SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలో బెంగళూరు, తెలంగాణలో హైదరాబాద్, దక్షిణ భారతదేశంలో అన్నింటికంటే చిన్న రాష్ట్రం కేరళలో రాజధాని కూడా కాని కొచ్చి.. ఈ నగరాల్లో మెట్రో ఇప్పటికే పరుగులు తీస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో కూడా మెట్రో రైలు సౌకర్యం లేదు.
కొచ్చి నగరం జనాభా పరంగా ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ, విజయవాడల కంటే చిన్నది.
కానీ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖలో మాత్రం మెట్రో రైలు నిర్మాణం ప్రారంభం కాదు కదా, కనీసం టెండర్ ప్రక్రియ, భూసేకరణ వంటివి కూడా మొదలు కాలేదు. పదేళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మెట్రో మాటలు, కాగితాలపై తప్ప వాస్తవంగా తట్టెడు మట్టి పని కూడా ప్రారంభం కాలేదు.


ఫొటో సోర్స్, amrc.ap.gov.in
ఎప్పటి నుంచి మొదలు?
విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైలు సావకాశాలు పరిశీలించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. వాటి కోసం 2014 ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసింది.
విజయవాడ మెట్రో కోసం దాదాపు 8 అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపాయి, జర్మనీకి చెందిన బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
ఇక విశాఖ మెట్రో కోసం కొరియన్ బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపించింది. 2017లోనే విశాఖ మెట్రో కోసం బిడ్డింగ్ ఆహ్వానించారు.
విజయవాడకు మీడియం మెట్రో కాకుండా లైట్ మెట్రో అన్నారు. అలా ఎన్నో పదుల సంఖ్యలో ప్రతిపాదనలు, చర్చలు, బిడ్ మీటింగులు, పేర్ల మార్పులు.. ఇలా ఎన్నో నడిచాయి కానీ ఏదీ ముందుకు సాగలేదు.
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్‌ను సలహాదారుగా పెట్టుకుంది. తరువాత కొంతకాలానికి ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.
2018 అక్టోబరు నాటికి విశాఖ మెట్రో కోసం అదానీ, షాపూర్జీ – పల్లోంజీ, ఎస్సెల్, ట్రిల్, టాటా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రైల్ సంస్థలు పోటీ పడ్డాయి.
2019 డిసెంబరులో విశాఖ కోసం ఎస్సెల్ ఇన్ఫ్రా బిడ్‌ను ఏపీఎంఆర్సీ రద్దు చేసింది. తరువాత అనేక సార్లు మెట్రో రైలు బోర్డు మీటింగులు జరిగాయి. చిన్న చిన్న పనులు కాగితాలపై జరిగాయి కానీ, సరైన ముందడుగు పడలేదు.

పేర్ల మార్పుతోనే సరి
విజయవాడ మొదటి దశ మెట్రో 2018 ఆగస్టు నాటికి , విశాఖ మొదటి దశ మెట్రో 2018 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అప్పట్లో అంటే 2015లోనే చంద్రబాబు ప్రకటించారు.
2018 దాటి ఏడేళ్లయింది. మధ్యలో 2019-2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మెట్రో రైలుకు సంబంధించి పెద్ద పురోగతి ఏమీ కనపడలేదు.
2015లో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ పేరు పెడితే, 2020లో దానికి ఆంధ్ర ప్రదేశ్ మెట్రో రైల్ కంపెనీ లిమిటెడ్ అని మార్చారు.
మొత్తంగా ప్రభుత్వాలు మెట్రోలను తేలేకపోయినా, వాటి పేర్లను మార్చుకుంటూ వెళ్ళాయే కానీ, పనులు మొదలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో ఏర్పడిన ప్రభుత్వాలేవీ మెట్రో రైలు గురించి పట్టించుకోలేదని విభజన హామీల అమలు కోసం పోరాడుతున్న చలసాని శ్రీనివాస్ అన్నారు.
“ఆంధ్రలో మెట్రో రైలును రెండు ప్రభుత్వాలూ బాబు, జగన్ ఇద్దరూ నిర్లక్ష్యం చేశారు. కాన్పూర్‌లో మెట్రో రైలును ఎయిర్‌పోర్టు వరకు పొడిగించారు. యూపీలో గోరఖ్‌పూర్ వంటి చిన్న పట్టణాలు సహా ఆరు మెట్రోలు నడుస్తున్నాయి. గుజరాత్ వంటి రాష్ట్రానికి ఇచ్చిన రైల్వే, బుల్లెట్ రైల్ బడ్జెట్లతో పోలిస్తే ఇక్కడ పిల్లికి బిచ్చం కూడా పెట్టడం లేదు. నాయకుల నిర్లిప్తత, డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి” అని చలసాని శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
”విశాఖ మెట్రోకి వయబులిటీ ఉంది. అనకాపల్లి నుంచి మధురవాడ వరకూ ఉంది కాబట్టి. విజయవాడకు వయబులిటీ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పటి నుంచి మెట్రో వేయడం మంచిదే. విజయవాడకు అమరావతిని కనెక్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది. విశాఖపట్నానికి అయితే మెట్రో అత్యవసరం.” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి విజయవాడ, విశాఖ మెట్రోలకు కేంద్రం సానుకూలంగా ఉందనీ తాము వెంటనే వాటిని ప్రారంభిస్తామనీ తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది.
త్వరలోనే విజయవాడ మెట్రో భూ సేకరణ కూడా జరగనుందని ఆ పార్టీ అంటోంది.
2024-25 బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం 50 కోట్లు ఇచ్చింది.
2024 డిసెంబరులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త డీపీఆర్ లకు ఆమోదం తెలిపింది. తాజగా 2025 మార్చిలో ఈ రెండు ప్రాజెక్టుల మొబిలిటీ ప్లాన్ రూపొందించడానికి మళ్లీ కన్సల్టెన్సీలను పిలవడానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది.
ఈ కన్సల్టెన్సీలు పనులు మొదలుపెట్టాక, అసలు మెట్రో పరుగులు తీయడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎవరూ చెప్పలేరు.
ప్రతిపాదిత విశాఖ మెట్రో
స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది ఎన్‌హెచ్ 16 మీద
గురుద్వారా నుంచి పాత పోస్టు ఆఫీసు
తాటిచెట్ల పాళెం నుంచి చిన్న వాల్తేరు ఆర్కేబీచ్
కొమ్మాది నుంచి భోగాపురం
ప్రతిపాదిత విజయవాడ మెట్రో
గన్నవరం నుంచి నెహ్రూ బస్టాండ్
నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు
నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS