SOURCE :- BBC NEWS

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు

ఫొటో సోర్స్, UGC

38 నిమిషాలు క్రితం

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి , అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత భద్రతా దళాల చేతుల్లో మరణించడం ఇదే మొదటిసారి.

”నక్సలిజానికి వ్యతిరేకంగా భారత్ గత 30 ఏళ్లుగా చేస్తోన్న యుద్ధంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి నాయకుడు చనిపోవడం ఇదే మొదటిసారి” అని అమిత్ షా కూడా తన ఎక్స్‌లో రాశారు.

మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ ఉద్యమానికి బాగా పట్టున్న శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు.

కోటబొమ్మాళి మండల కేంద్రానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న గ్రామమైన జియ్యన్నపేటలో 1955 సంవత్సరంలో నంబాల జన్మించారు.

ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తల్లి పేరు లక్ష్మీనారాయణమ్మ. వాసుదేవరావు దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు మొత్తం ఆరుగురు సంతానం. వారిలో రెండో సంతానం కేశవరావు.

కేశవరావు అన్న ఢిల్లీశ్వరరావు కబడ్డీ క్రీడాకారుడు. ఆయన పోర్టుబ్లెయిర్ పోర్టు చైర్మన్‌గా పనిచేశారు. విశ్రాంత జీవితాన్ని ప్రస్తుతం విశాఖపట్నంలో గడుపుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బసవరాజు ఇల్లు

శ్రీకాకుళ ఉద్యమ ప్రభావం

కేశవరావు కుటుంబంపై తొలి నుంచి శ్రీకాకుళం భూఉద్యమ ప్రభావం ఉంది.

కళాశాల విద్యాభ్యాసం సమయంలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. అప్పటి నుంచే ఉద్యమ స్వభావం ఆయనలో కనిపించేది.

వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)లో బీటెక్‌లో చేరారు. అన్న ఢిల్లీశ్వరరావులాగే కబడ్డీ ఆటతో పాటు వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించారు.

అప్పటికే రాడికల్ ఉద్యమంలో ఉన్న సూరపనేని జనార్దన్, జన్ను చిన్నాలు ప్రభావంతో ఆ దిశగా అడుగులు వేశారు.

అదేసమయంలో, సీపీఐ(ఎం‌ఎల్) నాయకుడు, పీపుల్స్ వార్ పార్టీ సారథి కొండపల్లి సీతారామయ్య ఆర్ఈసీ విద్యార్థులతో టచ్‌లో ఉండేవారు. విద్యార్థి ఉద్యమాల్లో గైడ్ చేసేవారు.

మరో సీపీఐ (ఎంఎల్) నాయకుడు కేజీ సత్యమూర్తి కూడా వారిని కలుస్తుండేవారు. వారి ప్రభావంతో కేశవరావు 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.

బసవరాజు ఇల్లు

అజ్ఞాతవాసంలోనే…

1980లో గెరిల్లా జోన్ ఏర్పాటు చేయాలని పీపుల్స్ వార్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు కేశవరావు విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులోని మన్యం ప్రాంతానికి వెళ్లారు. దీన్నే ఈస్ట్ డివిజన్‌గా వ్యవహరించేవారు.

కృష్ణ పేరుతో గిరిజనులతో కలిసి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా కొద్దిరోజులకే పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత నుంచి పూర్తిగా అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు.

నాటి నుంచి దాదాపు 45 ఏళ్లలో మరెప్పుడూ కేశవరావు అరెస్టు కాలేదు.

1987 చివర్లో కేశవరావు ఒంటరిగా విశాఖపట్నం వచ్చారు. పక్కా సమాచారంతో పోలీసులు మద్దిలపాలెం వద్ద మాటువేసి, కేశవరావును పట్టుకునే ప్రయత్నం చేశారని, క్రీడాకారుడు, ఆరడుగుల ఆజానుబాహుడు కావడంతో గట్టిగా విదిలించుకొని తప్పించుకున్నారని సన్నిహితులు చెబుతారు.

ఐదు దశాబ్దాల్లో అగ్రనేతగా…

కేశవరావు తొలుత ఈస్ట్ డివిజన్‌కు గంగన్న పేరుతో కార్యదర్శిగా పనిచేశారు. ఈస్ట్ డివిజన్‌తో పాటు నాటి మధ్యప్రదేశ్‌లోని బస్తర్ జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లా… ఈ నాలుగు ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటైంది.

ఈ కమిటీలో కేశవరావుతో పాటు కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ సభ్యులుగా ఉండేవారు.

1990లో జరిగిన పార్టీ ప్లీనరీలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్య స్థానంలో గణపతి, సభ్యుడిగా కేశవరావు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత కేశవరావు దండకారణ్య కమిటీ కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత, కొంతకాలానికే కొండపల్లిని పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాతి కాలంలో గణపతి, మరికొందరితో పాటు కేశవరావు పార్టీలో కీలక నేతగా ఎదిగారు.

కేంద్ర కమిటీలో సైనిక వ్యవహారాలు చూసే ప్రత్యేక విభాగానికి నాయకుడిగా 1995 నుంచి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావు నాయకత్వం వహించారు.

2001లో జరిగిన పీపుల్స్ వార్ పార్టీ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇంచార్జిగా ఎన్నికయ్యారు.

దేశంలో బలమైన రెండు సాయుధ మావోయిస్టు గ్రూపుల్లో ఒకటైన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (ఎంసీసీ), పీపుల్స్ వార్ విలీనమై 2004 సెప్టెంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఆవిర్భవించిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు.

వయోభారం, అనారోగ్యంతో 2016లో గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న తర్వాత, ఆ స్థానంలో కేశవరావు బాధ్యతలు చేపట్టారు.

బసవరాజు ఇల్లు

భార్య ఆత్మహత్యతో మానసికంగా కుంగిపోయి…

మావోయిస్టు పార్టీలోనే పనిచేసిన గడ్చిరోలి జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళ అనితను కేశవరావు వివాహం చేసుకున్నారు.

ఆమె అనారోగ్యం, మానసిక ఇబ్బందులతో 2010లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో కేశవరావు మానసికంగా కుంగిపోయారని, తీవ్ర నిరాశకు గురయ్యారని పార్టీ సన్నిహితులు చెబుతారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)