SOURCE :- BBC NEWS

త్రివేణిసంగమం

త్రివేణి సంగమం అంటే గంగ, యమున, సరస్వతి నదుల కలయిక అని చదువుకున్నాం కదా!

త్రివేణి సంగమం అని చెబుతున్నప్పటికీ, సరస్వతి నది ఎందుకు కనిపించదు? చరిత్ర పరిశోధకులు, పండితులు ఏం చెబుతున్నారు? సరస్వతి నదికి సంబంధించి చారిత్రక ఆధారాలున్నాయా?

సరస్వతి నది ఒకప్పుడు ఉండి, తర్వాత అంతరించిపోయిందా? లేక సరస్వతి నది అన్నది కల్పన మాత్రమేనా?

గంగ, యమునలా సరస్వతి నది పుట్టుక, ప్రవాహంపై కచ్చితమైన సమాచారం ఎందుకు లేదు?

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ రెండు నదుల నీళ్లు అక్కడ కలుస్తాయి.

పశ్చిమం వైపు నుంచి యమునా నది వస్తుంది. ఉత్తరం వైపు నుంచి గంగ ప్రవహిస్తుంది. ఈ రెండు నదులు కలిసి త్రివేణి సంగమం నుంచి గంగానది ప్రవాహం తూర్పువైపుగా సాగుతుంది.

ఇక్కడ సరస్వతి నది ఎక్కడా పైకి కనిపించదు. ఇందుకు చరిత్ర పరిశోధకులు, పండితులు ఏం చెబుతున్నారనేది పరిశీలిస్తే..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
గంగ, యమున, సరస్వతి

పురాణ గాథలు ఏం చెబుతున్నాయి?

త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంతర్వాహినిగా ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు.

సరస్వతి నది అంతర్వాహినిగా సాగుతుందని, అది అదృశ్యమవడం వెనక భిన్న కథలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు.

దీనిపై అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ఆచార్యురాలు అనామిక రాయ్ బీబీసీతో మాట్లాడారు.

”పురాణాల ప్రకారం సరస్వతిని బ్రహ్మ కుమార్తెగా చెబుతుంటారు. ఆమె ఒక సందర్భంలో పురూరవ అనే రాజుకు ఆకర్షితురాలైందని చెబుతుంటారు. పురూరవ.. కౌషంబి రాజ్యానికి చక్రవర్తిగా ఉండేవారు. ప్రయాగ్‌రాజ్‌కు దగ్గర్లోనే ఈ కౌషంబి ఉంది. ఈ విషయం బ్రహ్మకు తెలిసి కోపంతో.. సరస్వతిని మాయమైపోవాలని శపించాడనేది కథ” అని అనామిక రాయ్ చెప్పారు.

ఇదే విషయంపై మరో పౌరాణిక కథను చెప్పారు మధురకు చెందిన ధనుంజయ దాస్.

”సరస్వతి నది ప్రవాహం బద్రినాథ్ క్షేత్రం వద్ద మొదలైందని చెబుతుంటారు. సరస్వతి నదీ ప్రవాహ శబ్దం తన తపస్సుకు భంగం కలిగిస్తోందంటూ ఓ రుషి పెట్టిన శాపం కారణంగా అది అంతరించిపోయింది. పురాణాలు, శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో సరస్వతి నది కనిపించదు కానీ ఇక్కడ కచ్చితంగా అది ఉంది. అదృశ్య రూపంలో సరస్వతి నది ప్రవాహం సాగుతుంది. అందుకే గంగ, యమున నదులతో కలిపి త్రివేణి సంగమం అంటారు” అని ఆయన చెప్పారు.

త్రివేణిసంగమం

సరస్వతి నది ఆనవాళ్లు ఉన్నాయా?

సరస్వతి నది పేరు వింటుంటాం కానీ భారత్‌లో ఎక్కడా కనిపించదు.

గంగ, యమున, గోదావరి, కావేరి నదుల తరహాలో ఈ నది ప్రవాహం ఉండదు.

కానీ, సరస్వతి నది ఉందనేది ఎంతో మంది భక్తుల నమ్మకం.

”సరస్వతి నది ప్రజల మనసుల్లో ఉంది. నమ్మకాల్లో ఉంది. స్థానిక ప్రజలు చెప్పుకునే కథల్లో ఉంది” అని అంటారు అనామిక రాయ్.

త్రివేణి సంగమం కంటే ముందుగానే యమున నదితో కలిసి సరస్వతి కలసి ద్వివేణిగా మారిందని ఆమె చెబుతున్నారు.

సరస్వతి నది ప్రవాహాన్ని చివరిసారిగా హరియాణాలోని కురుక్షేత్ర ప్రాంతంలో చూసినట్లుగా ఆధారాలున్నాయని అనామిక రాయ్ చెప్పారు.

”చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఎలా ఉన్నా.. ఆర్కియాలజిస్టులకు లభించిన ఆధారాలను బట్టి హరియాణాలోని ఘగ్గర్ ప్రాంతంలో సరస్వతి నది యమునా నదిలో కలిసిపోయింది. అలా అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌ వరకు యమునా నదితో కలిసి ద్వివేణి ప్రవాహంగా సాగుతోంది. అలా వచ్చిన రెండు నదులు గంగా నదితో కలిసిన తర్వాత త్రివేణిగా మారాయి” అని చెప్పారామె.

”గంగ యమునియో యత్ర్ గుప్త సరస్వతి”గా పురాణాల్లో ఉంటుందని అన్నారు.

త్రివేణి సంగమం

ఫొటో సోర్స్, Naveen Kumar/BBC

సరస్వతి నది కోసం అధ్యయనాలు జరిగాయా?

2002 జూన్ 15 నాటి సంగతి ఇది. సరస్వతి నదీ ప్రవాహ మార్గాన్ని కనుగొనేందుకు తవ్వకాలు చేపట్టనున్నట్లు అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జగ్మోహన్ ప్రకటించారు.

అందుకోసం ఇస్రోకు చెందిన బల్‌దేవ్ సహాయ్, పురావస్తు శాస్త్రవేత్త ఎస్.కల్యాణ్ రామన్, గ్లేసియాలజిస్ట్ (హిమానీనద శాస్త్రవేత్త) వైకే పురి, వాటర్ కన్సల్టెంట్ మాధవ్ చితాలతో కూడిన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ బృందం రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ పర్యటించి సమాచారాన్ని సేకరించింది. దీని ఆధారంగా ఇస్రో శాస్త్రవేత్తల బృందం 2015 నవంబర్ 28న, సరస్వతి నదిపై ఒక నివేదికను విడుదల చేసింది.

సీనియర్ సైంటిస్టులు డాక్టర్ జేఆర్ శర్మ, డాక్టర్ బీసీ భద్ర, డాక్టర్ ఏకే గుప్తా, డాక్టర్ జి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ‘రివర్ సరస్వతి: యాన్ ఇంటిగ్రేటెడ్ స్టడీ బేస్డ్ ఆన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ టెక్నిక్స్ విత్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్’ పేరుతో ఆ నివేదిక రూపొందింది.

ఇస్రోకు చెందిన జోధ్‌పూర్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈ నివేదికను తయారుచేసింది. ఉపఖండం వాయువ్య ప్రాంతంలో గతంలో ఎన్నో పెద్ద నదులు ప్రవహించాయని ఆ నివేదిక పేర్కొంది.

సింధు నది తరహాలోనే, దాదాపు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాలకు పూర్వం.. అంటే సుమారు 8 వేల సంవత్సరాల కిందట సరస్వతి నది ప్రవహించినట్లు వేదాలు, పురాణాల్లో ఉంది.

సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గుజరాత్‌లోని కచ్ వద్ద సముద్రంలో కలిసేదని కూడా ఉంది. హిమాలయాల ప్రాంతంలో వాతావరణ మార్పులు, టెక్టోనిక్ ప్లేట్లలో మార్పుల కారణంగా సరస్వతి నది క్రీస్తుపూర్వం మూడు వేల ఏళ్ల క్రితం పూర్తిగా ఎండిపోయి, కనుమరుగైందని ఓ కథనం ప్రచారంలో ఉంది.

త్రివేణిసంగమం

కుంభమేళాతో విస్తృత ప్రచారం

క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన కాళిదాసు రచించిన ‘రఘువంశం’ కావ్యంలో గంగ, యమున నదుల ప్రస్తావన ఉంటుంది. అందులో సరస్వతి నది ప్రస్తావన ఉండదు.

అప్పటికి సరస్వతి నది గురించి ఎక్కువ ప్రస్తావన లేకపోవడంతో కాళిదాసు తన రచనలో పేర్కొనకపోయి ఉండవచ్చని చెప్పారు అనామిక రాయ్.

”కుంభమేళా మొదలయ్యాక సరస్వతి నది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. కానీ, చారిత్రక ఆధారాలు, పురాణాలు.. ఇలా అన్నింటినీ గమనిస్తే మాత్రం సరస్వతి నది ఒకప్పుడు ఉండేదని, తర్వాత అంతరించిపోయిందని చెప్పవచ్చు” అని అన్నారామె.

”సింధు నదినే సరస్వతిగా చరిత్రకారులు కె.చటోపాధ్యాయ చెబుతారు. ధర్మశాస్త్ర చరిత్ర రాసిన పీవీ కాణే వంటి చరిత్రకారులు ఈ వాదనతో విభేదించారు. సరస్వతి నది అనేది కురుక్షేత్ర ప్రాంతంలో పాయలుగా విడిపోయిందనేది మరికొందరు చరిత్రకారులు చెబుతున్నమాట” అని అనామిక రాయ్ వివరించారు.

ప్రయాగ్‌రాజ్‌లో ఒక సాధువు

ఫొటో సోర్స్, Naveen Kumar/BBC

సంగమం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం

ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా కూడా త్రివేణి సంగమం వద్దనే జరుగుతుంటుంది.

ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఘాట్లు నిర్మించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం.

ఈ ఘాట్ వద్ద నుంచి పడవలు అందుబాటులో ఉన్నాయి.

గంగ, యమున నదుల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో పడవల్లో వెళ్లి రెండు నదులు కలిసే ప్రదేశంలో స్నానాలు చేస్తుంటారు భక్తులు.

పూజలు చేయడంతోపాటు అస్థికలు కలపడం, పిండప్రదానాలు చేశాక పూజా సామగ్రిని అక్కడ కలుపుతుంటారు.

దీనివల్ల నది చెత్త, వ్యర్థాలతో కనిపిస్తోందని కొందరు భక్తులు చెబుతున్నారు.

ఒంటెను తీసుకెళ్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Naveen Kumar/BBC

వేలాది మందికి ఉపాధి మార్గం

త్రివేణి సంగమం దగ్గరకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక కుంభమేళా సమయంలోనైతే లక్షలాది మంది వస్తుంటారని యూపీ ప్రభుత్వం చెబుతోంది.

త్రివేణి సంగమం వద్ద దాదాపు 2వేల పడవలు ఉంటాయని అక్కడి పడవ నడిపేవారు చెబుతున్నారు.

ఇలా వేలాది కుటుంబాలు పడవలను నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులతో మాట్లాడేందుకు వీలుగా వారు అనేక భాషలు కొంచెం కొంచెం నేర్చుకున్నారు.

కుంభమేళా

ఫొటో సోర్స్, kumbh.gov.in

తెలుగు, కన్నడ, గుజరాతీ, తమిళ్ వంటి భాషల్లోని కొన్ని పదాలు నేర్చుకుని పడవ నడిపే వ్యక్తులు మాట్లాడుతుంటారు.

”తెలుగు, తమిళ్, గుజరాతీ, మరాఠీ.. ఇలా 15-20 భాషలు మాట్లాడేవారు వస్తుంటారు. వారితో మాట్లాడేందుకు లేదా పడవలో వెళ్లే సమయంలో జాగ్రత్తలు చెప్పేందుకు వీలుగా కొన్ని పదాలు నేర్చుకున్నాం” అని బచ్చన్ లాల్ అనే పడవ నడిపే వ్యక్తి బీబీసీకి చెప్పారు.

త్రివేణి సంగమం వద్ద వేణి దానం చేస్తుంటారు.

భార్యాభర్తలు కలిసి వెళ్లి మరోసారి అక్కడ పెళ్లి చేసుకుని.. భార్య జడ నుంచి కొన్ని వెంట్రుకలు దానం ఇస్తుంటారు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందని తెలుగు పురోహితుడు చంద్రశేఖర శర్మ బీబీసీకి చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)