SOURCE :- BBC NEWS

పాలస్తీనా

ఫొటో సోర్స్, Reuters

గాజా స్ట్రిప్‌లో జరిగిన విధ్వంసం స్థాయిని రెస్క్యూ వర్కర్లు, పౌరులు అంచనా వేయడం మొదలుపెట్టారు.

శిథిలాలలో పదివేలకు పైగా మృతదేహాలు ఉండొచ్చని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ చెప్పింది. ఇది గాజాలోని ప్రధాన అత్యవసర ప్రతిస్పందన సేవల సంస్థ.

వంద రోజుల్లోగా మృతదేహాలన్నీ వెలికితీయాలని తాము భావిస్తున్నామని బీబీసీకి ఏజెన్సీ అధికార ప్రతినిధి మహమూద్ బాసల్ చెప్పారు. కానీ, బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత కారణంగా మృతదేహాల వెలికితీత ఆలస్యమయ్యేలా ఉందని ఆయన అన్నారు.

ఆదివారం నాటి కాల్పుల విరమణ తర్వాత, గాజాలో తీసిన కొత్త ఫోటోలు 15 నెలల కాలంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌క్లేవ్‌కు ఉత్తరాన జరిగిన విధ్వంసకాండను చూపుతున్నాయి.

గాజాలోని 60 శాతం నిర్మాణాలు నాశనమయ్యాయని గతంలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

ఆదివారం కాల్పుల విరమణ మొదలు కాగానే బాంబుల మోతల స్థానంలో సంబరాలు కనిపించాయి. కానీ, గాజా అంతటా ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు నిరాశజనకంగానే ఉన్నాయి.

యుద్ధం వల్ల గాజాకు చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) పేర్కొంది. వారంతా ఆదాయం లేక, బతకడం కోసం సహాయంగా లభించే ఆహారం (ఫుడ్ ఎయిడ్)పైనే పూర్తిగా ఆధారపడ్డారని తెలిపింది.

ఆదివారం కాల్పుల విరమణ మొదలైన తక్షణమే గాజాలోకి సహాయ సామగ్రి రావడం మొదలైంది. ఆదివారం గాజా స్ట్రిప్‌లోకి సహాయక సామగ్రిని తీసుకొచ్చిన 630కి పైగా లారీలు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

సోమవారం ఈ ఎన్‌క్లేవ్‌లోకి మరో 915 లారీలు సహాయక సామగ్రితో ప్రవేశించినట్లు, 15 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తే ఇదే అత్యధికం అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

గాజా స్ట్రిప్‌కు తిరిగి జీవం పోసే సవాలులో సహాయక సామగ్రి రావడం కేవలం తొలి అడుగు మాత్రమేనని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ తాత్కాలిక డైరెక్టర్ శామ్ రోజ్ అన్నారు.

”మేం కేవలం ఆహారం, ఆరోగ్య సంరక్షణ, భవానాలు, రోడ్లు, మౌలిక వసతుల నిర్మాణం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ఇక్కడి ప్రజలు, వ్యక్తులు, కుటుంబాలు, కమ్యూనిటీలను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉంది.

ఈ 16 నెలలుగా వారు అనుభవించిన వేదన, బాధ, నష్టాలు, క్షోభ, దు:ఖం, అవమానాలు, క్రూరత్వం నుంచి వారిని బయటకు తీసుకురావాలి. దీనికి చాలా సమయం పడుతుంది” అని ఆయన వివరించారు.

తొలి విడత మార్పిడిలో భాగంగా హమాస్ చెర నుంచి విముక్తి పొందిన ముగ్గురు బందీల కుటుంబాలు సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాయి.

ఎమిలీ డమారి తల్లి మాండీ డమారీ మాట్లాడుతూ, తన కూతురు ధైర్యంగా ఉందని కోలుకుంటోందని చెప్పారు. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిలో ఎమిలీ తన చేతి వేళ్లు రెండింటిని కోల్పోరు.

చెర నుంచి బయటపడిన రోమి గోనెన్ తల్లి మైరవ్ లెషెమ్ గోనెన్ కూడా మాట్లాడారు.

”మా రోమి తిరిగొచ్చింది. అన్ని కుటుంబాలు మళ్లీ తమ వారిని కలుసుకోవాలి. మిగతా కుటుంబాలను తలుచుకుంటే బాధగా ఉంది” అని మైరవ్ అన్నారు.

ఈ న్యూస్ కాన్ఫరెన్స్‌కు ముందు ఇజ్రాయెల్ అధికారులు కొత్త ఫుటేజీని విడుదల చేశారు. ఆదివారం గాజానుంచి బయటకొచ్చిన కొన్ని క్షణాల తర్వాత డమారి (28), గోనెన్ (24), డోరోన్ స్టీన్‌బ్రిచర్ (31) కన్నీళ్లతో తమ తల్లులతో మాట్లాడుతున్నట్లుగా ఆ ఫుటేజీలో కనిపిస్తుంది.

ఒకవేళ కాల్పుల విరమణ తొలి దశ కొనసాగితే, రాబోయే 40 రోజుల్లో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 1800 మంది పాలస్తీనియన్ ఖైదీల విడుదలకు బదులుగా, గాజా నుంచి మరో 30 మంది ఇజ్రాయెల్ బందీలు బయటకు వస్తారు.

పాలస్తీనాలో విధ్వంసం

ఫొటో సోర్స్, EPA

15నెలలకు పైగా సాగిన యుద్ధంలో గాజాలో 46,900 మందికి పైగా చనిపోయారని, 1,10,700 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

ఇందులో సామాన్య ప్రజలు, పోరాటయోధుల సంఖ్యను మంత్రిత్వశాఖ గుర్తించలేదు. కానీ, మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి కూడా ఇదే చెప్పింది.

మరణాల సంఖ్యను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 40శాతానికి పైగా తక్కువగా అంచనా వేసి ఉండొచ్చని ఈ నెలలో మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ ప్రచురించిన యూకే అధ్యయనం సూచించింది.

సంక్షోభ కాలంలో తమ సిబ్బందిలో 48 శాతం మంది చనిపోవడం, గాయపడటం, బందీలుగా మారారని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. 85 శాతం వాహనాలు, తమకున్న 21 వసతుల్లో 15 దెబ్బతినడం లేదా ధ్వంసం అయ్యాయని తెలిపింది.

వైమానిక దాడుల ముప్పు తప్పినప్పటికీ, సివిల్ డిఫెన్స్ వర్కర్లకు భయానకమైన పని తప్పడం లేదు. ఉత్తర గాజాలోని ఏజెన్సీ సభ్యులు సోమవారం కొన్ని ఫోటోలను బీబీసీకి చూపించారు. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలు, మానవ కళేబరాల వెలికితీత వంటి భయంకరమైన పనులను ఏజెన్సీ వర్కర్లు చేస్తున్నట్లుగా ఫోటోల్లో కనిపిస్తోంది.

”వీధులన్నీ మృతదేహాలే ఉన్నాయి. ప్రతీ ఏరియాలోని భవనాల కింద ప్రజలు ఉన్నారు. ‘దయచేసి ఇక్కడకు రండి, శిథిలాల కింద మా కుటుంబం సమాధి అయిందంటూ’ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రజల నుంచి మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి” అని గాజాకు చెందిన సివిల్ డిఫెన్స్ వర్కర్, 24 ఏళ్ల అబ్దుల్లా అల్ మజ్దాలావీ చెప్పారు.

ఇతర కథనాలు

గాజా నుంచి వేరే చోటుకు వెళ్లిన వారిలో 23 ఏళ్ల మలక్ కసబ్ ఒకరు. ఆచూకీ తెలియకుండా పోయినవారిలో తన కుటుంబం కూడా ఉందని సోమవారం బీబీసీకి ఆమె చెప్పారు.

”మా కుటుంబంలోని చాలామందిని కోల్పోయాం. కొంతమంది ఇంకా ధ్వంసమైన భవనాల కిందే ఉన్నారు. శిథిలాల కింద చాలా మంది ఉన్నారు. ఈ సంగతి అందరికీ తెలుసు” అని ఆమె చెప్పారు.

ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండే తమ ఇల్లు పూర్తిగా ధ్వంసం కాలేదని, కానీ దారుణంగా దెబ్బతిందని మలక్ చెప్పారు.

”మా ఇంటి తలుపులు, కిటికీలు లేవు. నీళ్లు, విద్యుత్ ఏదీ లేదు. మంట కోసం కనీసం కర్రలు కూడా లేవు. ఆ ఇంట్లో ఉండలేం” అని ఆమె వివరించారు.

స్ట్రిప్‌లోని జనసాంద్రత ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. నిర్వాసితులైన గాజా ప్రజలకు రాకపోకలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి.

గాజా ప్రజలు తమ సిబ్బందిని లేదా తమ స్థావరాలను సంప్రదించవద్దని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) హెచ్చరించింది. గాజా సరిహద్దు, నెట్‌జారిమ్ కారిడార్ చుట్టూ ఏర్పాటు చేసిన బఫర్ జోన్‌లోకి ప్రవేశించకూడదని గాజా ప్రజలను ఆదేశించింది.

పాలస్తీనా

ఫొటో సోర్స్, EPA

కానీ, వీలైనంత త్వరగా తమ ఇళ్లను చూసుకోవాలని చాలామంది నివాసితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఖాన్ యూనిస్‌లోని తమ శిబిరం నుంచి దక్షిణ గాజాకు నడుచుకుంటూ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు గాజా నగరానికి చెందిన ఒక ఫ్యాక్టరీ సూపర్‌వైజర్, 42 ఏళ్ల హతేమ్ ఎలీవా చెప్పారు.

”ప్రజలు స్వర్గానికి చేరుకోవడానికి ఎదురుచూసినట్లుగా మేం కాల్పుల విరమణ కోసం ఎదురుచూస్తున్నాం. నా సోదరులిద్దరినీ, వారి కుటుంబాలను మేం కోల్పోయాం. మా కజిన్లు, బంధువులు కూడా చనిపోయారు. నాకున్న ఏకైక కోరిక మా ఇంటికి తిరిగి వెళ్లడం” అని ఆయన చెప్పారు.

దాదాపు ఆరు వారాలైన తొలి దశ కాల్పుల విరమణ పూర్తి అవ్వకముందే ఒప్పందం కుప్పకూలవచ్చని ఇరువైపులా తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. గాజాలో ఏ సమయంలోనైనా సైనిక చర్యను పున:ప్రారంభించే హక్కు తమకు ఉందని ఇజ్రాయెల్ నొక్కి చెప్పింది.

సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఒక ఆశాకిరణం అంటూ స్వాగతించారు. ఒప్పందంలోని విధివిధానాలను తప్పక పాటించాలని అన్నారు.

అదనపు రిపోర్టింగ్: మ్యుత్ అల్ ఖాతిబ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)