరలు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆకాశాన్నంటాయి.
ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లు, కళాశాలల నిర్మాణానికి వినియోగించారు.
సాధారణంగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే, నాలా(నాన్ అగ్రికల్చరల్ అసెస్మెంట్ యాక్ట్) కింద మార్చుకోవాలి. ఈ ప్రక్రియ నిర్వహించకపోవడంతో హైదరాబాద్ శివారులలో వేలాది ఎకరాల భూములు వ్యవసాయ భూముల కిందనే రికార్డుల్లో కొనసాగుతున్నాయని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం అలాంటి సాగులో లేని లేదా సాగు యోగ్యం కాని భూములకు సాయం విషయంలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే, వ్యవసాయేతర భూములన్నింటికీ రైతుభరోసా సాయం నిలిచిపోనుంది.
అయితే, ప్రభుత్వం తీసుకువచ్చిన మార్గదర్శకాల కారణంగా నిజమైన రైతులకు సాయం నిలిచిపోనుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు.
ఇక మరోవైపు, గుట్టల పక్కన, గుట్టల మధ్య కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు రైతులకు భూములు అసైన్ చేశాయి. అవి సాగుకి యోగ్యం కాకుండా ఉన్నాయని రైతులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్ శివారులో ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల వంటి మండలాల్లో ఈ తరహా భూములు కనిపిస్తుంటాయి. ఈ భూములకూ రైతు భరోసా వస్తుందా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
”చాలావరకు భూములలో అటు ఖరీఫ్ లేదా ఇటు రబీలో ఏదో ఒక పంట వేస్తుంటారు. వ్యవసాయ యోగ్యం కాని భూములని చెప్పారు కనుక ఆ ఇబ్బంది రాకపోవచ్చు” అని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు.
మరోవైపు భూభారతిలో రికార్డు అయిన భూములకే రైతుభరోసా వస్తుందని చెప్పడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాగులో ఉండి ఏదైనా సాంకేతిక కారణాలతో భూ భారతి పోర్టల్‌లో నమోదు కాకపోతే పరిస్థితి ఏమిటని రైతు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. పోర్టల్ తో సంబంధం లేకుండా సర్వేలో వచ్చే వినతులతో సాగులో ఉన్న వారందరికీ సాయం చేయాలని కోరుతున్నారు.
కౌలు రైతులకు సాయంపై స్పష్టత ఏదీ?
రైతు భరోసా విషయంలో మరో అభ్యంతరం ఉందని చెప్పారు కన్నెగంటి రవి.
”తెలంగాణలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి ఇస్తామన్న సాయంపైన ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల కుటుంబాలకు కౌలు రైతులున్నారు. నిజంగా వ్యవసాయం చేసే అలాంటి రైతులకు కూడా సాయం అందించాలి” అని అన్నారాయన.
అలాగే, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రతిపాదించింది. దీనిపైనా స్పష్టం ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.
కౌలు రైతులకు ఇప్పటికే ప్రయోజనాలు కల్పిస్తున్నామని, మున్ముందు కూడా 2011లో వచ్చిన కౌలుదారుల చట్టం ప్రకారం ప్రయోజనాలు అందుతాయని కోదండరెడ్డి బీబీసీకి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)