SOURCE :- BBC NEWS
భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కొండపల్లి బొమ్మల ఖ్యాతి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. కేవలం చేతితోనే తయారు చేసే కొయ్య బొమ్మలకు విజయవాడ సమీపంలోని కొండపల్లి ప్రసిద్ధి.
కొంతకాలంగా కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్లపొనికి చెక్కకు కొరత ఏర్పడటంతో తరతరాలుగా ఆ వృత్తినే నమ్ముకున్న కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంతకీ కొండపల్లి బొమ్మలకు తెల్లపొనికి చెక్కనే ఎందుకు వాడతారు?
తెల్లపొనికి చెట్టు నుంచి సేకరించిన కలప బెరడును తీస్తే లోపల చెక్క తెల్లగా ఉంటుంది, అందుకే దీనిని తెల్లపొనికి చెక్క అంటుంటారు. కొండపల్లి బొమ్మలతో పాటు తెలంగాణలోని నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి కూడా ఈ తెల్లపొనికి చెక్కను ఎక్కువగా వాడుతుంటారు.
ఈ కలప మెత్తగా ఉంటుంది. వివిధ ఆకృతులు చేసేందుకు అనువుగానూ, ఎన్నో ఏళ్ల పాటు మన్నికగానూ ఉంటుంది. పైగా.. చిన్న పిల్లలు పొరపాటున నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదు.. ఒకరి మీద ఒకరు విసురుకున్నా అంతగా దెబ్బ తగలదు.
ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు..
కేవలం కొండలు, గుట్టలు, రాళ్ల మధ్యనే ఈ చెట్టు పెరుగుతుంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి అడవుల్లోనే ఎక్కువగా లభ్యమయ్యే ఈ చెట్టు కలపను వందల ఏళ్లుగా వినియోగించడంతో చుట్టపక్కల ఆ చెట్లన్నీ అంతరించిపోయాయి.
దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొండపల్లి కళాకారులు ఈ చెక్కతోనే బొమ్మలను తయారు చేస్తున్నారు.
ఈ చెక్క మృదువుగా, తీపిగా ఉండటంతో అడవుల్లోని పశువులు ఈ మొక్క కనిపిస్తే తినేస్తాయని, పెద్ద చెట్టు కనిపించినా పెకిలించి వేస్తాయని కొండపల్లి అటవీ సమీప స్థానికులు చెబుతున్నారు.
ఇప్పుడు కొండపల్లి అడవి నుంచి దాదాపు పాతిక ముప్పై కిలోమీటర్ల వరకు వెళ్లినా తెల్ల పొనికి చెట్లు ఒకటి రెండు కూడా కానరావడం లేదు. ఫలితంగా కొండపల్లి బొమ్మల తయారీదారులు సతమతమవుతున్నారు.
వచ్చే తరానికి ఈ కలప దొరకడం కష్టమేనని కొండపల్లి బొమ్మల కళాకారుడు నడికుదిటి హనుమంతరావు అంటున్నారు.
‘‘నేను 30 ఏళ్ల నుంచి బొమ్మలు చేస్తున్నాను. మా నాన్న నుంచి ఈ వృత్తిని నేర్చుకున్నా. మేం ఐదుగురు అన్నదమ్ములం.. మాకు పదిమంది పిల్లలు ఉన్నారు. వచ్చే తరం ఈ కొండపల్లి మాత్రం ఇది చేయడం కష్టమే. ఎందుకంటే మేం వాడే మెటీరియల్ దొరకడం లేదు. ఓ పది సంవత్సరాల తర్వాత ఇంకా కష్టం. ఇప్పటికే న్యూవుడ్, ఫ్లైవుడ్ వాడుతున్నారు. కొండపల్లి బొమ్మల తయారీకి తెల్లపొనికి చెక్కే బాగుంటుంది. అది దొరకడంలేదు” అని హనుమంతరావు బీబీసీతో చెప్పారు.
తెలంగాణ నుంచి తెస్తున్నాం
”పొనికి చెట్టు ఇప్పుడు కనిపించడం లేదు. తెలంగాణ అడవుల్లో ఎక్కడైనా దొరికితే తెచ్చి బొమ్మలు చేస్తున్నాం. ఎక్కువగా జమలాపురం అడవుల్లో ఉంది. ఇక్కడెక్కడా లేదు” అని బాల బ్రహ్మచారి అనే మరో కళాకారుడు చెప్పారు.
ధరణికోట నగేష్ అనే కళాకారుడు మాట్లాడుతూ.. ”తెల్లపొనికి చెక్కను దూరం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వరకు చెక్క 250 పడేది.. ఇప్పుడు 2 వేల వరకు ఖర్చు అవుతోంది. దూరం నుంచి తెచ్చుకోవడం వల్ల ధర పెరిగింది. ఫలితంగా బొమ్మల రేట్లు కూడా పెరుగుతాయి. బొమ్మల ధరలు పెంచితే కొనుగోలుదారులు తగ్గుతారు. దీంతో ధరలు పెంచలేక, పెట్టుబడి ఖర్చులకే బొమ్మలు తయారు చేసి ఇస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కర్ర ఎక్కువగా మిగతా వాటికి పనికి రాదని కొండపల్లికి చెందిన కూరెళ్ల వెంకటాచారి, కూరెళ్ల జ్యోతి దంపతులు అంటున్నారు.
”వంట చెరుకుకూ ఉపయోగించలేం. ఎందుకంటే పొగ ఎక్కువ వస్తుంది. కేవలం బొమ్మలు చేసేందుకే వాడతాం. చెట్లను ఏళ్లుగా వినియోగించడం వల్ల ఇక్కడ కనిపించడం లేదు. 20 నుంచి పాతిక కిలోమీటర్ల మేర విస్తరించిన చెట్లు అన్నీ అయిపోయాయి. ఏ. కొండూరు అడవుల్లో చెట్లు ఉన్నాయి. ప్రభుత్వం అక్కడి నుంచి తెప్పించి ఇస్తే కళాకారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది” అని దంపతులు అన్నారు.
ప్రభుత్వం దృష్టి పెట్టింది: కలెక్టర్ లక్ష్మీషా
పొనికిచెట్ల కొరత విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటి పెంపకం కోసం చర్యలు తీసుకుంటోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా బీబీసీకి తెలిపారు.
చెట్లను ఏళ్లుగా వినియోగించడం వల్ల కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో లభ్యం కావడం లేదని, దగ్గరలోని ఏ కొండూరు అడవుల్లో చెట్లు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు.
అక్కడి నుంచి తెచ్చేందుకు రవాణా ఛార్జీలను సైతం వాళ్లే భరిస్తామని చెబుతున్నప్పటికీ అడవి చెట్ల నరికివేతపై నిబంధనలున్నాయని, అందుకే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు.
కళాకారుల నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉపాధి హామీ పథకం ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు.
వంద మొక్కలు వేస్తే 5 శాతమే బతికే అవకాశం ఉందని, అందుకే మొక్కల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని చెప్పారు.
విశ్వవ్యాప్తంగా పేరొందిన కొండపల్లి బొమ్మలకు కావాల్సిన ముడి సరకును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని లక్ష్మీ షా స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS