SOURCE :- BBC NEWS

రైళ్లు

ఫొటో సోర్స్, Getty Images

రైళ్లు నడవడంలో ఉపయోగపడే రాగి తీగల (కాపర్ కేబుల్స్) దొంగతనం కారణంగా స్పెయిన్‌లో పెద్ద ఎత్తున రైళ్లు ఆగిపోయాయి.

రాజధాని మాడ్రిడ్ నుంచి దక్షిణ స్పెయిన్‌లోని అండలూసియా మధ్య హైస్పీడ్ ట్రైన్లు ఆగిపోవడంతో, వేలమంది ప్రయాణికులు రాత్రిపూట రైళ్లలోనే చిక్కుకుపోయారు.

ఆదివారంనాడు ఈ దొంగతనం జరిగింది. రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే దీనిని ‘తీవ్ర విధ్వంసక చర్య’ అని అభివర్ణించారు.

హైస్పీడ్ లైన్‌లో ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు ప్రదేశాలలో కేబుల్ దొంగతనం జరిగిందని ఆయన తెలిపారు.

సోమవారం ఉదయం నుంచి రైలు కార్యకలాపాలు పునరుద్ధరిస్తున్నామని పుయెంటే చెప్పారు.

స్పెయిన్, పోర్చుగల్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఇబ్బందులకు గురైన వారం తర్వాత ఈ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రైళ్లు నిలిచిపోయాయి. గతవారం కరెంటు పోవడానికి కారణమేంటో ఇంకా తేలలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కేబుల్స్ దొంగతనం

ఫొటో సోర్స్, Getty Images

ప్రయాణికులు

ఫొటో సోర్స్, Getty Images

గత వారమే స్పెయిన్, పోర్చుగల్‌లలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి తర్వాత మళ్లీ వచ్చింది.

“గత రెండు వారాలుగా ఇలాంటి హఠాత్పరిణామాలు ఎందుకు సంభవిస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది?” అని రాయిటర్స్ వార్తా సంస్థతో అమెరికాకు చెందిన పర్యటకుడు కెవిన్ అన్నారు. మాడ్రిడ్‌లోని అటోచా స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ స్టేషన్‌లో వేలమంది చిక్కుకుపోయారు.

మాడ్రిడ్, సెవిల్లె, మలగా, వాలెన్సియా, గ్రెనడా మధ్య కనీసం 30 రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడగా, 10వేల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

సెవిల్లెలో వారంరోజుల పాటు జరిగే ఫెరియా ఉత్సవం కోసం నగరానికి పర్యటకులు భారీగా తరలివచ్చారు. ఇంతలో ఇలా జరిగింది.

‘‘ ప్రయాణికులు, సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు హై స్పీడ్ రైళ్ల కార్యకలాపాలు పునరుద్ధరించాం” అని రవాణా మంత్రి సోమవారం ఉదయం చెప్పారు.

దొంగతనం జరిగిన ప్రదేశాలను అటవీ మార్గం ద్వారా చేరుకోవచ్చని ఆయన అన్నారు.

రైలు సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని స్పెయిన్ జాతీయ రైల్వే మేనేజర్ ఆదిఫ్ సోమవారం మధ్యాహ్నం తెలిపారు.

ఏం జరిగిందో తెలుసుకోడానికి, బాధ్యులను గుర్తించడానికి ఆదిఫ్ సహా ఇతర అధికారులతో సివిల్ గార్డ్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారని స్పెయిన్ హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది.

గత కొన్నేళ్లుగా రాగి ధర బాగా పెరిగింది. దీంతో రైలు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల నుంచి కాపర్ కేబుల్ దొంగతనాలు పెరిగాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)