SOURCE :- BBC NEWS

Pahalgam

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు ఇది ఒక శాఖ అని చెప్తున్నారు.

టీఆర్ఎఫ్ విడుదల చేసినట్లుగా చెప్తున్న ఒక ప్రకటనను మేం పరిశీలించాం. టీఆర్ఎఫ్ గతంలో విడుదల చేసిన ప్రకటనలకు ఇది భిన్నంగా ఉన్నట్లు గుర్తించాం. గత ప్రకటనల్లో ఆ గ్రూప్ వివిధ దాడుల్లో తమ ప్రమేయాన్ని అంగీకరించింది.

తాజా ప్రకటనలో దాడి తీరును కానీ, దాడికి పాల్పడిన వారి వివరాలు కానీ వెల్లడించలేదు.

దాడికి పాల్పడినవారు సజీవంగా ఉన్నప్పుడు కానీ, పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు కానీ జిహాదిస్ట్ గ్రూపులు సాధారణంగా వారి వివరాలు వెల్లడించవు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పౌరులు, ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌కు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు.. ఇంకా కశ్మీర్‌లోని హిందువులు వంటివారిని లక్ష్యం చేసుకుని భారీ దాడులకు పాల్పడడానికి టీఆర్ఎఫ్ ఎన్నడూ వెనుకాడలేదు.

మరోవైపు గతంలో కొన్ని దాడులకు టీఆర్ఎఫ్ కారణమని ప్రచారం జరిగినా అందులో తమ ప్రమేయం లేదంటూ ఆ గ్రూప్ ఖండించిన సందర్భాలూ ఉన్నాయి.

2024 జూన్‌లో జమ్ములోని రియాసీ ప్రాంతంలో హిందూ యాత్రికులు వెళ్తున్న బస్సుపై దాడి జరిగినప్పుడు స్థానిక మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలోనూ ఈ గ్రూప్ కారణమంటూ కథనాలు వచ్చాయి. కానీ, ఆ దాడికి తాము బాధ్యులం కాదని టీఆర్ఎఫ్ తెలిపింది.

ఇదే కాకుండా తమ గ్రూప్ పేరుతో ప్రకటనలో విడుదల చేస్తున్న జీలమ్ మీడియా హౌస్ కూడా తమది కాదని టీఆర్ఎఫ్ గతంలో చెప్పింది.

అటారీ, వాగా బోర్డర్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌పై ప్రతి చర్యలు

కాగా పహల్గాం దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దాడి నేపథ్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కొన్ని స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు.

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలిక నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

పాకిస్తాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్దవుతాయని.. ప్రత్యేక వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు పిలిపిస్తోంది.

పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

మోదీ

కలలో కూడా ఊహించని రీతిలో శిక్షిస్తాం – మోదీ

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బిహార్‌లోని మధుబనిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్నవారికి కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామన్నారు. వారంతా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తాం అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)