SOURCE :- BBC NEWS

తిరువనంతపురం, పద్మనాభస్వామి ఆలయం

ఫొటో సోర్స్, Vivek Nair

వేడిగా ఉండే ఏప్రిల్ నెలలో ఒకరోజు, ఆ ఎయిర్‌పోర్టులో కొన్నిగంటల పాటు విమానాల రాకపోకలు ఆగిపోయాయి. కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఆకాశంలో నిశ్శబ్దం ఆవరించింది.

వాతావరణం అనుకూలంగా లేకపోవడమో, లేదా సాంకేతిక కారణాల వల్లో విమానాశ్రయం మూతపడలేదు, ఎయిర్‌పోర్టులోని రన్‌వే మీదుగా పద్మనాభస్వామి ఊరేగింపు వెళ్లడం కోసం ఈ ఏర్పాట్లు చేశారు.

చెక్కరథాలపై, అలంకరించిన ఉత్సవమూర్తులను ఉంచి, రెండు కిలోమీటర్ల రన్‌వేపై ఊరేగింపుగా తీసుకెళ్తారు భక్తులు. ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయం కోసం రన్‌వేను కొద్దిగంటల పాటు మూసేస్తారు.

ఈ విమానాశ్రయంలో మామూలు రోజుల్లో 90 వరకూ విమానాల రాకపోకలు (ల్యాండింగ్స్, టేకాఫ్స్) జరుగుతాయి.

హిందూ ఉత్సవాల్లో సాధారణంగా కనిపించే ఏనుగులు కూడా రన్‌వేపై సాగే ఈ ఊరేగింపులో పాల్గొంటాయి.

కోట్ల రూపాయల సంపదకు నిలయమైన శ్రీ పద్మనాభస్వామి ఆలయం ఏటా నిర్వహించే పెయింకుని ఉత్సవంలో భాగంగా, ఏప్రిల్ 11న ఈ ఊరేగింపు నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
తిరువనంతపురం, పద్మనాభస్వామి ఆలయం

ఫొటో సోర్స్, Vivek Nair

ట్రావెన్‌కోర్ సంస్థానాధీశుల ఆధ్వర్యంలో..

పది రోజుల పాటు జరిగే పెయింకుని ఉత్సవాల చివరి రోజున ఈ ఊరేగింపు జరుగుతుంది. ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు విమానాశ్రయం రన్‌వే మీదుగా శంఘుముఘం బీచ్ వరకూ 6 కిలోమీటర్ల దూరం సాగుతుంది.

బీచ్‌లో ఉత్సవమూర్తులకు అర్చకులు స్నానం చేయిస్తారు. అనంతరం, వచ్చిన దారిలోనే, రన్‌వే మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుతుంది.

1932లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించిన ట్రావెన్‌కోర్ సంస్థానానికి చెందిన రాజకుటుంబ పెద్ద ఈ ఊరేగింపుకు నాయకత్వం వహిస్తారు. అయితే ఈ ఉత్సవం, ఊరేగింపు ఎప్పటి నుంచి జరుగుతున్నాయనే దానిపై స్పష్టత లేదు. కానీ, విమానాశ్రయ నిర్వహణ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం, తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చూస్తోంది.

పద్మనాభస్వామి ఆలయంలో జరిగే అల్‌పాషి పండుగ సమయంలోనూ తిరువనంతపురం విమానాశ్రయంలో కొన్ని గంటల పాటు కార్యకలాపాలు నిలిపేస్తారు. ఈ పండుగ ఏటా అక్టోబర్ లేదా నవంబర్‌లో జరుగుతుంది.

మతపరమైన కార్యక్రమాల కోసం మూతపడే ప్రపంచంలోని అతికొద్ది విమానాశ్రయాల్లో తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఒకటి.

బాలినీస్ హిందూ న్యూ ఇయర్ సందర్భంగా ఇండోనేషియాలోని గురాహ్‌ రాయ్ ఎయిర్‌పోర్టు, యొమ్ కిప్పుర్ సందర్భంగా ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టును మూసేస్తారు. యొమ్‌ కిప్పుర్‌ను యూదులు పవిత్ర దినంగా భావిస్తారు.

అయితే, ఇండోనేషియా, ఇజ్రాయెల్‌లో విమానాశ్రయాలు మూసివేసే రోజులు అక్కడ అధికారిక ప్రభుత్వ అధికారిక సెలవుదినాలుగా ఉన్నాయి.

పటిష్టమైన భద్రత ఉండే ఎయిర్‌పోర్టుల్లోని రన్‌వేలను మతపరమైన లేదా సాంస్కృతికపరమైన కార్యక్రమాల కోసం వినియోగించడం అత్యంత అరుదు.

తిరువనంతపురం, పద్మనాభస్వామి ఆలయం

ఫొటో సోర్స్, Vivek Nair

ఆలయ ఊరేగింపు వారసత్వాన్ని కాపాడుకునే అవకాశం లభించడం తమకు గర్వకారణమని చీఫ్ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్ రాహుల్ భక్త్‌కోటి చెప్పారు.

“చారిత్రక కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చే విమానాశ్రయం బహుశా ఇదొక్కటే అనుకుంటా” అని శుక్రవారం ఊరేగింపు రన్‌వే మీదకు రావడానికి ముందు ఆయన బీబీసీతో చెప్పారు.

ఈ విమానాశ్రయంలో ఒకటే రన్‌వే ఉంది. ఊరేగింపు సమయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినళ్లను కూడా మూసివేశారు.

ఈ విమానాశ్రయం నుంచి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాలకు అంతర్జాతీయ విమానాలు వెళ్తుంటాయి. కేరళ నుంచి పెద్దసంఖ్యలో మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తుంటారు. భారత్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులు కూడా ఆయా దేశాల్లో పెద్దసంఖ్యలోనే పనిచేస్తున్నారు.

ఊరేగింపు, ఎయిర్‌పోర్ట్ మూసివేయడం గురించి విమానయాన సంస్థలకు రెండు నెలలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు విమనాశ్రయ వర్గాలు చెప్పాయి.

ఊరేగింపు రోజున పది విమానాల రాకపోకలను రీ షెడ్యూల్ చేశారు.

“స్థానిక సమయం ప్రకారం, ఊరేగింపు సాయంత్రం 4.45 గంటలకు ప్రారంభమైంది. పూర్తి కావడానికి నాలుగు గంటలు పట్టింది” అని ఆలయ ఈవో మహేశ్ బాలచంద్రన్ బీబీసీకి చెప్పారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్య పరిమితంగా ఉంటుంది.

తిరువనంతపురం, పద్మనాభస్వామి ఆలయం

ఫొటో సోర్స్, Vivek Nair

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి చెందిన పెద్దలు, పూజారులు, అధికారులు, ఎంపిక చేసిన భక్తులు మాత్రమే ఊరేగింపులో పాల్గొంటారు. వాళ్లంతా తప్పనిసరిగా ఆలయ ట్రస్ట్ ఇచ్చిన ప్రత్యేక పాసులను వెంట తెచ్చుకోవాలి, అలాగే ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలి.

“పెయింకుని, అల్‌పాషి ఉత్సవాల సమయంలో, ఏడాదికి రెండుసార్లు పూర్తి సంప్రదాయబద్దంగా, ఉత్సాహంగా జరిగే ఊరేగింపు ఎయిర్‌పోర్ట్ మీదుగా వెళుతుంది” అని బాలచంద్రన్ చెప్పారు. చాలా ప్రశాంతంగా, అంతా పక్కా ప్రణాళికతో జరుగుతుందని ఆయన అన్నారు.

ఎయిర్‌పోర్టు భద్రతను పర్యవేక్షించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు రన్‌వే అంతటా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా కెమెరాల ద్వారా ఊరేగింపులో పాల్గొనే భక్తులను పర్యవేక్షిస్తుంటాయి. ఊరేగింపు అనంతరం రన్‌వేను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అధికారులు తెలిపారు.

ప్రతీ ఏటా విమానాశ్రయం గుండా ఊరేగింపు వెళ్లడం “వారసత్వం, ఆధునికతల కలబోత” అని శుక్రవారం ఊరేగింపు పూర్తైన తర్వాత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)