SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
సీనియర్ ఐపీఎస్ అధికారి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పి.ఎస్.ఆర్. ఆంజనేయులును ఏపీ పోలీసులు మంగళవారం హైదరాబాదులో అరెస్ట్ చేశారు.
ముంబయికి చెందిన నటి కాదంబరీ జత్వానీకి వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను, ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.
జత్వానీ కేసు విచారణ సందర్భంగా నిందితులను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీతారామాంజనేయులు అరెస్టయ్యారు.
ఆంజనేయులను గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.


ఫొటో సోర్స్, UGC
ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ నరేంద్ర కుమారి జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆంజనేయులుపై ఉన్నాయి.
ఈ కేసులో ఈయనతోపాటు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, మరో సీనియర్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం 2024 సెప్టెంబర్‌లో 1590, 1591, 1592 జీవోలను విడుదల చేసింది.
అసలు వివాదం ఏంటి?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నేత కుక్కల విద్యాసాగర్‌కు, సినీనటి కాదంబరీ జత్వానీ మధ్య ఓ వివాదం ఉంది.
కుక్కల విద్యాసాగర్‌కు చెందిన భూమిని తాను వేరే వ్యక్తులకు అమ్మాలని యత్నించానంటూ తనతోపాటు తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి చిత్రహింసలకి గురి చేశారని జత్వానీ 2024 ఆగస్టు 30న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
“వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టి నాతో పాటు నా తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఫిబ్రవరి 2న నాపై ఫిర్యాదు చేస్తే, అదే రోజు ముంబయి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. 42 రోజుల పాటు జైల్లో పెట్టారు. కొందరు పోలీసు అధికారుల నేతృత్వంలోనే నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి, నన్ను వేధించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. నాకు, నా కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలి” అని సెప్టెంబర్ 14న కాదంబరీ జత్వానీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఈ ఫిర్యాదులోనే ఆమె ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రస్తావించారు. తనను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు
ఈ వ్యవహారంపై విచారణ తర్వాత నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.
ఆ నివేదిక ఆధారంగానే గత సెప్టెంబర్‌లో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను కూడా అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook
జత్వానీపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో ఏముంది?
జగ్గయ్యపేటలో తన (కుక్కల విద్యాసాగర్) ఐదు ఎకరాల భూమిని అమ్ముతానంటూ కాదంబరీ జత్వానీ ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు.
ఈ భూమిని కోసూరుకు చెందిన నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్‌లకు ఫోర్జరీ సంతకాలతో భూమిని అమ్మడానికి జత్వానీ ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
“’నేను ముంబయిలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆమె నాకు పరిచయమయ్యారు. అప్పట్లో ఆమెతో ఫొటోలు దిగాను. 2023 సెప్టెంబర్‌లో నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాలుగు రోజులు వారణాసిలో హోటల్ బుక్ చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆమె ఇచ్చిన పేరు, పుట్టిన తేదీ వివరాలు… నాకు అంతకు ముందు చెప్పిన వివరాలు వేరు” అని గతంలో సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాసాగర్ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ఆంజనేయులుపై ఆరోపణలు ఏంటి?
‘‘జత్వానిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కుక్కల విద్యాసాగర్ 2024 ఫిబ్రవరి 2న ఫిర్యాదు చేశారు. దానికి రెండు రోజులు ముందే అంటే జనవరి 31న అప్పటి విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నిలను పిలిపించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ముంబయిలో ఉన్న జత్వానీని అరెస్టు చేసి తీసుకురావాల్సిందిగా ఆదేశించారు’’ అని ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్లో ఉంది.
ఈ ప్రక్రియలో ఆంజనేయులు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆధారాలు లేకుండా అసంపూర్తిగా ఉన్న ఫిర్యాదు ఆధారంగా ఉన్నత హోదాను అడ్డుపెట్టుకొని తప్పుడు ఆదేశాలు జారీ చేశారని ఆ జీవోలో పేర్కొన్నారు.
ముందస్తు బెయిలుకు దాఖలు చేయని ఆంజనేయులు
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.
కానీ ఈ కేసుకి సంబంధించి పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం ఇప్పటి వరకు ఏ కోర్టునూ ఆశ్రయించలేదు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)