SOURCE :- BBC NEWS

తిరుపతి, నెల్లూరు, జిల్లాలకు సాగునీరు, తాగునీరు, చెన్నైకు తాగునీరు అందించే జలాశయం

ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఉదాహరణగా నిలుస్తున్న ప్రాజెక్టు కండలేరు జలాశయం. అత్యాధునిక మెషినరీ, యంత్రాంగం లేని రోజుల్లో అప్పటి నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటూ చెన్నైకి తాగునీరు అందించడానికి నిర్మించిందే కండలేరు జలాశయం.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు నది మీద నిర్మించారు కాబట్టే దీనికి కండలేరు జలాశయం అనే పేరొచ్చింది.

ఎన్టీఆర్ చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టులో కండలేరు అంతర్భాగం. తెలుగు గంగ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నై నగరానికి తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించడంతో ఈ కండలేరు జలాశయం పుట్టిందని తెలుగు గంగ ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్పారు.

చెన్నైకి తాగునీటితోపాటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో కండలేరు జలాశయాన్ని ప్రారంభించారని నెల్లూరు తెలుగు గంగ ప్రాజెక్ట్ సూపరిండెంట్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి బీబీసీతో చెప్పారు.

”1983లో కడప జిల్లాలో ఎన్టీ రామారావు, ఎంజీఆర్, ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు. చెన్నైకి 15 టీఎంసీల నీళ్లు ఇవ్వాలనేది దీని ముఖ్య ఉద్దేశం. చెన్నైకి నీళ్లు ఇవ్వడమే కాకుండా నెల్లూరు, తిరుపతి జిల్లాలలో 3.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కండలేరు రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు.’’ అని ఆయన వెల్లడించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆసియాలోనే అతిపెద్ద మట్టి డ్యాముల్లో ఒకటి

ఆసియాలోనే అతిపెద్ద మట్టి డ్యాముల్లో ఒకటి

కండలేరు జలాశయం నెల్లూరు నుంచి 54 కిలోమీటర్లు, తిరుపతికి 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా దీనిని 1983లో రాపూరు మండలంలోని చెల్లటూరు గ్రామం దగ్గర నిర్మించారు.

”కండలేరు వాగుకు అడ్డంగా రాపూర్ దగ్గర డ్యామ్ కట్టారు. దీనిని 10.57 కిలోమీటర్ల పొడవు, 49 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ ఆనకట్టను 1983లో శంకుస్థాపన చేసి 1996లో పూర్తి చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతి పొడవైన మట్టికట్టల్లో ఒకటి. దీని గ్రాస్ కెపాసిటీ 68 టీఎంసీలు. ఇప్పటివరకు 2020లో 61.16 టీఎంసీల నీటిని నింపగలిగాము.”అని రాధాకృష్ణమూర్తి చెప్పారు.

మట్టికట్టను మరింత వెడల్పు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు.

‘‘ ఒక నిపుణుల కమిటీ కూడా తనిఖీ చేసి కట్టను కొంచెం వెడల్పు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వానికి రూ.16.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం జలాశయంలో 55. 6 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు, చెన్నైకి నీళ్లు ఇవ్వడానికి ఒక సంవత్సరం వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. జలాశయం చుట్టూ నిర్మించింది మట్టి కట్టే అయినా, అది బీటలు వారకుండా తగిన చర్యలు చేపడుతుంటాం. రెగ్యులర్‌గా నిర్వహణ ఉంటుంది’’ అని రాధాకృష్ణమూర్తి చెప్పారు.

జలాశయం చుట్టూ మట్టికట్ట నిర్మాణం
జలాశయం చుట్టూ మట్టికట్ట నిర్మాణం

మట్టి కట్ట దృఢంగా ఉంటుందా?

”మట్టి కట్టలను సాధారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైన్ చేస్తాము. వర్షాలు పడినప్పుడు చిన్న చిన్న లీకులు లాంటివి వస్తుంటాయి. అందువల్ల ఈ మట్టి కట్టకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మట్టి కట్టకు లీకులు సాధారణమే అయినా, కండలేరు జలాశయం నిర్మించిన తర్వాత ఎప్పుడూ వర్షాకాలంలో పెద్ద లీకుల సమస్య రాలేదు’’ అని రాధాకృష్ణమూర్తి తెలిపారు.

”గతంలో కట్ట మీద వాలులో మట్టి జారింది. భారీ వర్షాల వల్ల అలా జరిగింది. వెంటనే మేము టెంపరరీ అరెస్ట్ చేసి పర్మినెంట్‌గా కూడా వాటిని మూసివేశాం. అందుకే వాటి వల్ల కట్టకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.’’ అని ఆయన చెప్పారు.

కండలేరు ద్వారా చెన్నైకు తాగునీరు
కండలేరు జలాశయం

కండలేరు నీటి కేటాయింపులు

ఎవరెవరికి, ఏయే రంగాలకు ఎన్ని టీఎంసీల జలాలు ఇవ్వాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు చేసిందని రాధాకృష్ణమూర్తి చెప్పారు. దాని ప్రకారమే ఇప్పటికీ జలాలు అందించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

”23 టీఎంసీలు తాగునీటికి, 30 టీఎంసీలు ఆయకట్టుకు కేటాయించింది. పరిశ్రమలకు 6 టీఎంసీలు, డెడ్ స్టోరేజీ కింద 8.4 టీఎంసీలు, ఆవిరి నష్టాల కింద 6.8 టీఎంసీలు కేటాయించింది. దీని కింద తిరుపతి, నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా 3.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటివరకు ఏడాదిలో అధికంగా 2.24 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాము. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 2.26 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. దీంతోపాటు చెన్నైకి 5 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదనలు చేశాం. ఇక కండలేరు నుంచి సరఫరా చేసే తాగునీరు చెన్నైకి చేరే దారిలో పలు పట్టణాలు, పల్లెల దాహార్తి తీరుస్తోంది’’ రాధాకృష్ణమూర్తి చెప్పారు.

1996 నుంచి ఇప్పటివరకూ చెన్నైకి 116 టీఎంసీల తాగు నీరు ఇచ్చామన్న ఆయన, రాష్ట్రంలో ఉన్న నీటి లభ్యతను బట్టి చెన్నైకి జలాలను సరఫరా చేస్తామని, అది నిరంతరం జరుగుతూనే ఉంటుందని తెలిపారు.

”కండలేరు నుంచి వెళ్లే తాగునీరు నెల్లూరు జిల్లా పొదలకూరు నుంచి మొదలై రాపూరు, గూడూరు, వెంకటగిరి, కాళహస్తి, తిరుపతి, రేణిగుంట తర్వాత చెన్నై వరకూ చేరుతాయి. మధ్యలో ఈ పట్టణాలు, గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటిని సరఫరా చేయగలుగుతున్నాము” అని ఆయన వివరించారు.

వేసవి కాలంలో కూడా ఈ జలాశయం ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలకు నీరందిస్తున్నారు అధికారులు. తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు ఎగువ ప్రాంతాలైన పొదలకూరు దాని చుట్టు పక్కల మండలాలకు మోటర్ల ద్వారా పంపింగ్ చేసి సాగు నీరు అందిస్తున్నారు.

పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ఆలోచన
కండలేరు జలాశయం

టూరిజం స్పాట్‌గా కండలేరు

కండలేరు జలాశయం చూడడానికి టూరిస్టులు కూడా వస్తుంటారు. ప్రకృతి అందాలకు తోడు, జలాశయం దగ్గర వీచే చల్లటి గాలులతో అక్కడి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది.

ఈ ఆనకట్ట పైనుంచి నీటి ఆవిరితో ఆకాశం, కండలేరు జలాశయం రెండూ కలిసిపోయాయా అన్నట్టు కనిపిస్తుంది. బాగా ఎండ ఉన్నప్పుడు మాత్రం నీళ్లకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక వైపు కొండలు కనిపిస్తాయి.

తిరుపతికి 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న కండలేరు జలాశయాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, సీప్లేన్‌ను ల్యాండ్ చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని రాధాకృష్ణమూర్తి చెప్పారు.

”పర్యటకం పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. టూరిజం శాఖ వాళ్లు దీన్ని పరిశీలించి ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. ఇది పెంచలకోన దేవస్థానానికి, తిరుపతికి దగ్గరలో ఉంది. ఈ మధ్య ప్రభుత్వం ఒక ప్రతిపాదన కూడా పెట్టింది. సీ ప్లేన్ ల్యాండింగ్ కు ఇది అనుకూలంగా ఉంటుందా అని అడిగారు. మేము అనుకూలంగా ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం” అని ఆయన తెలిపారు.

కండలేరును టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు కూడా ఉపాధి లభిస్తుందని పొదలకూరుకు చెందిన ఫోటోగ్రాఫర్ కేశవ అన్నారు.

‘‘కండలేరులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. ఒక చిన్న కొండపై నిర్మించిన దానిపై నుంచి కండలేరు జలాశయాన్ని చూస్తే ఒక చిన్న సముద్రాన్ని చూసినట్టే ఉంటుంది. రిజర్వాయర్ కింది భాగంలో ఒక పార్క్ నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది’’ అని రాధాకృష్ణమూర్తి చెప్పారు.

”ముందుగా పార్కు అభివృద్ధి చేయాలని, తర్వాత సీప్లేన్ డెవలప్ చేయాలని భావిస్తున్నారు. తర్వాత అక్కడ టూరిజంకు సంబంధించిన భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు ఉన్నాయి. అందుకే టూరిజం వాళ్ళు తనిఖీలు చేశారు. ప్రతిపాదనలు ఆమోదం పొందితే ఇది టూరిజం స్పాట్‌గా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది” అని రాధాకృష్ణమూర్తి అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)