SOURCE :- BBC NEWS
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలది ప్రత్యేక స్థానం. పండగ వేడుకల్లో పూజలు, కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు వినోద కార్యక్రమాలు సంక్రాంతి ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాలు ఆడటం, తెలంగాణలో గాలిపటాలు(పతంగులు) ఎగరవేయడం ప్రత్యేక ఆకర్షణ.
రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలను ప్రతిబింబించే ప్రతీకలుగా వీటిని భావిస్తారు.
తెలంగాణలో పతంగుల వేడుకకు హైదరాబాద్ శతాబ్దాలుగా కేంద్రం.
కుతుబ్‌షాహీల కాలం నుండి ఈ ప్రాంతంలో గాలిపటాలకు ఆదరణ ఉందని చరిత్రకారుల అభిప్రాయం.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి రోజుల్లో ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగరడం చూడవచ్చు.
ఇక్కడి సంస్కృతిలో పతంగులు ఎలా భాగం అయ్యాయి? సంక్రాంతి పండగకు పతంగులు ఎగురవేయడానికి ఏమైనా సంబంధం ఉందా?
పుట్టిల్లు చైనా
మెజారిటీ చరిత్రకారుల అభిప్రాయంలో గాలిపటానికి పుట్టిల్లు చైనా. వేర్వేరు సమయాలు, సందర్భాల్లో ఇది విశ్వవ్యాప్తం అయింది.
సిల్క్‌రూట్ వెంబడి ప్రయాణించిన బౌద్ధమత శ్రేణుల ద్వారా గాలిపటం భారత దేశానికి చేరిందనేది చరిత్రకారుల అభిప్రాయం.
అయితే భారత సాహిత్యంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి ‘సంత్ నామ్‌దేవ్’ (1270-1350)రచన ‘నామదేవ్ గాథ’లో మొదటిసారి గాలిపటం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.
ఇందులో ఆయన గాలిపటాన్ని సూచిస్తూ ‘గుడి’ అనే పదాన్ని ఉపయోగించారు.
కాగితంతో తయారు చేసిన గాలిపటాన్ని ఒక వ్యక్తి దారంతో ఎగురవేస్తుండగా, అక్కడి ప్రజలు చూసి ఆనందించారని ఆయన రాశారు.
ఈ వివరాలు మహారాష్ట్రకు చెందిన సంస్కృత పరిశోధకుడు పికే.గోడే (పరశురాం కృష్ణ గోడే 1881-1961) 1956 లో సమర్పించిన తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
అయితే సంత్ నామ్‌దేవ్ కాలంలో తాళపత్రాలపైనే రచనలు జరిగేవి. అలాంటప్పుడు కాగితం ఎలా వాడుకలోకి వచ్చిందని కొంతమంది పరిశోధకులు అనుమానాలు వ్యక్తం చేశారు.
మొఘలుల పాలన సమయానికి గాలిపటాల క్రీడ జనరంజకంగా మారిందని ఆనాటి కొన్ని పెయింటింగ్స్ ద్వారా తెలుస్తోంది.
మొఘల్ ప్రతినిధులుగా వచ్చి ఆ తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన కుతుబ్ షాహీల కాలంలో దక్కన్ ప్రాంతంలో గాలిపటాలకు విస్తృత ఆదరణ ఉండేదని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం.
“కుతుబ్ షాహీల పాలనలో హేమంత రుతువులో కాగితాలతో తయారుచేసిన పతంగులను, మూలికలు రుద్దిన దారాల సహాయంతో ఎగురవేసేవారు. ఆ తర్వాత అసఫ్ జాహీల పాలనలోనూ ఇది కొనసాగింది. ఆరవ నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ మైదానాల్లో పెద్ద ఎత్తున పతంగుల పోటీలు జరిగేవని విన్నాం. 1990 వరకు హైదరాబాద్ పాతబస్తీలో పతంగుల పోటీలు జరిగేవి” అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ బీబీసీ తో అన్నారు.
అయితే, సంక్రాంతికి పతంగులు ఎగరవేయడానికి సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
దసరా పండగకు బతుకమ్మలను ముడిపెట్టిన సంబంధమే సంక్రాంతికి గాలిపటాలకు మధ్య ఉంది అని శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
గాలిలో ఎగరాలని, ఆకాశయానం చేయాలనే మనిషి కాంక్షకు గాలిపటం ప్రతిరూపం. కీలుగుర్రం లాంటి ఊహలు ఇలాంటివే.
“ఉత్తరాయణంలో సూర్యునితో పాటూ గాలి దిశలు కూడా మారుతాయి. గాలి వీచే దిశ, తీవ్రత తెలుసుకోవడానికి గుడ్డలు, కాగితాలు ఎగురవేయడం మొదటి నుండి ఉంది” అని హరగోపాల్ వివరించారు.
మతాలకు అతీతంగా పతంగులు ఆట
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని కొన్ని ఇరుకైన వీధులు పతంగుల తయారీ కేంద్రాలు. పతంగుల తయారీ ఇక్కడ కుటీర పరిశ్రమ.
‘ఇది మతాలకు అతీతమైన క్రీడ’ అన్నారు ఇంటాక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) సంస్థకు చెందిన అనురాధా రెడ్డి.
‘మా చిన్నతనంలో హైదరాబాద్ లో విశాలమైన బహిరంగ ప్రదేశాలుండేవి. పాతబస్తీ నుండి మాంజా కొనితెచ్చి పతంగుల పోటీల్లో పాల్గొనేవారం. ఆ తర్వాతి రోజుల్లో మా పొరుగింటి ముస్లిం కుటుంబం దగ్గర గుడ్లు, కాంచ్ (గ్లాస్), బంక , కలర్స్ కలిపి స్వయంగా మాంజా తయారీ పద్దతి నేర్చుకున్నాం. లైట్ వెయిట్, హెవీ వెయిట్ ఇలా రకరకాల పతంగులు ఉండేవి. పతంగుల ఆట కోసమే వాడే ప్రత్యేక పదాలుండేవి (సాదా పతంగ్, చరకా, డోరా, పేంచ్, లడాయి). ‘కటీ పతంగ్’ లను( తెగిన గాలిపటాలు) దొరకబుచ్చుకుని వాటి తయారీ విధానం, వాడిన దారం వంటి అంశాలను అధ్యయనం చేసేవాళ్లం” అని అనురాధా రెడ్డి తెలిపారు.
‘‘అప్పటి మజా ఇప్పుడు లేదు. చైనా మాంజాలతో ప్రజలు, పక్షులు, జంతువులకు హాని పొంచి ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో గాలిపటాల పోటీల చరిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్ జాఫర్ జాఫ్రీ బీబీసీకి వివరించారు.
”కుతుబ్ షాహీల కాలం నుండి నేటి వరకు అదే ఉత్సాహంతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. బాద్‌షాలు స్వయంగా వీటిని వీక్షించేవారు. క్రికెట్, ఫుట్ బాల్ వంటి ఆటలు వచ్చినా పతంగుల ఆటకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ కాలనీల్లో మతాలకతీతంగా కమీటీలు ఏర్పడి పోటీలు నిర్వహించేవారు. లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ మెంట్‌లు ఉండేవి. విజేతలకు బహుమతులు ఇచ్చేవారు. అక్కడి గుట్టల్లో మాంజా తయారీ కోసం ప్రత్యేకంగా రాతి రోళ్లు-రోకళ్లు ఉండేవి. సిద్ది అంబర్ బజార్, బేగంబజార్, శీతల్ మాంజా రకాలు మా బాల్యంలో ఫేమస్. పతంగుల ఆట హైదరాబాద్ దక్కన్ సంస్కృతికి ప్రతీకగా చెప్పవచ్చు” అని ప్రొఫెసర్ జాఫ్రీ అన్నారు.
అంతర్జాతీయ గాలిపటాల పండగ
భారతదేశంలో గాలిపటాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రసిద్ది చెందింది. ఇక్కడి గాలిపటాల మ్యూజియం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
భారత్‌లో తొలిసారి 1989 లో అహ్మదాబాద్ వేదికగా అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు జరిగాయి.
మొదట్లో అగాఖాన్ అకాడమీలో నిర్వహించిన ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి.
గతంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కంబోడియా, మలేషియా, వియత్నాం, ఇటలీ, దక్షిణఆఫ్రికా, శ్రీలంక దేశాలనుండి ఔత్సాహులు ఇక్కడి పోటీల్లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ పతంగుల పోటీలు ఆయా దేశాల సాంస్కృతిక వినిమయానికి పనిచేస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS