SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
పోలీసు కస్టడీలో 2011 నుంచి 2022 మధ్య 1,100 మంది మరణించారు. ఈ డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇచ్చింది. ఈ మరణాలకు ఎవరినీ బాధ్యులుగా చేయలేదని కూడా డేటా చెబుతోంది.
అనుమానితులు, కస్టడీలో ఉన్న నిందితులపై హింస అనివార్యంగా జరుగుతుందనే ఒక సాధారణ అభిప్రాయం. కానీ ఇలా హింసకు పాల్పడటాన్ని ఎంతమంది పోలీసు అధికారులు సమర్థిస్తారు?
దీనిని తెలుసుకోవడానికి, దిల్లీ సహా దేశంలోని 16 రాష్ట్రాల్లో సుమారు 8,200 మంది పోలీసులతో ఒక సర్వే జరిపారు. ఈ సర్వే నివేదిక 2025 మార్చిలో విడుదలైంది.
‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025: పోలీస్ టార్చర్ అండ్ (అన్)అకౌంటబిలిటీ’ పేరుతో ఉన్న ఈ నివేదికను ‘కామన్ కాజ్’ అనే సామాజిక సంస్థ, ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ (సీఎస్డీఎస్) పరిశోధన సంస్థలు రూపొందించాయి.

హింసకు ఎంత మద్దతు ఉంది?
ఈ అధ్యయనంలో మూడింట రెండొంతుల పోలీసు అధికారులు హింసను సమర్థించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 30 శాతం మంది హింసను చాలావరకు సమర్థించదగినదిగా, మరో 32 శాతం మంది కొంతవరకు సమర్థించదగినదిగా భావించారు. కేవలం 15 శాతం మాత్రమే హింసను చాలా తక్కువ స్థాయిలో సమర్థించారు.
ఈ అభిప్రాయాన్ని పంచుకున్న వారిలో ఎక్కువ మంది కానిస్టేబుళ్లు, ఐపీఎస్ అధికారులున్నారు. హింసకు మద్దతు పలికిన పోలీసు అధికారులలో ఝార్ఖండ్ (50 శాతం), గుజరాత్ (49 శాతం) రాష్ట్రాల నుంచి అధికంగా ఉండగా, కేరళ (1 శాతం), నాగాలాండ్ (8 శాతం) రాష్ట్రాల నుంచి అత్యల్పంగా ఉన్నారు.
“అత్యున్నత స్థాయి పోలీసు అధికారులు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు హింసకు మద్దతు ఇస్తున్నారని గమనించాం” అని నివేదిక పేర్కొంది.
హింసను ఎలా సమర్థించారు?
అనుమాతులపై కస్టడీలో హింసను పోలీసులు ఎంతవరకు సమర్ధిస్తారో తెలుసుకోవడానికి, సర్వేలో వారిని వేర్వేరు ప్రశ్నలు అడిగారు.
ఉదాహరణకు, తీవ్రమైన నేరాల అనుమానితులపై పోలీసులు హింసను ప్రయోగించడం సమాజ శ్రేయస్సు కోసం సమర్థించవచ్చా, లేదా? అని అడిగినప్పుడు, దాదాపు మూడింట రెండొంతుల పోలీసు అధికారులు సమర్థించారు.
తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను ఛేదించడానికి ‘థర్డ్-డిగ్రీ’ హింసను ఉపయోగించడం సరైనదేనని 30 శాతం మంది అధికారులు అభిప్రాయపడ్డారు.
అరికాళ్లపై కొట్టడం, శరీర భాగాలపై కారం పొడి చల్లడం, నిందితులను తలకిందులుగా వేలాడదీయడం వంటివి ‘థర్డ్ డిగ్రీ హింస’లో ఉన్నాయి.
అనుమానితులను లేదా నిందితులను తరచుగా విచారించే ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసులు థర్డ్ డిగ్రీ హింసను సమర్థించారు.
ఎన్కౌంటర్
ప్రమాదకరమైన నేరస్థులను న్యాయ ప్రక్రియ ద్వారా శిక్షించడం కంటే చంపడం లేదా ఎన్కౌంటర్ చేయడం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని 22 శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు. ఇది సమాజానికి మంచిదని వారు విశ్వసించారు.
అయితే, అత్యధికంగా 74 శాతం మంది పోలీసులు మాత్రం నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
“పోలీసులలోని ఒక ముఖ్యమైన వర్గం తమనుతాము చట్టానికి తొలి సంరక్షకులుగా భావిస్తారు. కోర్టులు, చట్టపరమైన ప్రక్రియను ఒక అడ్డంకిగా భావిస్తారు” అని నివేదిక పేర్కొంది.
నేరాలను నిరోధించడంలో చట్టపరమైన ప్రక్రియ బలహీనంగా, చాలా నెమ్మదిగా ఉందని 28 శాతం మంది అధికారులు అభిప్రాయపడ్డారు.
చట్టంలో లొసుగులు ఉన్నాయని కానీ, అది ఇప్పటికీ నేరాలను నిరోధిస్తుందని 66 శాతం మంది విశ్వసించారు.
అరెస్టు సమయంలో చట్ట ప్రక్రియను పాటించడంపై..
ఎవరినైనా అరెస్టు చేసేటప్పుడు చట్టబద్ధమైన ప్రక్రియ ఎల్లప్పుడూ అనుసరిస్తున్నట్లు 40 శాతం మంది అధికారులు మాత్రమే అంగీకరించారు.
చట్టపరమైన విధానాన్ని అనుసరించడం అంటే.. అరెస్ట్ మెమోను సిద్ధం చేసి సంతకం చేయడం, అరెస్టు చేయవలసిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అరెస్టు గురించి తెలియజేయడం, వైద్య పరీక్ష చేయించుకోవడం మొదలైనవి.
మూక హింసకు ఎంత మద్దతు ఉంది?
లైంగిక హింస, పిల్లల కిడ్నాప్, చైన్ స్నాచింగ్, గోవధ వంటి నేరాలకు పాల్పడిన నిందితులను గుంపుగా శిక్షించడం సరైనదేనని పోలీసులలోని ఒక వర్గం అభిప్రాయపడింది.
“మూక హింసకు గుజరాత్‌లోని పోలీసు సిబ్బందిలో అత్యధిక మద్దతు కనిపించింది, కేరళ పోలీసు సిబ్బందిలో అత్యల్ప మద్దతు కనిపించింది” అని నివేదిక పేర్కొంది
ఎవరు ఎక్కువగా నేరాలు చేస్తారు?
ఏ రకమైన వ్యక్తులు నేరాలు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారని పోలీసులను అడిగితే.. ఎక్కువగా ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తులని తర్వాత ముస్లింలు, మురికివాడల్లో నివసించే ప్రజలు, వలసదారులు ఉంటారని వారు బదులిచ్చారు.
ఈ గణాంకాలను మత కోణం నుంచి విశ్లేషించినప్పుడు, ముస్లింలు సహజంగా నేరాలకు పాల్పడే ప్రమాదం ఎక్కువుందని 19 శాతం హిందూ పోలీసు సిబ్బంది అభిప్రాయపడుతుండగా, కొంతవరకు నేరాలకు పాల్పడే ప్రమాదముందని 34 శాతం మంది పోలీసులు నమ్మారు.
అదే సమయంలో ముస్లింలు ఎక్కువగా నేరాలు చేసే ప్రమాదం ఉందని 18 శాతం ముస్లిం పోలీసులు, కొంతవరకు నేరాలు చేసే ప్రమాదం ఉందని 22 శాతం మంది ముస్లిం పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. ముస్లింలు సహజంగా నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని దిల్లీ, రాజస్థాన్‌లోని అత్యధిక శాతం పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఇదేక్రమంలో, గుజరాత్‌లోని మూడింట రెండొంతుల పోలీసు అధికారులు దళితుల గురించి అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.
‘ఖచ్చితమైన డేటా లేదు’
పోలీసు కస్టడీలో మరణాలకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవని కూడా నివేదిక గుర్తించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ), జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దగ్గర వేర్వేరు గణాంకాలున్నాయి.
2020 సంవత్సరంలో ఎన్సీఆర్బీ ప్రకారం, 76 మంది పోలీసు కస్టడీలో మరణించారు. అయితే, ఎన్హెచ్ఆర్సీ ప్రకారం 90 మంది కస్టడీలో మరణించారు.
పోలీసు కస్టడీలో అత్యధిక మరణాలు మహారాష్ట్ర, గుజరాత్‌లలో జరిగాయి. ఎన్హెచ్ఆర్సీ డేటా ప్రకారం, 2023లో పోలీసు ఎన్కౌంటర్లలో అత్యధిక మరణాలు ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి.
ఈ నివేదికను రూపొందించడంలో రాధిక ఝా కీలక పాత్ర పోషించారు.
“ప్రారంభంలో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి మేం కొంచెం సంకోచించాం. ఈ అధ్యయనం చాలా వివాదాస్పదమైనది. పోలీసులు దీనిపై జాగ్రత్తగా సమాధానం ఇస్తారని భావించాం. కానీ, వారు హింసను ఎంత బహిరంగంగా సమర్ధిస్తారో తెలుసుకున్నాక, మాకు దిగ్భ్రాంతి కలిగింది” అని రాధిక బీబీసీ హిందీతో అన్నారు.
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తాపత్రికలో ఈ నివేదిక గురించి రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి ప్రకాశ్ సింగ్ రాశారు. ఈ అధ్యయనం ఫలితాలు దిగ్భ్రాంతికరమైనవి కానీ, కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు, 79 శాతం పోలీసులు మానవ హక్కుల శిక్షణకు విలువ ఇస్తున్నారని, 71 శాతం మంది హింస నిరోధక శిక్షణకు మద్దతు ఇస్తున్నారని అధ్యయనంలో గుర్తించారని తెలిపారు.
నివేదికలో లోపం ఉందని ప్రకాశ్ సింగ్ ఎత్తి చూపారు.
బ్రిటిష్ కాలం నుంచి వారసత్వంగా వచ్చిన పోలీసు సంస్కృతితో పాటు రాజకీయ నాయకులు, సీనియర్ అధికారుల ఒత్తిడి, “సత్వరమార్గ” పద్ధతులకు ప్రజల మద్దతు వంటి హింసకు మూల కారణాలను అధ్యయనం మాట్లాడలేదని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)