SOURCE :- BBC NEWS

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్

ఫొటో సోర్స్, Getty Images

4 ఏప్రిల్ 2025

దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడి యూన్ సుక్ యోల్ అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

దీంతో 60 రోజుల్లోపు మళ్లీ అక్కడ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.

కోర్టు తీర్పు అనంతరం యోల్ అనుకూలవాదులు నిరాశలో మునిగిపోగా, వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేశారు.

తీర్పు కోసం ఎదురుచూస్తూ యూన్ సుక్ యోల్ అనుకూల, వ్యతిరేకులు వీధుల్లోకి రావడంతో ఎలాంటి అవాంఛిత ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పార్లమెంట్‌లో అభిశంసన ఎదుర్కొని అధ్యక్ష పదవి పోగొట్టుకున్నయోల్ పదవి విషయమై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశారు. ఇప్పుడు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది.

ప్రజల అంచనాలను అందుకోలేకపోయినందుకు తనను క్షమించాలంటూ తీర్పు తర్వాత యూన్ సుక్ యోల్ స్పందించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
యూన్ అనుకూలవాదుల నిరాశ

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

‘‘దక్షిణ కొరియాకు సేవ చేయడం గొప్ప గౌరవం’’

రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన తర్వాత యూన్ లాయర్లు ఆయన తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు.

”ప్రియమైన దేశ ప్రజలారా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు సేవ చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నాలో అనేక లోపాలున్నప్పటికీ నన్ను ఆదరించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ నేను కృతజ్ఞుడను. మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు బాధగా ఉంది. నన్ను క్షమించండి. మన దేశం, మన ప్రజలందరి క్షేమాన్ని నేను కోరుకుంటాను” అని యూన్ ప్రకటనలో పేర్కొన్నారు.

సోల్ నగరంలో యూన్ వ్యతిరేకవాదుల హర్షం

జూన్ 3న ఎన్నికలు?

యూన్ సుక్ యోల్ అభిశంసనను రాజ్యాంగ ధర్మాసనం సమర్థించడంతో దక్షిణ కొరియాలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.

60 రోజుల గడువులో చివరిరోజైన జూన్ 3న ఈ అధ్యక్ష ఎన్నికలు జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవ్వడానికి తగినంత సమయం కోరుకుంటాయని, అది అవసరం కూడా అని బీబీసీతో సోగంగ్ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ హన్నా కిమ్ చెప్పారు.

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గుయెన్‌ను పదవి నుంచి 2017 మార్చి 10న తొలగించారు. సరిగ్గా 60 రోజుల తర్వాత, అంటే మే 9న మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.

అధ్యక్షుడి అరెస్ట్

ఫొటో సోర్స్, Reuters

అసలేం జరిగింది?

ఉత్తర కొరియా కమ్యూనిస్టు దళాల నుంచి దేశాన్ని రక్షించడం కోసం దేశంలో మార్షల్ లా (తాత్కాలిక సైనిక పాలన) విధిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు డిసెంబర్ 3 అర్ధరాత్రి ఒక ప్రకటన చేశారు.

దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, తనవద్ద మరో మార్గం లేదన జాతినుద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో చెప్పారు.

అయితే, కొన్ని గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీ మార్షల్ లాను ఎత్తివేస్తున్నట్లు ఆయన మరో ప్రకటన చేశారు.

జాతీయ అసెంబ్లీ నుంచి ఎమర్జెన్సీని ఎత్తివేయాలంటూ వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా సైనిక పాలనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

ఫలితంగా యూన్ అభిశంసన ఎదుర్కొన్నారు. తిరుగుబాటుకు ప్రయత్నించారనే ఆరోపణల మీద ఆయనపై దర్యాప్తు కూడా మొదలైంది. అయితే, విచారణకు హాజరయ్యేందుకు యూన్ నిరాకరించడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక నివాసం బయట మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

యూన్‌ను అరెస్ట్ చేసేందుకు ఉన్నత స్థాయి అధికారుల బృందం జనవరి 3న ప్రయత్నించింది. అయితే ఇనుప కంచెలు, బస్సులను అడ్డుగా పెట్టి వారిని అడ్డుకున్నారు.

తర్వాత జనవరి 15న చీకటి పడటానికి ముందు దర్యాప్తు బృందం ఆయన ఇంటికి వచ్చింది. తమకు అడ్డుగా ఉన్న బస్సులను ఎక్కేందుకు నిచ్చెనలు, ఇనుప కంచెలను కత్తిరించడానికి కట్టర్లు తెచ్చుకుంది. ఈ ఆపరేషన్‌లో వెయ్యి మంది పాల్గొన్నారు. కొన్ని గంటల తర్వాత యూన్‌ను అరెస్ట్ చేసినట్లు వారు చెప్పారు.

దక్షిణ కొరియాలో అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ రికార్డులకు ఎక్కారు.

యూన్ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక, తాత్కాలిక అధ్యక్షుడిగా హాన్ డక్ సూ బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా అభిశంసన ఎదుర్కొని పదవి నుంచి తొలగిపోవడంతో ఆర్థిక మంత్రి చోయ్ సంగ్ మాక్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

ఈ ప్రతిష్టంభన దక్షిణ కొరియా రాజకీయాలను యూన్ అనుకూలురు, వ్యతిరేకులు అనే రెండు వర్గాలుగా చీల్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS