SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Screen Grab
“చంపకండి… ఏ తప్పూ చేయకండి… కోర్టులో కేసులు పెట్టకండి. ఎన్‌కౌంటర్ చేయొద్దు” అని రహమాన్ (దోపిడీ దొంగ)ను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారి చౌధరీ అస్లాంకు ఆసిఫ్ జర్దారీ చెప్పారు.
ఇస్లామాబాద్, రావల్పిండికి కూడా వెళ్లగలిగే ఆ రాజకీయ నాయకుడు పాకిస్తాన్ వెలుపల జరిగిన ఒక సమావేశంలో దోపిడీదారుడు రహమాన్ కథను నాకు చెబుతున్నారు.
మీరు ఆయన్ను పీపుల్స్ అమన్ కమిటీ వ్యవస్థాపకుడు సర్దార్ అబ్దుల్ రహమాన్ బలోచ్ అని పిలిచినా, లేదా కరాచీ అండర్ వరల్డ్ డాన్ రహమాన్ డకైత్ అని పిలిచినా… ఇది నగరంలోని వెనుకబడిన ప్రాంతంలో కళ్ళు తెరిచిన ఒక పాత్ర కథ. కానీ ల్యారీ గ్యాంగ్‌కు చెందిన ఈ డాన్‌కి పోలీసులు, సైనిక నిఘా సంస్థల ఉన్నతాధికారులతోనే కాకుండా దేశాధ్యక్షునితో కూడా సంబంధాలున్నాయి.
ఈ కథ నాకు చెప్పిన నాయకుడు చాలా ప్రభుత్వాలలో భాగమే గానీ ఆయనకు కరాచీ ‘అండర్ వరల్డ్’ గురించి కూడా చాలా తెలుసు.
‘ధురంధర్’ చిత్రంలో అక్షయ్ ఖన్నా ఈ రహమాన్ పాత్రను పోషించారు. ఈ సమయంలో ప్రతిచోటా దీనిపై చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, JIO/YT/TRAILER GRAB
‘13 ఏళ్ల వయసులో నేర చరిత్ర ఎలా మొదలయిందంటే’
రహమాన్ చివరిసారిగా జూన్ 18, 2006న క్వెట్టాలో అరెస్టయ్యారు. ఈ అరెస్టును అధికారికంగా ఎప్పుడూ వెల్లడించలేదు.
అప్పుడు రహమాన్ తన తల్లి హత్యతో సహా 79 సంఘటనలలో తనకు సంబంధం ఉందని దర్యాప్తు అధికారుల ముందు స్వయంగా అంగీకరించారు.
రహమాన్ బలోచ్‌పై బీబీసీ పొందిన దర్యాప్తు నివేదిక అత్యంత గోప్యమైన ప్రభుత్వ పత్రం. ఇది ఆయన నేరాలను బహిర్గతం చేయడమే కాకుండా రాజకీయాలకు, నేరాలకు మధ్య ఉన్న అసహ్యకరమైన సంబంధాన్ని కూడా వెల్లడిస్తుంది.
13 సంవత్సరాల వయసులో నేర జీవితాన్ని ప్రారంభించిన రహమాన్ బలోచ్ అండర్ వరల్డ్ డాన్‌గా ఎలా మారారు. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సమూహాలు, వ్యాపారవేత్తలతో ఆయన తన సంబంధాలను ఎలా పెంచుకున్నారో ఈ నివేదిక వివరిస్తుంది.
కరాచీ నౌకాశ్రయం రెండు వైపులా విభిన్న ప్రపంచాలతో ఉంటుంది: ఒక వైపు మౌల్వీ తమీజుద్దీన్ ఖాన్ రోడ్డు. మరోవైపు ఎంఏ జిన్నా రోడ్డు.
మౌల్వీ తమీజుద్దీన్ ఖాన్ రోడ్డు దాటితే నగరంలోని అత్యంత ధనికులు, అత్యంత ఖరీదైన వినోద వేదికలు కనిపిస్తాయి.
ఈ ఓడరేవుకు అవతలి వైపున ఎంఏ జిన్నా రోడ్డు వెనుక, పేదరికం, నిరుద్యోగం నుంచి పుట్టిన నేరాలకు నిలయమైన ల్యారీ ఉంటుంది.
కరాచీలోని డజన్ల కొద్దీ పురాతనమైన, అత్యంత పేద మురికివాడలు నగరానికి దక్షిణం నుంచి పశ్చిమం వరకు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున నేర సామ్రాజ్యం పెరుగుతోంది.
ఆసక్తికరంగా, ఇదే ల్యారీ నుంచి జుల్ఫికర్ అలీ భుట్టో, ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో ప్రధానమంత్రి పదవులు చేపట్టారు. బాబు డకైత్, రహమాన్ బలోచ్ నేరాల ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఫొటో సోర్స్, Facebook
రహమాన్ కుటుంబం
పాకిస్తాన్ ప్రభుత్వ పత్రాల ప్రకారం, అబ్దుల్ రహమాన్ 1976లో పుట్టారు. ఆయన తండ్రిపేరు దాద్ మొహమ్మద్. దాదల్ అని కూడా పిలుస్తుంటారు. రహమాన్ తల్లి దాదల్‌కు రెండో భార్య.
దాదల్ ల్యారీలో అనేక సంక్షేమ పనులు చేశారని రహమాన్ కజిన్ నాతో చెప్పారు.
‘పిల్లల కోసం ఒక లైబ్రరీ, పెద్దల కోసం ఒక ఈద్గా, మహిళలకు కుట్టు, ఎంబ్రాయిడరీ కేంద్రం, యువత కోసం ఒక బాక్సింగ్ క్లబ్ నిర్మించారు’ అని ఆ కజిన్ చెప్పారు.
అయితే దర్యాప్తు పత్రాలు, పోలీసులు, సైన్యం, నిఘా సంస్థల అధికారులు చెప్పే కథ వేరేలా ఉంటుంది.
దాదల్, ఆయన సోదరుడు షేరూ ఇద్దరూ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నారని కరాచీ మాజీ పోలీసు చీఫ్ నాకు చెప్పారు. పోలీసు రికార్డుల ప్రకారం, షేరు కూడా నేరస్థుడు.
కానీ ల్యారీలో డ్రగ్స్ వ్యాపారం లేదా ఇతర నేరాలకు షేరు దాదల్ ముఠా ఏకైక సూత్రధారి కాదు. ఇక్బాల్, అలియాస్ బాబు డకైత్ ముఠా, సమీపంలోని కల్రీ పరిసరాల్లో పెద్ద మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను నడిపింది. హాజీ లాలూ ముఠా జహాంబాద్, షేర్ షా స్మశానవాటిక, పురానా గోలీమార్ వంటి ప్రాంతాలలో దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటివి నిర్వహించింది.
“ఒకే వ్యాపారంలో పాల్గొన్న అనేక ముఠాల మధ్య వ్యాపార వైరం, ప్రాంతీయ వివాదాలు రెండూ ఉండేవి. ఈ ముఠాల మధ్య విభేదాలు, రక్తపాత ఘర్షణలుగా మారేవి. అలాంటి ఒక ఘర్షణలో రహమాన్ బలోచ్ బాబాయి తాజ్ మొహమ్మద్‌ను ప్రత్యర్థి ముఠా సభ్యుడు బాబు డకైత్ హత్యచేశారు” అని ల్యారీ మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫయాజ్ ఖాన్ చెప్పారు.
రహమాన్ కథను చెప్పిన నాయకుడు ఇలా చెప్పారు. “అప్పుడు రహమాన్ ఇద్దరు సోదరులు రూఫ్ నజీమ్, ఆరిఫ్‌లతో స్నేహం చేసారు. వాళ్ల నాన్న హసన్ అలియాస్ హస్నూక్ కూడా మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉండేవారు. మాదకద్రవ్యాలు, నేరాలలో నేపథ్యం ఉన్న ఈ యువకులందరి స్నేహం క్రమంగా ఆరిఫ్ నజీమ్ నేతృత్వంలోని నేరస్థుల ముఠాగా మారింది. తరువాత రెహమాన్ దానికి నాయకుడయ్యారుగానీ మొదట్లో అది ఆరిఫ్ ముఠా”.
ఫొటో సోర్స్, Getty Images
డ్రగ్స్ వ్యాపారంతో కథ ప్రారంభం
కరాచీ పోలీసు రికార్డుల ప్రకారం 13 సంవత్సరాల వయసులో రహమాన్ నవంబరు 6, 1989న కలకోట్‌లోని హాజీ పిక్చర్ రోడ్డులో ఉన్న గులాం హుస్సేన్ దుకాణం దగ్గర టపాసులు పేల్చడానికి నిరాకరించిన, మొహమ్మద్ బక్ష్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరిచారు.
నేరం వైపు రహమాన్ వేసిన తొలి అడుగు ఇదేనని ఒక అధికారి తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, 1992లో, రహమాన్ డ్రగ్స్ సరఫరాదారులైన నదీమ్ అమీన్, ఆయన భాగస్వామి నన్నుతో గొడవపడ్డారు.
పోలీసు రికార్డుల ప్రకారం, నదీమ్ అమీన్ కూడా నేరస్థుడు. ఆయనపై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. ఆరిఫ్ నదీమ్, నన్ను ఇద్దరినీ రహమాన కాల్చి చంపారు. ఇది రహమాన్ చేసిన మొదటి హత్య.
సింధ్ మాజీ ముఖ్యమంత్రి జామ్ సాదిక్‌తో వ్యాపార సంబంధాలు ఉన్న సులేమాన్ బిరోహీని రహమాన్ 1988లో ఉత్తర నజీమాబాద్‌లోని డీసీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర హత్య చేశాడని కొందరు పోలీసు అధికారులు చెప్పారు.
ఈ హత్య రహమాన్‌ను ల్యారీ నేర ప్రపంచంలో ఆధిపత్యాన్ని సాధించే స్థాయిలో నిలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
హాజీ లాలూ డాన్ నుంచి భద్రత
ఈ ప్రతీకారం తీర్చుకోవడంలో లాలూ కుటుంబం రహమాన్ కుటుంబానికి గట్టి మద్దతు ఇచ్చిందని రహమాన్ బంధువు చెప్పారు.
హాజీ లాలూ ఒక అండర్ వరల్డ్ డాన్. ల్యారీ, ట్రాన్స్-ల్యారీల్లో ఏ నేరం జరిగినా, లాలూ లేకుండా అది జరిగేది కాదు. రహమాన్ రక్షణలో లాలూ కీలక పాత్ర పోషించారు.
“రహమాన్‌ను లాలూ రక్షించడానికి కారణం ఆ దందాలో లాలూకు బాబు శత్రువు. బాబును ఢీకొట్టడానికి లాలూకు యువకులు ధైర్యవంతులైన సహచరులు అవసరం” అని రహమాన్ బంధువు అభిప్రాయం.
రహమాన్ యువకుల ముఠా నేరాలు పెరుగుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలీసులు ఆ ముఠాను అంతమొందించడానికి ప్రణాళిక వేశారు.
పోలీసు రికార్డుల ప్రకారం, ఫిబ్రవరి 18, 1995న, ఆరిఫ్, రహమాన్ వారి సహచరులతో కలిసి ఉస్మానాబాద్ మిల్స్ ప్రాంతంలోని ఖాళీగా ఉన్న పాక్ పైప్ మిల్స్ భవనంలో ఉన్నప్పుడు పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసుల కాల్పుల్లో ఆరిఫ్ మరణించారు. రహమాన్ గోడ దూకి తప్పించుకున్నారు. అధికారిక నివేదికలో రహమాన్ కూడా ఈ సంఘటనను అంగీకరించారు.
ఫొటో సోర్స్, SMVP
తల్లిని కూడా హత్య చేసిన రహమాన్
ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత, రహమాన్ తన తల్లి ఖదీజా బీబీని కూడా 1995 మే 18న కలకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేశారు.
‘తన తల్లిని ఇంట్లోనే కాల్చి చంపానని’ రహమాన్ అధికారులకు చెప్పారు.
తన తల్లి పోలీసు ఇన్ఫార్మర్‌గా మారిందని ఆయన అనుమానించారని పోలీసులు చెప్పారు.
నాకు సమాచారమిచ్చినవారి వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. హత్యకు అసలు కారణం రహమాన్‌కు ‘తన తల్లి వ్యక్తిత్వంపై అనుమానం’ అని, ప్రత్యర్థి ముఠా సభ్యుడితో ఆమెకు ఉన్న ‘సంబంధాల’ కారణంగా ఆయన తన తల్లిని చంపారని తెలిపారు.
రికార్డుల ప్రకారం 1995లో పారామిలిటరీ రేంజర్లు అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై రహ్మాన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో రహమాన్ రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.
ప్రభుత్వ నివేదిక ప్రకారం జూన్ 10, 1997న రహమాన్‌ను కరాచీ సెంట్రల్ జైలు నుంచి ల్యారీ దగ్గరలోని సిటీ కోర్టుకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆయన తప్పించుకుని బలోచిస్తాన్‌లోని హబ్‌కు చేరుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ పత్రాల ప్రకారం రహ్మాన్ వేర్వేరు సమయాల్లో ఫర్జానా, షహనాజ్, సైరా బానో అనే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నారు.
ఈ ముగ్గురు భార్యల ద్వారా ఆయనకు 13 మంది పిల్లలు ఉన్నారు.
2006 నాటికి రహమాన్ కరాచీ, బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాలలో 34 దుకాణాలు, 33 ఇళ్ళు, 12 ప్లాట్లు, 150 ఎకరాల వ్యవసాయ భూమికి యజమాని అయ్యాడు.
ఆయన ఇరాన్‌లో కూడా కొంత ఆస్తిని కొన్నారు. 2006 తర్వాత ఆయన సంపాదించిన మొత్తం చాలా ఎక్కువ అని అధికారులు చెప్పారు.
బలూచిస్తాన్ రాజకీయ వర్గాలు, ప్రముఖ సమూహాలతో రహమాన్ సంబంధాలు కూడా పెరిగాయి.
ఫొటో సోర్స్, Getty Images
ల్యారీ గ్యాంగ్ వార్ కథ
పోలీసుల ‘అనుమతి’తో హబ్‌లో జూదం డెన్‌ను కూడా తెరిచానని, ఓపియం( ల్యారీ ప్రజలు ‘విషహర్’ అని పిలుస్తారు), హషీష్ వంటి డ్రగ్స్ వ్యాపారాన్ని కూడా ‘ఉన్నతాధికారుల’ పూర్తి సహాయం అనుమతితో కొనసాగించానని విచారణ సమయంలో రహమాన్ వెల్లడించారు.
ఆ సమయంలో రహమాన్, హాజీ లాలూ, ఆయన కుమారులు కలిసి మాదకద్రవ్యాలు, నేరాల వ్యాపారాన్ని తారస్థాయికి తీసుకెళ్లారని ల్యారీ మాజీ ఎస్పీ ఫయాజ్ ఖాన్ చెప్పారు.
చాలా మంది సీనియర్ పోలీసు అధికారుల అభిప్రాయం ప్రకారం లాలూ ప్రభావంలో ఉన్నంత కాలం నేర ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోలేనని ఆ సమయంలో రహమాన్ గ్రహించారు. చివరికి ఒక రోజు ఆయన లాలూ, ఆయన కుమారులతో గొడవ పడ్డారు.
త్వరలోనే ఈ వివాదం ‘రక్తపాత యుద్ధం’గా మారింది. రహమాన్ సన్నిహితుడు, మామా ఫైజ్ మొహమ్మద్ అలియాస్ ఫైజూ కిడ్నాప్, హత్యతో ఇది మొదలయింది.
ఫైజ్ మొహమ్మద్ రహమాన్‌కు బంధువు అలాగే అజీజ్ బలూచ్ తండ్రి. రహమాన్ తర్వాత ల్యారీ అండర్ వరల్డ్ డాన్‌గా అజీజ్ బలూచ్ బాధ్యతలు స్వీకరించారు.
ఫైజూ హత్య ల్యారీ గ్యాంగ్ వార్ యుద్ధానికి నాంది పలికింది.
రహమాన్, పప్పు మధ్య జరిగిన ల్యారీ గ్యాంగ్ వార్ చాలా హత్యలు, హింసకు దారితీసిందని, అది ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకువచ్చిందని మీడియా నివేదికలు తెలిపాయి.
సంవత్సరాల తరబడి కొనసాగిన ల్యారీ గ్యాంగ్ వార్ ఫలితంగా అన్ని ముఠాలకు చెందిన దాదాపు 3,500 మంది మరణించారని ల్యారీకి చెందిన పరిశోధకుడు, జర్నలిస్ట్ అజీజ్ సంగ్‌హూర్ పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
రహమాన్‌ను నియంత్రించేందుకు ప్రయత్నాలు
ల్యారీ గ్యాంగ్ వార్‌లో వేలాది మంది ప్రాణాలు పోవడంతో ఆ ప్రాంతంలోని ప్రముఖ వ్యక్తులు హత్యలు, హింసను ఆపడానికి ప్రయత్నించారు.
ల్యారీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ పార్టీ అధినేత ఆసిఫ్ జర్దారీని అనేక మంది స్థానిక నాయకులు కలిశారు.
జర్దారీ పరిచయస్తుడు ఒకరు మాట్లాడుతూ రహమాన్‌పై ఎలాంటి చర్య లేదా దాడి జరగదని లాలూతో మాట్లాడగలనని కానీ రహమాన్ దాడులు చేయరని ఎవరు హామీ ఇస్తారని ప్రశ్నించారు.
ఈ పరిస్థితుల్లో బలూచ్ ఐక్యతా ఉద్యమ నాయకుడు అన్వర్ భాయిజాన్‌ను మధ్యవర్తిగా వ్యవహరించి రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నించమని అందరూ కోరారు.
లాలూ కుమారుడు పప్పు భార్యకు అన్వర్ భాయిజాన్ మామ. ల్యారీలో ఆయనకు చాలా గౌరవం ఉండేది. కానీ ఇది ఖరారు అవుతుండగా రహమాన్ అన్వర్ భాయిజాన్‌ను చంపారు.
జనవరి 8, 2005న ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మేవా షా రోడ్డు గుండా అన్వర్ భాయిజాన్ వెళుతున్నప్పుడు తాను హత్య చేశానని దర్యాప్తు అధికారులకు రహమాన్ చెప్పారు. పప్పుతో ఉన్న బంధుత్వం కారణంగా “అన్వర్ భాయిజాన్ లాలూ గ్యాంగ్ వైపు మొగ్గు చూపారని, ఆయన మధ్యవర్తిత్వం నిష్పాక్షికంగా లేదని” రహమాన్ చెప్పారు.
ఈ హత్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేసింది. మధ్యవర్తిని రహమాన్ చంపారని ఆరోపిస్తూ ఆసిఫ్ జర్దారీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు.
నగరంలోని అనేక ముఖ్యమైన వ్యాపార ప్రాంతాలు, రోడ్లను ఎలొవెన్స్‌లు పొందేవాటిగా రహమాన్ మార్చుకున్నారని పోలీసులు చెప్పారు.
ఉదాహరణకు కరాచీ ఓడరేవు నుంచి బయలుదేరి కేమాడీ గుండా వెళ్ళే ప్రతి కంటైనర్ రహమాన్ నెట్‌వర్క్‌కు ‘భత్తా’ (దోపిడీ) చెల్లించకుండా వెళ్ళలేకపోయింది.
మరో ఆదాయ వనరు గుట్కా. రహమాన్ ముఠా ల్యారీలో అక్రమ గుట్కా తయారీ కర్మాగారాలను ప్రారంభించింది. తదనంతరం గుట్కా మాదకద్రవ్యాల కంటే లాభదాయకమైన వ్యాపారంగా మారింది.
ఫొటో సోర్స్, Getty Images
రాబిన్ హుడ్ రూపంలో రహమాన్
నగరంలోని ఇతర ప్రాంతాలలో బలపడుతున్న రహమాన్ అప్పటికి ల్యారీకి కిరీటం లేని రాజు అయ్యారని అనేక మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో జరిగిన సంభాషణల్లో వెల్లడయింది.
2002 నాటికి ల్యారీ, పరిసర ప్రాంతాల్లో రహమాన్ ప్రభావం ఎంతగా పెరిగిందంటే ఆ ప్రాంతాల నుంచి రాష్ట్ర లేదా జాతీయ అసెంబ్లీకి ఎవరు సభ్యులు కావాలో టౌన్ మేనేజర్‌గా నిర్ణయించేది ఆయనే.
ఇప్పుడు ఆయన్ను”సర్దార్ అబ్దుల్ రహమాన్ బలోచ్”గా పిలిచారు. పీపుల్స్ అమన్ కమిటీ అధిపతి. అప్పటికి రహమాన్ ల్యారీలోని కొన్ని ప్రాంతాల్లో రాబిన్ హుడ్ లాంటి వ్యక్తిగా మారుతున్నారు. పాఠశాలలు, డిస్పెన్సరీలను తెరవడం వంటి రాజకీయంగా ప్రభావవంతమైన కార్యకలాపాలలో పాల్గొనడం ప్రారంభించారు.
మాలెర్, బర్న్స్ రోడ్, గులిస్తాన్-ఎ-జోహార్, ఇతర ప్రాంతాల్లో శాంతి కమిటీలను ఏర్పాటు చేసినప్పుడు ఎంక్యూఎం దానిని ఒక రాజకీయ సవాలుగా చూసిందని రాష్ట్ర మంత్రివర్గంతో సంబంధం ఉన్న ఒక అధికారి చెప్పారు.
ఎంక్యూఎం ప్రభుత్వం రహమాన్‌ను అణిచివేయడంలో చురుగ్గా వ్యవహరించింది. రహమాన్ మార్గాన్ని అడ్డుకోవాలనే ఆలోచన పార్టీలో తలెత్తింది.
” పీపుల్స్ పార్టీ నాయకుడు, ఆ సమయంలో ఆసిఫ్ జర్దారీకి సన్నిహితుడు అయిన ఒకరు రహమాన్ తనకు ప్రయోజనకరంగా ఉంటారని భావించారు. రహమాన్‌కు ఆయన తెరవెనుక మద్దతు ఇవ్వడం ప్రారంభించారు” అని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
రహమాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఎంక్యూఎం, ఆయన రాజకీయ శత్రువు అర్షద్ పప్పుకు మద్దతు ఇవ్వడం ప్రారంభించిందని చెప్పారు.
ల్యారీ గ్యాంగ్ వార్‌తో లేదా రహమాన్ కేసుతో ఎంక్యూఎంకి ఎలాంటి సంబంధం లేదని ఎంక్యూఎం లండన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముస్తఫా అజీజాబాది చెప్పారు.
“పాకిస్తాన్ ఏర్పడటానికి ముందు నుంచీ తరతరాలుగా మాదకద్రవ్యాల వ్యాపారుల మధ్య ఉన్న శత్రుత్వం కొనసాగింపు ఇది. వీటన్నిటితో మాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన అన్నారు.
“అర్షద్ పప్పుకు రాజకీయ మద్దతు లభించడం, రాజకీయ శక్తుల కోపంతో రహమాన్‌కు ల్యారీలో జీవితం మరోసారి కష్టమైంది. అప్పుడు బలూచిస్తాన్‌కు వెళ్లడమే మంచిదని రహమాన్ భావించారు. కానీ ఈసారి హబ్‌కు వెళ్లే బదులు, క్వెట్టాలో రహస్య స్థావరంలో ఆశ్రయం పొందారు” అని పాకిస్తాన్ నిఘా సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫోన్‌లో జర్దారీ
బీబీసీకి లభించిన అత్యంత రహస్య నివేదిక ప్రకారం జూన్ 18, 2006న రహస్య సమాచారం ఆధారంగా చౌధరీ అస్లాం నేతృత్వంలోని ల్యారీ టాస్క్ ఫోర్స్ క్వెట్టా శాటిలైట్ టౌన్‌లోని రహమాన్ రహస్య స్థావరంపై ఆకస్మిక దాడి చేసింది.
‘ధురంధర్’ చిత్రంలో చౌధరీ అస్లాం పాత్రను సంజయ్ దత్ పోషించారు.
దాడి సమయంలో పై నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నంలో రహమాన్ కాలు విరిగింది.
గాయపడిన రహమాన్‌ను అరెస్టు చేశారని కానీ ఈ అరెస్టును ప్రభుత్వ రికార్డుల్లో ఎప్పుడూ చూపించలేదని ఒకరు తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని కానీ అప్పుడు ఒక నాటకీయ సంఘటన జరిగిందని, చౌధరీ అస్లాం ఫోన్ మోగడం ప్రారంభించిందని రహమాన్ కథను చెప్పిన నాయకుడు తెలిపారు.
రహమాన్ వంటి ప్రమాదకరమైన నేరస్థులపై జరిగిన ఆపరేషన్ల సమయంలో తానెప్పుడూ వ్యక్తిగత ఫోన్‌ను తీసుకెళ్లలేదని చౌధరీ అస్లాం స్వయంగా తనతో చెప్పారని, ఎందుకంటే ఎన్‌కౌంటర్ జరిగితే, కాలర్ డేటా రికార్డింగ్ (సీడీఆర్) లేదా జియో-ఫెన్సింగ్ ద్వారా చౌధరి అస్లాం ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో కోర్టులో నిరూపించవచ్చని ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్న ఒక రాజకీయ నాయకుడు పేర్కొన్నారు.
అందుకే చౌధరి ముగ్గురు లేదా నలుగురు ఉన్నతాధికారులకు తప్ప మరెవరికీ తెలియని ఫోన్ నంబర్‌ను ఉపయోగించారని ఆ నాయకుడు అన్నారు.
రహమాన్ అరెస్టు సమయంలో కూడా (ఎప్పుడూ వెల్లడించలేదు), చౌధరి అస్లాం అదే రహస్య ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ‘ఉన్నత అధికారి’తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నారు.
“రహమాన్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే, అకస్మాత్తుగా ఆ ఫోన్‌కు ఒక అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చిందని చౌధరి అస్లాం నాకు చెప్పారు”అని ఆ నాయకుడు వివరించారు.
“చౌధరీ అస్లాం ఫోన్ ఎత్తినప్పుడు అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఆసిఫ్ జర్దారీ. ఈ రహస్య నంబర్ జర్దారీ సాహిబ్‌కు ఎలా చేరిందా అని ఆయన ఆశ్చర్యపోయారు”
చౌధరీ అస్లాం, ఆసిఫ్ జర్దారీల మధ్య జరిగిన సంభాషణ గురించి తెలిసిన ఒక నాయకుడు “చంపవద్దు. ఏ తప్పూ చేయవద్దు. మీ దగ్గర (కోర్టులో) కేసులు దాఖలు చేయవద్దు… ఎన్‌కౌంటర్ చేయవద్దు” అని ‘చౌధరీ అస్లాంతో జర్దారీ చెప్పారిని తెలిపారు.
“ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి పోలీసులు కాల్పులు జరపకూడదని లేదా రహమాన్ అరెస్టును అప్పుడే రిజిస్టర్ చేయకూడదని వెంటనే నిర్ణయించారు. ఆయన్ను కరాచీకి పంపుతారు కానీ ఆయన అరెస్టును అధికారికంగా ప్రకటించరు” అని సింధ్‌లో ఒక ఉన్నతాధికారి అన్నారు.
మరో రహస్య ప్రభుత్వ పత్రం ప్రకారం, “ఈ దర్యాప్తు తర్వాత, రహమాన్‌ను ఎక్కడ ఉంచాలనే సమస్య తలెత్తింది. ఎందుకంటే అరెస్టును బయటకు వెల్లడించలేదు. రహమాన్‌ను మొదట గార్డెన్ పోలీస్ లైన్స్‌లోని ల్యారీ టాస్క్‌ఫోర్స్ అధికారి ఇన్‌స్పెక్టర్ నాసిర్ ఉల్ హసన్ నివాసంలో కొన్ని రోజులు ఉంచాలని సీనియర్ అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆయన్ను మెట్రోవిల్లెలోని కల్రీ ఎస్‌హెచ్ఓ బహావుద్దీన్ బాబర్ ప్రైవేట్ నివాసానికి తరలించాలని భావించారు”
ఫొటో సోర్స్, Getty Images
పోలీసు ఇంటి నుంచి ఎస్కేప్
ఇన్‌స్పెక్టర్ బాబర్ ఇంటి నుంచి రహమాన్ “నాటకీయంగా” తప్పించుకున్నారు. రహమాన్ తప్పించుకున్న తేదీని ఇంటెలిజెన్స్ నివేదికలు ఆగస్టు 20, 2006గా పేర్కొన్నాయి.
దీని ప్రకారం 2006 ఆగస్టు 20 రాత్రి, ఐదుగురు సాయుధ వ్యక్తులు దాడి చేసి రహమాన్‌ను విడిపించారు.
రహమాన్ పారిపోవడం ఉన్నతాధికారులు, ఇతర అధికారులలో భయాందోళనలకు కారణమైంది. ఆ తర్వాత రహమాన్ “లంచం ఇచ్చి తప్పించుకున్నానని” వెల్లడించారు.
రహమాన్ కథతో పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, కొంతమంది పోలీసు అధికారుల అభిప్రాయం ప్రకారం రహమాన్ తప్పించుకోవడంలో బాబర్ పాత్ర ఉందని సైనిక అధికారులు అనుమానించారు. డిసెంబర్ 31, 2013న జరిగిన దాడిలో ఇన్‌స్పెక్టర్ బాబర్ మరణించారు. కాబట్టి ఆయన వైపు నుంచి ఏం జరిగిందో తెలియదు.
పారిపోయిన తర్వాత రహమాన్ ల్యారీకి చేరుకుని హత్యలు, హింస కార్యక్రమాలతో మళ్ళీ పరిస్థితులను తీవ్రంగా మార్చివేశారు.
ఇప్పుడు రహమాన్ పీపుల్స్ పార్టీకి కూడా సమస్యలు సృష్టించడం ప్రారంభించారు.
పీపుల్స్ పార్టీ అభ్యర్థి మాలిక్ మొహమ్మద్ ఖాన్ ల్యారీలో టౌన్ మేనేజర్ పదవిని కోల్పోయి రహమాన్ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి గెలిచిన సమయం వచ్చిందని మీడియా దర్యాప్తులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
2008లో పీపుల్స్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఆసిఫ్ జర్దారీ మొదటిసారి దేశ అధ్యక్షుడైనప్పుడు, రహమాన్ ప్రభావితులైన స్థానిక నాయకులకు, పీపుల్స్ పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
దీని వల్ల పీపుల్స్ పార్టీ, రహమాన్ మధ్య వివాదం చెలరేగింది.
రహమాన్ విషయంలో పీపుల్స్ పార్టీ అసంతృప్తి వ్యవస్థ అంతటా కనిపించింది. తరువాత ఒక రోజు అప్పటి సింధ్ హోం మంత్రి, ఆసిఫ్ జర్దారీ సన్నిహితులు జుల్ఫికార్ మిర్జా, సింధ్ గవర్నర్ డాక్టర్ ఇష్రతుల్ ఇబాద్‌ను సంప్రదించారు.
ల్యారీలో పరిస్థితి తీవ్రంగా మారిందని జుల్ఫికార్ మిర్జా చెప్పినట్లు డాక్టర్ ఇష్రతుల్ ఇబాద్ నివేదించారు. “హత్యలు, హింస పెరుగుతున్నాయి. ల్యారీలోని ముఠాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించాలి”
మాజీ గవర్నర్ మాట్లాడుతూ, “మీరు రాష్ట్ర హోం మంత్రి అని నేను డాక్టర్ సాహిబ్‌తో చెప్పాను. మీరు ఆ ఉత్తర్వు జారీ చేయాలి. దాని ఆధారంగానే పోలీసులకు ఆదేశాలు ఇవ్వవచ్చు. ఆ తర్వాత, జుల్ఫికార్ మిర్జా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, ల్యారీలో మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే చర్యలను వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి” అని అన్నారు.
ఫొటో సోర్స్, SMVP/Getty Images
పోలీసులు రహమాన్‌ను ఇలా పట్టుకున్నారు
ఇప్పుడు రహమాన్‌ను మూడు వైపులా చుట్టుముట్టారు. ఒక వైపు ఎంక్యూఎం ఆయన “దోపిడీ భత్యాలు”, రాజకీయ ప్రభావంపై కోపంగా ఉంది.
మరోవైపు పీపుల్స్ పార్టీ కూడా కోపంగా ఉంది.
మరోవైపు, పోలీసు అధికారి ఇంటి నుంచి తప్పించుకుని, పోలీసుకు డబ్బు చెల్లించి తాను తప్పించుకున్నానని బహిరంగంగా ప్రకటించినందుకు పోలీసులందరూ, ముఖ్యంగా చౌధరీ అస్లాం రహమాన్‌పై కోపంగా ఉన్నారు.
అన్ని వైపుల నుంచి వచ్చిన ఈ ఆగ్రహం రహమాన్‌కు చాలా నష్టాన్ని కలిగించింది. చాలా ఎక్కువ నష్టం.
ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే ”ఆగస్టు 8, 2009న రహమాన్ అకస్మాత్తుగా తన సన్నిహిత, విశ్వసనీయ సహచరులకు ప్రస్తుతానికి వారి ప్రయాణాన్ని పరిమితం చేసుకోవాలని, కచ్చితంగా అవసరమైతే ప్రయాణానికి కారుకు బదులుగా మోటార్ సైకిల్‌ను ఉపయోగించాలని సూచించారు” అని ఆ నాయకుడు చెప్పారు.
“రహమాన్ కోసం తీవ్రంగా వెతుకుతున్న చౌధరీ అస్లాం ఒక ఇన్ఫార్మర్‌ను కలిశారు. మరుసటి రోజు, ఆగస్టు 9, 2009న రహమాన్ బలూచిస్తాన్ వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు తన ఇన్ఫార్మర్ ద్వారా విషయం చౌధరీ అస్లాంకు తెలిసింది”
రహమాన్, ఆయన ముగ్గురు సన్నిహితులు అకీల్ బలోచ్, నజీర్ బలోచ్ , ఔరంగజేబ్ బలోచ్ ఒక మోటార్ సైకిల్‌పై పురానా గోలిమార్ చేరుకున్నారు, అక్కడ నుంచి వారందరూ కారులో బలూచిస్తాన్‌లోని మంద్ ప్రాంతానికి బయలుదేరారు.
చౌధరీ అస్లాంకు ఇన్ఫార్మర్ నుంచి సమాచారం అందే సమయానికే, రహమాన్ కరాచీ సరిహద్దు దాటారని ఆ నాయకుడు చెప్పారు. ఆ తర్వాత అస్లాం, ఆయన బృందం రహమాన్‌ను వెతకడానికి బయలుదేరారు.
రహమాన్, ఆయన సహచరులు చాలా దూరం వెళ్ళినందున, సహాయక నిఘా సంస్థలు అస్లాంను తిరిగి రావాలని సలహా ఇచ్చాయి. చౌధరీ అస్లాం, ఆయన బృందం తిరుగు ప్రయాణంలో గడానీ వందర్ మధ్యకు చేరుకున్నప్పుడు రహమాన్ ఆయన సహచరులు మళ్ళీ కవరేజ్ ప్రాంతంలో ఉన్నారు. ఫోన్ మానిటర్లు వారి జాడను గుర్తించాయి.

పట్టిచ్చిన ఓ ఫోన్‌కాల్
ఏం జరిగిందంటే రహమాన్ స్నేహితుడు నజీర్ బలోచ్ తన భార్యకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్టు చెప్పి తనకు ఇష్టమైన ఆహారం వండమని అడిగారు. ఇదే ఆయనకు సమస్యగా మారింది.
నజీర్ బలోచ్ భార్య కూడా అతిథులు (రహమాన్, ఆయన సహచరులు) వస్తున్న అదే కాన్వాయ్‌లోని రహమాన్ సహచరుడి భార్యకు ఫోన్ చేసి వారికి ఇష్టమైన ఆహారం గురించి కూడా తెలుసుకున్నారు.
రహమాన్, ఆయన సహచరులు వస్తున్నారని చౌధరీ అస్లాంకు సమాచారం అందింది.
చౌధరీ అస్లాం, ఆయన బృందం జీరో పాయింట్ అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఒక రహదారి గ్వాదర్ కోస్టల్ హైవేకి, మరొక రహదారి క్వెట్టాకు వెళ్తుంది.
రహమాన్, ఆయన సహచరులు ఏ వైపు నుంచి వచ్చినా పోలీసులు ఎదురుపడేలా రోడ్డు ఆంగ్ల అక్షరం Y ఆకారాన్ని తీసుకునే ప్రదేశంలో పోలీసు బృందం నిలబడింది. పోలీసులు ఏమనుకున్నారో అదే జరిగింది.
రహమాన్, ఆయన సహచరులు నల్లటి టయోటా కారులో వస్తూ కనిపించారు.
“ఆ సమయానికి అస్లాం బృందంలోని కొంతమంది సభ్యులు పోలీసు యూనిఫాంల నుంచి అక్కడ మోహరించిన కోస్ట్ గార్డ్ యూనిఫాంలకు మారారు. తద్వారా రహమాన్, ఆయన సహచరులు కరాచీ పోలీసు యూనిఫాంను చూసిన తర్వాత, ముఖ్యంగా చౌధరీ అస్లాంసు చూసిన తర్వాతా ఎలాంటి తప్పూ చేయకుండా తెలియకుండానే పట్టుబడతారు” అని ఆ నాయకుడు నాతో చెప్పారు.
రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా.
గుర్తింపు కార్డు అడిగినప్పుడు రహమాన్ నకిలీ గుర్తింపు కార్డును చూపించారు. అందులో ఆయన పేరు షోయబ్ అని ఉంది. కానీ ప్రణాళిక ప్రకారం, కోస్ట్ గార్డ్ యూనిఫాం ధరించిన పోలీసు అధికారులు కారులో కూర్చున్న కల్నల్‌కు తన గుర్తింపు కార్డును చూపించమని రహమాన్‌తో చెప్పారు.
ఆ పెద్దమనిషి చౌధరీ అస్లాం. రహమాన్ వైవో బ్లాక్ విండో డోర్ తీసిన వెంటనే చౌధరీ అస్లాం ఆయన్ను నియంత్రణలోకి తీసుకున్నారు. రహమాన్ పారిపోవాలని ఆలోచించేలోపే ఆయన వెనుక నిలబడి ఉన్న పోలీసు అధికారి మాలిక్ ఆదిల్ ఆయన్ను లోపలికి తోసి కారు ఎక్కారని ఆ నాయకుడు తెలిపారు.
పోలీసు ఎన్‌కౌంటర్ జరుగుతుందన్న విషయం తెలిసి మరణం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు రహమాన్ ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అస్లాంకు రహమాన్ ప్రతిపాదించారు. కానీ అస్లాం ఇలా అన్నారు. “నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?”
అక్కడి నుంచి (జీరో పాయింట్) వారందరినీ నేషనల్ హైవే స్టీల్ టౌన్‌కు తీసుకెళ్లారని, నార్తర్న్ బైపాస్ ద్వారా కాన్వాయ్ లింక్ రోడ్‌కు చేరుకుందని పోలీసు ఎన్‌కౌంటర్‌లో రహమాన్, ఆయన ముగ్గురు సహచరులు అక్కడ మరణించారని ఆ నాయకుడు వెల్లడించారు.
ఆ నాయకుడు చెప్పిన విషయాన్ని అనేక మంది అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో ధృవీకరించారు. కానీ రికార్డు ప్రకారం రహమాన్ మరణంపై కరాచీ పోలీసుల అధికారిక ప్రకటన ఆగస్టు 10, 2009న అన్ని వార్తాపత్రికలలో ప్రచురితమైంది.
ప్రభుత్వ ప్రకటనను ఉటంకిస్తూ ‘డాన్’ , ‘ది నేషన్’ ఆంగ్ల వార్తాపత్రికలు పోలీసులతో జరిగిన ఘర్షణలో రహమాన్ డకైత్, ఆయన ముగ్గురు సహచరులు మరణించారని నివేదించాయి.
రహమాన్ కారును ఆపడానికి పోలీసులు ప్రయత్నించారని కానీ నిందితులు పారిపోవడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
పోలీసు ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నలు
“రహమాన్ 80కి పైగా హత్యలు, కిడ్నాప్ కేసుల్లో వాంటెడ్” అని ప్రభుత్వ ప్రకటనలో ఉంది.
ఆయన మరణం కరాచీ పోలీసులకు ఒక పెద్ద విజయమని కరాచీ పోలీస్ చీఫ్ వసీమ్ అహ్మద్ కూడా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
సింధ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఇష్రతుల్ ఇబాద్ కూడా ఇది ‘నిజమైన’ పోలీసు ఎన్‌కౌంటర్ అని అన్నారు.
“ఈ ఆపరేషన్ చౌధరీ అస్లాం నిర్వహిస్తున్నందున కొంతమందికి అనుమానం వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సందర్భంలో నకిలీ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పలేము. ఈ సందర్భంలో ఆ వ్యక్తిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి చంపేసే అవకాశం లేదు”
ఈ పోలీసు ఎన్‌కౌంటర్‌ను కోర్టులో సవాలు చేశారు. రహమాన్ భార్య ఫర్జానా తన న్యాయవాదులు అబ్దుల్ ముజీబ్ పిర్జాదా, సయ్యద్ ఖలీద్ షా ద్వారా సింధ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్మద్ జలాల్ ఉస్మానీ ముందు తన భర్తను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్టు డాన్ పత్రిక అక్టోబర్ 14, 2009న తెలిపింది.
కోర్టు రాష్ట్ర హోం కార్యదర్శితో పాటు కరాచీ పోలీసు, సింధ్ పోలీసు అధిపతులను కూడా సమన్లు జారీ చేసింది. అయితే రహమాన్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వర్గాలు ఈ కేసు తీర్పు కోసం తామింకా వేచి చూస్తున్నామని చెబుతున్నాయి.
రాజకీయ వ్యతిరేకత, వ్యవస్థ పట్ల కోపం కారణంగా రహమాన్‌ను చంపేసారు అనిపిస్తుంది. వ్యవస్థ అసలు ఆయనపై ఎందుకు కోపంగా ఉంది?
ల్యారీలోని ఉర్దూ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ (రిటైర్డ్) తౌసీఫ్ అహ్మద్ ల్యారీ గ్యాంగ్ వార్ వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉందని చెప్పారు. “ల్యారీలో మీరు చూసిన హింసకు కారణం ఇక్కడ తెలియదు. నిజాన్ని గుర్తించడానికి మీరు బలూచిస్తాన్ వెళ్ళాలి” అని ఆయన చెప్పారు.
బలూచిస్తాన్ జాతి ఉద్యమాన్ని ల్యారీ నుంచి వేరు చేయడానికి ప్రభుత్వం, వ్యవస్థలు రాజకీయాల నుంచి నేరాల మూలాన్ని తొలగించడానికి బదులుగా ఈ ప్రాంతంలో రాజకీయాలను ఆధిపత్యం చేయడానికి ఎల్లప్పుడూ అనుమతించాయని ప్రొఫెసర్ తౌసిఫ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
“1973లో బలూచిస్తాన్‌లో సైనిక చర్య ప్రారంభమైనప్పుడు, బలూచ్ ప్రతిఘటన ఉద్యమానికి ల్యారీ కేంద్రంగా మారుతుందనే భయం ఉంది. ల్యారీ అలా మారకుండా ప్రభుత్వ అధికారులు దానిని నేరాల కొలిమిలోకి నెట్టారు”
“సైన్యం ల్యారీని గ్యాంగ్ వార్‌కు అప్పగించింది. పీపుల్స్ పార్టీకి ఇందులో భాగముంది. పీపుల్స్ పార్టీది ల్యారీ రాజకీయ వారసత్వం. వారు పోరాట మార్గాన్ని ఎంచుకోలేదు. సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వేర్వేరు సమయాల్లో ఆ గ్యాంగ్‌స్టర్లను వారురక్షించారు” అని ప్రొఫెసర్ తౌసీఫ్ చెప్పారు.
ఆయన్ను సర్దార్ అబ్దుల్ రహమాన్ బలోచ్ లేదా రహమాన్ డకైత్ అని పిలవండి. కానీ ఒక విషయం కచ్చితంగా చెప్పవచ్చు. ల్యారీ చరిత్రలో జనం భారీగా తరలివచ్చిన అంతిమయాత్రల్లో ఆయనది ఒకటి.
ఐదేళ్ల తర్వాత జనవరి 2014లో చౌధరీ అస్లాం తాలిబాన్ ఆత్మాహుతి దళానికి బలయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS







